"ఉఁ. స్వప్న వుందా?"
ఇప్పుడెందుకు వచ్చావు మాధవ్? మనసు పట్టలేక పరిగెత్తుకు వచ్చాడా?మరీ అంత బలహీనుడా అతడు!
మళ్లీ స్వరూప్ గుర్తుకు వచ్చాడు స్వప్నకి. ఆరాధన నిండిన అతడి కళ్ళలో తనని తాకాలన్న కోరిక అప్పుడప్పుడూ కదిలేది! కాని నిగ్రహంతో తనెప్పుడూ తాకనైనా తాకేవాడు కాదు!
మాధవ్ గదిలోకి వస్తూ వెనుకగా చేతులు పోనిచ్చి తలుపులు చేరవేశాడు.
బిత్తరపోయినట్టుగా చూసింది స్వప్న.
అతడు స్వప్న ముఖంలోకి చూస్తూ శాంతంగా ప్రశ్నించాడు. "నీకు స్వరూప్ తెలుసా?"
"........" స్వప్న కళ్లు పట్టుబడిన అపరాధిలా క్రిందికి వాలిపోయాయి.
"నువ్వు నిజం చెబుతావని నాకు నమ్మకం. నీకతడు తెలుసా?"
"తెలుసు."తడారిన గొంతుతో జవాబిచ్చింది.
"ప్రేమించావా?"
తలూపింది.
"పెళ్లి చేసువాలనుకొన్నావా?"
"అవును."
అపరాధిని బోనులో నిలబెట్టి ఎదురుపార్టీ లాయర్ ప్రశ్నించినట్టుగా ప్రశ్నలు వేసి తనకు కావలసిన జవాబులు పొందిన మాధవ్ ఇక ఒక్క నిమిషం కూడా ఆగలేదు ఎలా వచ్చాడో అలాగే వెళ్లిపోయాడు.
ఏదో ద్వీపం మఎధ్య ఒంటరిగా చిక్కుబడినట్టుగా, చుట్టూ సముద్రం ఘోష పెడుతున్నట్టుగా అనిపించింది స్వప్నకు.
"అదేమిటి? అల్లుడు ఇలా వచ్చి అలా వెళ్లిపోయడేమిటి? ఏం మాట్లాడాడు నీతో?" తల్లివచ్చి అడుగుతూంటే పిచ్చి చూపులు చూసింది స్వప్న.
"గుడ్లు వెళ్లబెట్టి చూస్తావేమిటే? మాధవ్ ఏం మాట్లాడాడు?"
"నా ట్రాన్ఫ్ ఫర్ గురించి మాట్లాడాడు."
"ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడేమే?"
"నాకేం తెలుసు?" లోపల భయంగానే వుంది. ఈ నిజం తను దాచినా మాధవ్ ఎందుకు దాస్తాడు? దాచాల్సిన అవసరం అతడి కేమిటి? ఇవాళో రేపో ఈ నిజం భళ్ళున బద్దలై తీరుతుంది!
కులం తక్కువ వాడిని చేతుకొంటానంటే దూలానికి ఉరేసుకు చస్తానన్న తండ్రి, నూతిలో దూకి చస్తానన్న తల్లి అప్పుడేం చేస్తారో?
అసలు మాధవ్ ఏం నిర్ణయించుకొన్నట్టు?
పరీక్షాధికారిలా ప్రశ్నలు మాత్రమే వేశాడు! ఫలితం ఏమిటో చెప్పకుండానే వెళ్లిపోయాడు! అసలీ సంగతి మాధవ్ కి ఎలా తెలిసింది?
మాధవ్ వచ్చి వెళ్లిన మూడోరోజు అతడినుండి జాబు వచ్చింది.
"స్వప్నా!
నిజం మభ్యుపరచకుండా చెప్పినందుకు నీకు నా ధన్యవాదాలు.
నా భార్యవు నువ్వని తెలియని స్వరూప్ తన భగ్న ప్రణయం గురించి చెప్పి ఒకముప్పునుండి నన్ను తప్పించాడు. అతనికీ ధన్యవాదాలు!
ఎంత సహనవంతుడైనా భగ్న ప్రేమికతో సంసారం చేయడమనేది మగవాడికి నరకసదృశం కదా? త్వరలో నీకు నానుండి విడాకులందేలా ప్రయత్నిస్తాను - మాధవ్"


