Previous Page Next Page 
ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 21


    "మళ్ళీ 'భువన విజయమా?' అడిగాడు అభినవ్.
    "ఈసారి ఏదైనా హాస్య నాటిక వేద్దాం!" చెప్పాడు వాసు.
    "మనం ఏది వేసినా, అది గొప్ప హాస్య నాటికే అవుతుందిలే" చెప్పాడు సీరియస్ గా రాంబాబు.
    ఈసారి అభినవ్ తోబాటు, వాసు కూడా నవ్వేసాడు.
    ఇంకా కొంతమంది వచ్చి, 'మీటింగ్' పెట్టారు. ఎవరికి తోచిన నాటకాల పేర్లు వాళ్ళు ప్రపోజ్ చేసారు.
    "సత్యహరిశ్చంద్ర" వేద్దాం. పెద్దగా సెట్టింగులు అఖ్కర్లేదు" అన్నాడు వాసు.
    అందరూ ఒప్పుకున్నారు.
    "కానీ పేరు మార్చుదాం! 'పాపం పరిశ్చంద్ర' అని" అన్నాడు రాంబాబు.
    "పోయిన సారిలా ఒద్దు, లేడీ క్యారెక్టర్ అమ్మాయి చేతే వేయిద్దాం" చెప్పాడు ఆచారి.
    "అయితే అర్జంట్ గా చంద్రమతిని వెదకి పట్టుకోవాలి" అన్నాడు ధామస్.
    "డాన్స్ అదీ కూడా అఖ్కర్లేదు. ఒకటి రెండు ఏడుపు డైలాగ్స్ చెప్పగలిగితే చాలు!" అన్నాడు వాసు.
    "చక్కగా ఏడ్చే అమ్మాయిలెవరో చేతులెత్తండి!" అన్నాడు రాంబాబు లేచి నిలబడి.
    అమ్మాయిలందరూ కోపంగా తలలు తిప్పి చూసారు.
    "మన కాలేజీ తరఫున వరద బాధితుల సహాయార్థం సత్యహరిశ్చంద్ర నాటకం వెయ్యబోతున్నాము. అందులో నటించడానికి హీరోయిన్ వేషం వేసే అమ్మాయి కావాలి" అంటూ వాసు విపులీకరించాడు.
    విన్న అమ్మాయిలు, "మా వల్ల కాదు. అంటే మా వల్ల కాదు" అంటూ తప్పుకున్నారు.
    అభినవ్ నవ్వి, "మన కాలేజీలో ఓ అద్భుతమైన నటి వుంది తెలుసా!" అన్నాడు.
    "ఎవరు?" అందరూ ఆత్రంగా అడిగారు.
    అభినవ్ చెప్పాడు 'మంజీర'


                                                *    *    *    *


    "అభినవ్ నా పేరు ప్రపోజ్ చేసాడా?" మంజీరా ఆశ్చర్యంగా అడిగింది స్నేహితుల్ని.
    "ఆ... మంచి అవకాశం, రిహార్సల్స్ లోనే ముప్పతిప్పలు పెట్టెయొచ్చు" చెప్పింది ఓ ఫ్రెండ్.
    "నాటకం పేరేమిటీ?" అడిగింది మంజీర.
    "సత్య హరిశ్చంద్ర."
    "ఆయనెవరూ?" అడిగింది విసుగ్గా.
    "నేను చెప్తానమ్మా!" సంభాషణ అంతా విన్నట్లున్నాడు 'లూ' నవ్వుతూ వచ్చాడు లోపల్నించి.
    "అతనో 'కింగ్' ఎప్పుడూ అబద్ధం చెప్పనని, అన్నమాట నిలబెట్టుకోవడం కోసం, ఉన్నదంతా ఊడ్చిపెట్టి, అయినా అప్పులు తీరక, ఆలుబిడ్డలతో రోడ్లపాలయ్యాడు. చివరికి భార్యనీ, కొడుకునీ కూడా అమ్ముకుని, శ్మశానంలో కాటికాపరియై..." అంటూ చెప్తుంటే.
    "స్టాపిట్!" అంది చిరాగ్గా మంజీర.
    "ఇదేం నాటకం? ఒక కామెడీ లేదు, రొమాన్స్ లేదు, చివరిదాకా కష్టాలూ, కన్నీళ్ళూ ఏనా?"
    "పోనీ, నేను మోడ్రన్ గా మార్చి ఈ కథను స్క్రిప్ట్ రాసివ్వనా?" అడిగాడు లూ నవ్వుతూ.
    "ఎలా అంకుల్?" అడిగాడు అమ్మాయిలూ ఆసక్తిగా.
    లూ చెప్పనారంభించాడు. "దొరికిన ప్రతివాళ్ళ దగ్గర అప్పులు చేసి, చివరికి అప్పుల పాలౌతాడు. అబద్ధం మాత్రం చస్తే చెప్పకుండా, అన్నీ నిజాలే చెప్పి, ఒకళ్ళ జుట్లు ఒకళ్ళతో ముడివేసి, వాళ్ళు పోట్లాడుకుంటుంటే వినోదం చూస్తాడు. భార్య కష్టపడి ఉద్యోగం చేస్తుంటే, కూర్చుని తిని ఊర్కోలేక, "ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్'తో అడ్డమైన వేషాలు వేస్తాడు. పీనుగుల మీద పిండాకూడు ఏరుకునేందుకు కూడా అతను సిద్ధం! చివరికి భార్యనీ, కొడుకునీ తాకట్టు పెట్టి మరీ తాగేస్తాడు. ఆఖరి సీన్లో చంద్రమతి, కొడుకు చచ్చిపోయాడని కూడా లేకుండా, తాగి తాళిబొట్టు గుంజుకుంటున్న భర్తని ఈడ్చి, చెంపదెబ్బ కొట్టి, తన దారి తాను చూసుకుంటుంది, అదీ కథ! ఎలా వుంది?"
    "అద్భుతం!" మంజీరా అరిచింది. ఆమె కళ్ళముందు చివరి సీన్లో, అభినవ్ చెంప మీద తను ఈడ్చి కొట్టడం, అందరూ చప్పట్లు కొట్టడం కనిపిస్తోంది.


                                                 *    *    *    *


    మంజీర నాటకంలో తప్పకుండా వేషం వేస్తుందని అభినవ్ కి ముందే తెలుసు!
    మంజీర ఒప్పుకుందని తెలియగానే వాసు చాలా సంతోషించాడు. వెంటనే జేబు దులుపుకుని, ఆడపిల్లలకి పార్టీ ఇచ్చాడు కూడా. అతను చెప్పేదంతా శ్రద్ధగా వింది. స్క్రిప్ట్ చూసి, "నాకు చదవడం రాదు, కాబట్టి డైలాగ్స్ తీసెయ్యండి, కేవలం నటనతో ఏడుపుతో మెప్పిస్తాను" అంది.
    అందరూ తర్జన భర్జనలు పడి చివరికి ఒప్పుకున్నారు.
    "మీకు 'ప్లేబాక్' పెడ్తాం" అన్నాడు వాసు.
    రిహార్సల్స్ మొదలుపెట్టారు.
    అభినవ్ శ్రావ్యంగా పద్యం అందుకున్నాడు.
    మంజీర జేబులోంచి చాక్లెట్ తీసి నోట్లో వేసుకుంది. ఆమె దవడలు కదులుతుంటే అచ్చు, ఆ పద్యం ఆమె నోట్లోంచే వస్తున్నట్లు అనిపించసాగింది.
    వాసుకి కోపం వచ్చి, "రిహార్సల్స్ లో ఇలా తినకూడదు!" అన్నాడు.
    "ఖాళీగా ఉంటే నాకు తోచదు. పైగా అతను చెప్పేది ఒక్క ముక్క కూడా నాకు బోధపడడం లేదు" అంది విసుగ్గా.
    "పౌరాణిక నాటకాలు ఇలాగే ఉంటాయి. నీకూ పద్యం 'ప్లే బాక్' పెట్టిస్తాం. అప్పుడు నవులుదువుగానీ, చాక్లెట్..." అన్నాడు రాంబాబు.
    మళ్ళీ సీన్ మొదలయింది.
    అభినవ్ పద్యం అందుకుని మానేసాడు.
    'ఏం?' అడిగాడు వాసు.
    "నాకు మూడ్ కుదరడం లేదు. చంద్రమతి జీన్స్ లో ఉంటే నాకు బాగాలేదు."
    ఆ మాటకి మండిపడింది మంజీర.
    "రోజూ రిహార్సల్స్ కి కూడా, ఏడు గజాల చీర చుట్టబెట్టుకుని రావాలా? రేపట్నించి తల విరబోసుకుని, ఏడుస్తూ తిరగమంటాడేమో!" అంది.
    ఇద్దరికీ సర్ది చెప్పేటప్పటికి వాసు తల ప్రాణం తోకకి వచ్చింది.
    లోహితాస్యుడి వేషానికి, చిన్నపిల్లవాడ్ని రోజూ రిహార్సల్స్ కి తేవడం అదీ ఇబ్బంది కాబట్టి, పొట్టిగా, పీలగా ఉండే రాంబాబుని పెట్టారు. అతడు, "అమ్మా అమ్మా" అంటూ మంజీర వద్దకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి, ఆమె తల తిరిగిపోయింది.
    "ఇదేమిటీ? ఎద్దులా ఉండి నన్ను 'అమ్మా' అంటే రేపట్నించి కాలేజీలో అందరూ నన్ను "అమ్మమ్మా' అంటారు ఇలా అయితే నేను 'ఏక్ట్' చెయ్యను" అంది.
    "కలిసొచ్చే కాలం వస్తే, నడిచొచ్చే పిల్లలు పుడ్తారట! అందులోనూ సంతాన గోపాలస్వామికి ప్రదక్షిణాలూ... అవీ..." అని రాంబాబు అంటూంటే.
    మంజీర మొహం ఎర్రబడింది.
    పరిస్థితి శృతిమించుతోందని, అభినవ్ కలగచేసుకున్నాడు. అసలు ఎవర్నీ ఏమీ సంబోధించఖ్కరలేకుండా, డైలాగ్స్ రాయించమన్నాడు.

 Previous Page Next Page