Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 19


                                                                ప్రేమ

    ఆ టైమ్ లో ఆ రోడ్డెప్పుడూ రద్దీగానే ఉంటుంది.

    ఆఫీసుల కెళ్ళేవాళ్ళూ, స్కూళ్ళకూ, కాలేజీలకూ పోయేవాళ్ళూ ఊర్లోని జనమంతా ఆ రోడ్డుమీద ఉన్నట్లనిపిస్తుంది నాకా సమయంలో.

    చేతిలో ఫైల్సు పట్టుకొని నెమ్మదిగా పుట్ ఫాత్ మీద నడుస్తున్నాను. హఠాత్తుగా నా దృష్టి నా ఎదురుగా వస్తూన్న అమ్మాయి మీద పడింది. మరుక్షణం నా మనసంతా ఆమెమీద జాలితో నిండిపోయింది. గుండెలు బరువెక్కిపోయినాయి. ఆమె కుంటుతూ నడుస్తోంది. బహుశా పోలియో కేసేమో అనిపించింది. చాలా కష్టంగా నడుస్తోంది. ఖరీదయినా చీరా, అలంకరణ ఆమెను అందంగా చూపడానికి విఫలయత్నం చేస్తున్నయ్. ఆమె పక్కనే ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ నడుస్తున్నాడో యువకుడు. అది రోడ్డు అన్న విషయం గుర్తులేనట్లే లీనమయిపోయి మాట్లాడుతున్నాడతను. మంచి పర్సనాలిటీ - వేషం - చదువుకున్న వాడిలాగానే ఉన్నాడు. ఇద్దరూ నిలబడిపోయి రోడ్డు దాటడానికని అటూ ఇటూ చూశారు. నేనూ వాళ్ళతోపాటు నిలబడిపోయి వాళ్ళవంకే చూడసాగాను. అతను ఆమె భుజం చుట్టూ చేయివేసి అతి జాగ్రత్తగా ఆమెను రోడ్డు దాటించాడు. ఆ క్షణంలో ఆమె ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది నాకు. ఆ తరువాత మళ్లీ ఇద్దరూ కబుర్లలో మునిగిపోయి నెమ్మదిగా నడువసాగారు.

    వాళ్ళ గురించే ఆలోచిస్తూ, నేనూ ముందుకి సాగిపోయాను.

    వాళ్ళను చూస్తుంటే నాకెందుకో బాధా, ఆనందం రెండూ కలిగినయ్. ముఖ్యంగా అతనే చాలాసేపు నా ఆలోచనల్లో ఉండిపోయాడు. అతనెవరు? ఆమెకూ అతనికీ ఏమిటి సంబంధం? సోదరుడా? బంధువా? ప్రియుడా?

    అంత ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడుతున్నాడంటే ఎలాంటి బంధుత్వం అయుంటుంది వాళ్ళది?

    మర్నాడు మరికొద్ది నిమిషాలు ముందే ఆఫీసుకు బయల్దేరి ఆ రోడ్డు చేరుకొని ఓ పక్కగా నిలబడి వాళ్లకోసం ఎదుర్చూడసాగాను.

    సరిగ్గా అదే సమయానికి వాళ్ళిద్దరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకొంటూ రావడం కనిపించింది నా దగ్గరకొచ్చి ఆగిపోయి రోడ్డు దాటడానికి ప్రయత్నించసాగారు. అతని చేయి ఆమె భుజంచుట్టూ పడింది. మరుక్షణంలో ఇద్దరూ రోడ్డు దాటి ముందుకి సాగిపోయారు.

    "ఏమి టిక్కడ నిలబడిపోయావ్?"

    ఆ మాటతో ఉలిక్కిపడి పక్కకు చూశాను.

    రజనీకాంత్ కనిపించాడు.

    "అబ్బే- ఊరికే- పాపం ఆ కుంటి అమ్మాయిని చూస్తూంటే - మనసు అదోలా అయిపోయింది...."

    "ఓహో, అదా! అవును పాపం! మా ఇంటిదగ్గరే ఉంటాను వాళ్ళు - అదిగో- ఆ ఆఫీసులోనే పనిచేస్తోంది" అని చూపించాడు.

    "అలాగా!" ఆశ్చర్యంగా అడిగాను. "మరి.. అతనెవరు?"

    "అన్నీ గమనిస్తున్నావన్నమాట..." నవ్వుతూ అన్నాడతను.

    "ఎందుకో కుతూహలం కలిగింది."

    "త్వరలో వాళ్ళిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు... మరి నేనుపోనా? టైమయిపోయింది.." వెళ్ళిపోతూ అన్నాడతను.

    నేనూ టైమ్ చూసుకొని వడివడిగా నడవసాగాను ఆఫీసుకి.

    నా మనస్సంత ఒక విధమైన ఆనందంతో నిండిపోయింది. ఆ అమ్మాయి జీవితం సుఖప్రదం కాబోతుంది. తను కుంటిగా ఉన్నా, అందంగా లేకపోయినా అలాంటి చక్కని యువకుడిని ఆకర్షించిందంటే అది ఆమె అదృష్టం కాక మరేమిటి?

    ఆ మర్నాడు కూడా వాళ్ళని చూడకుండా ఆఫీసుకెళ్లడం నావల్లకాలేదు.

    అతన్ని చూస్తూంటే ఆనందంతోపాటు ఎంతో సంతృప్తి కూడా కలిగింది. అతను మామూలు యువకుడు కాదు. ఎంతో హృదయ వైశాల్యమున్న మనిషి. అలాంటి లోపాలున్న అమ్మాయిని మనసారా స్వీకరించగల గొప్పతనం ఎంతమందికి ఉంటుంది? ఆమెను జీవిత భాగస్వామిగా ఎన్నుకొనేంత త్యాగం ఎవరు చేయగలుగుతారు?

    ఆ రోజంతా అతన్ని గురించిన ఆలోచనలే.

    అతన్ని పరిచయం చేసుకొని మనసారా అభినందించాలనిపించింది.

    పది రోజులు గడిచిపోయాయ్.

    రోజూ వాళ్ళిద్దరూ కనబడుతూనే ఉన్నారు. ఏ ఒక్క రోజయినా వాళ్ళు కనబడకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అతని మాటలు వినేటప్పుడు ఆమె ముఖంలో కనిపించే ఆనందం, అతని ఆరాధన, ప్రేమ - అంత మంచి దృశ్యం నిస్సందేహంగా నేను నా జీవితంలో చూసి ఉండలేదు.

    చాలా రోజుల తరువాత కాకతాళీయంగా అదే చోట మళ్ళీ రజనీకాంత్ కలిశాడు.

    ఆ సమయంలోనే వాళ్ళిద్దరూ రోడ్డు దాటుతున్నారు.

    కొద్దిక్షణాలు ఏవేవో మాట్లాడుకొన్నాక మెల్లిగా నా మనసులోని కోరిక బయటపెట్టాను.

    "అతను నీకు తెలుసా?" అనడిగానతనిని.

    "తెలుసుగానీ - పెద్దగా పరిచయం లేదు..." అన్నాడు రజనీకాంత్.

    కొంచెం నిరుత్సాహపడ్డాడు.

    "ఏం, ఎందుకు? అతనితో ఏమిటి పని?" అడిగాను రజనీకాంత్.

    "ఊరికే- ఎందుకో అతనంటే గొప్ప అభిప్రాయం ఏర్పడిపోయింది. అతనలాంటి త్యాగవంతులంటే నాకిష్టం - ఒకసారి అభినందిద్దామని అనిపించింది.."

    "ఏమిటతను చేసిన త్యాగం?" ఆశ్చర్యంగా అడిగాడు రజనీకాంత్.

    "అదే - ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకోవడం..."

    "ట్రాష్!" నవ్వుతూ అన్నాడు రజనీకాంత్.

    "అతనేం అంతటి ఉదార పురుషుడు కాదులే! నువ్వు మరీ అతిగా ఊహించుకోనవసరం లేదు అతని గురించి.."

    "ఏం" దెబ్బతిన్నట్లు అడిగాను.

    "అతనా అమ్మాయినే పెళ్ళాడాలని అనుకోడానికి కారణం ఉంది."

    "ఏమిటది?"

    "అతనికి ముఖ్యం ఆ అమ్మాయి కాదు. ఆమె చేస్తున్న ఉద్యోగం. ఆమె తెచ్చే అయిదొందల జీతం..."

    "ఎందుకని?"

    "అతనికి ఉద్యోగం లేదు. ఏజ్ కూడా దాటిపోయింది. దొరుకుతుందన్న ఆశాలేదు. అతనిమీద ఆధారపడ్డ తల్లి చెల్లెలు బ్రతకాలంటే అతనా అమ్మాయిని వివాహం చేసుకోక తప్పదు. ఆ రకంగా తననీ తన కుటుంబాన్ని పోషించుకొంటున్నాడు. ప్రతినెలా ఆ అమ్మాయి జీతం అతనికే ఇచ్చేస్తుంది..."

    రజనీకాంత్ నన్ను తీవ్రంగా అవమానపర్చి నట్లనిపించింది నాకు. అతనిమీద విపరీతమైన కోపం వచ్చింది. హఠాత్తుగా ఆ యువకుడి గురించి అలాంటి వార్తలు చెప్పి నన్ను తికమక పెట్టేశాడు. అశాంతి పాల్జేశాడు.

    మరొక్క మాట కూడా మాట్లాడకుండా వేగంగా అడుగులు వేసుకొంటూ బయల్దేరాను.

    ఆ తరువాత ఎప్పుడూ ఆ అమ్మాయీ ఆ యువకుడూ నా కంటపడలేదు. అసలు నేను ఆ రోడ్డున వెళ్లడమే మానేశాను.

    వాళ్ళను చూస్తే కలిగే భావాలు నేను భరించలేను.

    అతను ఆమెను నిజంగా కేవలం ప్రేమకోసమే ప్రేమిస్తున్నాడన్న ఆ అమ్మాయి నమ్మకాన్ని - ఆమె ముఖంలో చూడటం నాకిష్టం లేదు.

 Previous Page Next Page