Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 18

 

    ఈ విషయమేకాదు, చాలా విషయాలు మార్పుగా తోచాయి మనోరమకి, పంకజానికి.

    మాట్లాడుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. ఇంట్లో మాట్లాడుకుంటే అద్దెకున్నవాళ్ళు వింటారు. పగలు తలుపులు బిడాయించుకుని చర్చించుకోటం ఎప్పుడూ జరగలేదు అద్దెకున్న వాళ్ళకి అనుమానం రాకుండా వుండాలని, వాళ్ళు ఒక్క మాటకూడా వినటానికి లేదు. వింటే డేంజర్. అందుకే ఇంట్లోంచి బైట పడ్డారు.

    కనకదుర్గ గుడి ఆవరణలో దూరంగా కూర్చున్నారు. అక్కడికి ఎవరూ వచ్చి కూర్చోరు. పెద్దగా మాట్లాడుకున్నా ఎవరూ వినరు. ఎవరైనా అటుగా వస్తున్నట్లు కనపడితే మాటలు ఆపేయవచ్చు.

    అందుకే ఆ స్థలం ఎన్నుకున్నారు కోదండరామయ్య వెంకుమాంబ.

    "ముందా పెట్టెని తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయండి" అంది వెంకుమాంబ.

    "పెట్టెని పారేయటానికి లేదు. అదేగా నా బాధ" ఎంతో ముందు చూపుతో ఆలోచించి చెప్పాడు కోదండరామయ్య.

    "ఇంకా పెట్టెమీద మోజు పోలేదా?"

    "ముందా వ్యంగ్యంమాటలు ఆపు. విషమపరిస్థితి వచ్చింది, అది ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే సహకరించాల్సింది పోయి నీ గోలే నీదయితే ఎలా? పెట్టె పారేస్తే ఎలా? అది అంత తేలికపాటి విషయంకాదు."

    "అంటే?"

    "అంటే ఏమిటో వివరంగా చెపుతాను విను. ఎర్రపెట్టె కొత్తరంగు పులుముకుని అందమైన పూలతో అందర్నీ ఆకర్షిస్తూ వుంది. అందరి దృష్టి దానిమీద పడింది. అందరూ ఎవరన్నది పేరు పేరునా చెప్పలేను కాని లైసెన్సు కూలీలు, రిక్షావాడు మనింట్లో అద్దెకున్న వాళ్ళు చూశారు. అది చాలు."
    "చూస్తే ఏమయింది?"

    "పిచ్చి మొహమా.....నేరం గురించి నీకు తెలియదు. ఎర్రపెట్టెలో శవం తలకాయ వుంది. చేతులు వున్నాయి. ఆ పెట్టెలో బంగారం వుందని ఆశపడి మనం తెచ్చుకున్నాము. శనిచుట్టుకున్నట్లు శవం మన తలకి చుట్టుకుంది, శవాన్ని. పెట్టెని కలిపి పారేశామనుకో. పోలీసుల దృష్టికి అది వెళ్ళిందనుకో వెంటనే వాళ్ళు రంగంలో దిగుతారు. ఆరా తీయటంలో వాళ్ళు మొనగాళ్ళు. అసలు హంతకుడిని పట్టుకోలేక నిన్నూ, నన్నూ పట్టుకుంటారు."

    "అయితే ఎలాగండీ?" ఏడ్పు మొహం వేసుకుని అడిగింది వెంకుమాంబ.

    "దానికి నేనో ఉపాయం ఆలోచించాను."

    "ఏమిటి?"

    "శవాన్ని గప్ చిప్ గా ఈ రాత్రికి మన పెరట్లో పాతేద్దాము."

    "ఏదీ మళ్ళీ చెప్పండి.

    మళ్ళీ చెప్పాడు కోదండరామయ్య.

    "అది ఇల్లు అనుకుంటున్నారా, వల్లకాడు అనుకుంటున్నారా! ఇంట్లో దాని తలకాయని పాతేస్తారా? ఇంకా నయం దాని తలకాయకో మందిరం కట్టించి నట్టింట్లో వేలాడదీసి నిత్యం పూజిస్తాననలేదు. దాని ముఖం అలా చూశానో లేదో ఇలా పడిపోయాను. మళ్ళీ ఆ పెట్టె ముఖం చూడలేదు నేను దాని తలకాయని ఇంట్లో పాతేస్తే అర్ధరాత్రిళ్ళు తలకాయ పైకిలేచి మన తలచుట్టూ తిరుగుతుంది. దాంతో నేను పిచ్చాసుపత్రీ పాలుకావడం ఖాయం" అంది వెంకుమాంబ.

    "చాల్లే" అన్నాడు కోదండరామయ్య.

    "చాల్లే కాదు, వెంటనే ఆ శవపేటికను వదిలించండి. ఆశపడి తెచ్చారుగా, తెచ్చినప్పుడున్న వుషారు వదిలించుకోవటానికి కూడా వుండాలి."

    కోదండరామయ్యకి చిర్రెత్తుకొచ్చింది.

    "బుద్ధిలేని మాటలు మాట్లాడకు. ఆశ అనేది ఇద్దరంపడ్డాము. 'ఒక బంగారు బిసికెట్టుతో వంకీల వడ్డాణం, కాసులపేరు చేయించండి' అని అడిగావే! అది మరచిపోయావా? ఆ పెట్టె ఎవరిదని పోలీసువాడు అడిగితే ఏం చెప్పాలో వెంటనే నాకు తెలిసి చావకపోతే టకీమని చెప్పేశావే- మా ఆయనగారికి నేనే వండి తగలెయ్యాలి, పెట్టెలో పప్పు, ఉప్పు, బొగ్గులు, బూడిద, నాశార్ధం నీశార్ధం అని చెప్పావుగా!"
   

 Previous Page Next Page