Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 21


    "అయితే నేనూ డాన్స్ చేయాలంటారు?"
    "ఏమిటి పోతుంది డాన్స్ చేస్తే?"
    "మీరెన్ని చెప్పండి, నా వల్ల గాదు. అలా పరాయి మగవాణ్ణి పట్టుకుని...... అసలీ విదేశీ పద్దతులు , అలవాట్లు మనదేశంలో ఎందుకో ఇంకా?"
    రావు మళ్ళీ నవ్వాడు, శాంతి కళ్ళలోకి చూసి , ఆ నవ్వుకి శాంతికి కోపం వచ్చింది. "నువ్వు ఏం తెలియని అమాయకురాలివని" చెపుతోన్నట్టుంది , ఆ నవ్వు.
    "మీరలా నవ్వితే నాకు కోపం వస్తుంది"
    "నీకు కోపం వస్తే నాకు బాగుంటుంది' ప్రేమగా నవ్వాడు రావు.
    మొదట కొన్ని క్షణాలు ఏం చెప్పాలో తెలియని సందిగ్ధంలో పడింది శాంతి. తర్వాత ఆమె మనసులో మాట చెప్పుకోవాలన్న ఆత్రుత ఎక్కువవుతుంటే మెల్లిగా మొదలు పెట్టింది.
    "నిన్నరాత్రి నన్ను వాళ్ళంతా ఏదో వింత వస్తువుని చూపినట్టు చూస్తుంటే నాకెంత చిన్నతన మనిపించిందో తెలుసా? వాళ్ళ కన్న ఏదో తక్కువ అన్నట్టు చూసి మాట్లాడడం. క్రొత్తలో తెలియక ఏదో చిన్న పొరపాట్లు చూశానే అనుకోండి. అంతమాత్రాన మరీ అంత ఇదిగా మొగం మీద చిన్న బుచ్చుకునే లాగ చెప్పాలేమిటి?"
    రావు నవ్వాడు , మళ్ళీ అదే ధోరణిలో.
    "శాంతీ డార్లింగ్! నిన్న నీ వేషం చూస్తె నాకేమనిపించిందో చెప్పనా?.....కోపం తెచ్చుకోకూడదు సుమా?"
    'చెప్పండి పరవాలేదు"
    "పందోమిదో శతాబ్దపు ఆదర్శ భారత నారీమణి అని బిళ్ళ ఒకటి మెళ్ళో వేలాడేసి మ్యూజియంలో పెట్టాలనిపించింది."
    "మీకు అలా అనిపించి ఎందుకు చెప్పలేదు?"
    "నేను చెపితే కన్నా నలుగుర్లోనూ చూస్తె నీకే తెలుస్తుందని వూరుకున్నాను."
    శాంతి చాలా సేపు మాట్లాడలేదు.
    "శాంతీ! నువ్వు తెలివైనదానివి. చదువు, అందం, జ్ఞానం వివేకం అన్నీ ఉన్నాయి. నిన్ను చూస్తె నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా.....అయినా నువ్వు కొంచెం మారాలి శాంతి. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగ ఉండమని ఒక సామెత ఉంది. అలాగ యిక్కడున్నప్పుడు ఇక్కడి వాళ్ళు లాగ ఉండడం అవసరం. వాలుజడలు, జడ కుచ్చులు మానేసి ఇప్పటి ఫేషన్ ప్రకారం ముడులు చుట్టుకోడం, ఎప్పుడూ కంచి జరీ పట్టుచీరలే కాకుండా నాజూకువి కట్టడం మొదలైనవన్నీ పెద్ద విషయాలేం కావు! నీ కిష్టమైతే మారడం నీ చేతిలో పని. ఇదివరకు నేను ఒకటి రెండుసార్లు చూదాయగా అన్నా నీవు పట్టించుకోలేదు. అలా మారితే నలుగుర్లోనూ కలిసి మెలసి ఉండడం సులభామైనప్పుడు అలా ఎందు కుండకూడదు? పోయేదేముంది ఇందులో. ఇక్కడింకోటి గుర్తుంచుకో, అందరితో కలిసి మెలిసి ఉండడం వాళ్ళ నీ గౌరవం హెచ్చడమే కాకుండా, సాంఘికంగా స్థాయి కూడా హెచ్చవుతుంది. మిగతా చోటల్లా కాదు ఇక్కడ. మిగతా ఉద్యోగాలలో కాదు ఆర్మీ ఆఫీసరు ఉద్యోగం ఆడా, మగ అంతా చనువుగా కలిసి ఉండే చోట, నీవు వెలిపడినట్లు ఉంటే, నీతో పాటు నేనూ వెలిగా ఉండిపోతాను! ఒక రకంగా చూస్తె నలుగుర్లోనూ నా పరపతి గౌరవం నీమీద ఆధార పడుంటాయి"
    'అయితే స్లీవ్ లెస్ బ్లౌజు, లిప్ స్టిక్ లు, నైలానులు వాడకపోతే అనాగరికుల క్రిందే లెక్క?"
    ".....అదికాదు శాంతి, లోకంతో పాటే మనమూ , రోజులు మారుతున్నాయి ఎప్పటి కాలానికి తగ్గట్టు అందరిలా ఉంటే తప్పేముంది."
    అయితే రేపట్నుంచి స్లీవ్ లెస్ బ్లౌజు లు, లిప్ స్టిక్, షిఫాన్ చీరలు, క్రొత్త రకం హెయిర్ స్టయిల్స్ మొదలుపెడతా నుండండి డాన్సు పాఠాలు కూడా నేర్చుకోమంటారా?"
    "డాన్స్ అంటే నీకిష్టం లేదని తెలుసు! కాని అందులో తప్పేం కనపడదు నాకు! ఇదంతా పెద్ద కుటుంబం. ఇక్కడున్న ఆఫీసర్లు అందరూ నీకు సోదరుల్లాంటివారు. మనసులొ ఆ భావం ఉన్నప్పుడు , పరాయి మగవాణ్ణి తాకామన్న ఆలోచన రాదు. పవిత్రత అన్నది మనసులో ఉంటుంది. నిన్న జనరల్ తో డాన్స్ చేసావు. నీకేమనిపించింది? అతనికి నీ తండ్రి అంత వయసు ఉంటుంది. అతను నీ చేతిని పట్టుకుని కాసేపు అటూ యిటూ తిరిగితే యిందులో అపచారం, అవినీతి ఏముంటుంది చెప్పు?"
    "......నేనేదో తేలిగ్గా మాట్లాడితే, మీరెందుకంత సీరియస్ గా ఉపన్యాసాలు దంచుతున్నారు....' చిలిపిగా అతని జుట్టు రేపింది శాంతి.
    
                                                 *    *    *    *
    
    "క్లబ్బులో యివాళ రాత్రి పిక్చరున్నట్టు చెప్పలేదేం? నిన్న సర్క్యులర్ వచ్చిందటగా?' మధ్యాహ్నం భోజనం చేస్తూ అడిగాడు రావు. ఆఫీసులో మీనన్ మాటల సందర్భంలో పిక్చర్ కి వస్తున్నారా?' అని అడిగేవరకు రావుకి తెలియదు.
    "ఎలాగు వెళ్ళడం, అవదని చెప్పలేదు."
    "ఏం! ఎందుకు అవదు? రాత్రి భోజనం చేసి ఏడు గంటలకి వెడితే పది లోపల వచ్చేస్తాం, ఇందులో వీలవక పోవడానికి ఏముంది?"
    "బాబుకి తొమ్మిది గంటలకి ఫీడింగ్ టైము, సుజా కి అన్నం అది ఎవరు పెడతారు?"
    "ఒక్కపూటకు మరేం కొంప మునగదులెద్దూ, ఆయా, రాము ఉన్నారుగా! సుజా కి అన్నం పెట్టి వెడదాం. ఆయా బాబుకి పాలు పడుతుంది, మంచి పిక్చర్"
    
                                                *    *    *    *
    "తొందరగా కానియ్యి, టైమయ్యింది!" టై కట్టుకుంటూ కేక వేశాడు రావు.
    'అయిపొయింది" అంటూ వచ్చిన శాంతిని చూసి నుదురు చిట్లించాడు రావు.
    "మళ్ళీ అదే వేషం! ఎప్పుడూ ఆ పట్టుచీరలే కాకపోతే మొన్న కొన్న షిఫాన్ చీర కట్టుకోకూడదూ? ఆ నల్లపూసలు, మట్టెలు ఒక్కపూటకి తీసేస్తే మరేం పాతివ్రత్యానికి భంగం రాదులే" శోభనం పెళ్ళి కూతుర్లా అన్ని పూలేమిటి? ముడి చుట్టుకోకూడదూ" శాంతిని ఆపాద మస్తకం పరీక్షిస్తూ అన్నాడు రావు.
    శాంతి ఇబ్బందిగా మొహం పెట్టి "ఏమిటో నాకు వాలుజడే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆ ముడి నాకు సరిగా కుదరదు. ఇప్పుడు మొదలు పెడితే వో అరగంట పడ్తుంది. ఈసారికి ఇలా రానిద్దురూ?" చూపులు తప్పిస్తూ అంది.
    మౌనంగా స్కూటర్ స్టార్ట్ చేశాడు రావు.
    "ఆయా, బాబుకి సరిగా తొమ్మిది గంటలకి పాలుపట్టు, ప్లాస్కులో పోశాను. సుజాని ఏడిపించకుండా పడుకోబెట్టూ రామూ?"
    "ఏమిటి వో రెండుగంటలకి అన్ని అప్పగింతలు పెడుతున్నావు? ఏది నీ కార్దిగాన్ తెచ్చుకోలేదా?"
    "పర్వాలేదు లెద్దురూ , ఇవాళ అట్టే చలిగా లేదు. మళ్ళీ లోపలికి వెడితే ఆలస్యం' రావు కింకేం చెప్పాలో ,ఎలా చెప్పాలో తెలియలేదు.

                                                   *    *    *    *

 Previous Page Next Page