Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 19


    "ఎక్స్ క్యూజ్ మి" అని హీరోయిన్ తల్లితో చెప్పి హీరోయిన్ చేయి పట్టుకుని లాన్స్ లోకి లాక్కెళ్ళి "నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను." అన్నాడు.
    "నిజంగానా?" ఆనందంగా అడిగిందామె.
    "అవును! నీకిష్టమేనా?"
    "మా అమ్మనడగాలి!" అందామె.
    "అబ్బా!' అంటూ మళ్ళీ తల పట్టుకున్నాడతను.
    హీరోయిన్ పరుగుతో వెళ్ళి అతనన్న మాటలు వాళ్ళమ్మతో చెప్పేసింది.
    "పిచ్చి ముఖమా! పెళ్ళి చేసుకుంటానంటే 'సరే' నను. ఇంకా అలోచిస్తావెం? వెళ్ళేళ్ళు. వెళ్ళి 'రడీ' అని చెప్పు! అందామె తల్లి.
    హీరోయిన్ మళ్ళీ పరుగుతో అతని దగ్గర కెళ్ళి 'రడీ' అంది. అతను ఆనందం పట్టలేక కౌగలించుకుని ముద్దు పెట్టుకోబోయాడు.
    "అమ్మో! ఇప్పుడు కాదు - పెళ్ళయ్యాక ' అంటూ అతన్నుంచి తప్పించుకుందామే.
    మరో వారం పోయాక కార్లో ఆమె ఇంటికి వచ్చి "పద! కాసేపలా బీచ్ లో కూర్చుందాం" అన్నాడు.
    "అమ్మను కూడా తీసుకొస్తాను" అంటూ ఇంట్లోకి పరుగెత్తిందామె.
    "అబ్బా' అంటూ కుర్ర నిర్మాత రెండు చేతుల్తో తల పట్టుక్కూచున్నాడు.
    హీరోయిన్ వాళ్ళమ్మతో పాటు రడీ అయి బయటికొచ్చి "పదండి" అంది ఉత్సాహంగా.
    "అబ్బే! మీ అమ్మ రానక్కరలేదు. అలా ఓ గంట బీచ్ లో కూర్చుని వచ్చేద్దాం. మళ్ళీ నేను నిన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను." అన్నాడతను ఖంగారుగా. హీరోయిన్ అమ్మవేపు చూసింది. అమ్మ ఆకాశంలోకి చూసింది. చూసి ఏవో లెక్కలు కట్టి "సరే - గంటసేపటిలో అమ్మాయిని మళ్ళీ ఇక్కడ వదిలెయ్యాలి. నువ్విలా రామా ఓసారి!" అంటూ హీరోయిన్ ని లోపలకు పిల్చుకెళ్ళి గంటసేపు నీతి పాఠాలు చెప్పి పంపించింది.
    నిర్మాత ఆమెతో పాటు బీచ్ లో తిరిగి. ఆ తరువాత ఓ ఖరీదయిన హోటల్ గది తీసుకుని ఇద్దరికీ డిన్నర్ ఆర్డర్ చేశాడు.
    "అమ్మో! మా అమ్మ లేకుండా మీతో భోజనం చేయాలా?" అంది హీరోయిన్ ఏడుపు ముఖంతో.
    "ఇది ప్రియుడితో భోజనం చేసే వయసు - అమ్మతో చేసే వయసు కాదు" అన్నాడతను కోపంగా. హీరోయిన్ దిగులుగానే భోజనం ముగించింది.
    ఆ తరువాత ఆమెను దగ్గరకు తీసుకుని "మనం కాసేపు ప్రేమించుకుందామా?"అనడిగాడతను.
    "అమ్మో! మా అమ్మ నడుగకుండా ఎలా?" అందామె భయంగా.
    "ఎలాగూ మనకు పెళ్లవబోతుందికదా! ఇంకా భయమెందుకు?" అన్నాడతను ఆమెను గాడంగా కౌగలించుకుని.
    "ఊహూ! వద్దండీ ! పెళ్ళికాక ముందు ఇలాంటివి నా కిష్టం లేదు. అదీ మా అమ్మకు తెలీకుండా అసలిష్టం లేదు." అంటూ అతని చేయి తోసివేసి దూరంగా జరిగిందామె.
    కుర్ర నిర్మాత ఆశ్చర్యపోయాడు. ఆ హీరోయిన్ 'సతీతులసి' అంతటి శీలవతి అనీ , సినిమా ఫీల్డులో కొచ్చినా శీలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోందనీ , అందుకు కారణం ఆమెను ఇరవై నాలుగ్గంటలూ కంటికి రెప్పలా కాపాడే ఆమె తల్లి అనీ తెలుసుకున్నాడతను. అలాంటి శీలవతి దొరకడం తన అదృష్టమనీ, ఆమెను పెళ్ళాడినా తప్పు లేదనీ నిర్ణయించుకుని ఓ మంచి రోజ్జూసి వైభవంగా వివాహం చేసుకున్నాడు. తీరా చేసుకున్న రెండో రోజే విడాకుల కోసం కోర్టుకెక్కాడు."
    ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అంది -
    "నిర్మాతా! ఆ కుర్ర నిర్మాత ఆ హీరోయిన్ ని కావాలని కోరి వివాహం చేసుకుని మర్నాడే మళ్ళీ ఎందుకు విడాకుల కోసం కోర్టు కెక్కాడు? ఆ వివాహం అలా "జతదినోత్సవం' చేసుకోడానికి కారణం ఎవరు? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది జాగ్రత్త."
    నిర్మాత తన తల ఓసారి తడిమి చూసుకుని ఇలా అన్నాడు.
    "ఆ హీరోయిన్ కి ఇరవై నాలుగ్గంటలూ వాళ్ళమ్మ చాటునే గడపడం అలవాటు కదా! వాళ్ళమ్మకూ అంతే. కూతురికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ తనే తలదూర్చి ఆమె బదులుగా తనే అందరితోనూ మాట్లాడుతుండేది. అందువల్ల కూతురిని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలడం ఆమెకు అలవాటు లేదు.
    మొదటి రాత్రి కుర్ర నిర్మాత హీరోయిన్ తో ప్రణయ కలాపాలు ప్రారంభించి , ఆమె ఎంతకూ ఉత్సాహం చూపకపోయేసరికి సంగతేమీటని అడిగి వుంటాడు. అందుకు హీరోయిన్ నా ప్రక్కన మా అమ్మ లేకుండా గడపడం ఇది మొదటిసారి. ఆమె లేకపోతె నా మనసెం బావుండదు అని జవాబిచ్చి వుంటుంది. మొదటి రాత్రి కూడా పక్కన అమ్మేమిటని అతగాడికి కోపం వచ్చి ఆమెతో బలవంతంగా ప్రణయం ప్రారంభించేసరికి "అమ్మా" అని హీరోయిన్ అరవటం, వెనువెంటనే ఆమె 'తల్లి' అమ్మాయి అమాయకురాలు అల్లుడూ! జాగ్రత్తగా చూసుకో! నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. అందుకే ఈ గది బాల్కనీ లో పడుకున్నా' అని అనడం చూసి ఇలా ప్రతి విషయానికి ఆఖరికి పడగ్గదిలో కూడా అమ్మ మీద ఆధారపడ్డ భార్యతో సంసారం చేయడం కంటే సన్యాసం తీసుకోవడం మంచిదనిపించి విడాకుల కోసం కోర్టు కెక్కాడతను...."
    ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.

                                              ***

 Previous Page Next Page