ఆమాటలు తనన్నాడా నిర్మల అన్నదా అనిఒక్కక్షణం మధనపడ్డాడు సాగర్. తర్వాత నెమ్మదిగా "ఒకసారి మిమ్మల్ని నా స్నేహితులకు చూపిస్తాను. వాళ్ళ అభిప్రాయం మీరు చెవులారా విందురుకాని నా అదృష్టాన్ని వాళ్ళు ఆగకుండా పొగుడుతూంటే మీ విలువమీరు తెలుసుకుందురుగాని...." అన్నాడుతను.
"మీ స్నేహితులు నన్నెలా చూస్తారు?" అంది నిర్మల.
"ఇక్కడకు తీసుకుని రావడం బాగుండదు మీరే నేనుచెప్పిన చోటుకి రాగలరా?" అన్నాడు సాగర్.
"నేనా- అది అసాధ్యం!" అంది నిర్మల.
తను ముందుగా ఆలోచించుకునివున్న పధకాన్ని అప్పటికప్పుడు తట్టినట్లు గొప్పగా నటించాడు సాగర్. ఒక్కటొక్కటిగా స్ఫూర్తిస్తున్నట్లు భ్రాంతిని నిర్మలకు కలగజేశాడతడు నిర్మల అతడి నటనను వాస్తవమేననుకుంది. వచ్చే మంగళవారంనాడు వూళ్ళో సినీతారలు కూడా వస్తున్నారు. టికెట్ పది రూపాయలనుండి అయిదు వందలవరకూవుంది. సాగర్ రామారావు కుటుంబానికి నాలుగు టికెతలిస్తాడు తనకు ఎవరో ఇచ్చారనీ- తనకు వెళ్ళే ఉద్దేశ్యం లేదనీ చెబుతాడు. వాళ్ళకోసం రానూపోనూ కారేర్పాటుచేస్తాడు. సాయంత్రం అయిదున్నరకు కారువచ్చి వాళ్ళకు తీసుకుని వెడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏడుగంటలకు రామారావింటికి కారువస్తుంది అందులో నిర్మల ఎక్కాలి.
"నాకు భయంగావుంది...."
"ఇది భయానికి సంబందించైనా విషయంకాదు. మీకు నమ్మకముండాలి....." అన్నాడు సాగర్.
"నేను మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నాను...." అంది నిర్మల.
"అయితే తప్పక వస్తారుకదూ!" అన్నాడు సాగర్.
నిర్మల బదులివ్వలేదు. ఆమె సమాధానంకోసం కాసేపెదురు చూసి "నేనింక మిమ్మల్నికలవను ఆలోచించుకుందుకు మీకింకా నాలుగురోజుల వ్యవధి వుంది" అన్నాడు సాగర్.
"నేనొకటి అడుగుతాను- చెబుతారా?" అంది నిర్మల.
"ఊఁ"
జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలుతిని వున్నాను. అందువల్ల నాకుమంచి తనమంటే నమ్మకం పోయింది. నేను మిమ్మల్నినుమానిస్తే ఆతప్పునాదే అవుతుంది. అయినా అడుగుతున్నాను. నన్ను మీరు మోసంచేయరు కదూ?" అంది నిర్మల.
"మిమ్మల్ని మోసంచేస్తే నన్నునేను మోసంచేసుకున్నేట్లే! అయినా మికీఅనుమానమెందుకొచ్చింది?"
"ఎందుకో చెప్పనా?"
"ఊఁ" అన్నాడు సాగర్ కుతూహలంగా.
"నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను...." అంది నిర్మల.
ఆమాటకు సాగర్ లో నిలువెల్లా పులకింత కలిగింది.
"మీరూ నన్ను ప్రేమిస్తున్నారు కదూ!" అంది నిర్మల.
"ఊఁ"
"మీరు నిజంగా నన్ను పెళ్ళిచేసుకుంటే జీవితాంతం మీకు కృతజ్ఞురాలివై వుంటాను. నా గురించి మీకున్న భావనలన్నీ నిజంచేస్తాను. నేను ఇల్లాలిగా అభించడం మీఅదృష్ట మన్నభావన మీకేకాక చుట్టుపక్కల వారందరికీకూడా కలిగేవిధంగా నా ప్రవర్తనను తీర్చిదిద్దుకుంటాను. ఒక్కమాటతో చెప్పాలంటే నాజీవితాన్ని మీకు అంకితంచేస్తాను"
సాగర్ తెల్లబోయి " నిర్మలా! అంతఅదృష్టానికి నేనుతగను" అన్నాడు.
"ఆ నిర్ణయం మీదికాదు నాది...." అని "నన్ను నిజంగా పెళ్ళిచేసుకుంటానని నా చేతిలో చేయివేసి చెప్పండి...." అంది నిర్మల.
సాగర్ తటపటాయించాడు. నిర్మల చేయిసాచి అతడిఎదురుగా నిలబడి వుంది. సాగర్ ఆమెచేతినే చూస్తున్నాడు. కుసుమకోమలంగా ఉన్నదాచేయి అప్పుడాచేతిని తాకాలంటేనే అతడికి భయం వేసింది.
"నాకు ఒట్లంటే నమ్మకంలేదు...." అన్నాడు సాగర్.
"నాకుంది...."అంది నిర్మల.
"కానీ నిర్మలా! పెళ్ళయ్యేదాకా నేనుమిమ్మల్ని తాకలేను. అంతవరకూ నామాట నమ్మండి....." అన్నాడు సాగర్. అతడప్పుడు మనసులో ఆషాడభూతికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు.
ఈ మంత్రం నిర్మలపై బాగా పనిచేసింది. ఆమె చటుక్కున చేతిని వెనక్కు తీసుకుంది. సాగర్ పై ఆమెకున్న గౌరవంఅప్పుడు రెట్టింపయింది
ఇంతలో తలుపు చప్పుడైంది.
15
"మైడియర్ ఫ్రెండ్! పదివేలు రెడీ చేసుకో...." అన్నాడు సాగర్.
"ఎందుకు?"
"నా కార్యక్రమం జయప్రదంగా ముగిసింది. ఇంకనేను మంగళవారం దాకా ఆగదికి కూడా వెళ్ళను...." అన్నాడు సాగర్.
"అంటే?"
"మంగళవారం నాడు సాయంత్రం నువ్వు నా ఆఫీసుగది కెదురుగాఉన్న బస్ స్టాపులోనిలబడు. సరిగ్గా ఏడుంపావూ, ఏడున్నరకూమధ్య నాయింటిముందో కారాగుతుంది. అందులోంచి నిర్మల దిగి నాగదికి వస్తుంది ఆ తర్వాత నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు....."
చంచ లావు తెల్లబోయి "నువ్వు నిజమే చెబుతున్నావా?" అన్నాడు.
"ఇప్పుడు నేనుచెప్పిమాత్రం ప్రయోజనమేమిటి? మంగళవారం నాడు నువ్వేచూసి తెలుసుకుందువుగాని....." అన్నాడు సాగర్.
"నేను నిన్ను నమ్ముతానుగానీ- అసలిదంతా ఎలా సాధించావో నాకు చెప్పు....." అన్నాడు చంచల్రావు.
"ఏముంది! వియ్యానికైనా నెయ్యానికైనా సరివారుండాలి. నాకూ ఓ సవతి తల్లుందనీ- అష్టకష్టాలూ పడ్డాననీ చెప్పాను. ఆమె పై నేను సానుభూతి చూపించాను. నాపై ఆమెసానుభూతి చూపించింది. అదే మప్రేమకు బలాన్నిచ్చింది. ఇప్పుడామె నన్ను త్రికరణశుద్ధిగా ప్రేమిస్తోంది....."
"అంటే నిజంగా పెళ్ళికి ముందే నీకు లొంగిపోతుందంటావా?"
"ఆడదాని గురించి నీకు తెలియదు బ్రదర్! ఒకసారి ఎలాగో నమ్మించామంటే ఆతర్వాత మనకోసం మానప్రాణాల్ని తృణప్రాయంగాచూస్తుంది"