ఆ దెయ్యం - అదే, ఆ జ్యోత్స్న - నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేదా? మావారిని వలలో వేసుకోవాలని చూసేదా?" అని అడిగింది నెమ్మదిగా-
జ్యోత్స్న నిర్ఘాంతపోయింది.
అక్కడికి కొంచెం దూరంలోనే కూచున్న రేవతికి ఆ మాటలు వినిపించాయి. విరగబడి నవ్వేసింది-
"సుశీలగారూ! మీ ప్రక్కన కూర్చున్నది జ్యోత్స్న అండీ! నేను కాదు-" అని అరిచింది గట్టిగా....
నల్లని సుశీల ముఖం మరింత నల్లబడిపోయింది. లావుపాటి కళ్ళద్దాల వెనక కాంతిలేచి ఆ కళ్ళలో నీళ్ళు నిండాయి.
"నాకు తెలుసు - నాకు తెలియదనుకున్నావా? దానికి బుద్ధి రావాలనే అలా మాట్లాడాను - ఈశని.... ఈ దెయ్యం.... ఈ రాక్షసి...." ఇంక మాట్లాడలేక పైట కొంగుతో ముఖం కప్పుకుంది సుశీల -
జ్యోత్స్నకు ఏం జరుగుతోందో, ఎవరు ఏమంటున్నారో,అర్థం కావటంలేదు. ఆ వ్యక్తుల మధ్యనుంచి, ఆ పరిసరాల్లోంచి, ఆ పరిస్థితుల్లోంచి ఎక్కడికో ఎగిరిపోతోంది మనసు.... ఈ లోకంలో లేనిదానిలా, ఈ లోకంతో సంబంధం లేనిదానిలా ఎక్కడో, ఏదో చూస్తూ నిలబడి పోయింది.
ఉక్రోషంతో, ఉడుకు మోతుతనంతో, సుశీల జ్యోత్స్నను నోటికొచ్చినట్లు తిట్టడం మొదలు పెట్టగానే, జ్యోత్స్న మీద చాలా జాలి కలిగింది వెంకట్రావుకి - సుశీల ఉక్రోషానికి అసలు కారణమేమిటో వెంకట్రావుకి తెలుసు - పాపం, అదంతా కక్కటానికి జ్యోత్స్న దొరికింది సుశీలకి -
జాలిగా జ్యోత్స్నను చూసిన వెంకట్రావు ఉలికిపడ్డాడు. ఆ మూర్తి.... ఈ లోకంలో లేనిదానిలా.... ఈ లోకంలో సంబంధంలేని దానిలా.... ఎక్కడో చూసే ఆ మూర్తి.... ఎలా మరిచిపోగలడు?
"జ్యోత్స్న! మీరు బొంబాయి హోటల్లో అర్థనగ్న ప్రదర్శనలిచ్చేవారు కదూ!" అనేశాడు.
ఉన్నపాటున పిడుగు పడినా అంత సంచలనం కలగదు ఒక్కసారిగా కలకలం చెలరేగింది -
జ్యోత్స్న వెంకట్రావు వైపు చూసింది. "నీకు ఉరిశిక్ష వేస్తున్నాను" అన్న జడ్జీ వైపు ఏ నేరమూ చెయ్యని ముద్దాయి చూసినట్లు చూసింది. "నువ్వు ఇంత రాక్షసుడవా?" అని అధిక్షేపిస్తున్నట్లు చూసింది. కత్తి తీసుకుని తన మెడ నరకబోయే కసాయివాడిని లేడిపిల్ల చూసినట్లు చూసింది.
వెంకట్రావు రాక్షసుడు కాడు - కసాయి కాడు - పాపం, మనసున్న మనిషి! అతనికి తను చేసిన దారుణమయిన పొరపాటు అర్థమయ్యేసరికి అది వెనక్కు తీసుకోగలిగే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. అప్పటికే అందరికందరూ పట్టరాని కుతూహలంతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
"ఏమిటి? జ్యోత్స్న అర్థనగ్న ప్రదర్శన లిచ్చేదా? ఆ ఎలాగ? ఏం బట్టలుండేవి వంటిమీద? చీర ఉండేది కాదనుకుంటాను మరి...." మనసులో ప్రతి దృశ్యమూ ఊహించుకోవటానికి ప్రయత్నిస్తూ యావగా అడుగుతున్నాడు మాజీ తహసీల్దారు.
"ఛీ! ఛీ! ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టే స్త్రీ జాతి ఇంత అధోగతి పాలవుతోంది. డబ్బుకోసం ఉచ్చం, నీచం, మానం మర్యాద అన్నీ మంట గలుపుకునే ఇలాంటి ఆడవాళ్ళు కొందరు మొత్తం స్త్రీ జాతికే అవమానకరంగా తయారవుతున్నారు...." అని చీదరించుకుంది రేవతి.
"ఏమిటి? అర్థనగ్న ప్రదర్శనలా? ఎలా ఇస్తారు? ఒక్కొక్క ప్రదర్శనకి ఎంత డబ్బు యిస్తారు? ఈ లెక్కన చాలా డబ్బు సంపాదించి ఉండాలి! ఏమైపోయింది, ఆ డబ్బంతా? ఎక్కడయినా దాచావా జ్యోత్స్న దగ్గిరగా వచ్చి ఆత్రంగా అడగసాగింది ఐరావతమ్మ.
సుశీల తన ఏడుపు మరిచిపోయింది.
"ఛీ! ఛీ! ఇది ఇలాంటి పిశాచమా? నేను ముందే అనుకున్నాను. మనుష్యుల ముఖాలు చూస్తూనే ఎవరెలాంటి వాళ్ళో కనిపెట్టగలను...." అంది, కనబడని కళ్ళతో జ్యోత్స్నను చూడాలని ప్రయత్నిస్తూ.
భాస్కర్ ఉడికిపోతున్నాడు. ఆ రాక్షసులందరి మధ్యనుండీ, జ్యోత్స్నను ఎత్తుకుని దూరంగా పారిపోవాలని ఆరాటపడుతోంది అతని మనసు. చూపులతో సుశీలని కాల్చేస్తున్నాడు. అది గమనించిన వెంకట్రావు వణికిపోయాడు.
మచ్చల డాక్టర్ జ్యోత్స్న దగ్గిరకి వచ్చి జ్యోత్స్న చెయ్యి పట్టుకుని "రండి- మీ వాటాలోకి పోదాం!" అన్నాడు.
జ్యోత్స్న అతని చెయ్యి విడిపించుకోలేదు. అతనికే విధమైన సమాధానమూ చెప్పలేదు. అసలు జ్యోత్స్న అక్కడ లేదు. కొన్ని సంవత్సరాల గతంలోకి జారుకుంది జ్యోత్స్న మనసు....
తెలిసీ తెలియని చిన్న వయసు - అసాధారణమైన అందం - తల్లిదండ్రులు లేని అనాథ.... అలాంటి ఆడపిల్ల ఎన్ని చిక్కులు ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కొంది తను. డబ్బు లేదు: బ్రతుకు తెరువుకు ఉద్యోగం చెయ్యక తప్పదు. ఎక్కడ ఏ ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఒకటే సమస్య. మొగవాళ్ళ కళ్ళన్నీ తన మీదే! ఏదో ఒక రకంగా అందరూ తనను కబళించాలని ప్రయత్నించే వారే!
ఏ ఉద్యోగంలోనూ నిలవలేకపోయేది. ఒంటరిగా తనను చుట్టుముట్టిన పరిస్థితులను ఎదిరించి ఎలా తన బ్రతుకు చక్కదిద్దుకోవాలో అర్థమయ్యేది కాదు.
అలాంటి సమయంలో తనతో కలిసి హైస్కూల్లో చదువుకున్న పద్మిని బొంబాయి నుండి వచ్చి తనను చూడటానికి వచ్చింది. హైస్కూల్లో పద్మినీ, తనూ చాలా స్నేహంగా ఉండేవారు. ఆ అమ్మాయిది చాలా మంచి మనసు.