ఇద్దరికి మాత్రమే సరిపడే చిన్నడైనింగ్ టేబుల్ ముందు జాస్మిన్, నందితాదేవి కూర్చున్నారు. ప్లేట్లలో చపాతీ కూర్మా కూడా సర్దింది. రైస్ వేరే ప్లేట్లలో తీసింది. ఫ్రిజ్ లోంచి రెండు అమృతపాణిలు, ఐస్ వాటర్ బాటిల్స్, గాజు కప్పులో గట్టి మీగడ పెరుగు తీసింది.
నందితాదేవి చూస్తూ కూర్చుంది.
"ఉన్నది ఒక్కమనిషి. ఫ్రిజ్ దగ్గరనుంచి అన్నీ చాలా చక్కగా అమర్చుకుంది. ఈమె మాటలు. అందమైన చిరునవ్వు, పొందికగా ముచ్చటగా వున్న సామాను ప్రశాంతంగా, హాయిగా జీవిస్తున్నది. పెళ్ళి చేసుకున్నవాడు సుఖపడతాడు. అందం, తెలివి, మంచితనం ఈమె సొత్తులా వుంది."
"ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ముందు భోజనం కానివ్వు. నావరకే వంట చేసుకున్నాను. ఇరువురం సర్దుకుందాము. కడుపు నిండకపోతే యాపిల్స్ వున్నాయి. తర్వాత తిందాం" నవ్వుతూ అంది జాస్మిన్.
"నా వల్ల మీకు యిబ్బంది..." నసిగింది మొహమాటంతో నందితాదేవి.
"ఇది నాటకం డైలాగుకాదు. సినిమా డైలాగ్; కానియ్ కానియ్" జాస్మిన్ చపాతీ తుంచుతూ అంది.
నందితాదేవి మారు మాట్లాడక ప్లేటు దగ్గరకు లాక్కుంది.
"పెరుగు చాలా గట్టిగా చల్లగా..."
"పెరుగు కేకులా ముక్కలు కోసేటంత గట్టిగా వుండడం. ఐస్ లా వుండటం నాకు చాలా ఇష్టం, ఫ్రిజ్ లో వుంచింది అందుకే" జాస్మిన్ చెప్పింది.
భోజనం కాగానే డైనింగ్ టేబుల్ క్లీన్ చేసింది జాస్మిన్. కొత్తగా వచ్చిన అతిధిలాగానే చూస్తూ వుండిపోయింది నందితాదేవి.
బెడ్ రూమ్ లో చేరి ఇరువురూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. జాస్మిన్ మధ్యలో వెళ్ళి వాకిట్లో చూచి వచ్చింది. వాళ్ళిద్దరూ వీధిచివర తారట్లాడుతూనే వున్నారు. మరోసారి వెళ్ళి చూసినపుడు ఒకరి ఇంట్లోకి వెళ్ళి తలుపు కొడుతున్నారు.
"ఈ రాత్రికి వీళ్ళుపోరు. నువ్వు నిశ్చింతగా నిద్రపో వాళ్ళు వచ్చి అడిగితే ఎవరూ రాలేదని చెపుతాలే." జాస్మిన్ అంది. పెద్ద లైటు అర్పి బెడ్ లాంప్ స్విచ్ వేస్తూ నందితాదేవి గుడ్ నైట్ చెప్పి పడుకుంది.
సరిగ్గా పావుతక్కువ పన్నెండు అయింది.
వీధి తలుపులు తట్టిన శబ్దం అయింది.
జాస్మిన్ అప్పటికే నిద్రపోయింది.
జరిగింది మననం చేసుకుంటూ జరగబోయే రోజులు ఎలా వుంటాయో ఊహిస్తూ నిద్రపట్టక పక్కమీద దొర్లుతున్న నందితాదేవి ముందుగా తలుపు తట్టిన చప్పుడు వింది. "హారి భగవంతుడా వీళ్ళు నన్ను వదిలేటట్లు లేరు" అనుకుంది.
మరోసారి తలుపు తట్టారు వాళ్ళు.
చేతిలో తట్టి నెమ్మదిగా జాస్మిన్ ని లేపింది. గుసగుసలాడుతూ వాళ్ళు వచ్చారని చెప్పింది. ఇంట్లో గాలిస్తామనొచ్చు. దౌర్జన్యం చేయొచ్చు. ఏం చేద్దామని భయంతో అడిగింది నందితాదేవి.
"డోంట్ వర్రీ. వాళ్ళ విషయం నే చూసుకుంటాను. నీవా బాత్ రూమ్ లో దాక్కో. నే పిలిచిందాకా బైటికి రాకు" బెడ్ రూమ్ లోంచి వున్న ఎటాచ్ద్ బాత్ రూమ్ నందితాదేవికి చూపి నైట్ గౌను బెల్టు ముడి వేసుకుంటూ తలుపు తీయటానికి వెళ్ళింది జాస్మిన్.
నందితాదేవి బాత్ రూమ్ లోకి వెళ్ళి లోపలబోల్టు బిగించుకుంది.
"ఎవరు? తలుపు తీయకుండానే అడిగింది జాస్మిన్ పెద్ద లైటు స్విచ్ వేస్తూ.