పొడుగ్గా , బట్టతలతో , భారీగా ఉన్న ఒక మనిషి ఆడవాళ్ళ మధ్యకి వచ్చాడు. ప్రక్కన బ్రిగేడియర్ నిలబడి ఒక్కొక్కరినే పరిచయం చేస్తున్నాడు.
శాంతి దగ్గర నిలబడ్డాడు జనరల్ నవ్వుతూ నమస్కరించి శాంతి సిగ్గుపడి సంభ్రమంతో నిలబడి నమస్కరించింది. బ్రిగిడియేరు పేరు తెలియక కొద్ది సేపు ఇబ్బంది పడి "చివరకు "క్రొత్తగా వచ్చారు?" అన్నాడు.
"మిసెస్ రావ్" మిసెస్ అరోరా చెప్పింది.
"కూర్చోండి. ఎక్కడ నుంచి వచ్చారు?" అడిగాడు జనరల్ నవ్వుతూ.
"రాజమండ్రి "
"రాజమండ్రి ---- ఎక్కడుంది? బెంగుకూర్ దగ్గిరా?' అయోమయంగా బ్రిగిడియర్ వంక చూశాడు జనరల్.
"మెడ్రాసు దగ్గిర అనుకుంటాను" తనకీ తెలియదన్నట్లు చూశాడు బ్రిగిడియర్.
శాంతికి తను చేసిన పొరపాటు అర్ధమయింది. కాని సరిదిద్దుకునే లోపునే జనరల్ ప్రక్కకి వెళ్ళిపోయాడు. జనరల్ వెళ్ళాక, సన్నగా మిసెస్ తివారి చెప్పింది.
"మీరు తెల్సుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మీకు తెలియకపోయినా చుట్టూ జూసి ఉండాల్సింది. జనారల్ వచ్చినప్పుడు మీరు లేవనక్కరలేదు. కూర్చునే నమస్కరించాలి, తర్వాత బ్రిగిడియేర్ మీపేరు తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు మీ అంతట మీరే ,మీ పేరు చెప్పుకోవాలి...."
శాంతికి చెమటలు పోశాయి...... ఇంకా కూర్చుంటే ఏమవుతుందో తెలియనట్లుంది . కాని వెళ్ళడం ఎలా?
పదకొండు కావస్తుంది. అప్పటికి గాని ఎవరూ డిన్నర్ కి వెళ్ళలేదు. రావు అప్పుడు కనపడ్డాడు శాంతికి. కళ్ళు ఏవో లోకంలో ఉన్నట్టున్నాయి. ఆమె అతన్ని ఎరిగినట్లు లేదు. చేతులూ, కాళ్ళూ చాల విసురుతో కదులుతున్నాయి.
"డార్లింగ్! ఎలా వుంది?" నవ్వుతూ అడిగాడు రావు. అదేదో వాసన తగిలింది శాంతికి.
డిన్నర్ అయి బయటికి వచ్చిన మరో పావుగంటకి హల్లో వాద్యం మొదలైంది. జంటలు కదులుతున్నాయి హాలు మధ్యకి. మగవాళ్ళు దగ్గిరకి వచ్చి అడుగుతున్నారు. ఆడవాళ్ళు లేస్తున్నారు. శాంతి గుండెలు గబగబ కొట్టుకున్నాయి.
"మీతో డాన్సు చేసే గౌరవం నాకు కలిగిస్తారా?" కల్నల్ తివారి మర్యాదగా వంగి అడిగాడు.
"క్షమించండి , నావల్ల కాదు" ఎలాగో అనగలిగింది.
"పర్వాలేదు లెండి" కల్నల్ వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత ఒకరిద్దరు ఇలానే అడిగి వెళ్ళిపోయారు. డాన్స్ కి డాన్స్ కి మధ్య పచ్చని, తెల్లని ముదురు నల్లని రంగుల పానీయాలు తాగుతున్నారు మగవాళ్ళు. గంటలు గడిచిన కొద్ది నవ్వులు, కేకలు ఎక్కువ అవుతున్నాయి. కాళ్ళు తడబడ్తుంటే మాట అస్పష్టమవుతుంటే ప్రతి మనిషీ ఏదో వేర్రీగా మాట్లాడుతూ , బాండ్ వాద్యానికి లయగా అడుగులు వేస్తున్నారు.
రావు వచ్చి తనని డాన్స్ చేయమని అడిగితే ఎంత బాగుణ్ణనుకుంది శాంతి. రావు ఎక్కడా కనబడడం లేదు. ప్రతి అయిదు నిమిషాలకి ఎవరో వచ్చి అడగడం, ఒకోసారి కొద్దిగా బలవంతం పెట్టడం కూడా జరుగుతుంది. ఎంత కాలమని తప్పించుకోడం?
రాత్రి రెండు దాటింది. అప్పటికింక మగవాళ్ళేవరికి రెండో మనిషి చెపుతున్నది వినపడుతునట్టు లేదు.
"మీరింతవరకు డాన్స్ చెయ్యనే లేదు"
తలెత్తింది శాంతి.
ఎదురుగా జనరల్ భగత్!
"నాకు డాన్స్ రాదండీ!"
"డాన్స్ రాకపొవడమేమిటి ? నాలుగడుగులు ఇటూ అటూ వేయడానికి! రండి, నేను నేర్పుతాను."
శాంతి ఏం మాట్లాడలేకపోయింది. జనరల్ చెయ్యి చాచాడు. బాండ్ వాద్యం మొదలైంది. జనరల్ చేతిని పట్టుకుని ముందుకీ వెనక్కీ, ప్రక్కలకీ అడుగువేసింది శాంతి. ఆమె మొదటిసారి ఫోర్ మీదకి రాగానే చుట్టూ అంతా డాన్స్ మానేసి చప్పట్లు చరిచారు. శాంతి మొగం సిగ్గుతో కందింది.
"క్షమించండి , ఇంకా చాలు , నాకు అలసటగా ఉంది" అంది శాంతి బాండ్ ఆగగానే.
"మరేం పరవాలేదు -- రండి' జనరల్ ఆమెని సోఫా దాకా తీసికెళ్ళి కూర్చున్నాక మర్యాదగా వంగి కృతజ్ఞత చెప్పి గుంపులో కలిశాడు. ఆమె వెంటనే లేచి ఎవరూ లేని మూలకి చేరి కూలబడింది. ఆ ప్రక్కనే మిసెస్ మీనన్ ఉంది.
"ఇంకా ఎంత సేపుంటారు, వీళ్ళంతా?" అడిగింది శాంతి.
"జనరల్ ఇష్టం. అతను వెళ్ళేదాకా ఎవరు కదలరు" నవ్వుతూ అంది మీనన్. రావు దూరంగా కనపడ్డాడు. నిలబడి ఎవర్తోనో మాట్లాడుతూ , సైగచేసి పిల్చింది శాంతి.
"వెళ్దాం ఇంక" అంది శాంతి నిద్రకి వాల్తున్న కళ్ళతో.
"డోంట్ బి సిల్లీ" రావు నవ్వి వెళ్ళిపోయాడు.
శాంతికి నిద్ర ముంచుకు వస్తోంది. మిగతా అంతా ఎలా నిబ్బరించుకుంటూన్నారో అర్ధం కాలేదు. మొదట్లో ఉన్న బెరుకు , క్రొత్త దనం పోయి విసుగుదల హెచ్చయింది. డాన్స్ తర్వాత డాన్స్, చివరకది ఏ రకం డాన్సో తెలుసుకోలేని విధంగా తయారైంది.
మూడున్నర గంటల వేళ, "ఒకే చాప్సు! థాంక్యూ , గుడ్ నైట్ " అని చెప్పి, ఆడవాళ్ళందరికి నమస్కరించి, కారు కేసి నడిచాడు జనరల్. జనరల్ వెనకాలే బ్రిగేడియర్ , కల్నల్స్ అందరూ నడిచారు.
దారిపొడుగునా, ఇంటికి వచ్చాక, శాంతి రావుతో ఏమేమో మాట్లాడాలనుకుంది. ఎన్నో అడగాలనుకుంది. అక్కడి కొందరి మనుషుల ప్రవర్తనని , వాళ్ళ ఆచారాల మీద, పద్దతుల మీద, తన అభిప్రాయాల్ని ఏవేవో చెప్పాలనుకుంది. చర్చించాలనుకుంది. కాని ఇంటికి రాగానే బట్ట, లైనా మార్చకుండా మంచం మీద పడి నిద్రపోయేడు రావు.
* * * *
మర్నాడు ఉదయం రావు తొమ్మిదిన్నరకి లేచాడు. స్నానం వగైరాలు కానిచ్చి వచ్చేసరికి పదిన్నర అయింది. అప్పటికి శాంతి వంట కూడా పూర్తయింది.
రావుకి కాఫీ అందిస్తూ, ఏ భావం వెలిబుచ్చని అతని మొహంలోకి చూసింది. క్రితం రాత్రి కళ్ళలో మైకం ఆమె కళ్ళ ముందు కదిలింది.
"మీరు తాగుతారని నాతొ ఎప్పుడూ చెప్పలేదేం?"
"అదేమంత ఘనకార్యమని ప్రకటించుకోవాలి?"
"త్రాగక పోతేనేం?"
రావు నవ్వాడు. సమాధానం చెప్పలేదు.
"రాత్రి నేనున్నాన్న సంగతి మీకు గుర్తున్నట్టు లేదు?"
"నిన్ను కనిపెట్టి చూస్తూనే ఉన్నాను. నువ్వూ ఎవర్తోనో మాట్లాడకుండా తల దించుకు కూర్చోడం జనరల్ వచ్చినప్పుడు నిల్చుని తడబడడం నిన్నందరూ డాన్స్ కి పిలవడం, నీవు బిత్తరచూపులు చూడడం, చివరన జనరల్ తో డాన్సు, ఆఖర్న అక్కడ మిసెస్ మీనన్ దగ్గరికి వచ్చి సగం నిద్రలో కూలబడ్దాం --అంతా చూస్తూనే ఉన్నాను"
శాంతి సిగ్గుపడి తల దించింది.
"చూడు శాంతీ, నీకు నాకు ఇష్టమున్నా లేకపోయినా మన ఇక్కడికి వచ్చాం ఇప్పుడు. ఇక్కడున్నప్పుడు ఇక్కడి పద్దతులు, అలవాట్లు, కట్టుబాట్లు పాటించడం మంచిది. ఎప్పుడో ఒకసారి తాగినంత మాత్రాన పోయేదేం ఉండదు. కాని తాగకపోతే, నలుగుర్లోనూ వెలిగా ఉన్నట్టవుతుంది. అలాగే నువ్వూ అందర్లా కాకుండా ఎవరితో మాట్లాడకుండా ఒకల్తేవీ కూర్చుంటే పోయేదే ముండదు గాని, సాంఘికంగా వెనక బడినట్టు చూస్తారంతా. వాళ్ళకా అవకాశం ఎందుకు కలిగించాలి?"