Previous Page Next Page 
రాక్షసుడు పేజి 24


    వెనుకే "అత" డొచ్చాడు. అతడి వెనుకే బ్రాహ్మణడొచ్చాడు. బ్రాహ్మణుడి వెనుక మంగలి వచ్చాడు.

 

    బ్రాహ్మణుడు పాపని తూర్పుగా నిలబెట్టి మంత్రాలు చదువుతూ వుండగా, మంగలి పాప జడ చివరి ఒక అంగుళం కత్తిరించాడు. అతడు పట్టుకున్న వెండి పళ్ళెంలో వెంట్రుకలు పడినయ్.

 

    వాళ్ళు ముగ్గురూ లోపలికి వెళ్ళిపోయారు.

 

    అతడు మిగిలేడు.

 

    చిన్న స్టేజి ఎక్కి చెప్పటం మొదలు పెట్టాడు.

 

    "మిత్రులారా! ఈ రోజు ఈ శుభ సమయంలో మనందరం ఇక్కడికి రావటం మన అదృష్టం. ఈ అదృష్టం నగరంలో కేవలం కొద్ది మందికే దక్కింది.... కొంకిణి జాతిలో దీన్ని ఒక అపూర్వ అవకాశంగా భావిస్తారు. ఆడవాళ్ళకి వడుగు చేసి చివర కొద్దిగా వెంట్రుకల్ని కత్తిరిస్తారు. తమ తమ ఇనప్పెట్టెలో ఈ వెంట్రుక శాశ్వతంగా పెట్టుకుంటే అది తమ ధనాగారాన్ని పెంపొందిస్తుందని అక్కడి వారు నమ్ముతారు. ఈ రోజు పురోహితన్ గారు మన మధ్య వుండటం, వారి మనవరాలికి మన ఊళ్ళోనే వడుగు చేయించటానికి నిర్ణయించటం కేవలం మన అదృష్టం. ఒక్కొక్కరూ వచ్చి ఒక్కొక్క వెంట్రుకని స్వీకరించ ప్రార్థన!"  


    ....ముందు సింహం వచ్చాడు. భక్తితో ఒక వెంట్రుక తీసుకుని, పక్కన హుండీలో పదివేలు "అందరికి కనపడేటట్టు" వేసి వెంట్రుక కళ్ళకద్దుకుని దిగాడు.

 

    తరువాత పపట్ లాల్...

 

    తరువాత తులసీ ప్రసాద్.

 

    ఎనిమిదింటికి పవిత్ర కార్యక్రమం ముగిసింది.

 

    పదింటికి పాతిక లక్షలూ అందచేయవలసిన వారికి అందజేయబడ్డాయి.

 

    పురోహితన్ ఆ విధంగా అతడికి దగ్గిరయ్యాడు.

 

    దాదాపు కళ్ళనీళ్ళతో "నీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోను?" అన్నాడు చేతులు పట్టుకుని.

 

    "నాకు కాదు. మా నాన్నకి చెప్పుకోండి. ఏ పని చేసి పెట్టాలో చెప్పేది ఆయనే. ఎలా చెయ్యాలో మాత్రమే నేను ఆలోచించేది-"

 

    "అయినా ఆడపిల్లకి వడుగులేమిటి?" అన్నాడు పురోహితన్ తన మనవరాల్ని చూస్తూ.

 

    "మీరు చేసుకుంటే ఈ వయసులో బాగోదు కాబట్టి, మీ అబ్బాయిది కూడా బట్టతలే కాబట్టి- మీకు మనవళ్ళు లేరు కాబట్టి -" అన్నాడు అతడు "... మీరు కొంకిణి నుంచి వచ్చారు కాబట్టి- వారి ఆచార వ్యవహారాలు మాకు ఎక్కువగా తెలీదు కాబట్టి..."

 

                                          7

 

    "అసాధ్యం"

 

    అతడు మాట్లాడలేదు. పురోహితన్ అన్నాడు. 'ఎలా... ఎలా ఇది సాధ్యపడుతుంది? సస్పెండయిన ఇన్ స్పెక్టర్ని ఇరవైనాలుగ్గంటల్లోగా తిరిగి పనిలోకి తీసుకోవటం? అసాధ్యం... ఇంపాజిబుల్".

 

    "ఈ దేశంలో అసాధ్యం అన్నమాట లేదు పురోహితన్" తాపీగా అన్నాడు అతడు. "అవసరం వున్న వాడి మనవరాలి వెంట్రుకని పదివేలకి కొనే మనుషులున్న దేశం ఇది. ఎలా చేస్తారో మీ ఇష్టం. రేపీపాటికి నాకు విజయ్ ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటూ ఉత్తర్వు కావాలి..." అంటూ లేచాడు. అతడితోపాటు వాణి కూడా లేచింది.

 

    ఇద్దరూ బయటకొచ్చారు. కారెక్కుతూంటే వాణీ అన్నది- "చాలాకాలం క్రితం మీరు చేసిన సాయాన్ని చాలా ఇన్ డైరెక్టుగా చెప్పారు". అతడు మాట్లాడలేదు. కారు కదిలింది. ఆమె తిరిగి అన్నది. "ఆ విషయమే ఎప్పటినుంచో అడుగుదామనుకున్నాను".

 

    "ఏమిటి?"

 

    "ఈ మనుష్యులపట్ల మీకెందుకు కసి?"

 

    ఇదే ప్రశ్న సింహం అడిగాడు. ఎందుకింత కసి...

 

    ఆమె అంది- "వెంట్రుకే అమ్మక్కర్లేదు. ఏ ఫంక్షనైనా వాళ్ళు డబ్బులిస్తారు. ఆడిపిల్ల వడుగే అక్కర్లేదు. సత్యనారాయణ వ్రతమైనా చాలు. కేవలం మనుష్యుల్లో..." అని, సీరియస్ గా వున్న అతడి మొహం చూసింది. "నేనేమైనా ఎక్కువగా మాట్లాడానా సార్"

 

    "లేదు వాణి. నేనెప్పుడూ నన్ను నేను వేసుకునే ప్రశ్న నువ్వు అడిగావు" ఎప్పుడూ సీరియస్ గా, ఏదో ఆలోచించుకుంటూ వుండే అతడు అంత మామూలుగా మాట్లాడటం ఆమెకి సంతోషం వేసింది.

 

    "నేనొకటి చెప్పనా?" అంది తటపటాయిస్తూ.

 

    "ఏమిటి వాణి -"

 

    "చొరవ తీసుకుంటున్నానేమో!"

 

    "లేదు వాణీ చెప్పు!"

 

    "నాకు మిమ్మల్ని.... మిమ్మల్ని చూస్తే ఒక పెద్ద అండని చూసినట్టువుంటుంది. ఒక అన్నయ్య ఇంట్లో తిరుగుతూ వున్నట్టుంటుంది".

 

    "ఇప్పటికి ఎన్ని హత్యలు చేసి ఉంటావు వాణీ నువ్వు? అంటే సింహం రాబోట్ లాటి ఇంకొకరితో కలసి కాదు. నువ్వు స్వయంగా?"

 

    సందర్భంలేని ప్రశ్నకి ఆమె విస్తుబోయింది. "మూడు- ఊహూ- కాదు నాలుగు. ఆఁ నాలుగే అనుకుంటా"

 

    అతడు చాలాసేపు మాట్లాడలేదు. కారు నెమ్మదిగా సాగిపోతుంది. డ్రైవ్ చేస్తున్న అతడు కొంచెంసేపటి తరువాత ఏడుస్తున్న చప్పుడు వినిపించి తలతిప్పి చూశాడు. ఆమె చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తోంది. అతడు తిరిగి రోడ్డుమీద దృష్టిసారించి, ట్రాఫిక్ ని తప్పిస్తూ "వెళ్ళగానే చేయవలసిన పన్లు చాలా వున్నాయ్" అన్నాడు. "-అండ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ!"

 

    ఆమె మాట్లాడలేదు.

 

    "మొట్టమొదటి హత్య ఎప్పుడు చేశావ్ వాణీ నువ్వు?"

 

    ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. తరువాత నెమ్మదిగా అంది. "సరిగ్గా గుర్తులేదు. పదకొండో - పన్నెండో వయసుంటుందనుకొంటా. నాన్న పాకలోకి అర్థరాత్రి ఎవడినో తీసుకొచ్చాడు. నేనేడ్చాను. గోలపెట్టాను. అరగంట తరువాత బైట గొడవ జరిగింది. తాగుడు లేకపోతే నాన్న మనిషికాడు. 'పది రూపాయలిమ్మని నాన్న - పెద్దమనిషి అవని దాని దగ్గిరకు తీసుకొచ్చి పది అడుగుతావా' అని వాడూ అరగంటపాటూ ఘర్షణ పడ్డారు. వాడు నాన్నని పొడిచాడు. చూస్తున్న నాకు కోపం వచ్చి వాడ్ని వెనక నుంచి పొడిచేశాను. తరువాత భయంవేసింది. అర్థరాత్రి రోడ్డుమీద పరుగెత్తి పారిపోతుంటే మీ నాన్న కారెక్కించుకున్నారు".

 

    చెప్పటం ఆపగానే కారంతా నిశ్శబ్దం!

 

    "ఎంత నికృష్టమైన జీవితాలు వాణీ ఇవి! ఒక్కొక్క జీవితం వెనకున్న చరిత్రతల్చుకుంటేనే వళ్ళు గగుర్పొడుస్తుంది. అయినా కూడా ఎంత ఇన్ డిఫరెంట్ గా బ్రతుకుతున్నామో!!! నేను చూడు. ఇన్నాళ్ళు కలిసివున్నా నీ గురించి ఒక విషయమూ తెలుసుకోలేదు. కానీ నేన్నీకో సలహా ఇవ్వనా- ఎప్పుడూ ఎవరి ముందూ ఏడవకు వాణీ. ఒంటరిగా ఏడవటంకోసమే రాత్రిళ్ళు సృష్టించబడ్డాయి..." గుండె లోతుల్లోంచి వచ్చినట్లున్న ఆ మాటలకి ఆమె స్థబ్దురాలై, మళ్ళీ వెంటనే సర్దుకుంది. "అబ్బే- ఎందుకో అలా ఊరికే ఏడుపొచ్చేసింది అంతే... నౌ ఐయాం ఆల్ రైట్" అంది నవ్వుతూ. మామూలు వాణి అయిపోయి! "-ఇప్పుడు నేను చాలా సుఖంగా ఉన్నాను. కావలసినంత డబ్బు, స్వేచ్చ, సింహంతో స్నేహం... ఆ రోజు మీ నాన్నగారే తటస్థపడకపోయివుంటే ఎంగిలాకుల మధ్య తెల్లవారేది బ్రతుకు. చదువు చెప్పించి, పెంచి.... పెద్దచేసి..."

 Previous Page Next Page