రోషమో, ఉక్రోషమో ఆమె రెప్పలార్పకుండా చూస్తుంది.
" ఎలా ఉన్నావో తెలుసా?"
అప్పటికీ ఆమె మాట్లాడలేదు.
"ఈ గది స్వాప్నాలతో నిండిపోయింది. నా మది స్వగతాలతో కుంగిపోతోంది ఇంకా రావెందుకు ప్రభూ శంకాకులమై ఈరాత్రి సడలిపోతోంది."
తిలక్ విరహోత్కఠింతని అప్పచెప్పడు.
అమాంతం అతని షర్టుకాలరు అందుకుంది. ఆడగడానికైనా, కడిగేయటానికైనా ఏకాంతం కావాలనిపించిందేమో ఆవేశంగా అతన్ని పక్కగదిలోనికి లాక్కుపోయింది.
అతన్ని సోఫాలో కి నెడుతూ అంది " చెప్పు!"
" ఇంకో కవితా?"
"షటప్! నేను...."
"క్షణమాగు...."
"దేనికి?"
" ఏమిటీ?"
" ఇందాకటి కవిత చిత్రంగా నీ పెదవులపైన కనిపిస్తూంది"
దూరం నెట్టింది- " నన్నిలా బుజ్జగించకు ముందు నేనే...."
ఈ సారి ఆమెను బలంగా దగరకులాక్కున్నాడు " గది చీకటిగా ఉంది. ఒక కిటికీతెరుద్దామా అంటే ఒప్పుకోని ప్రియురాలు. గదిమీద కప్పు కూలగొడతానూ అంటే, కిటికీతో పనిలేదు ద్వారమే తెరుస్తానూ అంటుందట."
"మిస్టర్ విశ్వామిత్రా!" అతని అల్లరినీ చిలిపితన్నాన్ని ఎంజాయ్ చేసే స్థితిలో లేదామె. " ఎన్ని కప్పులు కూలగొట్టావో, నీ మార్పు నాకు భయంగా ఉంది. ఎందుకు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు!"
" నేను ఎప్పటిలాగే--"
" నో!" గగుర్పాటుగా అంది. " నువ్వు ఎప్పటిలాగే ప్రవర్తించడం లేదు నటిస్తున్నావు కదూ?"
నొసలు చిట్లించి చూశాడు- "ఎందుకలా అనిపించింది?"
"ఈ రోజు రాజీ నాదగ్గరికి వచ్చింది."
హఠాత్తుగా అతనిమొహంలో రంగులుమారాయి.
"రణధీర్ కి తనుభార్యనంది"
క్షణం నిశ్శబ్దం తరువాత అన్నాడు--" అవును నిజమే"
" ఆ నిజాన్ని ముందే నువ్వెందుకు చెప్పలేదు"
"చెబితే ఏం చేసేదానివి విడిచిపెట్టేదానివా?"
వెంటనే జవాబు చెప్పలేకపోయింది "అది తరువాత విషయం .అసలు ఆ ప్రసక్తినే నువ్వెందుకు తీసుకురాలేదు?"
" అది నా సంస్కారం"
" కాని.... రాజీ నీకు చెల్లెలు!"
" కాదు.... నేను ఇప్పటికీ రాజీపడని గతానికి ఒక గుర్తుని"
" ఏమిటో గతం?"
"అవసరం వచ్చినప్పుడు చెబుతాను"
" ఎందుకు మిత్రా!" ఆమె మనసు ఉడికెత్తుకు పోతూంది. " ఎందుకు నన్ను పరాయి దానిలా భావిస్తున్నావు?"
తేలిగ్గా నవ్వేశాడు. "చూడు మున్నీ... నువ్వు పరాయిదానివే అయితే, కనీసం అలా అనుకుని ఉంటే నేనిలా ప్రవర్తించేవాడినా? ల అసలు ఎంత ఆడపిల్లపయితేనేం ,ఓ పోలీసాఫీసరునివాటేసుకుని ముద్దుపెట్టాలీ అంటే ఎన్ని గట్స్ ఉండాలి? సో మైడియర్ మున్నీ నేను అప్పటి నీ మిత్రనే..."
"అదే నిజమైతే నిన్నరాత్రి వస్తానన్న వాడిని ఎందుకు రాలేదు?"
"గ్రహించుకోవడం కష్టమని"
" శనిగ్రహం లా రెచ్చగొట్టే ఉద్రేకానికి"
ఆమె చెంపలు ఎరుపెక్కాయి.
"పైగా ఈ మధ్యే తెలుసుకున్నాను"
" ఏమిటి?"
" కామాతురాణం నభయం న లజ్జా అని..... అనగా కామాతురునికి అర్థరాత్రివేళ అందమైన అమ్మాయి కనిపిస్తే భయమూ, సిగ్గూ లాంటివి ఉండవని...."
" ఆహో... ఆవిషయం ఫోన్ చేసి చెప్పొచ్చుగా?"
" అవసరం లేకపోయింది"
" అదేం?"
"మరో కార్యమున నిమగ్నడనై కామాన్ని నిరోధించితిని. నీ విషయమే మరిచితిని కాబట్టి..."
పకాలున నవ్వింది- "అదేం భాష?"
" ఓ పీఠాధీపతి వాడిది"
"మధ్యలో పాపం ఆయనెవరు?"
"చెబుతా... ఆయన నన్ను ఎంత ఇన్ స్పైర్ చేశాడు అదీ చెబుతా ముఖకవళికల్ని చాలా సిరీయస్ గా మార్చేశాడు. "ఒక సన్యాసిని.... అంటే ఆడసన్యాసి అని అర్థం సో.... సన్యాసిని ఆయన్ని కలిసి మీరు కామమునెట్లు జయించితిరీ అందట. దానికాయన పవ్రసన్నంగా నవ్వేసి ' కామము నా మనోద్వారము కడకువచ్చి తలుపుతట్టినప్పుడుఏదో కార్యమున నిమగ్నుడైన యుండుటచే దావికి విసుగుపుట్టి తిరిగిపోవును సుమా'అంటూ చెప్పాడట. ఏదేమటి నవ్వుకుండా మొహాన్నలా సీరియస్ గా పెట్టావు?"
నిజమే .... మేనక సీరియస్ గా మారిపోయింది. ఆక్షణంలో రాజీ గుర్తుకురావడం యాదృచ్చికంకాదు.అన్నలాగే రాజీకూడా ఒకప్పుడు ఇలా నవ్వుతూ తుళ్ళుతూ గడిపేసేది.
"మేనకా!"
" కాదనను మిత్రా.పెళ్ళన్నది ఆడదానికి అవసరమే" నిర్వేదంగా అంది.
"అవునవును. ఇప్పుడు మనం అర్జంటుగా ఆ విషయం మాట్లాడుకోవాలి"