మాట్టాడుతున్నది తన ప్రియాతి ప్రియమైన రీతూ అన్న మాటను ఎప్పుడో మరచిపోయాడు రవితేజ. నిస్తేజంగా తన స్థానంలో నుంచి లేచాడు. కదిలాడు...
అతని మనోగతాన్ని అప్పటికే గమనిస్తున్న కొందరు పరిస్థితిని అర్ధం చేసుకోగలిగారు. అతను ఆహ్వానించిన అమ్మాయే అతనిని...
రవితేజ వేగంగా బయటపడ్డాడు. డ్రయివరు కారును తెచ్చి ఆపాడు.
రవితేజ అంత సీరియస్ గా వుండడం డ్రయివరు ఎన్నడూ ఎరగడు.
"నో... అటుకాదు. టేక్ లెఫ్ట్ టర్న్!" ఆవేశంగా అరచాడు రవితేజ.
యధావిధిగా ప్రధాని నివాసం వైపుకు పోనిస్తున్న కారును ఖంగారుగా ఎడమ వైపుకు తిప్పాడు డ్రయివరు. అతను బిత్తరపోతున్నాడు. భయపడుతున్నాడు.
"స్టాప్ ఇట్ !" మళ్ళీ అరచినంతగా అన్నాడు రవితేజ కారుకు షడన్ బ్రేక్ పడింది.
"నువ్వు కారు తీసుకుని వెళ్ళిపో !" దాదాపు ఆజ్ఞాపిస్తున్నట్టు అని, దాపునే వున్న స్టార్ హోటల్ వైపుకు నడిచాడు రవితేజ...
రవితేజ వెళ్ళీవెళ్ళగానే, ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సదస్యులు.
తమకు తెలిసినంతవరకు రవితేజ కోటీశ్వరుని కుమారుడే ! నిజానికి, అతనికి ఉద్యోగం చేయవలసిన అవసరం కూడా లేదు. అతను వృత్తిపట్ల ఏనాడూ ప్రమత్తంగాలేడు. ఎంతో అంకిత భావంతో పని చేస్తున్నాడు. ఇంటిలిజెన్స్ రిపోర్టులన్నీ అతన్ని గురించిన సదభిప్రాయాన్ని వ్యక్తపరిచాకే అతనిని సెక్యూరిటీలోకి తీసుకున్నారు!
అంత ముఖ్యమైన సదస్సులో. అందరి మేధావుల ముందు అంత పెద్ద హోదాలో వుండి, ఇంత ప్రత్యక్షంగా, నీచంగా నిందపడిన తరువాత, ఇక అతను ఉద్యోగం చేస్తాడని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఒకొక్కరే నిష్క్రమించడం ప్రారంభించారు.
ఎవరినోటవిన్నా, కుమారి రీతు మిష్టర్ రవితేజను అపార్ధం చేసుకుంది... అనే !
పరోక్షంగా, నీతూ ప్రసంగానికి నిరసనగా అంతా వాకౌట్ చేస్తున్నట్టు గుర్తించిన డైరక్టరు మురళీధరన్ సదస్సు సమావేశాన్ని అప్పటికప్పుడే ముగించి, రవితేజ కోసం ఆదరాబాదరాగా వెళ్ళాడు.
కుమారి రీతూ ముఖాన కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు తన నిర్ణయం సభను ఇంత మలుపు తిప్పుతుందని ఆమె కలలో కూడా ఊహించుకోలేదు ! భిన్నురాలయింది.
తెలిసీ తెలియని ఆవేశం ఎంతటి అనర్ధాన్ని తెచ్చి పెడుతుందో తొలిగా ప్రత్యక్షంగా తెలుసుకుంది రీతూ...
అయితే, అప్పటికే జరగవలసిందంతా జరిగిపోయింది..........
* * *
ఆమెను వింతగా చూస్తున్నది సింధు.
ఆమె జీన్స్ ప్యాంటుకు చెక్స్ డిజైన్ షర్ట్ ను టక్ చేసింది. కాళ్ళకు యాక్షన్ షూస్ తొడిగింది. క్రాపును చేతి వ్రేళ్ళతో మరోసారి సవరించుకున్నా, జుత్తు రఫ్ గా ముఖం మీదకు. చెవుల మీదకు జారి జీరాడుతూనే వుంది. వెంట్రుక ఒకటి ఊయలలూగుతున్నది.
బులెట్ మోటార్ సైకిలును స్టాండు నుంచి ముందుకులాగి, ఎక్కి కూర్చుని, ఒకే ఒక్క కిక్ తో స్టార్ట్ చేసింది. అది క్షణంలో రాకెట్ లా దూసుకుపోయింది.
ఆమె ధీరజ. సింధు అక్క. సింధు ప్రాణం. ధీరజకూ అంతే. ఆమె ప్రాణం సింధు.
వీధిలోని జనం అంతా నోరెళ్ళబెట్టి, కనుపించినంత మేరకు ధీరజనే చూస్తుండిపోయారు. ఆమె అటు వెళ్ళాక, అమ్మలక్కలంతా ఇటు సింధు చుట్టూ చేరారు.
రకరకాల ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. పోసుకోలు ప్రశ్నలు. ఉబుసుపోని ఆ ప్రశ్నలన్నింటినీ ఓపికగా విన్నదే కాని, ఒక్కదానికీ జవాబు చెప్పలేదు సింధు. చెప్పదు. అన్నింటికీ చిరునవ్వే సమాధానం ! ఆమె తత్వమే అంత! మితభాషి. సుభాషిణి... అమ్మలక్కలు విసిగి వేసారి, ముఖాలు మాడ్చుకుంటూ ఎటువారటు జారుకున్నారు. అది వారి అలవాటు.
చివరగా ఒక వ్యక్తి మాత్రం అలాగే నిలచి వున్నాడు ! అతని ప్రక్కన జీపు.
అతనిని ఎప్పుడూ చూడకపోవడంతో, ఎవరో కొత్తవ్యక్తి అయి వుంటాడనుకుంటూ సహజంగానే అతనిని ఎగాదిగా క్రిందికి పైకీ చూసింది. అనుమానంగా, ఆసక్తిగా చూసింది.
'ఎవరైతే తమకెందుకులే' అనుకుంటూ తల తిప్పి లోనికి నడచింది సింధు.
ఆమె తలుపులు మూస్తున్న సమయానికి ఆ వ్యక్తి హడావుడిగా, అంగలపంగలతో వచ్చి ఇంట్లోకి చొరబడ్డాడు ! నిస్సంకోచంగా, నిబ్బరంగా లోనికి వచ్చాడు. చొరవ చూపాడు.
తెల్లబోయింది సింధు. అంతలోనే తెప్పరిల్లింది. తొట్రుపడింది.
"ఎవరు మీరు ? ఎవరు కావాలి ? సరాసరి లోపలికే వచ్చేశారేమిటి ?" అంటూ అడిగింది. నిలదీసింది. ఆనక నిలువుగుడ్లు వేసుకు చూసింది.