"అంటే ఈ విషయాలు నీకు తెలియవా?"
"ఏ విషయాలు?"
"ఇలాంటి హోటళ్లలో జరిగే భాగవతాలు?"
"డ్రింక్స్! నాన్ వెజ్ డిషెస్!. డాన్స్ లూ....!"
"ఇంకా అమ్మాయిలూ.... రహస్యంగా ఏర్పాట్లూ...."
"ఛీ! ఛీ!"
"నువ్వు ఇదివరకు ఎన్నిసార్లు వచ్చావు!"
"ఇదే మొదటిసారి!"
"మరి ఇక్కడి వాతావరణం ఇలా ఉంటుందని ఎలా తెలుసు?"
"విన్నాను! ఇలాంటివి ఎలా అయినా తెలుస్తాయి!"
"ఎందుకు పుట్టింది నీకీ బుద్ధి ఇక్కడికి రావాలని?"
చివ్వున యశోద కళ్లలో నీళ్ళు తిరిగాయి. లేచి నిలబడింది.
"వెళ్ళిపోదాం పదండి!"
"కూచో!"
ముందున్న గ్లాసెత్తి గడగడా తాగేశాడు.
యశోద కళ్ళలో నీళ్ళు తిరగటానికి కారణం వివేక్ ఊహించినది కాదు. అంచేత ఆ నీళ్ళు మరింత ఎక్కువై యశోద లాంటి ధీరురాలు కూడా నుదుటికి చెయ్యి ఆనించుకుని తల దించుకుంది.
"యశూ! ప్లీజ్! అలా అయిపోకు! నిన్ను దిగులుగా నేను చూడలేను!"
వరీనియా నింపిన గ్లాసు ఖాళీ చేసి "ఇంకొక బాటిల్!" అని ఆర్డర్ చేసి. యశోద చేతిని నుదుటి మీద నుంచి తొలగించి తన చేతిలోకి తీసుకున్నాడు. మాట కొంచెం ముద్దగా వస్తోంది.
"యశూ! ఇదివరకు అనుకునేవాణ్ణి... మనుషులు ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రింక్స్ తీసుకుని ఎందుకు తీసుకుంటారా? అని! ఇప్పుడు అర్థమవుతోంది! ఇవి తాగితే మనుషులు తమ నుంచి తాము తేలిగ్గా తప్పించుకుని పారిపోవచ్చు! అయితే నాకు అర్థం కానిది ఒకటే! మనుషులందరూ పోనీ మూడొంతులమంది తమ నుంచి తాము తప్పించుకుని పోవాలనే ప్రయత్నిస్తున్నారా?"
యశోద సమాధానం చెప్పలేదు. ఆమె మనసు అల్లకల్లోలంగా ఉంది. జింజర్ చికెన్ వచ్చింది.
"తిననా?"
"మీ ఇష్టం!"
"నో! నో! ఇవాళ నా ఇష్టం కాదు. నీ ఇష్టం. నీ ఇష్టమే నా ఇష్టం.... చెప్పు తిననా?"
"తినండి!"
"ఆల్ రైట్!"
కళ్ళు మూసుకుని నోరు తెరిచి నోట్లో వేసుకుని. గటుక్కున ఇన్ని మంచినీళ్ళు తాగాడు. వెంటనే డోక్కున్నాడు. టేబిల్ మీదా వివేక్ నోటి మీదా పడింది వమనం. అక్కడి వాళ్లందరూ విడ్డూరంగా చూస్తున్నారు. యశోద తనని తాను బాగా తిట్టుకుంది. వివేక్ ని నడిపించుకుంటూ సింక్ దగ్గరికి తీసికెళ్ళి మొహం కడిగింది. రుమాలుతో సూట్ తుడిచింది. ఇద్దరూ మరొక టేబిల్ ముందు కూర్చున్నారు.
మళ్ళా డ్రింక్స్ తీసుకోబోయాడు వివేక్. "ఒద్దు!" అంది యశోద.
"ప్లీజ్! పారిపోనీ! అన్నీ మరిచిపోనీ! డ్రింక్ తాగానని కూడా మరిచిపోవటానికీ మరింత తాగనీ!
గడగడా తాగుతున్నాడు వివేక్. నిస్సహాయంగా చూస్తోంది యశోద.
తాగుతున్నవాడు హఠాత్తుగా గ్లాసుకింద పెట్టాడు వివేక్.
"మా నాన్నగారు కూడా తననుంచి తాను తప్పించుకుపోవటానికి ప్రయత్నిస్తున్నారు భలే భలే!"
ఉలికిపడి వివేక్ చూస్తోన్నవైపు చూసింది యశోద. అక్కడ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. రెండు మూడు టేబిల్స్ అవతల ఉన్న టేబిల్ ముందు దేవిశంకర్ కూచుని ఉన్నాడు స్నేహితులతో!
అతడి ముందు డ్రింక్స్ ఉన్నాయి. నిప్పులు కక్కే కళ్లతో కొడుకునీ కోడలినీ చూస్తున్నాడు.
* * *
పట్టరాని తమకంతో యశోదని అల్లుకుపోయాడు వివేక్. కానీ యశోద పారవశ్యంలో మునిగిపోలేదు. అందుకు కారణాలు రెండు. ఒకటి: వివేక్ నోటి నుంచి వచ్చే మద్యమాంసాహారాలు కలగలిసిన దుర్వాసన.
రెండు: ఇంతగా మనసు చంపుకుని ప్రారంభించిన డ్రింక్స్ ఎలాంటి ఫలితాన్నిచ్చాయనేది తెలుసుకోవాలనే కుతూహలం.
వివేక్ శరీరానికి ఎప్పటిలా చెమటలు పట్టలేదు. కళ్ళు భయంతో సంచలించిపోవటంలేదు. యశోద "హమ్మయ్య!" అనుకునేటంతలో మరొకటి జరిగింది.
అతడికి శరీరం మీద పూర్తిగా వశం తప్పింది. అతడి ఆరాటానికీ, ఆశకీ సహకరించకుండా శరీరం పూర్తిగా మైకంలోకి జారుకుంది.
ఏం జరుగుతోంది? తను తీసుకున్న స్టెప్ సరి అయిన దవునా కాదా?
ఆ రాత్రి అసలు నిద్రపోలేకపోయింది యశోద.
* * *
డైనింగ్ టేబిల్ ముందు దేవిశంకర్ కుటుంబసభ్యులందరూ కూర్చున్నారు. వంటవాడు దోసె, చట్నీ తెచ్చి బల్లమీద పెట్టాడు. పేలబోతున్న బాంబులా ఉంది అక్కడి వాతావరణం. ఎవరికీ తిండి మీద లేదు.
అందరిలో దేవిశంకర్ దెబ్బతిన్న పులిలాగ, తోక తొక్కిన త్రాచులాగ రగిలిపోతున్నాడు. ఎప్పటిలాగే. యశోద ముందు ఉంచిన ఫలహారం వివేక్ తను తిన్న తర్వాతే యశోదని తిననిచ్చాడు. భరించలేకపోతున్నాడు దేవిశంకర్.
"నిన్న సాయంత్రం ఎక్కడికి వెళ్ళావూ?" తీక్షణంగా అడిగాడు.
"మీకు తెలుసు!" శాంతంగా చెప్పాడు వివేక్. ఏ కొంచెం తొణకలేదు.
తడబడ్డాడు దేవిశంకర్. తన లోపం ఎత్తి చూపటంతో అహం గాయపడి మరింత రెచ్చిపోయాడు" ఎందుకెళ్ళావు అక్కడికి?"