ప్రశ్న : చాలామంది రచయితలు "ఫోర్త్ డైమెన్షన్ లో.....: అని ఉపయిగిస్తారు. నాలుగో డైమన్షన్ లో అంటే ఏమిటి? 3-డి సినిమాకి దీనికి ఏదైనా సంబంధం వుందా? (శ్రీమతి సుగుణకుమారి, హైదరాబాద్)
జవాబు : మీకు మీ శ్రీవారికి మధ్య ఎప్పుడయినా ఈ రకమైన సంభాషణ జరిగిందా?
"నా పెన్ ఎక్కడ పెట్టావ్?"
"గూట్లో వుంది చూడండి."
"కనపడటం లేదు. కాస్త వచ్చి చూడు"
"పై అరలో వుంటుంది. కాస్త చూసుకోండి. చెయ్యి ఖాళీ లేదు"
"పై అరంటే ఎక్కడ? కాస్త సరిగ్గా చెప్పకూడదూ, ఆఫీసుకి టైమ్ అయిపోతోంది."
"కుడివైపు, వెనుక మూల"
మీరు మీ వారికి పెన్ను ఎక్కడుందో చెప్పాలంటే దాని తాలూకు మూడు డైమెన్షన్లు చెప్పాలి. ఇదే మీ బాబు గుచ్చుమీద ఇంకు వలకబోశాడనుకోండి. అదెక్కడో చెప్పటానికి మీరు రెండు డైమెన్సన్లు చెప్తే చాలు. ఎత్తు చెప్పనవసరంలేదు. దీన్ని టు - డైమెన్షన్ లో కనపడతాయి. అలా కాకుండా సినిమాలో వస్తువుల మధ్యదూరం కూడా చూడాలంటే 3-డి;ప్ చూడవలసి వుంటుంది. ఇక ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం.
మీ భర్త...... భూమి, వాతావరణం, గాలక్సీల ఆకర్షణ ప్రభావం ఏమీ లేకుండా గదిలో నిలబడి "నా పెన్ను ఎక్కడ పెట్టావ్" అని అడిగారనుకోండి. పై అరలో కుడివైపు.....వెనుక మూల..... అని మీరు సమాధానం ఇచ్చే లోపులో ఆయన మీకు దాదాపు తిరుగుతూ వుంది. అదీగాక వేగంగా సూర్యుడిచుట్టూ తిరుగుతూంది. పైగా సూర్యుడు గాలక్సీ చుట్టూ సెకనుకి 250 కి.మీ వేగంతో తిరుగుతున్నాడు. వీటన్నిటికంటె ముఖ్యంగా మన గాలక్సీ మొత్తం శూన్యంలో వేగంగా కొట్టుకుపోతోంది. ఇవన్నీ కలుపుకుంటే, మీరు పెట్టిన పెన్ను చోటుని "మీ శ్రీవారి పరంగా" చెప్పాలంటే ఫలానా టైమ్ లో అది ఫలానా ప్రదేశంలో వుంటుంది అని చెప్పాలి. గది స్థిరంగా, మనుష్యులు భూమ్మీద స్థిరంగా వుంటారు. కాబట్టి 3-డి చాలు. శూన్యంలో వస్తువుల ఉనికి చెప్పాలంటే సమయంకూడా దానికి కలుపుకోవాలి. దీన్నే ఫోర్త్ డైమెన్షన్ అంటారు. మీ శ్రీవారు మిమ్మల్ని "నేన్నిన్ను ఫోర్త్ డైమెన్షన్ లో కూడా ప్రేమిస్తున్నాను. సుగుణా" అంటే మీరు ఆయన్ని వెంటనే అనుమానించవలసిన పరిస్థితి వచ్చిందన్నమాట ఐన్ స్టీన్ మాటల్లో చెప్పాలంటే నవలల్లోలా ఆ ప్రేమ సెకనులో లక్షవ వంతు మాత్రమే!!!
ప్రశ్న : నేను ఎన్. ఆర్ ఎమ్. స్కూల్లో తొమ్మిదో క్లాస్ చదువుతున్నాను. చీకట్లో సూర్యుడు చాలా చోట్ల అర్థం కాకపోయినా విడవకుండా చదువుతున్నాను. చాలాకాలం నుంచీ నాకో అనుమానం వుంది. వేడి వేరు - వెలుతురు వేరా? కాక రెండూ ఒకటేనా? రెండూ వేరయితే, వెలుతురు కూడా ఒక శక్తేనా? అంటే వేడితో రైలు ఇంజను నడిపినట్టు వెలుతురుతో కూడా నడప వచ్చా? వెలుతురు కూడా శక్తే అని మా టీచరు చెప్పారు. వేడి లేకుండా వెలుతురు కూడా శక్తే అయితే, దానితోకూడా పనులు చేయించుకోవచ్చు కదా. నా ప్రశ్న తప్పయితే నవ్వుకోకండి
(సురేష్ కుమార్.....?)
జవాబు : ఇందులో నవ్వుకోవటానికి ఏమీలేదు తమ్ముడూ! తొమ్మిదో క్లాసు చదివే చాలామందికి ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి వుండక పోవచ్చు. వెలుతురు కూడా శక్తి స్వరూపమే! అయితే దీని మాస్ దాదాపు "జీరో". ఒక వస్తువుని (ఉదాహరణకి నువ్వు చెప్పినట్టు-రైలింజన్) కదల్చటానికి శక్తి కావాలి. అంతేకాదు, ఆ శక్తి అంతా ఒకచోట కేంద్రీకృతం కావాలి. నువ్వొక బ్యాటరీ లైటు వెలిగించావనుకో! దాని కాంతికిరణం సెకనులో 186,282మైళ్ళు వెళ్ళిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని ఒకేచోట కేంద్రీకృతం చేయటం ఎలా? అలా అని, వెలుతురికి శక్తి లేదని కూడా అనలేం. ఒక సన్నటి దారానికి ఒక నిలుపుపాటి రాడ్ వేలాడకట్టి దానిమీదకు కాంతిని ఫోకస్ చేస్తే, శూన్యస్థితిలో ఆ రాడ్ వెంట్రుకవాసి కదులుతుందని దాదాపు 80 సంవత్సరాల క్రితమే మనవాళ్ళు కనుక్కున్నారు. "శూన్యస్థితి" అని ఎందుకు అనవలసి వచ్చిందంటే - అందులో గాలి వుంటే ఆ గాలిని మళ్ళీ కదపటానికి మళ్ళీ శక్తి కావాలి కదా! వెలుతురికి అంత శక్తిలేదు. దీన్నిబట్టి వూహించు.....వెలుతురు ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తిని వెదజల్లుతుందో!(కానీ వెదజల్లుతుంది)