Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 18

                                 

 

                                          తల్లి చాటు పిల్ల కధ
      

                          
    
    పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు. అప్పుడు ఆ బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది.
    "నిర్మాతా! నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు భలే జాలిగా వుంది. నీలాగానే ఎంతో శ్రమ పడి ఓ హీరోయిన్ ని పెళ్ళాడిన ఓ కుర్ర నిర్మాత జాలీ కధ చెప్తాను విను!
    అనగనగా ఓ హీరోయిన్. ఆ పిల్లలు చిన్నప్పటినుంచీ వాళ్ళమ్మ కొంగు పట్టుకుని తిరగడం అలవాటు. ఆ అలవాటు పెద్దయినా అలాగే ఉండిపోయింది. ఆ పిల్లకు అభం శుభం తెలీదని వాళ్ళమ్మ సినిమా ప్రెస్ స్టేట్ మెంటిచ్చింది. కాబోలనుకుని ఆ పిల్ల కూడా తెలీనట్లే ఉండిపోయింది. షూటింగుకి వెళ్తున్నా , సెట్లో ఉన్నా , సెట్ బయటున్నా ఆ పిల్ల చేతిలో వాళ్ళమ్మ కొంగు ఉండాల్సిందే! ఒకవేళ వాళ్ళమ్మ ఆమె నొదిలి ఇంకెక్కడయినా వెళ్ళాల్సి వస్తే తన చీర కొంగు అక్కడే ఆ పిల్ల చేతిలో వదిలి తను మరో స్పేర్ కొంగు కట్టుకుని వెళ్ళేది.
    ఆ హీరోయిన్ నటించిన మొదటి చిత్రం వంద రోజులాడేసరికి జర్నలిస్టు లందరూ ఆమె చుట్టూ ఇంటర్ వ్యూ కోసం మూగిపోయారు.
    "మొదటిసారి కెమెరా ముందు నిలబడినప్పుడు మీకు భయం వేసిందా?" అదిగాడు ఒకతను.
    "భయమెందుకు? మా అమ్మ కొంగు నా చేతిలోనే ఉందిగా!" అంది హీరోయిన్ ధైర్యంగా.
    "మీకెలాంటి పాత్రలంటే ఇష్టం?"
    "మా అమ్మకేవి ఇష్టమౌతే అవే"
    "సంవత్సరాని కెన్ని సినిమాల్లో నటిస్తారు?"
    "మా అమ్మ తీరికను బట్టి!"
    "మీకేం కూరంటే ఇష్టం?"
    "మా అమ్మనడగాలి !"
    "తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు?"
    "ఏం చేస్తుంటేనే అమ్మా?' అంటూ పక్కనే ఉన్న వాళ్ళమ్మ నడిగిందామే.
    "తీరిక ఉండదని చెప్పవే"
    "మీ అభిమాన హీరో ఎవరు?"
    "మా అమ్మకేవరయితే నాకూ వారే!"
    "మీ అమ్మగారు కూడా ఆ రోజుల్లో ఓ సినిమాలో నటించారని విన్నాము !"
    'అవును! నేనూ చూశానా సినిమా!"
    "ఆమెకు ఎలాంటి పాత్రలంటే ఇష్టం?"
    "అది వాళ్ళమ్మని అంటే మా అమ్మమ్మని అడగాలి!"
    జర్నలిస్టులందరూ ఘోల్లున నవ్వారు.
    అది చూసి హీరోయిన్ తల్లి వాళ్ళ మీద విరుచుకు పడింది.
    "అభం శుభం తెలీని పెల్లనలా వేధించుకు తింటారేమిటి - చాల్లే వెళ్ళండిక!" అంటూ అరిచింది . జర్నలిస్టులు వెళ్ళిపోయారు.
    "ఈసారి ఇంకెవరయినా ఇంటర్ వ్యూ అడిగితె నాతో మాట్లాడమని చెప్పమ్మా! నువ్వేమీ మాట్లాడకు" అందామె హీరోయిన్ తో!
    ఆ హీరోయిన్ పాతిక సినిమాల్లో బుక్కయిపోయింది గాని వాటిల్లో వరుసగా నాలుగు ప్లాప్ అయ్యేసరికి అడ్వాన్సులు వదులుకొని పారిపోయారు మిగతా నిర్మాతలు. ఈ పరిస్థితి చూసి హీరోయిన్ తల్లికి భయం వేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రం గుర్తుకొచ్చింది. ఎట్రాక్షన్ ఉన్నప్పుడే హీరోయిన్ కి పెళ్ళి చేసేయాలని నిర్ణయించుకుందామే. వెంటనే కూతురితో సహా పార్టీలకు, పబ్బాలకూ ఝూమ్మని హాజరవసాగింది. ట్యూటర్ ని పెట్టి ఇంగ్లీష్ మాటలు కొన్ని నేర్చుకుని "హలో ప్ల్లీజ్ డ్ టు సీయూ - మీట్ మై డాటర్ " అంటూ అందరికీ హీరోయిన్ ని పరిచయం చేయసాగింది.
    కొంతకాలం గడిచాక ఓ కుర్ర నిర్మాత ఆ హీరోయిన్ ని చూసి ముచ్చట పడ్డాడు. పార్టీ హాల్లో పక్కకు తీసుకెళ్ళి "అయ్ లవ్ యూ" అన్నాడు అలవాటు ప్రకారం.
    "అమ్మో! ముందు మా అమ్మతో చెప్పాలి!" అంది హీరోయిన్ బెరుగ్గా.
    "అదేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    ఓ వారం తర్వాత ఆమెను అతి ఖరీదయిన హోటల్లో డిన్నర్ కి పిలిచాడతను. డిన్నరుకి తల్లితో పాటు వచ్చింది హీరోయిన్.
    "అబ్బా" అన్నాడు కుర్ర నిర్మాత హీరోయిన్ తల్లిని చూసి చిరాకుతో.

 Previous Page Next Page