Home » Yandamuri veerendranath » చీకట్లో సూర్యుడు


    నిఖిల్ నవ్వాడు. "యుద్ధం వద్దని ఒక సైనికుడు విశ్వసించి వాదించవచ్చు. అలా అని అతడు  తన విశ్వాసానికి ఎదురుగా పని చేశాడని అనలేంగా సార్! ఈ ప్రాజెక్టుపట్ల నాకు  అంతగా నమ్మకం లేనిమాట నిజమే. కానీ సకల మానవాళిని రక్షించే ప్రయత్నం కోసం పంపే బృందంలో నన్నూ ఒకడిగా ఎన్నుకున్నారని తెలిస్తే. దానికి నేను సంతోషించకుండా ఎలా వుండగలను.....?"

    "కానీ ఇందులో బలవంతమేమీ లేదు నిఖిల్. నాతోబాటు మరో నలుగురు రావాలి అంతే! నీ కిష్టంలేని పక్షంలో మరో ఆస్ట్రోనాట్ వస్తాడు!"

    నిఖిల్ ఇబ్బందిగా చూస్తూ "మీకు నేను రావటం ఇష్టం లేదా సర్" అని అడిగాడు.

    "నోనో.....అదేం కాదు. నీ జీవితం ఇంకా ముందు చాలా వున్నదనీ- అన్ని అనుభవాల్నీ వదులుకుని శూన్యంలో శేషజీవితం గడపవలసి వస్తుందనీ అంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా  నీ ప్రియురాలు....."

    "ఓ.... ఆ విషయమూ....." అన్నాడు నిఖిల్. కొంచెం ఆగి, తరువాత నెమ్మదిగా కొనసాగించాడు. "నిజమే సర్. శ్రీజకి ఇది భరించలేని వార్త. కానీ తనైనా దీనికి అడ్డు చెప్పుతుందనుకోను."

    "ఆమె నీ మీద ఎన్నో ఆశలు  పెట్టుకొని వుండవచ్చు."

    "నిజమే. ఆ కారణంగా నేనీ ప్రయాణం మానుకుంటే ణా బదులు మరొకరు వెళ్ళాలి. ఆ వెళ్ళే వ్యక్తికి అప్పుడే వివాహం జరిగి వుండవచ్చు లేదా తల్లికి ఒక్కడే  కొడుకు అయివుండవచ్చు. లేదా  ఒక సంవత్సరం పాపకి తండ్రి అయి, ఆ పాప  పెరుగుదలని ప్రతి క్షణమూ చూడాలని ఉవ్విళ్ళూరుతూ వుండవచ్చు. ఇలా  ప్రతి వారికీ  ఏదో ఒక సమస్యగానీ - భూమిమీద జీవించటంలో ఆ ఆకర్షణగానీ వుండటం చాలా సహజం సర్! నా మేనకోడలూ నేనూ  వివాహం చేసుకుందా మనుకున్నాం. ఆ దృష్టితోనే దగ్గిరయ్యాం కూడా. మా వివాహం జరిగాకే ఈ ఆహ్వానం వచ్చి వుంటే ఏం చేసి వుండేవాడిని? నిశ్చయంగా వప్పుకొని వుండేవాడిని!.... ఇదే ఇప్పుడు జరుగుతుంది" అతడు ఆగి, తిరిగి అన్నాడు.".......మనం  శూన్యంలోకి వెళ్ళిపోయిన ఎన్నాళ్ళవరకూ తిరిగి రాకపోతే ఈ  ప్రపంచం మన  భార్యల్ని విధవరాళ్ళుగా గుర్తిస్తుందా? చట్టం ఎన్నాళ్ళ తరువాత వాళ్ళకి విడాకులు ప్రసక్తి లేకుండా పునర్వివాహానికి ఒప్పుకుంటుంది? ఇవన్నీ మనకి లేని సమస్యలు. కానీ చాలా పెద్ద సమస్యలు. ఆ రకంగా చూస్తే శ్రీజ అదృష్టవంతురాలు. ఈ అత్యంత ఆధునిక సమాజంలో ఆఫైర్స్ కేముంది? ఒక యుద్ధఖైదీని ప్రేమించాననుకుని ఆమె నన్ను మర్చిపోవటానికి ప్రయత్నించవచ్చు. ఇక నా సంగతంటారా? మనిషి మనుగడకన్నా ప్రేమ ముఖ్యం కాదు. అంతరిక్ష పరిశోధన సంస్థ నన్ను ఎన్నుకోవటమే ఒక గుర్తింపు! భూమ్మీద జీవకోటిని నిలవడం కోసం నా మీద సంస్థ వుంచిన నమ్మకం ముందు నా వ్యక్తిగత విషయాలు చాలా చిన్నవి.....కాదంటారా?"

    యశ్వంత్ అతడివైపు విస్పారిత నేత్రాలతో చూస్తూ వుండి పోయాడు. ఆ క్షణం నిఖిల్ ఎంతో ఎదిగిపోయినట్టు అనిపించింది. తనపట్ల తనకి సిగ్గుకూడా వేసింది.

    అంతరిక్ష శూన్యంలోకి ప్రయాణం అన్నప్పుడు క్షణంపాటు (అది క్షణం అయితేనేం? ఆ మాత్రం సేపైనా సరే-) కొట్టుమిట్టులాడింది మనసు. అనూహ్య కూడా వస్తుందని, తెలిసినప్పుడు కాస్త సర్దుకుంది. కానీ ఇతడో? తనకీ యాత్ర పట్ల నమ్మకం లేకపోయినా సరే- ఆజ్ఞకు నిబద్ధుడయ్యాడు. ప్రియురాల్ని వదులు కుంటున్నాడు. పైకి సామాన్యంగా కనిపించే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే వుంటారు.

    యశ్వంత్ చేయి చాచి అతడి చేతిని అందుకుని "ఐయామ్ హాపీ నిఖిల్- వెల్ కమ్ టు అవర్ టీమ్-" అన్నాడు. నిఖిల్ అంగీకార పత్రంమీద సంతకం పెట్టటానికి లోపలికి వెళ్ళాడు.

    సరిగ్గా ఆ సమయానికి మేఘాల్ని చీల్చుకుంటూ సూపర్ సానిక్ విమానం భారతదేశం వైపు వస్తోంది. రెండుచేతులూ వళ్ళో పెట్టుకుని తల వెనక్కి వాల్చుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ప్రయాణం చేస్తోంది శ్రీజ. నిఖిల్ తండ్రి అవటానికి ఆర్నెల్లుందని డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు. టెలిఫోన్ లో ఎంత ప్రయత్నించినా దొరకలేదు అతడు. నిఖిల్ ని వివాహం నిమిత్తమై తీసుకెళ్ళటానికి వస్తోంది ఆమె. తన గర్భవతినన్న విషయాన్ని లోకంనుంచి దాచే ప్రయత్నమేమీ చెయ్యలేదు.

    ఆమెకి నిఖిల్ మీద నమ్మకం వుంది.


                                                              *    *    *

    అదే సమయానికి తన  గదిలో టేబిల్ ముందు కూర్చుని అనూహ్య ఉత్తరం వ్రాస్తోంది.

    ప్రియమైన యశ్వంత్.

    ఈ ఉత్తరం మీకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుందని తెలుసు కానీ కొన్నివిషయాలు ముఖాముఖి మాట్లాడుకోవటం కంటే ఇలా ఉత్తరాలు ద్వారా అయితేనే మనసులో వున్నది బాగా చెప్పగలను.

    ఇక అసలు విషయానికి వస్తాను.

    ఈ మధ్య తరచు సైకియాట్రిస్టుని కలుసుకోవలసి వస్తోంది. దానికి కారణం మీరు!

    మీకు ఆశ్చర్యంగా వుండవచ్చు. మనం ఎప్పుడో విడిపోతే ఇంతకాలమయ్యాక- ఇలా మీ కారణంగా నేను సైకియాట్రిస్టుని కలుసుకోవలసిన అవసరం ఏముందా- అని.

    సంస్కృతి గానీ, మారే  అభిరుచులు గానీ  కాలంతోపాటు స్త్రీని మార్చలేవనటానికి బహుశా నేనే  ఉదాహరణ ఏమో. మనం విడిపోయి ఇంతకాలం అయినా నేను  మిమ్మల్ని  నా తలపుల్లోంచి బయటకు తోసెయ్య లేకపోయాను. కలిసి జీవించినంతకాలం-కేవలం ఇద్దరూ బాటసారుల్లా, ఒకే ఇంట్లో బ్రతికిన మనం, ఒకరంటే ఒకరు.....కావలసిన దాని కన్నా ఎక్కువ గౌరవం చూపించుకున్నాం! నన్నో చిన్నపిల్లలా మీరు చూశారు. మిమ్మల్నో బాధ్యతాయుతమైన పెద్దమనిషిలా నేను చూశాను. ఏమైతేనేం చివరకు ఇద్దరం విడిపోయాం.

    కానీ మీరు మర్చిపోయినంత తొందరగా నేను మిమ్మల్ని మర్చిపోలేక పోయాను, ఆడపిల్లను కాబట్టి.

    చివరికి ఎలాగయితేనేం-మనసుని స్వాధీనపర్చుకోగలిగాను. పరిస్థితులబట్టి మనమూ మారాలి కదా! సరీగ్గా ఇటువంటి టైమ్ లోనే వాయుపుత్ర నాకు  పరిచయమయ్యాడు. అతడూ కుర్రవాడు. ఉత్సాహవంతుడయిన యువకుడు, తన అల్లరితో, పట్టుదలతో క్రమంగా  నన్ను తనవైపు లాక్కున్నాడు  మొదట్లో మదనపడ్డా చివరికి నేనూ అంగీకరించాను.

    సరిగ్గా ఆ సమయంలో భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచి మృత్యువు అంచున నిలబడి మీరు నన్ను మళ్ళీ పలకరించారు.

    కదిలిపోయాను.

    అదృష్టవశాత్తు మీరు తిరిగి వచ్చారు. (మిమ్మల్ని రక్షించిన వాయుపుత్రనా స్నేహితుడు, నన్ను ప్రేమిస్తున్నవాడు) 'మరణానికి ముందు' జీవితం చివర' అనుకున్న క్షణాల్లో మీరు నన్ను పలకరించటం తిరిగి నన్ను కలతలో పడవేసింది. మీకేం? తిరిగి రాగానే మళ్ళీ మీ పరిశోధనా ప్రపంచంలో పడిపోయారు. మీ జ్ఞాపకాల సుడిగుండంలో మళ్ళీ నేను వేదనగా మిగలిపోయాను.

    మీకు గుర్తుందా? పనిపట్ల మీకున్న ఉత్సాహం, ప్రేమ పట్ల లేకపోవటమే. మనం విడిపోవటానికి కారణమైంది. ప్రతీ మనిషికీ తన వాళ్ళనుకున్న వారి దగ్గర్నుంచి కాసింత ప్రేమ కావాలి! అది మనస్సులో మాత్రమే  వుంటే చాలదు. పైకి కూడా ప్రదర్శిస్తూ వుండాలి. మీరేమో అలాకాదు. ఎప్పుడూ అంతుపట్టరు. అవతలివాళ్ళకి అది నరకం అనికూడా తెలుసుకోరు.

    అటువంటి సమయంలో ఎంతో కష్టపడి, నన్ను నేను కుదుట పర్చుకుని ఎలాగైతేనేం తిరిగి ప్రేమని ఆస్వాదించసాగాను. వాయుపుత్ర దీనికి కారకుడు. మేం వివాహం కూడా చేసుకోవాలనుకున్నాం.

    ఈ సమయంలో తిరిగి మీరు సైన్స్ సిటీకి రావటం, అంతకుముందే నన్ను  పలకరించటం- అతడిపట్ల నేను పెంచుకుంటున్న అభిమానాన్ని మళ్ళీ తగ్గించి వేస్తూంది. నేనెటూ నిర్ణయించుకోలేక సైకియాట్రిస్టుని ఆశ్రమించాను. ఆయన  మిమ్మల్ని స్వయంగా కలుసుకొమ్మని సలహా చెప్పారు.

    మిమ్మల్ని కలుసుకుని, నా ఈ  కొత్త జీవితం గురించి చెప్తే మీరు అర్థం చేసుకుంటారనీ, ఇక ఈ అగమ్యగోచరమైన స్థితి వుండదని అయిన అన్నారు. అది నిజమే అనిపించింది.

    పైగా ఈ విషయమంతా మీకు తెలిస్తే, నా మనస్సులో ఏ మూలో వున్న  గిల్టీకాన్షస్ ఫీలింగు పోతుందనిపించింది. ఒకటి మాత్రం నిజం యశ్వంత్, మీ సామీప్యంలో నేనెవర్నీ ప్రేమించలేను. నా మనసంతా భయమే నిండి వుంటుంది. భయం నుంచి గౌరవం పుడుతుంది. గౌరవం నుంచి ప్రేమ పుడుతుంది. గౌరవప్రదమైన ప్రేమ నాకొద్దు.

    అందుకే ఈ ఉత్తరం.

    సైకియాట్రిస్టు సలహా ప్రకారం ఇదంతా మీకు  నేనుస్వయంగా కలుసుకుని చెప్పాలి, కానీ అంత ధైర్యంలేక ఇలా వ్రాస్తున్నాను, ఒక్కసారి మీరు తేలిగ్గా దాన్ని స్వీకరించినట్టు తెలిస్తే వాయుపుత్రతో నేను....ఉంటాను యశ్వంత్.

    ఒకప్పుడు మీ ప్రేమకోసం తపించిపోయిన

                                                                                                                  -అనూహ్య.

   
    ఆమె వ్రాయటం పూర్తిచేసి, కవరుమీద యశ్వంత్ అడ్రస్ వ్రాస్తూ వుండగా వదిన పిల్చి ఏదో పని చెప్పింది. ఆమె కవరు అతికించి, వెళ్ళి పోస్ట్ చేసి వచ్చి వదిన చెప్పిన పనిలో నిమగ్నమయింది.

    సైకియాట్రిస్టు చెప్పింది నిజమే.

    ఆమె మనసు ఇప్పుడు తేలిగ్గా వుంది.

    మునుగుతామో తేలుతామో తెలియని స్థితికంటే - నిశ్చయంగా మునుగుతామని తెలియటం మంచిది. అయితే ఇప్పుడు ఆ పోలిక సరి అయినది కాదు. ఆమె అన్నట్టు వాయుపుత్రతో నిజంగానే ఆహ్లాదకరంగా వుంటుంది.

    యశ్వంత్ సామీప్యం లేకపోతే!


                            *    *    *

    పై సంఘటన జరిగిన అరగంట తరువాత ఆమెకు డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది- అర్జంటుగా రమ్మని.

    ఆమె తయారై వెళ్ళేసరికి అతడు గదిలో ఒక్కడే వున్నాడు.

    "రండి. మీ కోసమే చూస్తున్నాను" అన్నాడు చేయిసాచి.

    అతడికి షేక్ హాండిచ్చి ఆమె ఎదుటి కుర్చీలో కూర్చుంది. "ప్లయింగ్ సాసర్  గురించీ, ప్రప్రంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య గురించీ రెండు మూడు మాటలు మాట్లాడి, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఒక టీమ్ ని అంతరిక్షంలోకి పంపాలనుకుంటున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు.

    ఆమె చాలా మామూలుగా . "దీనివల్ల అంత ఉపయోగం వుంటుందని అనుకోను కానీ ప్రయత్నం చేయటంలో తప్పేముంది?" అన్నది.

    "కరెక్టు, మేమూ అలాగే అనుకున్నాం. మిస్ అనూహ్యా వెళ్ళే ఐదారుగురిలో ఆ బృందంలో మీరు ఒకరిగా వెళ్ళటానికి మీకేమైనా అభ్యంతరం వుందా?"

    అకస్మాత్తుగా ఊహించని రీతిలో వచ్చిన ఈ ప్రశ్నకి ఆమె తబ్బిబ్బయింది. చప్పున తలెత్తి అప్రయత్నంగా "నేనా" అంది. ఆమె అనటాన్ని అతడు మరోలా అర్థం చేసుకుని, "టీమ్ లో ఒక బయోకెమిస్టు వుండటం కూడా అవసరమే అని  నిపుణులు భావించారు. మీకు అభ్యంతరమైతే బలవంతం ఏమీలేదు" అన్నాడు.

    ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు. ఆలోచనలో పడింది. ఒక బృందంలో కలిసి దిశాంతరాల్లోకి ప్రయాణం అంటే చాలా థ్రిల్లింగ్ గా వుంది. ప్రపంచపు అన్ని దేశాల్నుంచీ ఎన్నుకున్న బృందంలో తనూ వుండటం ఎంతో గర్వించదగ్గ విషయం. కానీ అది త్రాసులో ఒకవైపు మాత్రమే.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra