Previous Page Next Page 
రుద్రనేత్ర పేజి 21


    స్వర్ణరేఖ జీవితం కూడా స్వల్పకాలంలోనే ఇలాటి మలుపు తిరిగింది. ఆమె తండ్రి బాక్టీరియాలజీ, వైరాలజీలలో రిసెర్చి చేసి, పెస్టిసైడ్స్ లో కృషిచేశాడు. సర్పభూషణరావు తాలూకు మందుల ఫ్యాక్టరీల రిసెర్చి విభాగంలో ప్రధానాధికారిగా ఆయన పని చేసేవాడు. ఆ రోజుల్లో అతడి కూతురు స్వర్ణరేఖ కూడా తండ్రికి సాయపడుతూ ఆ విభాగంలోనే పనిచేసేది.

 

    పైకి  చాలా సాధారణంగా, మామూలుగా కనిపించే రేఖ తండ్రి, ఎంతో తెలివైనవాడు. అతడు కనుక్కున్న పి.జి. గ్యాస్ (విషవాయువు) ఫైలం ప్రొటో జోవా నుంచి, నాన్ -  కార్డెటా వరకూ అన్ని చిన్న తరహా జీవుల్నీ చంపేస్తుంది. అంతేకాదు. సాధారణంగా ఏదైనా మందు ఒక పంటకి వాడితే, కొన్ని సంవత్సరాలకి ఆ  క్రిములు ఆ మందుపట్ల 'ఇమ్యూన్' అయి  పోతాయి. ఈ వాయువులో అటువంటి స్వభావం లేదు. వేర్వేరు పురుగులకు వేర్వేరు మందులు అవసరం లేకుండా కేవలం స్ప్రే ద్వారా చంపే ఈ గ్యాస్ గానీ మార్కెట్  లోకి వచ్చి వుంటే దేశపు వ్యవసాయోత్పత్తి రెండు మూడు రెట్లు పెరిగి వుండేది. అనుకున్న ప్రదేశాల్లో అనుకున్నప్పుడు  క్రిములు సంహారమయ్యేవి. గ్రీన్  రివల్యూషన్ వచ్చి వుండేది.

 

    ఇవన్నీ  జరగకపోవడానికి కారణం చివరి క్షణంలో సంభవించిన ఒక దురదృష్టకరమైన సంఘటన!

 

    అది ఆ సైంటిస్టు మరణం!

 

    ప్రస్తుతం ఆ ఫార్ములా తెలిసింది అతని కూతురైన స్వర్ణరేఖ ఒక్కతే!

 

    ఆమె దానిని బయటపెట్టలేదు.

 

    ఆమెలోని కసి, ఫ్రస్ట్రేషన్, తన  తండ్రి మరణం, తనకు జరిగిన అన్యాయం, థనుఇ తీసుకునే మత్తు ఇంజెక్షన్లు- అన్నీ కలిసి, ఆ ఫార్ములాని తనలోనే నొక్కేసేలా చేశాయి. ఆ ఫార్ములా పునాదిగా ఆమె ఇంకా పై ఎత్తున పరిశోధనలు చేస్తోంది.

 

    కానీ అంతకన్నా ఎక్కువకాలం స్వర్గంలోనే గడుపుతోంది.

 

    తండ్రి చనిపోయాక పెంపుడు తండ్రి ఇచ్చే ఇంజెక్షన్లవల్ల కనపడే స్వర్గం అది! ఏజెంట్ క్యూ చేతుల మధ్య దొరికే స్వర్గం అది!! రెండే ప్రపంచాలు ప్రస్తుతం ఆమెకి.

 

    వాటిలోంచి బయటకు రావడానికి ఇష్టం లేనంతగా కూరుకుపోయింది ఆమె!


    
                                   *    *    *

 

    "ఇంకా ఎంతకాలం పడుతుంది నువ్వు ఈ ఎక్స్ పెరిమెంట్ పూర్తి చెయ్యడానికి.....?" క్యూ అడిగాడు.

 

    "తొందర్లోనే పూర్తవ్వచ్చు" అంది స్వర్ణరేఖ. ఆమె పూర్తి నగ్నంగా వుంది. ఎయిర్ కండిషనర్ లోంచి వస్తున్న చల్లటి గాలి ఆమె శరీర స్పర్శకి వేడెక్కుతూంది ఆమె పక్కన 'క్యూ' పెద్ద సింహంలా వున్నాడు. బలమైన భుజాలు, సన్నటి నడుము, విశాలమైన ఛాతి, అన్నిటికన్నా మంచి...... ఓర్పు!

 

    అతడికి మామూలు మేటింగ్ సరిపోదు. దాదాపు నాలుగైదుగంటలు కావాలి. మొదట్లో ఆమె కాడి బాధగా వుండేది. కాని అలవాటయిన తరువాత అందులో ఆనందం తెలిసింది. "నేనెవరి దగ్గిరా వుండలేను" ఆనందంతో  కూడిన  బాధతో అంది. "ఇంత సామర్థ్యం నీకెలా వచ్చింది?"

 

    "యోగ" నవ్వేడు అతడు. "మీ భారతీయుల్లో నాకు నచ్చిన ఒకే ఒకటి యోగ. కానీ మీ బద్ధకస్తులు దాన్నీ సరిగ్గా చేస్తున్నారనుకోను. తినడం కోసం  బ్రతకడం, పడుకోబోయే ముందు మొక్కుబడి చెల్లించుకోవడం- అంతే."

 

    "నీకు ఈ దేశం మీద తక్కువ అభిప్రాయం వున్నట్టుందే?"

 

    "తక్కువ కాదు. అసల్లేదు. మీది కేవలం ప్రపంచ పటంలో కనిపించడానికే పెద్ద దేశం. సియోల్ ఒలిపింక్స్ నుంచి రాజకీయాల వరకూ అన్నీ  ఆ విషయాన్ని నిరూపిస్తున్నాయి. ఒక ప్రభుత్వం ఢిల్లీ "వెళ్ళి" అరాచకం  సృష్టిస్తే  మరో  ప్రభుత్వం హైద్రాబాద్ "వచ్చి" రాస్తా రోకో నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి  వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒకరోజు బంద్ నిర్వహిస్తే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రభుత్వమే ఒక రోజు బంద్ నిర్వహిస్తుంది. జనం తమని మర్చిపోతారేమోనని జనతా ఒకరోజు, తామూ వున్నామంటూ కమ్యూనిస్టులు ఒకరోజు - ఇలా  ఏడాది  కాలం బంద్ లతో గడిచిపోతుంది. ఇప్పుడు కొత్తగా 'ఆందోళన  కార్యక్రమాలు చేపట్టడం' ఒకటి! చూస్తూ వుండు. నా దేశపు మిలటరీ  అధికారంలోకి  వచ్చాక ఎలా అది ఈ మనుష్యుల్ని దార్లోపెడుతుందో" అన్నాడు క్యూ.

 

    ఆమె అతడి మెడ చుట్టూ చేతులు వేసి, "సెక్స్ లోంచి రాజకీయాల్లోకి వచ్చావేంటి" అంది. అతడు ఆమె మీదకు వంగి పెదవుల్ని  గట్టిగా  నొక్కి పట్టాడు కేవలం పెదవులతోనే అతడు అరగంట ఆడుకోగలడు. కరాటే, బాక్సింగ్ లాగే దీన్నికూడా నిష్టతో అభ్యసించాడేమో అని అతన్ని ఎనలైజ్ చేసిన అమ్మాయిలకి అనిపిస్తుంది!! "హోల్డింగ్" అతడి ఆర్టు. చైనా, జపాన్, రాష్యాల్లో అతడు ఇంటర్ పోల్ ఏజెంటుగా నెగ్గుకు రావడానికి సాయపడిన ఆయా దేశపు స్త్రీల్లో చాలా శాతం ఈ విద్యకే పడిపోయారనడం అతిశయోక్తి కాదేమో! తను ఆనందించడం కన్నా  ఎక్కువగా  అవతలి వ్యక్తిని ఆనందింప చేయడం ముఖ్యద్దేశంగా పెట్టుకుంటాడు. అంతేకాదు. అవతలి పార్టనర్ నుంచి తనకు కావాల్సింది రాబట్టుకోగలడు. తీసుకోవడం, అంతకు రెట్టింపు ఇవ్వడం- అలా  ఇవ్వడం కోసం నిరంతరం సాధన చెయ్యడం అతని టెక్నిక్. ఆ విధంగా అతడి దగ్గిర నేర్చుకున్న ఏ స్త్రీ  అయినా అతడికి జీవితాంతం కృతజ్ఞురాలుగా వుండిపోక ఏం చేస్తుంది? తమకు అంతవరకు తెలియని కొత్త ప్రపంచం అది. తమకి అనుక్షణం జీవితంలో ఉపయోగపడే విద్య అది. అంతకన్నా కావాల్సింది ఏముంది? గురుదక్షిణంగా ఎందరో విదేశీ సైనికాధికారుల భార్యలు అతడికి ఎన్నో సీక్రెట్ వివరాలు అందించారు. అతడికి తన పిస్టల్, తన  తెలివితేటలు , తన పోరాట నైపుణ్యం..... వీటికన్నా తన ఈ 'కళ' మీదే ఎక్కువ నమ్మకం!!

 

    తన బాధలతో అవతలి పార్టనర్ ని విసిగించకపోవడం అతడికి వున్న మరో  గొప్ప గుణం. స్త్రీ పురుషులు తమ బాధల్ని ఒకరికొకరు చెప్పుకుని స్వాంతన పొంది, ఆ విధంగా ఉత్పన్నమయ్యే కృతజ్ఞత ద్వారా మానసికంగా దగ్గిరవుతున్నారన్నది నిజమే  అయి వుండవచ్చు. కానీ ఎవరి సమస్యలు వారే  పరిష్కరించుకోవాలి, ఇవ్వగలిగింది మాట సాయం మాత్రమే అన్న విధానాన్ని అతడు ఎక్కువ నమ్ముతాడు. ఉన్న కొద్ది సేపు తన బాధలు వినిపించక, తన వాదనల్తో విసిగించక, మూర్తీభవించిన ఆనందంలా వుంటాడు. శత్రుదేశపు సైన్యం మొత్తం వలవేసి దగ్గిరకొస్తూ, కూత వేటు దూరంలోకి వచ్చినా సరే- ఆ టెన్షన్ ని ప్రియురాలికి తెలియనివ్వక పోవడం అతడి విద్య. వళ్ళో తల పెట్టుకుని ఏడ్చే మొగవాడిని ఎక్కువ ప్రేమించినా, ఈ విధమైన 'మాన్లీనెస్' చూసేక ఏ స్త్రీ అయినా దాసోహం అవక తప్పదు.

 

    మామూలు స్త్రీలకే ఆ విధంగా వున్నప్పుడు, అత్యంత ప్రతిభావంతురాలు, నిరంతరం తన రిసెర్చి విషయాల్లో అలిసిపోయే స్వర్ణరేఖకు అతడి చెలిమి 'స్వర్గం' అనడంలో విశేషమేమీ లేదు.

 

    అటువంటి స్వర్ణరేఖకు నేత్ర 'స్వర్గం' కన్నా అతీతమైనది ఏం చూపించి, విధంగా ;క్యూ' నుంచి బయటకు తీసుకొచ్చి తన వైపు తిప్పుకున్నాడు అనేది కాలమే  తేల్చాలి. సర్పభూషణరావు రహస్యాలు ఆమె ద్వారా బయట పడడమనేది అంత చిన్న విషయం కాదు.

 Previous Page Next Page