మరి?
అనుదీప్ చెప్పింది నిజమేనా?
ఏడు సంవత్సరాలపాటు వింధ్య పర్వతాల్లో వున్నాడా?
ఎందుకో ఈ విషయం ఒప్పుకోవటానికి మనసు అంగీకరించలేదు.
అంతలో మెరుపులా ఒక ఆలోచన స్పురించింది.
మధ్యప్రదేశ్ అడవుల్లో తాంత్రిక విద్యలు తెలిసిన కోయవాళ్ళు వున్నారని వినికిడి. అటువంటి వారితో ఇతగాడికిగానీ పరిచయం ఏర్పడి ఆ విధంగా ఇతడికి కూడా ఈ కళలు అలవడినాయా?
ఆ ఆలోచన రాగానే అతడికి అది కరెక్టయి వుండవచ్చుననిపించింది.
"మీ అబ్బాయి తిరిగివచ్చి ఎన్ని రోజులు అయి వుంటుంది?"
"వారం పదిరోజులు."
"ఇంట్లో వున్నప్పుడు సరిగ్గా వుంటాడా?"
ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. వాళ్ళు తటపటాయించటంతో అతడికి అనుమానం బలపడింది. ఇంతలో తండ్రి అన్నాడు - "ఇంట్లో వున్నంతసేపూ తలుపులు వేసుకుని, పెట్లోంచి ఏదో తీసి కూర్చుంటాడు బాబూ. భోజనం చేస్తున్నంతసేపూ ఆలోచిస్తూనే వుంటాడు."
సో....
తన అనుమానం నిజమేనన్నమాట. ఇన్ స్పెక్టర్ కి ఉత్సాహం వచ్చింది.
"ఆ పెట్టెలో ఏముంది?"
"తెలీదు"
"నాకు కాస్త చూపిస్తారా?"
వాళ్ళు అతనిని లోపలికి తీసుకెళ్ళి చూపించారు. చిన్న పెట్టె... పాతది.
"మీ అబ్బాయి వస్తూ దీన్ని తీసుకొచ్చాడా?"
తలూపారు.
ఇన్ స్పెక్టర్ మోకాళ్ళమీద కూర్చుని పరిశీలించి, "దీని తాళం చెవి ఎక్కడుంది?" అని అడిగాడు.
"అబ్బాయి దగ్గిర"
వాళ్ళని అడిగి కల్వంరాయి తీసుకుని దాన్ని బద్ధలుకొట్టటం ప్రారంభించాడు. "వద్దు బాబూ. వాడికి తెలియకుండా..." అనుదీప్ తండ్రి మాటలు పూర్తికాకుండానే తాళం వూడివచ్చింది.
మూత తెరిచాడు.
రెండు మూడు జతల బట్టలున్నాయి. తీసి పక్కన పెట్టాడు... పోలీస్ డిపార్ట్ మెంట్ లో అన్నేళ్ళు పనిచేసినా ఆ క్షణం అతడి మానసికోద్వేగం వర్ణనాతీతం. ఏముంది ఆ పెట్టెలో?
దేన్ని అనుదీప్ ప్రతిరోజూ ముందు ప్రతిష్టాపించుకుని క్షుద్ర సమాధిలో పూజలు చేస్తున్నాడు?
బట్టల అడుగున న్యూస్ పేపర్ వుంది. దాని అడుగున ఏదో తగిలింది. న్యూస్ పేపర్ తీస్తూ ఇన్ స్పెక్టర్ అనుకున్నాడు - 'రుద్రాక్షా? తాళపత్ర మంత్రమా? రాగిరేకా? పుర్రె ఎముకా? -ఏముంటుంది' అని.
ఊపిరి బిగపట్టి - పేపర్ పూర్తిగా తీసేసేడు.
ముగ్గురూ ఒక్కసారిగా ఒకర్నొకరు చూసుకున్నారు.
క్రింద వున్నది ఒక ఫోటో.
విద్యాధరిది.
* * *
ఆమె చెప్పటం పూర్తి చేసింది.
అంతా విని అనుదీప్ తలపైకెత్తి నవ్వేడు. "అయితే - పోలీసులకు సాయం చేసే నిజమైన దేశభక్తురాలిలా తయారయ్యావన్నమాట" అన్నాడు. ఆ మాటల్లో శ్లేషకు ఆమె మొహం ఎర్రబడింది.
"ప్రతి మనిషి కనీస కర్తవ్యం అది" అంది.
"ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ప్రజల్ని మొసం చేస్తున్నాయి. తప్పు కంపెనీలది ఒక్కటే కాదు, ప్రజలది కూడా వుంది. పద్దెనిమిది శాతం కన్నా ఎక్కువ వడ్డీ ఆశించటం రిస్కు తీసుకోవటమే. అటువంటిది 36 శాతం అనగానే తేరగా వస్తోంది కదా అని. క్యూలో నిలబడి డిపాజిట్టు చేశారు, ఆశకు పోయిన వాళ్లకు ఆ మాత్రం శాస్తి జరగాల్సిందే-"
ఆమె అతడివైపు అయిష్టంగా చూసింది. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు... ఆమె తన ఆవేశాన్ని దాచుకునే ప్రయత్నం ఏమీ చెయ్యక "ప్రజలు అమాయకులు. ముసలితనం కోసం డబ్బు దాచుకున్నవాళ్ళు, కష్టాల్లో కలిసి వస్తుంది కదా అని వుంచుకున్న అమాయకులు - వీళ్ళని మోసం చేసిన వాళ్ళని ఉరితీసినా పాపం లేదు" అంది ఆవేశంగా.
"అయితే ప్రభుత్వాన్నే ఉరితీయాలి" అంటూ మళ్ళీ నవ్వేడు. "గవర్నమెంట్ రేటు పదకొండు శాతం. అంతకన్నా ఎక్కువ మూడురెట్లు ఇస్తామని ఎవరైనా అంటే - ప్రభుత్వమే తన డబ్బంతా ఆ కంపెనీల్లో ఇన్వెస్టు చెయ్యవచ్చుకదా?"
"ప్రభుత్వానికి వేరే పనిలేదా ఏమిటి? - అది ప్రైవేట్ బిజినెస్సు."
"ప్రయివేటు బిజినెస్సు అని నువ్వు అంటున్నావు కదా, మరి వ్యాపారంలో నష్టంవస్తే ప్రజలు ఎందుకు తాము మోసపోయినట్లు భావించాలి? లాభాలు వస్తాయి కదా అని ఇన్వెస్టు చేశారు. నష్టం వచ్చింది. వూరుకోవాలి."
"ఇది నష్టంకాదు, మొసం. ఆ డబ్బంతా ఇన్వెస్టుమెంటు కంపెనీ వాళ్ళు తమ స్వంతానికే వాడుకున్నారని, అసలా ఉద్దేశ్యంతోనే ఈ కంపెనీలు మొదలుపెట్టారనీ అందరికీ తెలుసు. లేకపోతే 36 శాతం వడ్డీ ఎలా ఇస్తారెవరైనా?"
"ముప్పై ఆరుశాతం వడ్డీ ఎవ్వరూ ఇవ్వలేరని తెలిసినప్పుడు ప్రభుత్వం దీన్ని ముందే బాన్ చెయ్యొచ్చు కదా - లేదా తన ఆడిటర్లను నియమించి ఏ నెల కానెల పరిస్థితులు తెసుకుకోవచ్చు కదా."
ప్రభుత్వానికి ఇంకేం పనిలేదా ఏమిటి?"
"నీకు మాత్రం ఇంకేం పనిలేదా ఏమిటి? చేతులు కాలేక ఆకులు పట్టుకుందామని ప్రభుత్వమే అనుకుంటున్నప్పుడు -నీకెందుకు ఈ ఉచ్చులో ఇరుక్కోవాలని ఉత్సాహం? నిజంగా నువ్వు కష్టాల్లో పడితే నిన్ను ఈ పనికి ప్రోత్సహించిన ధర్మారావు కూడా నీ సహాయం కోసం వస్తాడని నేను అనుకోను...."
"మనుష్యుల మీద నీకింత తక్కువ నమ్మకం వున్నందుకు నాకు చాలా విచారంగా వుంది" వ్యంగ్యంగా అంది విద్యాధరి.
"నువ్వు చేసేపనికి ఏమీ గుర్తింపు వుండదు విద్యాధరీ. మహా అయితే ఆ పోలీస్ కమీషనర్ మెచ్చుకోలు లభిస్తుందేమో. అదే నువ్వు చిక్కుల్లో పడితే ఆ కమీషనర్ ప్రాణాలకు తెగించి నీకేమయినా సాయం చేస్తాడా?"
"అందరూ నీలా కేవలం ట్రిక్కులతోనే ఆకట్టుకోవటానికి ప్రయత్నించరు. మనుష్యుల మధ్య రిలేషన్స్ కూడా కొన్ని వుంటాయి."
చప్పున అనేసి, మళ్ళీ అలా యెందుకు అన్నానా అనుకుంది. అయితే అతడు దాన్ని అంతగా పట్టించుకోలేదు. "కంసుడేగానీ ఎనిమిది మంది పసిపిల్లల్ని చంపేటంత శ్రమపడకుండా... వసుదేవుడినీ దేవకిని చెరో జైల్లోనూ పెట్టివుంటే భారత భాగవతాలుండేవి కాదుకదా! కొన్ని రసవత్తరమైన కావ్యాలు పుట్టాలంటే కొన్నిసార్లు రీజనింగ్ వదిలెయ్యాలి. తధాస్తు..." 'తధాస్తు' అన్నమాట వత్తిపలికి - ఆమె ఏదో అనబోతూ వుండగా - క్షణంలో మెరుపులా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. అతడంత అకస్మాత్తుగా వెళ్ళిపోతాడని వూహించని విద్యాధరి యధాలాపంగా రోడ్డు చివరికి చూసింది. అప్పుడే వస్తున్నాడు పోలీసు అక్కడికి.
ఆమెకి ఇరిటేటింగ్ ఫీలింగ్ కలిగింది. ఇంకొద్దిసేపు అతడిని ఆపుచేస్తే బావుండేది. ఈ పోలీసుమీద ధర్మారావు అంకుల్ కి ఫిర్యాదు చేయాలనుకుంది.
ఇంతలో దూరంనుంచి అనుదీప్ గట్టిగా పాడుకుంటూ వెళ్ళిపోవడం వినిపించింది.
"త్యాగమూర్తివమ్మా...
నువ్వూ - కొ ... వ్వొత్తివమ్మా..."
ఆమె పిడికిళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి.
కేవలం తనని ఏడిపించటానికే ఈ పాట అని ఆమెకి తెలుసు.
* * *
మే 18, 1987. చక్రధర్ ఇల్లు.
తనకంత ధైర్యం వుందని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.
చక్రధర్ ఇంటికి 'టీ' కి వచ్చింది ఒంటరిగా! ఇంత జరిగాక కూడా.
అసలు చక్రధరే తలమునకలయ్యేటంత ఆశ్చర్యంలో వున్నాడు ఆమె ప్రవర్తనవల్ల.
అంతక్రితం రోజు ఆఫీసులో ఏదో కాగితం చూపించే 'మిష' మీద అతడి గదిలోకి వెళ్ళింది.
అనుదీప్ వ్యవహారం జరిగినప్పటినుంచీ అవసరమైనదానికంటే ఎక్కువ రిజర్వుడుగా వుంటున్నాడు. కాగితం అతడికి చూపించిన తరువాత అతడు ఏకాగ్రతతో తన ఫైలు చూడటంలో నిమగ్నుడయ్యాడు.
ఆమె కదల్లేదు. చక్రధర్ తలెత్తి చూశాడు.
ఆమె తలవంచుకుని చెప్పాలా మానాలా అన్నట్టు తటపటాయిస్తూ "సారీ సర్" అంది. అతడి చేతిలోంచి ఫైలు జారిపోయింది. అతడు 'దేనికి' అని అడిగే లోపు "ఆ రోజు నేను తొందరపాటుతో ప్రవర్తించాను. అనవసరంగా మీ మనసు బాధపెట్టాను" అంది బొటనవేలుతో కార్పెట్ మీద గీస్తూ.
ఆడవాళ్ళ మనసు తెలుసుకోవటంలో చక్రధర్ ఘటికుడు. ముందు కాదని, తరువాత కాళ్ళబేరానికి వచ్చే ఆడవాళ్ళ సంగతి అతడికి అనుభవమే. అనుదీప్ కీ ఈమెకీ ఏదైనా గొడవ జరిగి వుండవచ్చునని వూహించాడు. లేక తనతో గొడవ పెట్టుకోవటం వల్ల వచ్చే కష్టాల్ని ఆమె ఈ పదిరోజుల్లోనూ రియలైజ్ అయివుండాలి.
"అలా కూర్చో" అన్నాడు. ఆమె కూర్చుంది.
అతడు ఆమెవైపు కన్నార్పకుండా చూశాడు. గుండ్రటి మొహం, యవ్వనం నిండిన కళ్ళు, గుండ్రటి బుగ్గలు... ఆమె అందమంతా క్రింద పెదవిలో వుంది.
అతడికి పర్వత శిఖరం ఎక్కినంత సంతోషంగా వుంది. ఈ మాత్రం వీలు దొరికితే చొచ్చుకుపోగలనన్న నమ్మకం అతడికెప్పుడూ వుంది.
"ఎవరతను? ఆ రోజు నీతో వచ్చింది?"
"నాకు తెలీదు సర్. అతడి దగ్గరికి మీ ఫోటోలు ఎలా వచ్చాయో కూడా తెలీదు. ఆ తరువాత ఆ అడ్వాంటేజి తీసుకుని నాకు దగ్గరవటానికి ప్రయత్నం చేశాడు. అసహ్యం వేసింది."
"నాకు నీమీద ఎప్పుడూ కోపం లేదు విద్యా. ఆ రోజు నా అహం దెబ్బతిన్నది. దాంతో నాకు కోపం వచ్చినమాట నిజమే కానీ అప్పట్నుంచీ ఎంత బాధపడుతున్నానో నీకు తెలీదు. నీకీ విషయం ఎలా చెప్పాలా అని ఆ రోజునుంచీ చూస్తున్నాను."
"నేనూ అలాగే ఫీలయ్యాను సర్. కానీ మీ ఛాంబర్లోకి రావాలంటేనే భయం వేసింది."
"భయమా? నన్ను చూస్తే నీకు భయం వేస్తూందా? ఒక్క భయం తప్ప ఇంకేమీ లేదా?"
ఆమె ఒకసారి అతడికేసి చూసి కళ్ళు దించుకుంది.
"పోన్లే విద్యా, ఇప్పటికయినా నన్ను అర్థంచేసుకున్నావు. థాంక్స్" బల్ల క్రిందనుంచి కాలు ముందుకు జరుపుతూ అన్నాడు. ఆమె కాళ్ళు వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి అతడివైపు చూసింది. ఈ చూపుకోసమే లక్షలివ్వచ్చు అనుకున్నాడు.
ఆమె లేచి నిలబడి "నా మనసిప్పుడు తేలిగ్గా వుంది సర్. ఇన్నాళ్ళూ ఎంతో బాధపడ్డాను" అని కాగితం తీసుకుని వెనుదిరగబోయింది.
"విద్యా".
ఆమె ఆగింది.
"థాంక్యూ... థాంక్యూ వెరీమచ్".
ఆమె తలూపి బయటికొచ్చింది. వస్తూ అనుకుంది - "ప్రతి మగవాడూ ఒక ట్రాన్సిస్టరే - ఒకే ట్యూను, స్టేషన్లే తేడా..."