Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 19

 

    ఆమె నవ్వాపుకుంది.
    "మరీ ఇంత కమర్షియలా?"
    "అవునులెండి! మీ పనికోసం బస్ చార్జీ అడిగితేనేమో కమర్షియ ల్ ! నా పేరు మీద మీరు నాలుగువేలు జీతం వచ్చే ఉద్యోగం సంపాదించుకుంటేనేమో లిబరల్"
    ఆమె పర్సు లోంచి ఓ ఐదు నోటూ, ఓ అర్ధ రూపాయి నాణెం తీసి ఇచ్చింది.
    "ఇంక వెళ్ళనా మరి?"
    "ఇంకొక్క విషయం."
    "చెప్పండి!"
    "నేను ఈ విషయంలో మిమ్మల్నే కావాలని ఎన్నుకున్నది మీరు అన్ డ్యూ ఎడ్వాంటేజ్ తీసుకోరన్న నమ్మకంతో ఆ నమ్మకాన్ని వమ్ము కానీరు కదూ?"
    "అన్ డ్యూ కాదు కదా. డ్యూ ఎడ్వాంటేజ్ కూడా  తీసుకొను ---- మీకా అనుమానాలే అక్కరలేదు. మీరే అన్నారుగా మనం ఫ్యూర్ కమర్షియల్ "
    "థాంక్యూ" ఆమె వెళ్ళిపోయింది.
    సురేష్ ఉత్సాహంగా వెళుతుంటే మాగజైన్ షాపు నుంచి జగదాంబ పిలిచింది.
    "ఏమిటి? మా షాప్ వరకూ వచ్చి నన్ను జూసి కూడా అంజాన్ కొడుతున్నావ్?"
    "అంజాన్ కాదు, బేచైన్."
    "బెచేయినెందుకు?"
    "ఇంకా నీ ఫోర్త్ హజ్ బెండ్ వేకెన్సీ రాలేదని ."
    తను చాలా దూరం వచ్చేసేవరకూ ఆమె తుళ్ళి తుళ్ళి నవ్వుతూనే వుంది.
    తను టెర్రస్ మీద కెళ్ళాలని బటన్ నొక్కినా అది లిప్ట్ ఆరో ఫ్లోర్ లోనే ఆగిపోయింది. తెరుచుకునేసరికి ఎదురుగా శ్రీదేవి నిలబడి ఉంది. కోపంతో బుసలు కొడుతోంది.
    క్లచ్ వదలకుండా యక్సిలేటర్ నొక్కి రైజ్ చేస్తున్న మోటడార్ ఇంజన్ లా ఆమె శరీరమంతా ఆవేశంకి అదురుతోంది.
    "ఇవాళ పొద్దున్న ఆయనను వెంబడించలేదు కదూ!"
    సమాధానం సరిగ్గా చెప్పకపోతే కొంపలు మునిగిపోతాయ్. ఫ్రీ ఫలహారాలు, కాఫీలు, లిఫ్టు రైడ్ లు అన్నీ బంద్! ఆ తర్వాత ఆ అపార్ట్ మెంట్స్ నుంచి బహిష్కరణ --
    "భలేవారే! ఇప్పుడు దాకా ఎక్కడ అఘోరించాననుకున్నారు మరి?"
    ఆమె మొఖంలో ప్రసన్నత .
    "నిజంగానా?" అనందం, అనుమానం.
    "మీకు నా మీద లేకపోయినా నాకు మీ మీద ఎప్పుడూ ఉంటుందండీ గౌరవం! మీరొదిలినా నేనోదుల్తానా?"
    "ఆ సిక్స్ నాట్ త్రీ ఆవిడా ఈ మనిషీ మళ్ళీ బస్ స్టాప్ లో కల్సుకున్నారా?"
    "కలుసుకోవడం ఏమిటి? వ్యవహారం చాలా దూరం పోయింది."
    ఆమె కలవరపాటుతో చూసింది.
    "చూశావా? నా అనుమానాలన్నీ నిజాలవుతున్నాయ్! మా చెల్లెలేమో నేనుత్త అనుమానాలు గిత్తనంటోంది."
    "చెల్లెళ్ళకేం తెలుస్తాయ్ అక్కల పాట్లు ."
    "బాగా చెప్పావ్! ఏం జరిగింది తర్వాత?"
    "ఇద్దరూ తిన్నగా జూపార్క్ కెళ్ళారండీ! నేనూ వెంబడించాను . లోపల నిర్మానుష్యంగా మూల గెస్టు హౌస్ వుంది చూడండి! అందులో దూరారండీ!"
    "చూశావా ఎంతకు తెగించారో?"
    "అప్పుడే ఎమయిందండీ! వ్యవహారమంతా తర్వాత ఉందండీ!"
    ఆమె రోషంగా చూసింది. కళ్ళల్లో కృష్టా జలాల మళ్లింపు పధకం కనబడుతోంది.
    "తర్వాతేం చేశారు?"
    "నేను కిటికీ బయట నక్కాను కదండీ! లోపల సీన్ స్పష్టంగా కనబడట్లేదు గానీ ఇద్దరూ ఒకళ్ళ వళ్ళో ఒకళ్ళు పడుకుని ఒకటే మాటలండీ!"
    ఆమె కళ్ళ వెంబడి రెండు కన్నీటి చుక్కలు గంటకు మూడొందల కిలోమీటర్ల వేగంతో కిందకు రాలినాయ్.
    "ఏం మాట్లాడారో వినిపించిందా?"
    "నానా చావూ చస్తే రెండు మూడు డైలాగులు వినబడ్డాయండీ!"
    "ఏమిటవి?"
    తనింక ఆమె ఇమేజినేషన్ కి ఆనకట్ట వేయటం అవసరం . లేకపోతే మోహన్రావ్ జీతం ఇవ్వడు.
    "సరిగ్గా నాకూ అర్ధం కాలేదు గానండీ. ఇద్దరూ రాజకీయాలు మాట్లాడుకున్నారండీ."
    "రాజకీయాలా?" నివ్వేరబోతూ అడిగింది.
    "అవునండీ! అలా ఎంతసేపూ చూస్తావ్?అధికారపార్టీ రెండుగా చీలింది గదా! ఇప్పుడు నిలబడితే తేలికగా అసెంబ్లీలో జోరబడవచ్చు కదా అని ఆమె అందండీ! దానికతను "నీకు తెలీదేమో! ఎప్పుడో ఇండిపెండెంట్ గా నిలబడటం , డిపాజిట్ గల్లంతవటం కూడా జరిగిపోయింది. మళ్ళీ మళ్ళీ నావల్ల కాదు అన్నారండీ!"
    ఆమె ఆలోచనలో పడింది.
    "ఆ రాజకీయ భాషలో ఏమయినా తిరకాసుందంటావా?"
    "ఏమీ ఉన్నట్లు కనిపించడం లేదండీ! అయినా మన జాగ్రత్తలో మనం వుండాలి కదండీ?"
    "వాళ్ళక్కడ ప్రణయకలాపాలేమీ జరపలేదంటావా?"
    "వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఏమీ లేదని నా నమ్మకమండీ."    
    "అంతేనంటావా?"
    "అంతేనండీ!"
    "సరే -- ఈమె పాలిటిక్స్ ఫ్రెండ్ అనుకో! ఆ ఆఫీస్ లో రాజేశ్వరీ సంగతేమిటి?"
    "అది ,మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి ఉండాల్సిందేనండీ! కనిపెట్టి వుండాలంటే నేను రోజూ లంచ్ టైం కి వాళ్ళ కాంటీన్ కెళ్ళాలండీ! వాళ్ళ వెనుక బెంచిలేనే కూర్చోవాలండీ! వాళ్ళు ఎదోకటీ మేసినంత సేపూ నేనూ మేస్తుండాలీ కదండీ, నా దగ్గరేమో అస్సలు కాష్ లేదండీ.
    "ఇదిగో నువ్ కాష్ గురించి భయపడబోకు. ఎంత ఖర్చయినా నేనిస్తా కదా -'
    'అలాగాండీ! అయితే ఓకే అండీ! రేపట్నుంచీ లంచ్ టైం వాళ్ళ కాంటీన్ కెళ్ళి వాళ్ళ గుట్టంతా బయట పెడతాను . అబ్బ! అప్పుడే భోజనం టైమయిందా? ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్ మీద మేస్ కెళ్ళి భోజనం చేయాలండీ ."
    "భలేవాడివే! నా వంటకాలు పనికిరావా ఏమిటి - పరాయి కొంపల్లో తినడానికి పద"
    సురేష్ ఆనందంతో పొంగిపోయాడు.
    వాళ్ళిద్దరికీ కొట్లాట్లలు రాకుండాను, ఆమెకు అతగాడి మీద అనుమానం మరింత ఎక్కువయ్యేటట్లుగానూ ఇలాగె నాలుగు కాలాలు మేనేజ్ చేయగలిగితే చాలు. పుడ్ కి డోకా వుండదు.
    "చికెన్ బిరియానీ అయన కిష్టమని వండాను. యివాళ మా పెళ్ళి రోజూ కదా! అందుకని అడ్డమయిన దాని వెంబడీ పడే వాడికెందుకు పెట్టాలి నువ్వే తిను ."
    సురేష్ కి ప్రాణం లేచి వచ్చింది.
    ఇది బిరియానీ సీజను లాగుంది.
    రాత్రి కుముదిని మటన్ బిరియానీ----
    ఇప్పుడు శ్రీదేవి చికెన్ బిరియానీ ---

 Previous Page Next Page