Previous Page Next Page 
లవ్ స్టోరీస్ పేజి 18


    స్టేజిమీద నటీనటులంతా కనిపించి, మాట్లాడి వెళ్ళిపోయారు.

    జనమంతా ఒక్కుమ్మడిగా బయటకు వెళ్లసాగారు. ఆ గుంపులో ప్రతిమ, ఇందిర తలో పక్కకూ నెట్టుకుపోయారు. తనని ఇంచుమించుగా వెనుక నించి ఎవరో కౌగిలించుకొంటున్నట్లు ఆనుకొని నించునేసరికి కంగారుగా వెనక్కు తిరిగి చూసింది ఇందిర. అనంతం ఆమె చేతిని పట్టుకొన్నాడు అప్పుడే. "కాసేపు అలాగే నుంచోండి! రష్ తగ్గాక వెళదాం" అన్నాడు నెమ్మదిగా. ఇందిర శరీరమంతా ఝల్లుమంది. అతని స్పర్శ తన శరీరమంతా రక్తంతోపాటు ప్రవహిస్తున్నట్లుంది. అతను తన కభిముఖంగా వచ్చి తన శరీరం నలిగిపోయేలా కౌగిలించుకొంటే బాగుండుననిపిస్తోంది కొద్దిక్షణాల్లో రష్ తగ్గిపోయింది. ప్రతిమ ఇంచుమించుగా గేటు బయటి వరకూ వెళ్ళిపోయి నించుంది వాళ్ళకోసం ఎదురుచూస్తూ. ముగ్గురూ రోడ్డు మీదకొచ్చారు.

    "అబ్బ! పాడు రష్! చిన్నపిల్లలుంటే ఎటో తప్పిపోయేవాళ్ళు." ఆమె తామిద్దరినీ అలా దగ్గరగా నించుని ఉండటం గమనించిందేమో అన్న అనుమానంతో అంది ఇందిర.

    "పెద్దాళ్ళయి ఉండి కూడా మనమే తలో మూలకు కొట్టుకుపోతే. ఇంక చిన్నపిల్లల సంగతి చెప్పేదేముందీ?" అంది ప్రతిమ. ఆ మాటల్లో ద్వంద్వార్థం కనిపించి దెబ్బతిన్నట్లు చూసింది ఇందిర. మళ్ళీ రిక్షాల్లోనే ఇల్లు చేరుకొన్నారందరూ.

    ఆ రాత్రి తీయని కోరికలు ఆమెను సతమతం చేసినాయి. అనుక్షణం అనంతమే కళ్లముందు కనబడుతున్నాడు. మర్నాడు సాయంత్రం వాళ్ళింటి కెళ్ళినప్పుడు ఆమె దగ్గరగావచ్చి అన్నాడతను.

    "నా వివాహానికి కొద్దిరోజుల క్రితం నువ్వు తారసపడినా, నా జీవితమే ఎంతో ఆనందదాయకంగా ఉండేది, ఇందిరా!"

    ఇందిరకు అతన్ని చూస్తే జాలివేసింది. అతని తల తన గుండెలకు హత్తుకొని ఓదార్చాలన్న కోరిక ఊగించివేసింది. కాని, ప్రతిమ ఏ క్షణంలోనయినా హాల్లోకి రావచ్చునన్న భయం ఆ కోరికకు కళ్ళెం వేసింది.

    "ఇప్పుడలా అనికొని ఉపయోగం ఉందా?" అంది నెమ్మదిగా.

    "ఎందుకు ఉండదు, ఇందిరా? జీవితం చాలా పెద్దది! చేసిన పొరపాట్లు దిద్దుకోడానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది!" అంటూ ఆమె చేయి పట్టుకొని, మరో చెయ్యి ఆమె నడుం చుట్టూ వేసి తనమీదకు లాక్కొన్నాడు. ఇందిరలో విద్యుత్ ప్రవహిస్తోంది. గుండెలు వేగంగా కొట్టుకొంటున్నాయి. మరింత కోరికతో అతన్ని హత్తుకుపోయింది. ఆమె ముఖానికి చేరువగా వచ్చిందతని ముఖం.

    "ప్రతిమ వస్తుందేమో?" అస్పష్టంగా గొణిగిందామె.

    "మరేం ఫరవాలేదు..."

    ఆమె పెదాలు తాకబోతూండగానే అడుగుల చప్పుడు వినిపించింది. ఛటుక్కున అతని కౌగిలినుండి దూరంగా జరిగింది ఇందిర. అప్పుడే ప్రతిమ ఆ గదిలోకి అడుగుపెట్టి, అక్కడ వారిద్దరినీ చూసి నిర్ఘాంతపోయింది. అంతకు కొద్ది క్షణాల క్రితం వారెలాంటి భంగిమలో ఉన్నారో కూడా తేలికగానే ఊహించుకొంది. అక్కడినుంచి విసురుగా వెనక్కు నడిచింది మళ్ళీ.

    ఇందిరా గాభరాపడిపోయింది . "ప్రతిమకు అనుమానం వచ్చే ఉంటుంది" అంది భయంగా.

    "వస్తే మరీ మంచిది. ఇంక మనం చాటుగా వ్యవహరించవలసిన అవసరముండదు" అన్నాడతను నవ్వుతూ.

    వారం రోజులు గడిచిపోయాయ్. ఆ వారం రోజులూ ప్రతిమ అనంతాన్ని అంటిపెట్టుకొనే తిరగడం మూలాన, అతనితో ఒంటరిగా గడిపే అవకాశం దొరకలేదు ఇందిరకు. అయితే, ఈ వారం రోజులూ ఆమె మనసుని పూర్తిగా ఆక్రమించేశాడు అనంతం. అతన్ని రోజుకోసారయిన చూడందే తను బ్రతకగలదా? అన్న అనుమానం కూడా వచ్చింది.

    ప్రతిమ పిన్ని కూతురు వివాహం నిశ్చయమైనట్లు ఉత్తరం వచ్చింది ప్రతిమకు. వెంటనే వచ్చేస్తే తనకు తోడుగా ఉంటుందని కూడా రాసిందామె. కాని, ప్రతిమకు ఇల్లు వదిలివెళ్ళడం ఇష్టం లేకపోయింది. అనంతం ఒంటరిగా ఉన్నప్పుడు ఇందిర ఇంటికొస్తే- తరువాత ఏమయినా జరగవచ్చు! కానీ, ఆమె అనుకొన్నట్లు జరగలేదు. పెళ్ళి నాలుగు రోజులుందనగా ప్రతిమ బాబాయి స్వయంగా వచ్చేశాడు. వెంటనే వాళ్ళని తనతో బయలుదేరమంటూ బలవంతం చేయసాగాడు. "నాకు రెండు రోజులకంటె ఎక్కువ సెలవు దొరకదు. కనుక ముందు ప్రతిమను తీసుకెళ్ళిపోండి. నేను పెళ్ళి టైమ్ కి అక్కడకు చేరుకొంటాను!" అంటూ సర్దిచెప్పి ప్రతిమను రైలెక్కించేశాడు అనంతం. రైలు ప్లాట్ ఫారం వదిలేసరికి ఎంతో ఆనందంగా ఫీలయ్యాడు. అబ్బ! పీడ ఇప్పటికి విరగడయింది అనుకొన్నాడు సంతోషంగా! వెంటనే ఆఫీసుకి ఓ సెలవు చీటి పడేసి ఇల్లు చేరుకొన్నాడు. ఇందిర బయటే నించుని ఉందప్పుడు. ప్రతిమ ఊరువెళ్ళడం ఆమెకు తెలుసు. ఇందిరకు రమ్మని సైగచేసి లోపలికెళ్ళాడు అనంతం! ఇందిరకు భయమేసింది. ప్రతిమ లేనప్పుడు ఆ ఇంటికెళ్తే తన తల్లికి అనుమానం కలుగుతుందేమోనని వెళ్ళడం మానేసింది . అనంతం  కాలుకాలిన పిల్లిలా తలాకిట్లోకీ, పెరట్లోకి తిరుగుతున్నాడు. చివరకు పెరట్లో వంటరిగా కనిపించింది ఇందిర.

    "రాత్రికి డాబామీది కొస్తాను!" అంది నెమ్మదిగా.

    ఆనందపడిపోయాడతను. పెందలాడే హోటల్లో భోజనంచేసి, ఇంటికొచ్చి డాబామీద పక్క పరచుకొని పడుకొన్నాడు. అర్థరాత్రి దాటాక అడుగులో అడుగు వేసుకొంటూ వచ్చింది ఇందిర. ఆకలిగొన్న పులిలాగా అమాంతం ఆమెని ఆక్రమించుకొని పక్కమీదకు వరిగాడు అనంతం. ఇందిర కలలన్నీ పండినయ్ ఆ రాత్రి.  

    "మనం ఎన్నాళ్ళిలాగ గడపటం?" అడిగింది ఇందిర.

    "జరిగినన్నాళ్ళు...."

    "తరువాత?"

    "నీ కెలాగూ పెళ్ళయిపోతుందిగా!"

    "ఇంకా నయం! నాకింకేమీ అక్కరలేదు! జీవితాంతం మీ దగ్గరే ఉంటాను!"

    "నీ ఇష్టం! నాకు అది మరీ అనందం!" అన్నాడు, ఆమెని గుండెల్లో పొదువుకొంటూ. వారి రహస్య ప్రణయం ఎన్నోరోజులు దాగలేదు. పెళ్ళినాడు మధ్యాహ్నమే తిరుగు ప్రయాణమయి సాయంత్రం ఆరింటికల్లా ఇల్లు చేరుకొంది ప్రతిమ. తలుపు కొట్టేసరికి అనందం తలుపుతీశాడు . ఇందిర ఒంటికి బట్టలు చుట్టుకొంటూంది లోపల. నిశ్చేష్ఠురాలయిపోయింది ప్రతిమ. ఏమనడానికి తోచక వెంటనే ఆ ఇంట్లో ఉన్న తన చీరెలూ, నగలూ తీసుకొని పుట్టింటికి బయలుదేరింది. ఆ రాత్రే జరిగిన సంఘటనలన్నీ తన తల్లి ముందుంచింది ఇందిర. కాస్సేపు ఏడ్చి, "నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో! ఇంతదూరం వచ్చాక నేనేం చేయగలను?" అందామె. అనంతం, ప్రతిమ విడాకులు తీసుకున్నారు. తరువాత కొద్ది రోజులకే ఇందిర అనంతం ఒకటయారు. 

    నెలరోజులపాటు సెలవుపెట్టాడు అనంతం. ఇద్దరూ బోలెడు డబ్బు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద పట్టణాలన్నీ తిరిగి, అన్ని సుఖాలూ అనుభవించి తిరిగి వచ్చారు.

    "నా జీవితంలో ఇంకేలోటూ లేదు, ఇందిరా! ఇంతటి అందమైన భార్య, ఇంతటి అనుకూలవతి - ఎంతమందికి లభిస్తుంది అదృష్టం? ఈ పెద్దాళ్ళు చేసే పెళ్ళిళ్ళు అందుకే ఫెయిలవుతూంటాయి."

    ఇందిర మురిసిపోయింది. ఆరు నెలలు ఇట్టే గడిచిపొయినాయి. రోజూ అనంతం ఆఫీసునుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా తను డ్రెస్ చేసుకొని, అందంగా అలంకరించుకొని ఎదురుచూస్తూ నించునేది. ఇద్దరూ సినిమాకో లేక ఎక్కడికయినా సరదాగా తిరగటానికో వెళ్ళేవాళ్ళు. హఠాత్తుగా అనంతానికి ట్రాన్స్ ఫర్ అయింది. వెంటనే వెళ్ళిపోయి ఓ ఇల్లు దొరికాక ఇందిరను కూడా తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిన పదిరోజులకే పక్కింట్లోనివాళ్ళతో పరిచయమయింది ఇందిరకు. పక్కింటామె చెల్లెలు టీచర్ ఉద్యోగం చేస్తూంది. ఆమె పేరు సుశీల. సమవయస్కురాలు కావడంతో ఆమె బాగా సన్నిహితురాలయిపోయింది. ఎప్పుడు ఖాళీ దొరికినా తనతో మాట్లాడుతూ కూర్చునేది.

    ఓ రోజు జ్వరం వచ్చింది ఇందిరకు. అనంతం ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టేశాడు. సాయంత్రానికి కొంచెం తగ్గుముఖం చూపింది జ్వరం. అనంతం కాఫీ తయారుచేస్తున్నాడు వంటింట్లో. నెమ్మదిగా లేచి అతనికి సహాయం చేయడానికి వంటింటివేపు నడిచింది ఇందిర. అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంతపోయి గడపలోనే నిలబడిపోయిందామె. అనంతం కిటికీ బయటనించున్న సుశీల చేయి పట్టుకొని ముద్దుపెట్టుకుంటున్నాడు. సుశీల పరవశంతో చూస్తోందతని వంక.

    కళ్ళు తిరిగినట్లుయింది ఇందిరకు. వంట్లో సత్తువ పూర్తిగా పోయింది. వెనక్కు తిరిగి నడిచి పక్కమీద పడుకుండిపోయింది. ఆమెకు ప్రతిమ గుర్తుకొచ్చింది. ప్రతిమకు అన్యాయం చేసిన ఇందిర గుర్తుకొచ్చింది. ఇందిరకు అన్యాయం చేయబోతున్న సుశీల కళ్ళముందు కదిలింది. ఆమె కళ్ళవెంబడి నీళ్ళు కారిపోతున్నాయి.

                                      * * * * *

 Previous Page Next Page