కారు తారురోడ్డులోకి ప్రవేశించినప్పుడే నీలిమ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.
అసలే ఆకాశం మేఘావృతమయింది. అందునా చీకటిరాత్రి...పైగా నిర్జన ప్రదేశం.
తనకు ఆ అనుభవం కొత్తేమరి! అంతలోనే గుండెల్లో గుబులు, మనసులో భయం చోటుచేసుకున్నాయి.
తనకు అతనిమీద అమితమైన ప్రేమ వుంది. తను అతనిని పూర్తిగా నమ్మింది.
అతనూ తనంటే ప్రాణం ఇస్తున్నాడు. మరి ఇప్పుడు అతనిని అనుమానించడం ఎందుకో?
తను ఎంత చదువుకున్నా ఆడపిల్ల అన్న సంగతి పదేపదే గుర్తుకురావడమే ఆ హెచ్చరికకు కారణం కావచ్చు.
తను కాస్తంత మెత్తబడితే, అమ్మో ఇంకేముంది అతను విజృంభించడూ!
అయినా ఇలా ఆరు బయట విచ్చలవిడి శృంగారమా! అసలు సిగ్గనేది తనకి మొదటే వుండాల్సింది, అది కాస్త నడిబజారులో వదిలేసి తను తగుదునమ్మా అంటూ రవిచంద్రతో జాలీ ట్రిప్పులు, అతనితో డూయట్ పాటలు, మధ్యమధ్యన చిలకొట్టు దొంగముద్దులు.
ఇంతదూరం వచ్చాక ఆ కాస్త అయిపోవాలన్న పట్టుదలమీద అతను వున్నట్టు అతని ప్రతిచర్య చప్పకయే చెబుతుంది.
ఉన్నట్టుండి స్టీరియో ఆన్ చేశాడు రవిచంద్ర. వెష్ట్రన్ మ్యూజిక్ మరింత రెచ్చగొట్టే రీతిలో వుంది.
ఆమె భుజమ్మీద చేయి వేశాడు.
ఆమె తల వంచుకుంది__
రెండోచేత్తో ఆమె చుబుకంపట్టి లేపాడు.
ఆకలిగొన్న అతని కళ్ళలోకి సూటిగా చూడలేక నీలు చూపు మరల్చింది__
"ఏయ్ సిగ్గా?...భయమా?" కన్నుగీటుతూ అడిగాడు.
"రవీ ఇదేమీ బాగోలేదు...ఇప్పటికే లేటయ్యింది పిచ్చివేషాలు మాని కారు స్టార్ట్ చేయి" ముక్కు పుటాలు అదురుతుండగా వస్తున్న కోపాన్ని అదిమిపట్టి మరీ అంది.
"గుడ్ జోక్..." పరిహాసంగా నవ్వేస్తూ అన్నాడు.
"షటప్...కారు స్టార్ట్ చేస్తావా లేక నన్నే కారు దిగి కాలినడకన వెళ్ళిపొమ్మంటావా?" మరింత సీరియస్ గా అంటూ కారుదోర్ తీసింది నీలు.
"సారీ డియర్..." కోపంలో నువ్వెంత అందంగా వున్నావో తెలుసా?...అంటూ ఆమె భుజమ్మీద చేయివేశాడు రవిచంద్ర.
"ఊ..."
విదిలించి కొట్టింది నీలిమ.
అప్పుడు తీశాడు డాష్ బోర్డు నుంచి బటన్ నైఫ్.
కొత్తదేమో అంత చీకటిలో కూడా తళతళ మెరుస్తున్నది.
నీలిమ నవనాడులు కుంగిపోయాయి. అంత చల్లదనంలో సయితం ముఖాన చిరుచమటలు పట్టేశాయి...
ఇప్పుడు అతని ముఖం ఎర్రబడి కందగడ్డలా వున్నది.
ఆమెకు గుండెదడ ప్రారంభమయింది.
ఈరోజు అతని వింతప్రవర్తన అర్ధంకాకుండా వుంది. కొంపదీసి బెదిరించి తనను చెరచడుకదా...
ఆ వూహకే తట్టుకోలేకపోయింది.
"ఐ హేట్ యూ... ఐ హేట్ యూ..." అంటూనే హఠాత్తుగా కారు డోరు తెరుచుకుని కిందకు దిగింది.
ఛటాలున అతను కారు దిగాడు.
కత్తిని ఎడమచేతిలోకి తీసుకుని ఒక్క అంగలో ఆమెను సమీపించాడు.
ఆమె నోరువిప్పి ఏదో అనబోతుండగానే కుడిచేతితో ఆమె చెంప చెళ్ళుమనిపించాడు.
"యూ...యూ పూర్ క్రీచర్...కత్తితో బెదిరించి నీ శీలం దోచుకుంటాననుకున్నావా...ఇంతేనా నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది..." అంటూనే ఈసారి కత్తిని కుడిచేతికి తీసుకుని ఎడమ అరచేయిని సర్రున కట్ చేసుకున్నాడు.
అంతే...
ఎర్రని రక్తం చివ్వున చిమ్మింది...
ఆ దృశ్యం చూస్తూనే నీలిమ అవాక్కయింది.
"ఆ వాంఛను ఆపుకునే శక్తి నాలో ఉందనుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే!..." అంటూ కత్తిని దూరంగా విసరివేశాడు.