జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
రెండవ అధ్యామము
1. కృష్ణ్కా స్యాఖష్ణ్కాగ్నయే త్వాజుష్టం ప్రోక్షామి వేదిరసి
బర్షిషే త్వాజుష్టాం ప్రోక్షామి బర్హిరసి స్రుగ్భ్యాస్త్యాజుష్టం ప్రోక్షామి
ఇంధనమా! నీవు తృణసమృద్ధ ప్రదేశమున ఉన్న శుష్క కాష్టమవు. నీవు అగ్నికి ప్రియమవు. నిన్ను జలముచే పవిత్రము చేయుచున్నాను. (దర్భల కూర్చతో నీరు చల్లవలెను.)
(వేది మీద దర్భచే నీరు చల్లి పవిత్రము చేయవలెను)
వేదీ! నీవు సకల లాభములు సమకూర్చు వేదివి. దర్భకు ప్రీతి కలిగించు నిన్ను పవిత్రము చేయుచున్నాను.
దర్భా! నీవు బర్హివి. స్రువములకు ప్రీతి కలిగించుదానవు, నిన్ను పవిత్రము చేయుచున్నాను.
2. ప్రోక్షించగా మిగిలిన జలమా! నీవు నేలను తడి చేయుదానవగుము.
దర్భా! నీవు విష్ణువు శిఖా వృంతము నుండి వచ్చినదానవు. ఉన్నితో మృదువగు కంబళము చేసి నిన్ను వేది మీద పరచెదను.
వేదీ! నీవు దేవతలకు సుఖాసన స్థానమవు. (హొమము చేయునపుడు బయటపడిన హవిరన్నము తాకి) అగ్ని యొక్క ప్రథమ భ్రాత భువపతి కొరకు ఈ హవి ఆహుతి కావలెను. అగ్ని ద్వితీయ భ్రాత భువపతి కొరకు ఈ హవి ఆహుతి కావలెను. అగ్ని ద్వితీయ భ్రాత భువపతి కొరకు ఈ హవి ఆహుతి కావలెను. అగ్ని తృతీయ భ్రాత భువపతి కొరకు ఈ హవి ఆహుతికావలెను.
3. ప్రథమ పరిధీ! విశ్వావసు గంధర్వా! అన్ని విధముల అహింసల నిమిత్తము నీవు పరిధిని ఆహవనీయపు పశ్చిమ దిశన స్థాపించుము. పరిధీ! నీవు యజమాని రక్షాపరిధివి.
భువపతి అగ్నీ! నీవు స్తుత్యుడవు. అందువలన హొత మున్నగు వారిచే సంస్తుతింపబడుము.
దక్షిణ పరిధీ! నీవు ఇంద్రుని దక్షిణ భుజమవు. అన్ని హింసల సమాప్తికిగాను నిన్ను ఆహవనీయపు దక్షిణ భాగమున స్థాపింతును. నీవు యజమానికి కూడా రక్షణ పరిధివి.
అగ్నికి ద్వితీయ భ్రాతవగు భువపతీ! నీవు స్తుత్యుడవు. అందువలన హొత మున్నగు వారిచే సంస్తుతింపబడుము.
ఉత్తర పరిధీ! మిత్రావరుణులు స్థిర ధారణ ద్వారా నిన్ను ఉత్తరమున స్థాపింతురు గాత. నీవు యజమానికి సహితము రక్షణ పరిధివి.
అగ్నికి తృతీయ భ్రాతవగు భ్రాతపతీ! నీవు స్తుత్యుడవు. అందువలన హొత మున్నగు వానిచే సంస్తుతింపబడుము.
4. (అగ్ని హొమమున సమిధలు వేయుచు) ఆహవనీయ అగ్నీ! క్రాంతదర్శీ! నీవు దేవతల పానగోష్ఠిని సంపన్నము చేయువాడవు. ద్యుతిమంతుడవు. మహామహుడవు. మేము యజ్ఞమున హొమము చేయుదుము. సమిధలచే నిన్ను ప్రజ్వలితుని చేయుదుము.
5. (రెండవ సమిధ వేయుచు) సమిధే! నీవు సమిధవు తూర్పు దిక్కున నీకు ఎట్టి హింస జరుగకుండ సూర్యుడు రక్షించును గాత.
దర్భలారా! మీరు సూర్యుని బాహువులగుదురు. ఉన్ని యొక్క మృదువైన కంబళమున మిమ్ము వేదిపై పరుస్తాను. మీరు దేవతలు సుఖాసీనులగు సాధనములు.
పరచిన దర్భాసనమా! వసువులు, రుద్రులు, ఆదిత్యులు విచ్చేసి నీపై ఆసీనులు కావలెను.
'ఆత్వా వసవో రుద్రా ఆదిత్యాః సుదన్తు'
6. జుహువా! నీవు ఘృతము పోయుదానవు. 'జుహువు' అను పేరు గల దానవు. దేవతలకు ప్రియమగు ఘృత సహితవై దర్భాసనమున స్థిరపడుము.
హవీ! నీవు దేవతలకు ప్రియ తేజమగు ఘృత సహితవై దర్భాసనమున నిలువుము.
(యజ్ఞ సామగ్రిని తాకి) హవిస్సులన్నియు యజ్ఞ భూమియగు వేది మీద స్థిరపడినవి. విష్ణూ! నీవు ఈ హవిస్సులను అసురులనుండి రక్షింపుము. యజ్ఞమును రక్షింపుము. యజ్ఞపతిని రక్షించుము. అధర్వుడనగు నన్ను రక్షింపుము.
"ధృవా అసదనృతస్య యోనౌ తావిష్ణోపాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహిమాం యజ్ఞన్యమ్"
7. హవిరన్న విజేతా అగ్నీ! హవిరన్నమునకు నమస్కరింతును. దానిని పవిత్రము చేయుదును. నీకు సమర్పింతును. (ఉత్తర దిశకు చేతులు జోడించి) దేవతలకు వందనము. (దక్షిణ దిశకు చేతులుజోడించి) పితృ దేవతలకు నమస్కారము. (జుహువు, ఉపభృతములను చేతితో ఎత్తి) ఈ రెండును పూర్తిగా నా అధీనమున ఉండవలెను.
"నమోదేవేభ్యః స్వభాపితృభ్యః సుయమే మే భూయాస్తమ్"
8. నేడు నేను చెదిరి ఇటునటు పడిన హవిరన్నమును మరల దేవతలకు సమర్పిస్తాను. యజ్ఞ దేవతా! పొరపాటున సహితము నిన్ను నేను దాటకుందును గాత.
అగ్నీ! నీ ఛాయ ధనమయము. దానినే నేను ఆశ్రయింతును.
యజ్ఞ ప్రదేశమా! నీవు విష్ణువునకు స్థానమవు. ఇచట నుండియే ఇంద్రుడు తన పరాక్రమము ప్రకటించినాడు. అప్పటినుండియే హింసారహిత యజ్ఞము తలెత్తినది.
9. అగ్నీ! నీవు అగ్ని హొత్రమవని ఎరుంగుము. నీ దూతత్వమును ఎరుంగుము. దూత కార్యము నిర్వహించునపుడు ద్యావాపృథ్వులు నిన్ను రక్షించును గావుత. నీవు సహితము ద్యావాపృథ్వులను రక్షింపుము.
ఇంద్రుడు హవి, ఘృతములందు ప్రీతి కలవాడు. అతడు శుభములు కలిగించవలెను. యజ్ఞమును పూర్తి చేయించవలెను. ఇది ఇంద్రుని కొరకైన ఆహుతి, జ్యోతి జ్యోతితో కలసిపోవలెను.
"సంజ్యోతిషాజ్యోతిః"
10. (ప్రధానయాగము ముగిసినంత మిగిలిన పురోడాశము భక్షించునపుడు యజమాని పఠించవలసినది)
ఇంద్రా! ఈ హుతశేషము భక్షించుట వలన నా ఇంద్రియ బలము వృద్ధి యగును గాత. మాకు ఇంద్రుని ధనముతో సాంగత్యము కలుగును గాత. మా ఆశయములు ఫలించును గాత. అభిలాషలు తీరును గాత.
నేను పృథ్విని పిలుచుచున్నాను. పృథ్వి నన్ను పిలువ వలెను. నేను అగ్నినై శేష పురోడాశమును భక్షించుచున్నాను.
"ఆహంతు అగ్నిహిసన్ భక్షయామి" అని ఉవటుడు. "స్వాహాసుహుతమస్తు జఠరాగ్నే' అని మహీధరుడు.
నరుని యందు జఠరాగ్ని ఉన్నది. కావున నరుడు అగ్నిఅయినాడు. జఠరాగ్నిలో ఇది చక్కగా హుతమగునుగాత. అన్నము జీర్ణమైననేగదా బలము- ప్రాణము!
11. నేను ధ్యౌష్పిత నన్ను పిలువవలెను. నేను అగ్నిని అగుదును. అగ్నీధ్రుని చేత పురోడాశ శేషము భక్షింతును.
పురోడాశ శేషమా! నేను సవితృ దేవత ఆజ్ఞానువర్తిని. ఆశ్వినుల బాహువులతో పూష దేవత హస్తములతోను ఈ హుత శేషమును పట్టినాను.
పురోడాశ శేషమా! నేను నిన్ను అగ్నిముఖముగనే భక్షింతును.
12. ద్యోతమాన సవితా! ఈ యజ్ఞపు యాజమాని నిన్ను భజించుచున్నాడు. బృహస్పతిని బ్రహ్మను భజించుచున్నాడు. కావున నీవు యజ్ఞమును రక్షించుము. యజ్ఞస్వామియగు యజమానిని రక్షింపుము. బుత్విజుడనగు నన్ను రక్షింపుము.
13. సవిత మనోవేగము కలవాడు. అతడు ఈ ఆహుతి యందలి ఘృతమును స్వీకరించవలెను. బృహస్పతి. ఈ యజ్ఞము హింసితము కాకుండ చేయవలెను. అతడు స్వయముగా ఈ యజ్ఞమును భరించవలెను.
ఈ యజ్ఞమున విశ్వేదేవతలు ఆనందించవలెను. ఆ దేవతలందరు యజ్ఞము సఫలమగునట్లు ఆశీర్వదించవలెను.
14. అగ్నీ! ఇది నీ కొరకైన సమిధ. దానిచే నీవు పూర్తిగా ప్రజ్వలితుడవగుము. యజమానాదులను వర్ధిల్లచేయుము.
మేము బుత్విజులము. మేము వర్ధిల్లుదుము యజమానాదులను వర్ధిల్లచేయుదుము.
అగ్నీ! నీవు హవిరన్నము మీదకు ఎగబడువాడవు. హవిరన్నమును జయించిన వాడవు. నిన్ను నేను పవిత్రుని చేయుదును.
15. (ప్రక్కప్రక్కన ఉన్న జుహువును ఉపభృతమును వేరు చేయదలచిన యజమాని జుహువును తూర్పుదిశకు జరిపి)
అగ్ని సోములు స్వర్గాదులను జయించినారు. నేను వారికి అనుకూలుడనగుదును. వాటిని గెలుతును. హవిరన్నము సమర్పించి నేను స్వయముగా జుహువును అగుదును. తూర్పునకు జరుగుదును.
అగ్నిసోములారా! మమ్ము ద్వేషించువారిని- మేము ద్వేషించువారిని తొలగించండి. అన్నము పెట్టియే నేను ఈ శత్రువును తొలగింతును.
ఇంద్రాగ్నులు నా కొరకు స్వర్గాదులను గెలిచినారు. నేను వారికి అనుకూలుడనగుదును. వాటిని సాధింతును.
(ఉపభృతమును పడమటికి జరిపి) హవిరన్నము సమర్పించి స్వయముగా ఉపభృతమునై పడమటికి జరుగుదును. మమ్ము ద్వేషించువారిని- మేము ద్వేషించువారిని ఇంద్రాగ్నులు తొలిగించవలెను. హవిరన్నము సమర్పించియే నేను నా శత్రువును తొలగింతును.