Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 19

    సమయం సాయంత్రం ఆరు.

    ప్రదర్శన భారత కళా మండపం.

                                                                                                                       ఇట్లు
                                                                                                                         దీక్ష.

    మందారవర్దని మొత్తం చదివింది. అంతకు మించి ఆ కాగితంలో ఏమీ రాసిలేవు. దీక్ష అన్న పేరు దగ్గర రెండు గాజుల చేతులు నమస్కారం పెడుతున్న ఆర్ట్ గీసి వుంది అంతే.

    చదవటం పూర్తి చేసి మందారవర్దని తలపైకి ఎత్తింది.

    "రేపు ఆరుగంటలకి మీరు తప్పక రావాలి వర్ధని గారూ! మీకు తెలిసిన వాళ్ళు వుంటే వాళ్ళను కూడ తీసుకు రండి. మా ప్రదర్శన చూడకుండా మిస్సయ్యారంటే తర్వాత చింతించి ప్రయోజనం లేదు. మీరు చూసి తరించవలసినది, కనీవినీ ఎరుగనిది, ఇంతవరకూ మీ ఊహకు రానిది." ఊరిస్తున్నట్లు అంది దీక్ష.

    "సరీపోయే! ఇంతవరకూ నీ రాతలు చూసి ఏమో అనుకుని హడలి పొయ్యాము. గాజుల ప్రదర్శనకి వచ్చిన తిప్పలా యిది?" మందారవర్దని తేలికపడ్డ మనసుతో నవ్వుతూ అంది.
    "గాజులేమిటి?" తెల్లబోయింది దీక్ష.

    "నాకు ఆ మాత్రం తెలివి వుందిలేమ్మాయ్!" ముసి ముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది మందారవర్దని.

    "నిజంగా మీరు అనేది ఏమిటో నాకు అర్ధం కావటం లేదండి!"

    "సరే. ఈ బొమ్మకి అర్ధం ఏమిటి?"

    "నమస్కారం పెడుతున్న చేతులు."

    "చేతికేమున్నాయ్?"

    "గాజులు."

    "అర్ధమేమిటి?"

    "నమస్కారం పెట్టే చేతులు స్త్రీ వని."

    "అయితే గాజుల ప్రదర్శన కాదా!" మందారవర్దని నిజం తెలుసుకోనందుకు నీరు కారిపోతూ అడిగింది.

    "ఉఁహూ" దీక్ష నవ్వాపుకుంటూ చెప్పింది.

    "మరి... మరి... కొత్తరకం చీరలా!"

    "ఉఁహూ." మృదువుగా అంది అంది దీక్ష.

    "దేముడికి సంబంధించినదా?"

    "ఉహూ."

    "సినిమా!"

    "ఉఁహూ."

    "సర్కస్!"

    "ఉ... హు."

    "ఉచితంగా డాక్టరు పరీక్ష లాంటిది!"

    "కాదు."

    "పుస్తకాల ప్రదర్శన."

    "లేదు."

    "కొత్తరకం వంటలు."

    "లేవు."

    "మాతా శిశు పోషణ!"

    "అలాంటిది కాదు."

    "మరి?"

    "కొత్తది. సరికొత్త రకంది. మీరు కనీవినీ ఎరుగనిది."

    మందారవర్ధనిలో పట్టుదల పెరిగింది. అదంది ఇదంది.

    ఏదీ కాదంది దీక్ష.

    అంతవరకూ గమనించంది అప్పుడు గమనించింది మందారవర్దని ప్రత్యేకంగా అలంకరించుకున్న దీక్షని.

    రోజూ సింపుల్ గా నాయిల్ చీర మ్యాచింగ్ బ్లవ్ జ్, మెడలో వంటిపేట గొలుసు, ఓ చేతికి రెండే రెండు గాజులు. ఈ రోజు దీక్ష ఖరీదైన విమల్ టెరకోసా శారీ మ్యాచింగ్ బ్లవ్ జు శారీ రంగులో చేతికి నిండుగా గాజులు, రింగుల స్థానంలో బుల్లి బుట్టలు వున్న బుల్లి లోలాకులు, చెంప స్వరాలు, వేలికి వుంగరాలు, తలలో అరవిచ్చిన జంట గులాబీలు, నుదుటబొట్టు కూడా తళుకులీనుతూ రాళ్ళ హెయిర్ పిన్స్, ఈ అలంకరణ కాక, దొండపండులాంటి పెదవులు తాంబూలంతో మరింత ఎర్రబడి, నక్షత్రం చేపలాంటి కళ్ళు కాటుకతో తీర్చిదిద్ది వుండి మొదటి చూపులోనే ఆకర్షించే దీక్ష మరింత ఆకట్టుకునేలా తయారయింది.

 Previous Page Next Page