రేప్ కధ
కొంతకాలం క్రితం మద్రాసు మహానగరంలో ఓ గొప్ప నటుడు ఉండేవాడు. చెట్లు లేనిచోట ఆముదపు చెట్టే మహా వృక్షం లాగా అతను తెలుగు చిత్రసీమను ఏలేస్తుండేవాడు. అతనంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో అభిమానం. అతని అభిమాన సంఘాల వాళ్ళకు అతనంటే మరీ దురభిమానం. అంచేత వాళ్ళందరూ అతని సినిమా ఏది రిలీజయినా చందా లేసుకుని మరీ వందరోజులు లాడించేస్తుండేవాళ్ళు. చాలా సెంటర్స్ లో వంతులవరిగా రోజుకి కొంతమంది సభ్యులు అతని సినిమాలకు వెళ్ళి మధ్యమధ్యలో అతని నటనకు మెచ్చినట్లు విజిల్స్ వేసి చప్పట్లు కొడుతుండేవాళ్ళు.
ఆ హీరో పది కాలాలపాటు నిలబడగలడని నమ్మిన ఓ హీరోయిన్ అతని నెలాగయినా తన వలలో వేసుకుంటే ఆ పది కాలాలు తనే అతని సినిమాలన్నీటిలోనూ హీరోయిన్ గా అవకాశాలు సంపాదించవచ్చని అలోచించి ఓ వల కొని తనింటి గడపలో కట్టింది. ఆ తరువాత ఆ హీరోని పుట్టిన్రోజని చెప్పీ డిన్నర్ కి ఆహ్వానించింది. హీరో ఆమె ఇంటి కొచ్చి గడపలో అడుగుపెట్టి వలలో పడిపోయాడు. అంతే! ఆ రోజు నుంచీ అతని సినిమాలన్నీటిలోనూ ఆమె హీరోయిన్ అయిపొయింది.
అలా చాలా కాలం ఆ హీరో ఆడింది అట, పడింది పాట చేసింది నటనగా సాగిపోయింది. అలా పోతూ పోతూ ఓ రోజు పోవడం మానేసింది. హటాత్తుగా సినిమా ఫీల్డులోకి మరో కుర్ర నటుడు జొరబడిపోయాడు. అతను అవలీలగా హీరో వేషం వేసి పారేయడం చూస్తుంటే గొప్ప నటుడికి మతిపోయినట్లయింది. పైపెచ్చు ఆ కుర్ర హీరో సినిమాలు విజయవంతం కూడా అవుతున్నాయ్. ఆ కుర్ర హీరోకి అభిమాన సంఘాలు లేవు. పర్మనెంటు ప్రొడ్యూసర్లు లేరు. అయినా అతని సినిమాలు ఎలా సక్సెస్ అవుతున్నాయో అర్ధం కావటం లేదు గొప్ప నటుడికి.
ఆ కుర్ర హీరో నటనకీ, తక్కువ రేటుకీ పోటీ పడలేక గొప్ప నటుడి బుకింగులన్నీ సైక్లోన్ లో చెట్లలా టపాటపా కూలిపోయినాయ్. అతనింటి ముందున్న 'క్యూ' అంతా కుర్రహీరో ఇంటి ముందుకి పార్టీ మారినట్లు మారిపోయింది.
ఆ గొప్ప నటుడితో పాటు ఆ హీరోయిన్ కి కూడా కష్టకాలం వచ్చేసింది. గొప్పనటుడిని కౌగలించుకుని "నీవు లేక నేను లేనే లేనులే, ఇదీ నిజములే!" అంటూ పాడింది ఏడుస్తూ.
మహానటుడికి ఆ కుర్ర హీరో మీద ఉక్రోషం పుట్టుకొచ్చింది. ఇలా నిర్మూసుకూర్చుంటే తనూ, తనతో పాటు హీరోయినూ ఇద్దరూ "పల్లెకు పోదాం గేదెలు కాద్దాం చలో చలో , కట్టెలు కొడదాం చలో చలో" అని పాడుకుంటూ తమతమ ఊళ్ళకు బండేక్కాయాల్సి వస్తుందని తెల్సిపోయింది. వెంటనే శకుని ఫోటో ఒకటి టేబుల్ మీద పెట్టుకుని ఆ హీరోయిన్ ని ఒళ్ళో ఉంచుకుని ఆలోచనలు ప్రారంభించాడు.
ఆ మర్నాడు ఆ హీరోయిన్ మళ్ళీ ఓ వల కొనుకొచ్చి తనింటి గడపకు కట్టి ఆ కుర్ర హీరోని పుట్టిన్రోజు పార్టీకి ఆహ్వానించింది. కుర్ర హీరో సంబరంగా ఆమె ఇంటి కెళ్ళి ఆ వలలో పడిపోయాడు. ఇద్దరూ కొద్ది రోజులు ప్రణయ కలాపాలు జరిపాక ఓ మంచి రోజు చూసి హీరోయిను ఆ కుర్ర హీరో తనను రేప్ చేసినట్లు పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ సంగతి ఓ పోలీస్ మిత్రుడి ద్వారా విని ఖంగారుగా ఆమె ఇంటికి పరుగెత్తాడు కుర్ర హీరో.
"నువ్వు నాతో ప్రణయం జరపడం నిజమేగా? అందుకే రిపోర్టిచ్చాను" అందామె నవ్వుతూ.
"కానీ అది నీ ఇష్టం మీదే జరుగుతోందిగా! మరి డానికి 'రేప్' అని ఎందుకు పేరు పెట్టావ్?" ఉక్రోషంగా అడిగాడతను.
"సినిమాల్లో రేప్ సీన్లు యాక్టు చేసి చేసి బోర్ కొట్టింది. నిజం 'రేప్' ఎలా వుంటుందో చూద్దామని సరదా పుట్టింది" వాంప్ లాగా నవ్వుతూ అంది హీరోయిన్.
"ఛీ! పాపాత్మురాలా! పిల్లికి చెలగాటం ఎలకకు ప్రాణ సంకటం లా - నీ సరదా కోసం నా పరువూ, ప్రతిష్టా , కాల్ షీట్లూ , షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ మంట కలుపుతావా? నన్ను జైలు పాలు చేస్తావా? హు!" అన్నాడు కుర్ర హీరో ఓ సినిమాలోని డైలాగులు గుర్తు తెచ్చుకుంటూ.
ఈలోగా బయట పోలీస్ వాన్ వస్తున్న శబ్దం అయ్యేసరికి, క్లయ్ మాక్స్ దృశ్యాల్లో పోలీసుల బారి నుండి తప్పించుకు పారిపోయే హీరోలా బయటకు పరిగెత్తాడు.
అలా పరుగెత్తి , గెత్తి ఓ చోట కాళ్ళ చెప్పులు కాస్తా తెగేసరికి ఆ పుట్ పాత్ మీదున్న చెప్పుల షాపులోకి జొరబడి "అర్జంటుగా నా చెప్పులు కుట్టు. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను" అన్నాడు జేబులో నుంచి వంద రూపాయల నోట్ల కట్ట తీసి.
చెప్పులు కుట్టే ముసలాడు అతన్ని చూసి వేదాంతిలా నవ్వి "దొరకునా ఇటువంటి ఛాన్సు" అని పాడుకుని "ఓ వందిటు పారెయ్యండి " అన్నాడు.