మొండిగుర్రాన్ని నీటి తొట్టి దాకా లాక్కెళ్ళ గలిగిన దీక్ష గుర్రాన్ని నీళ్ళు తాగించగలదా! దానికి రేపటి దాకా ఆగాలి.
ఎదుటి వారిలోని బలహీనతని పట్టేస్తే బలం (గెలుపు) మనదవుతుంది అన్న చిన్న సూక్తి దీక్ష ఎప్పుడూ మరచిపోదు.
ఆదిలక్ష్మమ్మ యింట్లో అయితే మంచినీళ్ళు యిమ్మని అడిగేసరికి దీక్ష ముఖానే తలుపులువేసి మంచినీళ్ళు లోపలి నుంచి తెచ్చి ఆ తర్వాత తలుపుతీసి యిచ్చింది. ఆ మహాతల్లి దీక్షని దొంగల రాణి అనుకుంది.
మరొక యింట్లో అవసరం అయితే నలుగురం చేతులు వేద్దామన్నట్లు దీక్ష రాగానే వాకిలికి అడ్డంగా అరడజను మంది నుంచున్నారు.
ఇలాంటి అనుభవాలు కొన్ని కాగానే దీక్ష విషయం ఏమిటో చూచాయిగా కనిపెట్టేసింది. అనవసరపు పొగడ్త తప్పని తెలిసినా ఆ పరిస్థితులలో తప్పలేదు.
'చాలావరకు సాధించాను. చివరి అధ్యాయం కూడా ఏ అవాంతరమూ లేకుండా పూర్తి అయితే, తన కృషి పూర్తి అవుతుంది. ఫలితం దైవాధీనం, అదృష్టం కూడా కృషికి తోడుకావాలి. వెండి కంచానికయినా, బంగారపు పళ్ళేనికయినా గోడ చేర్పు కావాలి అన్నారు పెద్దలు.'
"దీక్షగారూ"
ఎవరో పిలిచినట్లయి దీక్ష ఆలోచనలు చెదిరి పొయ్యాయి. సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయి వెనుతిరిగి చూసింది.
దగ్గరగా వస్తూ పృధ్వీరాజ్.
దీక్ష మనసు తృప్తిగా వుంది. అందువల్ల పృధ్వీరాజ్ ని చూడగానే సంతోషం కలిగింది.
"రెండుసార్లు పిలిచాను, మీరు వినిపించుకోలేదు." పృధ్వీరాజ్ దగ్గర కొస్తూ చెప్పాడు.
"ఈ మధ్య కాస్త చెముడు వచ్చింది లేండి." దీక్ష చెప్పిన తీరులో రవంత కొంటెతనం ధ్వనించింది.
"మీకా..! చెముడా..!"
"నాకే.. చెముడే..ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది?"
"నిక్షేపంలా వున్న మీకు.... !"
"మరీ అంత ఆశ్చర్యపోకండి. నటన అనుకోవాల్సివస్తుంది."
"ఇందులో నటన లేదు. వంకాయ లేదు. నిక్షేపంగా వున్న మీకు చెముడా?"
"మనిషి నిక్షేపంగా వుండటానికి చెవులు వినిపించక పోవటానికి సంబంధం లేదు."
"అంతేనంటారు?"
"అంతే మరి...!"
"అబద్ధాలు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు దీక్షగారూ!" సీరియస్ గా అడిగాడు పృధ్వీరాజ్.
"చెముడు వచ్చినప్పటి నుంచీ." నవ్వుతూ చెప్పింది దీక్ష.
పృధ్వీరాజ్ నవ్వాడు. "మీరు చాలా తెలివి కలవారు." అన్నాడు.
"మీ కన్నానా!" అంది దీక్ష.
గుంభనంగా నవ్వాడు అతను.
అది కనిపెట్టింది దీక్ష. 'గురుడు పొగడ్తల బుట్టలో పడే రకమే' అనుకుంది.
"ఇలా ఎన్నాళ్ళు దీక్షగారూ!" అడిగాడు.
"ఏది?" నిజంగా అర్ధంగాకనే అడిగింది దీక్ష.
"ఇలా ఇల్లిల్లు తిరిగి పాంప్లెట్లు పంచిపెట్టటం?"
ఈ రోజుతో ఆఖరు అని దీక్ష చెప్పలేదు. "ఎక్కేగడప దిగేగడప, నా కాళ్ళు నొప్పులు పుట్టనంతవరకు." అంది.
"అసలు ఆ పాంప్లెట్లకి అర్ధం ఏమిటి?"
"అది చాలా సీక్రెట్."
"ఏది మళ్ళీ చెప్పండి?"
"అది చాలా సీక్రెట్! పైగా స్త్రీలకి సంబంధించినది."
"ఆ... స్త్రీలంటే గుర్తుకొచ్చింది. మీరు చాలా ప్రమాదంలో పడ్డారు దీక్షగారూ!" ఆ విషయం అప్పుడే గుర్తుకు వచ్చిన పృధ్వీరాజ్ అన్నాడు.
దీక్ష ఒకసారి నలువైపులా చూసి ఫక్కున నవ్వింది.
"ఎందుకు నవ్వుతారు?" పృధ్వీరాజ్ కోపం తెచ్చుకుంటూ అడిగాడు.
"ప్రమాదం నాకా?" దీక్ష అడిగింది.
"మరి నాకా?"


