Previous Page Next Page 
తపస్వి పేజి 25


    "డబ్బు కోసం కృంగిపోతున్నారా? మీకు డబ్బు అక్కర్లేదనుకున్నాను."
    "ఎందుకనుకున్నారు? నాకు డబ్బు కావాలి! అందుకే ఒక దాని కోసం మరొకటి వదులుకోను- చంపుకోను!"
    సౌందర్య తన బాగ్ లో చెయ్యి పెట్టింది. ఆ చెయ్యి చటుక్కున పట్టుకున్నాడు విక్రమ్.
    "ఇప్పుడే చెప్తున్నాను. ఒక దాని కోసం మరొకటి చంపుకోలేనని..." అంటూ ఆ చెయ్యి వదిలేసి చమత్కారంగా నవ్వుతూ "ఇవాళ మీరు కారులో వచ్చినట్లు లేరు. మీ బాగ్ ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి మోసుకొస్తాను. కూలి డబ్బులు ఇప్పించండి!" అన్నాడు.
    కదిలిపోయిన సౌందర్య కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. తరువాత దీనమైన స్వరంతో "మీకు కూలి ఇయ్యగలిగేటంత శక్తిమంతురాలిని కాను, కానీ మీరు నాతో రాగలిగితే సంతోషిస్తాను." అంది.
    సౌందర్య ఎక్కడికయినా కారులోనే వెళుతుంది. ఆ రోజు విక్రమ్ దగ్గరకు నడిచి రావాలనిపించింది.
    "పదండి!" అన్నాడు విక్రమ్.
    ఆ నిశీధిసమయంలో విక్రమ్ సరసన నడుస్తోంది. ఏదో అవ్యక్తానందంతో నిండిపోయింది సౌందర్య మనసు. మాటలకందని అనుబంధమేదో అల్లుకుంటున్నట్లు...మాట్లాడితే అది చెదిరిపోతుందేమోనన్నట్లు ఏమీ మాట్లాడలేక పోయింది. ఆ మాధుర్యాన్ని తను పంచుకున్నట్లు విక్రమ్ కూడా మాట్లాడలేదు.
    అంతలో హారన్ ధ్వని చేత్శూ మిసెస్ కామేశ్వరీ దేవి కారు వాళ్ళ ముందు ఆగింది.
    "హలో! సౌందర్యా! ఇంత రాత్రి వేళ నడిచి వెళ్తున్నావా? రా! రా! కారెక్కు" అంది మిసెస్ కామేశ్వరీ దేవి.
    సౌందర్య కృంగిపోయింది. తననూ విక్రమ్ నూ కలిసి సాగనివ్వకుండా ఈ కామేశ్వరీ దేవి ఎప్పుడూ అడ్డుపడుతూనే ఉంటుందా?
    మాట్లాడకుండా కారులో కూర్చుంది. కామేశ్వరీ దేవి విక్రమ్ ను చూసి ముఖం చిట్లించుకుంది. కారు ముందుకు సాగింది. సౌందర్య విక్రమ్ వైపు తల తిప్పలేదు. అతడు బొమ్మలా నిలబడి తనను చూడటం సౌందర్యకు తెలుసు!
    "లాభం లేదు విక్రమ్! నేను నీ వైపు చూడను. కామేశ్వరీ దేవి ప్రక్కన కూర్చొని నీకు వీడ్కోలు చెప్పి నిన్ను అవమానించను!" అనుకుంది.
    కారు ముందుకు సాగాక "ఈ దౌర్భాగ్యుడెక్కడ దొరికాడు నీకు?" అంది కామేశ్వరీ దేవి.
    ఇంకా విక్రమ్ స్మృతులలోంచి తేరుకోని సౌందర్య "ఏ దౌర్భాగ్యుడు?" అంది పరధ్యానంగా.
    "అదే! డాక్టర్ విక్రమ్!"
    ఒక్కక్షణం కామేశ్వరీ దేవి ముఖంలోకి చూసి ఫకాలున నవ్వింది సౌందర్య.
    "అవును దౌర్భాగ్యుడు! మన సౌభాగ్యం గుర్తించలేని దౌర్భాగ్యుడు!"
    "అలాంటివాడెక్కడ దొరికాడు నీకు? ఏముంది అతనిలో? గొప్పవాళ్ళు ఎందరో నీ ప్రేమ కోసం పడిచస్తూంటే."
    "అవును. ఆ గొప్పవాళ్ళకు, ఇతనికి పోలిక లేదు. ఒక్క సౌందర్యం తప్ప ఇతనిలో ఏమీ లేదు."
    "అందమా? ఇతడు అందంగా ఉంటాడా? నీకు మతిపోయిందా?"
    పకపక నవ్వింది కామేశ్వరీ దేవి!
    మొదటి నుండీ ఒక విధమైన ఆకారాన్ని చూడటానికి అలవాటు పడిపోయిన మానవుల మనసులు అదే అందమనుకుంటున్నాయి. సాధారణమైన ఆ కను ముక్కు తీరుకు ఏపాటి విభిన్నతనయినా వెంటనే మనసు అంగీకరించలేక పోవటం చేత వికారంగా భ్రమపడుతున్నాము. సృష్టి క్రమంలో వచ్చే ఆకారంలో మానవుడు తానుగా వెలిగించుకొనే సౌందర్యం కామేశ్వరీదేవి కంట పడక పోవటంలో ఆశ్చర్యమేముందీ? ఆవిడ అలా నవ్వటంలో వింత ఏముందీ? ఈ అలవాటుకు మనసు ఎంతగా బానిస అవుతుంది?
    "అవును. అతనికి చెప్పుకోతగినంత రూపం లేదు. సౌందర్యం ఉందో లేదో అర్ధం చేసుకోవటం కష్టం..."
    "నీ చూపులన్నీ ఎప్పుడూ తికమకగానే ఉంటాయి. అయినా బాగుంటాయి. అందుకే నువ్వంటే నా కిష్టం."
    "మీకు ఇష్టంలేనిదెవరిమీద? అందరిమీదా తలా ఒక విధమైన అభిమానమా! ఆ అదృష్టంలో నాకూ భాగం తప్పదు."
    "అంతేగా! సర్వజనులనూ సమానంగా ప్రేమించగలిగినప్పుడే మన మానవత్వానికి సార్ధకత! భగవద్గీత మూడో అధ్యాయం నాలుగో శ్లోకంలో చెప్పినట్టు..."
    దిగ్భ్రాంతితో చూసింది సౌందర్య.
    "మిసెస్ కామేశ్వరీదేవీ! మీరు నాతో....సౌందర్యతో మాట్లాడుతున్నారు. మీకు ఈ ఉపాయం చెప్పినదానిని నేనే!"
    కామేశ్వరీ దేవి నవ్వేసింది.
    "అలవాటయిపోయింది. పోనీలే! ఇప్పుడు మునిగిపోయిందేముంది?"
    అలవాటు! అలవాటు! అలవాటు!
    
                                        15
    
    పడుకున్నవాడు దిగ్గున లేచి కూచున్నాడు వామనమూర్తి...లేచి కూచున్నా చెవుల్లో భాస్కరరావు నవ్వు ప్రతిధ్వనిస్తోంది.
    శరీరమంతా చెమటలు పట్టగా అలాగే కూచున్నాడు. కదలటానికి శక్తి లేకపోయింది. ఆ మంచం భాస్కరరావుది కాదు. అసలా ఇల్లే భాస్కరరావుది కాదు. ఇల్లు మారినా, వస్తువులు మారినా భాస్కరరావు ఛాయలు మాత్రం అతని సంపదను అన్ని విధాలా అంటి పెట్టుకుని వదలటం లేదు. వామనమూర్తిని చూసి అవన్నీ నవ్వటం మానలేదు.
    మంచం దిగి క్రింద పడుకున్నాడు. నిద్ర రాలేదు. కటిక నేల మీద మామూలు పక్క పరుచుకుని పడుకోవటం శరీరానికి కష్టంగా ఉంది. సుఖం కావాలి శరీరానికి...
    ఖరీదయిన ఆ స్ప్రింగ్ మంచం...దాని మీద ఆ డన్ లప్ పరుపులు....ఎంత హాయి! లేచి మంచం మీద పడుకున్నాడు.
    నవ్వులు....భాస్కరరావు నవ్వులు!
    గభాలున లేచి కూచున్నాడు. క్రింద పడుకోలేడు, పైన అసలు పడుకోలేడు.
    ఎన్నడూ ఏడు గంటలకు ముందు నిద్ర లేవని వామనమూర్తి తొలి కోడి కూత కోసం ఎదురు చూస్తూ, ఆ కూత వినీ వినగానే సంతోషంతో ఆ ఖరీదయిన మంచం మీద నుంచి లేచి కూచున్నాడు భగ్గున మండుతున్న కళ్ళతో.

 Previous Page Next Page