తయారవడానికి వార్డ్ రోబ్ తీయగానే హంగర్ల కి వ్రేలాడుతున్న రకరకాల చీరలని చూస్తూ ఓ క్షణం నిలబడిపోయింది సావిత్రి. ఓ నైలక్స్ చీర మీదికి వెళ్ళిన చెయ్యిని అప్రయత్నంగా వెనక్కు లాగేసుకుంది సావిత్రి.
చిన్న జరీ వున్న పట్టుచీరతో, చేతులున్న బ్లౌజ్ తో తయారయిన సావిత్రిని ఆశ్చర్యంగా చూశాడు కృష్ణమూర్తి. మెచ్చుకోలుగా సంతోషంగా చూస్తూ "ఇవాళ చాలా బాగున్నావు. నీకీ డ్రస్సింగ్ బాగా నప్పింది, ఆ సిల్కుల కంటే ....' అన్నాడు తృప్తిగా.
'అమ్మా, రోజూ యిలా కట్టుకో అమ్మా' అన్నాడు ఏం తెలియని కొడుకు కూడా.
'అమ్మయ్య , ఎన్నాళ్ళకి చూశాను నిన్ను యిలా' అంది పెద్ద కూతురు....
"అమ్మలా వున్నావు నిజంగా యివాళ" అంది చిన్నకూతురు నవ్వుతూ. సావిత్రికి తిక్క పుట్టింది వాళ్ళ మాటలతో. "ఏం ఇన్నాళ్ళు యెలా వున్నాను.....సానిదానిలా కనిపించానేమిటి ఆ చీరలు కట్టుకుంటే" అంది తీక్షణంగా.
'ఛా....అది కాదు ....ఇలా వుంటే ఎంతో డిగ్నిపైడ్ గా వున్నావు...."
"మరెందుకు చెప్పలేదు ఇన్నాళ్ళూ?"
"నీవు సరదా పడుతుంటే నేను నిరుత్సాహపరచడం ఎందుకని వూరుకున్నాను....అసలు చెప్పినా నా అభిప్రాయం పాటిస్తావని నమ్మకం లేక...." చిన్నగా నవ్వాడు కృష్ణమూర్తి.
ఆరోజల్లా అన్యమనస్కంగానే వుంది సావిత్రి. సావిత్రి బాధ సాయంత్రం కూతుళ్ళిద్దరూ డాబా మీద కూర్చుని అనుకుంటున్న మాటలు వినగానే మరింత పెరిగింది.
ఆరేసిన బట్టలు తెద్దామని డాబా మీదకి వెడుతూ పై మెట్టు దగ్గిర ఆగిపోయింది మాటలు విని....
"అమ్మ రోజూ ఇవాళ లా తయారయితే బాగుండును. అమ్మకసలు ఆ నైలాన్లు, స్లీవ్ లెస్ లు అవి నప్పవు. నిన్న మా కాలేజీలో పిల్లలందరూ అమ్మ వంక ఎలా చూశారో తెలుసా, వాళ్ళు అదోలా నవ్వుకున్నారు. నా కెంత సిగ్గేసిందనుకున్నావు ....మా ఫ్రెండ్స్ అనేశారు కూడాను....."మీ అమ్మగారే అంతటి టిప్ టాప్ గా తయారయితే నీవేమిటోయ్ ఇలా ఉంటావు" అన్నారు. చచ్చిపోయాను సిగ్గుతో. స్టూడెంట్స్ కామెంట్స్ విని తలెత్తుకోలేక పోయాను.
"అమ్మ తను ఫేషన్ బుల్ గా తయారవుతుంది గానీ, మనం కొంచెం ఏదన్నా షోకు చేసుకుంటే తిడుతుంది....పిచ్చి వేషాలేమిటి అని కేకలేస్తుంది.....' రెండో కూతురు అంటుంది.
"ఆ....గొప్పగా ....చిన్నపిల్లలా తయారయి ఎంగ్ గా కనిపిస్తున్నా ననుకుంటుంది కానీ చూసేవాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలియదు...."
సావిత్రి నిర్ఘాంత పోయి నిల్చుండి పోయింది. మొహం ఎర్రబడి పోయింది. తన పిల్లలు.....తన కడుపున పుట్టిన పిల్లలు .....వాళ్ళ దృష్టిలో తన విలువ ఇదా!"
గిర్రున తిరిగి క్రిందికి వచ్చేసింది. ఆవేశం అణిగిన మరో గంటకి నెమ్మదిగా లేచి బీరువా తెరిచింది.....రకరకాల చీరలు.....ముచ్చటపడి మోజుపడి కొనుక్కున చీరలని చూస్తుంటే తన వయసుని దాచి తనని పాపులర్ చేస్తాయనుకున్న చీరలు తనని ఎంత దగా చేసాయి.....తనని ఎంత కించపరిచాయి....?
అలా చూస్తూ ఏదో అలోచించి కూతుళ్ళు ఇద్దరిని పిలిచి ఈ చీరల్లో మీ కిద్దరికి ఏం కావాలో అవి తీసుకోండి! అంది. వాళ్ళిద్దరూ మొహాలు చూసుకున్నారు గిల్టీగా.
"ఏం ఎందుకు యిచ్చేస్తున్నావు, "అంది పద్మ.
"ఏం లేదు, నాకక్కరలేదు. మీకు కావలిస్తే తీసుకోండి" అంది పొడిగా సావిత్రి.
అంతేకాదు ఆరాత్రి భర్తతో "మీ అమ్మాయికి పెళ్ళి చేయ్యరేమిటి? సంబంధాలు చూడడం ఆరంభించండి' అంటున్న భార్యని తెల్లపోయి తదేకంగా చూశాడు. భార్య మొహంలోకి చూసిన కృష్ణమూర్తికి ఏదో అర్ధమయింది.....ఆమె మొహం చూస్తె ఆ క్షణాన ఎంతో జాలనిపించింది. బుజం మీద చేయి వేసి ప్రేమగా, ఓదార్పుగా 'పిచ్చిదానా..... నాకర్ధం అయింది నీ బాధ.....ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను.... ఇందుకా యింత తాపత్రయపడ్డావు....పోనీ ఇప్పటికయినా నిజం గుర్తించావు....చూడు సావిత్రీ.....ఓ చెట్టుకి ఓ వూవు పూయడం, యెంత సహజమో, అది వాడి కొన్నాళ్ళకి రాలిపోవడమూ అంత సహజం. ఆ వూవుని నీ వేంత తాపత్రయపడి, ఎంత జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని కాపాడినా దానిని వాడి రాలిపోనీయకుండా ఆపగలవా? మహా అయితే రెండు రోజులలో వాడేదానిని.....నీ పోషణలో మరో రెండు రోజులు తాజాగా ఉంచగలవు గానీ అసలు వాడకుండా వుంచడం నీ తరమా?....నీ వెంత చేసినా అప్పుడే విచ్చినా పువ్వులా యీ వాడబోయే పూవుని తాజాగా కన్పించేటట్టు చేయగలవా? వాడే పూవుని తాజాపూవు అని కళ్ళు వున్న ఎవ్వరూ నమ్మరు. నీవు దానికి ఎన్ని అలంకారాలు చేసినా! ఈమాత్రం చిన్న విషయం నీకెందుకు తట్టలేదు.........
సావిత్రి చప్పున కృష్ణమూర్తి నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి యింక చెప్పకండి ....అంది అదోలా.
***