"అన్నట్టు రేపు నువ్వూ నాతో వైజాగ్ వస్తావా? క్యాంప్ కి వెళ్తున్నాను." వారం రోజులు వుండాల్సి వస్తుంది."
"బాబోయ్ వాళ్ళ గృహప్రవేశం కూడా వుందిగా, తప్పకుండా వస్తాను. అయినా వారంరోజులు మనం విడిగా వుండగలమా" అతని దగ్గరగా జరుగుతూ అంది అమృత.
"ఇల్లు తాళం పెట్టి వెళ్తే పర్లేదా?"
"నువ్వు నా దగ్గిరుంటే ఇల్లు బ్లాస్ట్ అయినా పర్లేదు" అన్నాడు. త్వరలో ఆ ఇల్లు బ్లాస్ట్-అవబోతున్నదని అతడికే తెలీదు.
* * *
కీర్తి డిక్టేషన్ తీసుకుంటోంది.
హర్షకి అటూ, ఇటూ పచార్లు చేస్తూ చెప్పడం అలవాటు. నడుస్తూ, నడుస్తూ జేబులో చెయ్యి పెట్టి కర్చీఫ్ తీసి నుదుట పట్టిన చిరు చెమట అద్దుకున్నాడు.
అతని కర్చీఫ్ మడతలోంచి ఓ కాగితం మడత జారిపడడం కీర్తి గమనించింది. వంగి ఆ కాగితం తీసి అందివ్వాబోతూండగా ఫోన్ రింగయ్యింది.
హర్ష కీర్తివైపు వీపుపెట్టి మాట్లాడుతున్నాడు.
కీర్తి అసంకల్పితంగా చేతిలో వున్న కాగితం విప్పి చూసింది. అది సభ్యత కాదని మనసు చెప్తున్నా అందులో వున్న అక్షరాలు చదవకుండా వుండలేకపోయింది.
"రాత్రి ఎంత బావుందంటే....మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూసేటంత...నీ అమృత అని రాసుంది.
హర్ష ఫోన్ పెట్టేసి, ఆమెవైపు తిరగగానే ఆ స్లిప్ అందించింది.
"ఏమిటీ?" అన్నట్లు కనుబొమ్మలెత్తి అది తీసుకుని చదువుతూండగానే అతని మొహం ప్రపుల్లమవడం, పెదవులు చిరునవ్వుతో విచ్చుకోవడం కీర్తి గమనించింది. ఆలస్యం భరించలేనట్లు చతాలున వెనుతిరిగి ఫోను అందుకుంటూ కీర్తివైపు ఇబ్బందిగా చూశాడు.
అతని అవస్థ అర్ధం చేసుకున్న కీర్తిలేచి అవతలికి వెళ్ళి పోయింది.
"నీ ఉత్తరం - ఐ మీన్ -స్లిప్ చదివాను" అన్నాడు భార్యతో- ఆమె అటువైపు ఫోన్ అందుకోగానే.
"ఎలా వుంది?" అని అడిగింది.
"నాకు శివపార్వతులు గుర్తొచ్చారు"
"మైగాడ్, రతీమన్మధులు గుర్తు రావాలిగానీ, మన్మధుడిని దహనం చేసినా శివుడు గుర్తు రావడం ఏమిటి?"
అతడి కంఠం మంద్రంగా పలికింది "ఒకర్నొకరు కోరుకుని, ఒకరికోసం ఒకరు తపస్సుచేసి గెల్చుకుని అన్ని రీతుల్లోనూ సామానులయిన పార్వతీ పరమేశ్వరుల ప్రేమకన్నా గొప్పది ఈ ప్రపంచంలో వుంటుందా అమృతా."
అతడి మాటలకి కదలిపోయింది ఆమె. ఎందుకో తెలీదు కానీ ఆమె కళ్ళలో తడి పోరా కదలాడింది. "ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షా" అంది.
* * *
విక్రమ్ తన చేతిలో వున్న చిరునామా వంక ఆప్యాయంగా చూసుకున్నాడు. చివరికి ఎలాగైతేనేం వర్షిణి అడ్రస్ దొరికింది. ఇది ఇల్లా...రూమా? వర్షిణి ఏం చేస్తూవుండి వుంటుంది? ఉద్యోగమా? లేక ఖాళీగా వుండి వుంటుందా? తనని చూడగానే ఏడ్చేస్తుందా వచ్చి ఆనందంతో కౌగిలించుకుంటుందా - లేక స్పృహ తప్పి పడిపోతుందా? పరుగు పెడ్తున్నట్లుగా అతను ఆ ఇంటివైపు వెళ్తున్నాడు. అందులోనే తన ప్రియ బాంధవి, నెచ్చెలి, జీవితేస్వరి వుంది-అన్న సంతోషంతో అతనికి ఒళ్ళు తెలియడం లేదు! కానీ,
అతని ఆవేశానికి, ఆనందానికీ పగ్గాలు వేస్తూ గేటు తాళం వెక్కిరించింది. అతను ఆలోచించడం లేదు, చటుక్కున గేటు ఎక్కి అవతల వైపుకి దూకాడు. తలుపు దగ్గరకు ఒక్క అంగలో వెళ్ళి దబదబా బాధబోతూ, ఆగిపోయాడు. తలుపుకి కూడా పెద్ద తాళం కప్పు వేళ్ళాడుతోంది.
అతనికి ఆ ఆశాభంగానికి దుఃఖం, ఉక్రోషం అన్నీ కలగలిపి వచ్చాయి. కాలితో కోపంగా తలుపుని తన్నాడు.
"విక్రమ్" అన్న పిలుపు వినిపించింది.
అతను తలతిప్పి చూశాడు.
గేటు దగ్గర భ్రమరాంబ నిలబడి వుంది.
అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా అతను మండిపడ్డాడు. "యూ డెవిల్, వర్షిణి ఇల్లు ఎదురుగా పెట్టుకుని నన్ను ఇంత ఏడిపిస్తావా?" అంటూ ఆమె వైపు దూకుడుగా వెళ్ళాడు.
ఆమె గేటు తాళం తెరుస్తూ "ఆగు మళ్ళీ గేట్లూ, గోడలూ దూకకు" అంది.
విక్రమ్ బైటికి వస్తూనే ఆమె జడ పట్టుకున్నాడు "వర్ష ఏదీ?" అడిగాడు.
ఆ నెప్పికి ఆమె సన్నగా మూల్గింది "విడు విక్రమ్, అందరూ చూస్తున్నారు" అంది.
"నా వర్ష ఎక్కడుందో ముందు చెప్పు."
ఆమె జడని మరింత గట్టిగా పట్టుకుంటూ అడిగాడు.
"వైజాగ్ వెళ్ళారు, ఎప్పుడోస్తారో తెలీదు."
అతను ఆమె వదిలిపెట్టి "పద" అన్నాడు.
ఆమె తన ఇంటివైపు నడిచింది.
కూతురి వెనకాలే వస్తున్న విక్రమ్ ను చూడగానే అధర్వణాచారి పై ప్రాణాలు పైనే పోయినయ్.