Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 18


    "నేనేదో మంచి ఉద్యోగం చేస్తానని- తననేదో ఉద్దరిస్తానని ఎన్ని కలలు కందో....కానీ ఆ తండ్రి రక్తం నాలో ప్రవహిస్తుంటే ఎలాబుద్దిగా ఉద్యోగంలో చేరగలను? ఎలా నిన్ను సుఖ పెట్టగలనమ్మా" పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు అనిల్ .

    హంపీ చేతిలో కెమేరా తిరిగి ఆన్ అయింది.

    ఆ చితిమంటల్ని, ఆ మంటల ప్రక్కగానిలబడి నిర్లిప్తంగా మంటలకేసి చూస్తున్న అనిల్ ని జూమ్ లోకి తీసుకుంది హంపీ.

    మంటలు క్రమేపీ తగ్గుతున్నాయి. ఆమె కెమేరాను ఆఫ్ చేసింది.

    "అతరువాత వచ్చి బూడిదను ఏదైనా నదిలో కలుపుదాం- ప్రస్తుతానికి వెళ్దాం పదా అనిల్' టాగూర్ భుజాల్ని ఆప్యాయంగా స్పృశిస్తూ అన్నాడు.

    అక్కడ జరిగిందేమిటో తెలీని హంపీ గేటు దగ్గరే ఆగిపోయి ఎదురు చూస్తోంది.

    అనిల్ ని బలవంతాన స్మశానం బయటకు లాక్కుంటూ వస్తున్నాడు టాగూర్.

    కేవలం నటనే అయితే జనం ఉన్నంత వరకే ఏడవాలి. ఇంకా ఏడుస్తున్నాడంటే ఏమిటర్ధం? అనిల్, టాగూర్ గేటు దగ్గరకు వచ్చారు.

    హంపీ రెండడుగులు వేసి

    "చాలా బాగా నటించారు....హేట్సాఫ్ టూ యువర్ పెర్ ఫామెన్స్" అంది చిర్నవ్వుతో.

    అంతే.....అనిల్ కొట్టిన దెబ్బకు ఆమె కళ్ళు బైర్లుకమ్మాయి.

    ఆమెకర్థం కాలేదు- అతనెందుకలా ప్రవర్తించిందీ.

    అనిల్ ముందుకు సాగుతూ అన్నాడు-

    "ఆమె మా అమ్మ..... నా కన్నతల్లి"

    హంపీ షాక్ తింది అనిల్ చెప్పింది విని. అనిల్ ని ముందుకు వెళ్ళనిచ్చి శిలాప్రతిమలా నించున్న హంపీ దగ్గరకు వచ్చాడు టాగూర్.

    "మాదే పొరపాటు..... వాస్తవానికి ఒక శవం దగ్గర ఏడ్చేందుకే అనిల్ ఒప్పించాం. అయితే ఆఖరి క్షణంలో తెల్సింది- ఆ శవం నిజంగా వాళ్ళమ్మే అని....." అంటూ వేగంగా వెళ్ళి అనిల్ తో కలసిపోయాడు.

    కొద్ది క్షణాల వరకు హంపీ ఆ షాక్ నుంచి తేరుకోలేదు.


                       *    *    *


    ఆఫీసుకి వస్తూనే కేసెట్ ని రివైండ్ చేసి మానిటర్ లో చూడసాగింది హంపి.

    కేకవేసి స్పృహ తప్పి పడిపోయే వరకు అతనికి ఆ శవం తన తల్లిదని తెలీదు అంటే ఇప్పటివరకు అతను నటించాడు.

    "సీ.....మిస్టర్ విల్సన్....నూటయాభై రూపాయలకోసం ఎంత అద్భుతంగా అతను నటించాడో....చూడండి"

    "అవును మేడమ్......అవకాశం లేక, రాక ఇలాంటి మహానటులెందరో మరుగున పడి ఉన్నారు. వీరికి అవకాశం వస్తే అద్భుతాల్ని సృష్టిస్తారు. ఒక్క డైలాగ్ చెప్పటానికి అష్టవంకర్లు తిరుగుతూ నానాహైరానా పెట్టేవాడ్ని వదిలించు కొని ఇలాంటి వార్ని పెట్టుకోవడం చాలా మంచిది....." మానిటర్ కేసే చూస్తూ అన్నాడు విల్సన్.

    ఆమె క్యాసెట్ ని మరలా రివైండ్ చేసింది. అలా నాలుగుసార్లు చూసింది వెంటవెంటనే.

    "స్ర్కిప్టు సంగతేం చేసారు మేడమ్?"

    "వాళ్ళు అభ్యంతరం తెలిపిన వాటిని ఎడిట్ చేసాను. ఇప్పుడు తిరిగి సబ్ మిట్ చేస్తే ఎక్సెప్టు చేయవచ్చు. ఈరోజు దాన్ని ఫెయిర్ చేయించి పంపించండి" అంది మానిటర్ ముందునుంచి లేస్తూ.

   
                      *    *    *

    "మొత్తం పధ్నాలుగు బంగారపు షాపులున్నాయి-ఆ రూట్ లో అన్నిటినీ మార్క్ చేసాను..... ఇదిగోండి మేప్" అంటూ ఓ బ్లూ ప్రింట్ ని జయధీర్ ముందుంచాడు దాదా.

    ఓ పదినిమిషాల వరకు అతను ఆ మేప్ కేసి చూస్తుండిపోయాడు.

    "ఓకే..... మనకిప్పుడు షుమారు పాతికమంది కమెండోల్లాంటి వాళ్ళు కావాలి. వాళ్ళు మెరుపువేగంతో షాప్స్ కున్న షట్టర్స్ లేపేయాలి. కొంతమంది ఆ పని చేస్తుంటే మరి కొంతమంది ఆ షాప్స్ లో షోకేసుల్లో ఉంచే నగల్ని లేపేయాలి. ఆ మరుక్షణం వచ్చి ఊరేగింపులో కలిసిపోవాలి. ఊరేగింపులో కలిసిన కొద్దిక్షణాలకే చిన్నగా అక్కడి నుంచి తప్పుకోవాలి. ఈ ఆపరేషన్ సక్రమంగా పూర్తికావాలంటే మెషిన్ కన్నా వేగంగా పనిచేసే వాళ్ళు కావాలి మనకు....." పైప్ పీలుస్తూ, పచార్లు చేస్తూ అన్నాడు జయధీర్.

    "ఓకే.....సార్.....బట్......పోలీస్ బందోబస్త్ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. డానికి తోడు మఫ్టీలో కొందరు ఉండవచ్చు......ఒకవేళ మనవాళ్ళు షాప్స్ లోంచి కొట్టేసి ఊరేగింపులోకి వచ్చి కల్సిన మరుక్షణమైనా కేచ్ చేయవచ్చు.....నా కెందుకో రిస్కీగా అనిపిస్తోంది....."దాదా నీళ్ళు నమిలాడు.

    "అందుకే...వేరే ఏర్పాట్లుకూడా మనం చేసుకోవాలి. నగల్ని వెంటనే మార్చి వేరే చోటుకి తరలించేవారు వేరుగా ఉండాలి.....ముందు నమ్మకస్తులైన మనవాళ్ళని ఇరవైమందిని పిలిపించు. వారికి రెండురోజులు ట్రైనింగ్ ఇద్దాం. ఆ తరువాత మరో ఇరవైమందిని కొట్టేసినవాళ్ళనుంచి నగల్ని తప్పించేందుకు సిద్ధం చేయ్. వాళ్ళకీ ట్రైనింగ్ ఇద్దాం. మొత్తానికి ఈ ఆపరేషన్ లో కోటి రూపాయలు దాకా మిగలాలి. అందులో ఇరవై లక్షలు పోలీసులకు ఖర్చు పెట్టాలి..... మరో విషయం ప్రభు డ్యూటీ ఎప్పుడు? ఎక్కడ? కూడా తెలియాలి మనకు....."

    దాదా  జయధీర్ చెప్పే విషయాన్ని తన మెదడులో నిక్షిప్తం చేసుకు పోతున్నాడు.

    "ఇకపోతే ఈ ఊరేగింపును ఎవరెవరు షూట్ చేస్తారు?"

    "స్టేట్ ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ యూనిట్ ఒకటి, దూరదర్శన్ యూనిట్ ఒకటి షూట్ చేయవచ్చు...."

    వాళ్ళు కాక ఇంకెవరన్నా ఉంటారా?"

    "ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ కొందరుండవచ్చు. అయితే వాళ్ళు ప్రోసెషన్ ని జనరలైజ్ చేస్తూ స్టిల్స్ మాత్రమే తీసుకోవచ్చు....."

    "ఓకే....వెంటనే పనిలోకి దిగిపో.....మరో విషయం....నువ్వెప్పుడు నా దగ్గరకు వచ్చినా కాస్త ముందూ వెనుక చూసుకొని వస్తుండు"

    "ఓకె.....వెంటనే పనిలోకి దిగిపో..... మరో విషయం....నువ్వెప్పుడు నా దగ్గరకు వచ్చినా కాస్త ముందూ వెనుక చూసుకొని వస్తుండు"

    "ఓకె సార్.....వస్తాను" అంటూ దాదా వెళ్ళిపోయాడు.

       
                                          *    *    *

    "మూడు యూనిట్స్ దొరికాయా?" హంపీ స్ర్కిప్టు చూసుకుంటూ విల్సన్ ని అడిగింది.

    "దొరికాయి మేడమ్.....కాని...."

    "చెప్పండి- ఫర్వాలేదు"

    "ఈసారి ఊరేగింపులో బాగా అల్లర్లు జరగవచ్చని అనుమానిస్తున్నారు" మనమేదన్నా రిస్క్ లో పడతామేమో"

    "వినాయక నిమజ్జనం ఎప్పుడు ప్రశాంతంగా జరిగింది కానుక? అలా అని ముందే మనం భయపడితే ఒక మంచి క్యాసెట్ ని తయారు చేయలేం.....మన సొంత యూనిట్ ని ఊరేగింపుకి ముందు అరేంజ్ చేసి, లీజ్ కి తీసుకొనే యూనిట్స్ ని మాత్రం సేప్టీ ప్లే సెస్ లో అరేంజ్  చేయిద్దాం" ప్రతి యూనిట్ కొంత ఏరియాని కవర్ చేసి ఆఫ్ అయిపోతుంది. మహా అయితే ఒక వీధిని కవర్ చేయగలుగుతుంది ప్రతి యూనిట్. గొడవలు జరిగినా లీజ్ కి తీసుకున్న యూనిట్స్ ఎత్తయిన బిల్డింగ్స్ పై ఉంటాయి గనుక డేమేజ్ జరిగే అవకాశం లేదు..... దీని మూలంగా మనం పోలీస్ శాఖకు కూడా బాగా ఉపయోగపడవచ్చు. ప్రతిసారి లూటీలు సర్వ సాధారణమై పోతున్నాయి. అందుకే మనం అప్రమత్తంగా ఉంటే జూమ్ ఉపయోగించి అందుకు కారకులైన వాళ్ళను సాక్ష్యాధారాలతో సహా రికార్డ్ చేయవచ్చు....."

    విల్సన్ ఓకే క్షణం భయపడ్డాడు.

    "అనవసర  విషయాల్లో తలదూర్చుతున్నామేమో ననిపిస్తోంది మేడమ్....."

    ఆమె తేలిగ్గా  నవ్వేసింది.

    "సరే.....మీ ఇష్టం.....ఈ రోజే మూడు యూనిట్స్ ని ఫైన లైజ్ చేస్తాను....' అంటూ లేచాడు విల్సన్.

    ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న సంఘవిద్రోహ శక్తులు ఎవరనేది సాక్ష్యాధారాలతో పట్టుకోగలిగితే......

       
                       *    *    *

    మరో రెండురోజులకు స్క్రిప్టు అప్రూవ్ అయి వచ్చింది. సాధ్యమైనంత త్వరలో 13భాగాలలో మొదటి భాగం (పైలట్) పూర్తిచేసి దూరదర్శన్ కు సబ్ మిట్ చేయమని ఇంటిమేషన్ కూడా వచ్చింది.

    ఆ రోజు హంపీ పొందిన ఆనందం వర్ణనా తీతం.

    ఆ ఆనందంలో తను తీసుకోబోతున్న స్క్రిప్టు గురించి ఆమె ఏమాత్రం ఆలోచించలేదు.

    దూరదర్శన్ లెటర్ తీసుకొని తండ్రి దగ్గరకు వెళ్ళింది.

    కూతురు కళ్ళలోని ఆనందాన్ని ఆయన అనుభవం క్షణాల్లో చదివేసింది.

    "ఏమ్మా స్ర్కిప్టు అప్రూవ్ అయిందా?" కూతురుకేసి చూస్తూ ప్రేమగా అడిగాడు.

    "అవును నాన్నా, నా జీవితాన్ని ఫణంగా పెట్టయినా ప్రతి ఫ్రెమ్ ని అద్భుతంగా చిత్రీకరిస్తాను. ఎక్కడా దేనికీ రాజీపడను.... సర్ఫ్ కి మోడల్ గా నటించే కవితా చౌదరీ తెలుసా నాన్నా? ఆమె చెల్లెలు నిజ జీవితంలో ఓ ఐ.పి.ఎస్ ఆఫీసర్. ఆమె ఇప్పుడు సి.బి.ఐ. ఆఫీసర్ . తన చెల్లెలి జీవితాన్నే తన టీవీ సీరియల్ కి కథగా ఎన్నుకుంది. అదే 'ఉడాన్' నెట్ వర్క్ లో నెంబర్ ఒన్ సీరియల్ గా క్లిక్ అయింది....."

    కూతురి కళ్ళలో కనిపిస్తున్న మెరుపు చూసి ఆయన సంతృప్తిగా తల పంకించాడు.

    "తండ్రీ కూతుర్లు-ఒకరికొకరు బాగా సరిపోయారు.....ఏ ప్రేమ కథో......మధ్యతరగతి కుటుంబాల కథో అయితే ఏ గొడవా ఉండదు..... మీ  నాన్నగారిజీవితాన్ని కథగా తీసుకుంటే పెద్దమనుష్యులనిపించుకుంటున్న చాలామంది బయటకు వస్తారు. నువ్వందులో పెట్టే ప్రతిపాత్ర బయట ఎవరినో ఒకర్ని పోలిఉంటుంది. సమాధి చేసిన భయంకర సత్యాలు సోదాహరణంగా బయటకొస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు వాళ్ళు....నా మాట విని మరోసారి ఆలోచించు తల్లీ....."

    ఆమె ఎప్పటిలాగే కూతుర్ని మందలించింది.

    కొద్దిక్షణాలు వాళ్లిద్దరేం మాట్లాడలేదు.

    నిజానికి వాళ్ళకీ తెలుసు కొండల్ని ఢీకొనబోతున్నట్టు.

    సీరియల్ ప్రారంభమైతే ఎదురయ్యే నున్న పరిస్థితుల్ని ఇద్దరు నిశ్శబ్దంగా అంచనా వేసుకుంటున్నారు.

    అంతలో కాలింగ్ బెల్ మోగింది.

    ఆమె ఉలిక్కిపడి ఆలోచనల్నుంచి తేరుకొని క్రిందకు వచ్చేసింది.

    "మూడు యూనిట్స్ రడీ మేడమ్" విల్సన్ అడ్వాన్స్ రిసిప్ట్స్ హంపీకిస్తూ అన్నాడు.

    "వెరీ గుడ్.... మేప్ ఓసారి అందుకోండి' అంది తనసీట్లో కూర్చుంటూ.

 Previous Page Next Page