జానపదం కధ
పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు. అప్పుడు ఆ బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది.
"నిర్మాత! మీ నిర్మాతల అవస్థలు చూస్తుంటే భలే జాలేస్తుంది. ఓ సినిమా తీయాలంటే నానా తంటాలు పడి, నలభై అబద్దాలు చెప్పి, తొంభయ్ ఆరు తెలివి తేటలు ప్రదర్శించి , అరవై మూడు రకాల వేషాలు వేయాల్సి వస్తోంది. మట్టికొట్టుకు పోవాల్సిన ఓ సినిమాని కేవలం తన తెలివితెటల్తో పూర్తి చేసి రెండు శతదినోత్సవాలు జరిపించిన ఓ నిర్మాత కమ్ డైరక్టర్ కధ చెప్తాను విను.
మద్రాసులో "మహారాజు" అనే నిర్మాత కమ్ దర్శకుడు ఉన్నాడు. అయన పేరుకు తగ్గట్టు మహారాజే! రూపాయి ఖర్చు చేసే చోట పది రూపాయలు ఖర్చు చేసే రకం. సినిమాకి కావాల్సింది కధా, నటులూ అన్న అభిప్రాయం సరయినది కాదని అయన అభిప్రాయం. లక్షలు ఖరీదు చేసే సెట్టింగులూ, ఒళ్ళు జలదరించే డాన్సులూ, బ్రహ్మడమయిన ఫైటింగులూ , కన్నుల కింపు కలిగించే అవుడ్దోర్ దృశ్యాలూ మొదలయిన హంగులన్నీ ఉంటె ఏ సినిమా అయినా చచ్చినట్లు విజయవంతం అవుతుందని అయన అనుభవం వల్ల తెలుసుకున్నాడు. వాటితోనే అనేక జానపద సినిమాలు నింపి జనం మీద పారేసేవాడు. జనం వాటిల్లో ఆనందంతో మునిగిపోయి అయన మీద డబ్బు పారేసేవారు. అలా బోలెడు సినిమాలు తీస్తూ తీస్తూ లక్షలు గడించేశాడతను. దాంతో మహారాజు తీసే చిత్రాలంటే చాలామంది నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, జిల్లాలవారీ కొనుగోలుదార్లు అయన ఇంటి ముందు 'క్యూ' లు కట్టేసేవారు. సినిమా పత్రికల వాళ్ళు పత్రి సంచికలోను ఏదో మూల ఆయనను ఆకాశాని కేత్తేస్తుండేవారు. కొన్ని పత్రికలూ అయన తాలూకు ప్రత్యేక సంచికలు కూడా వేసి మహారాజుకి బాకా ఊది నాలుగు రాళ్ళు సంపాదించుకున్నాయ్. ఆయనకు వాడవాడలా సన్మానాలూ, సభలూ ఎక్కువయిపోయాయ్. ఇదంతా చూసి అంతకంటే గొప్ప పేరు ప్రఖ్యతలున్న ఓ పెద్ద నటుడికి వళ్ళు మండిపోయింది. అలా అయన వంటికి మంటలంటూకున్న సమయంలోనే మహారాజు ఓ సినిమా పత్రికలో ఏ సినిమా విజయవంతం అయినా అందుకు దర్శకుడే కారకుడనీ, మిగతా వారంతా కేవాలం టైం పాస్ బఠాణీలని స్టేట్ మెంట్ ఇవ్వడం అయన కంట పడింది. దాంతో మరింతగా కాలి కమిలిపోయాడు. 'ఈ మహారాజుకి గర్వభంగం చేయవలె' అని అలోచించి అలోచించి చివరకు ఓ మాస్టర్ ప్లాన్ తయారుచేశాడు. మర్నాడు పత్రికల వాళ్ళకు కబురు చేసి తనే కావాలని ఇంటర్ వ్యూ ఇచ్చాడు. అందులో ఫలానా మహారాజు చాలా గొప్ప నిర్మాత కమ్ దర్శకుడనీ , అలాంటి విజయవంతమయిన దర్శకుడు నభూతోనభవిష్యతి అనీ చెప్పాడు. అయన లాంటి మహావ్యక్తి చిత్రంలో నటించాలని తనకు కోరికగా ఉందని అభిలాష వెలిబుచ్చాడు. ఆ ఇంటర్ వ్యూ చదివి మహారాజు ఆనందపడిపోయేడు. వెంటనే ఆ పెద్ద నటుడిని తన సినిమాలో బుక్ చేసి పారేశాడు. మొదటి షెడ్యూల్ షూటింగు కూడా వారం రోజుల్లో మొదలయిపోయింది. తీరా షూటింగు ప్రారంభించబోయే ముందు అసిస్టెంట్ డైరెక్టర్ ఖంగారుగా వచ్చాడు మహారాజు దగ్గరకు.
"ఈ సినిమాకు మన దగ్గర కధ లేదు కదండీ!" అన్నాడు గాభరాగా.
"లేపోతే ఏమయిందోయ్? అసలు ఏ సినిమాకు మాత్రం కధేడ్చిందనీ? హీరో - హీరోయినూ వాటేసుకోవడం, విలనోడితో కొట్లాడటం, హీరో - హీరోయినూ విడిపోవడం , విలన్ చావడం హీరో - హీరోయినూ కలుసుకుని మళ్ళీ కావలించుకోవడం ..... ఇంతకంటే ఇంకే కధుంటున్నది?" అన్నాడు చిరాగ్గా మహారాజు.
"అయితే ఇప్పుడు ఏయే సీన్లు తీద్దామంటారు?"
"ఏ సినిమా అయినా హీరో హీరోయిన్లూ కలుసుకున్నప్పుడు వాటేసుకునే సీనూ , మళ్ళా ఆఖర్లో కలుసుకున్నప్పుడు కావలించుకునే సీనూ ముందు తీసేయాలి! గుర్తుంచుకో " అన్నాడు మహారాజు.
ఆ రోజు ఆ రెండు సీన్లూ తీసేశారు. ఆ మర్నాటి నుంచీ పెద్ద నటుడు షూటింగు కి రావడం మానేశాడు. మహారాజు వెంటనే పెద్ద నటుడికి ఫోన్ చేశాడు సంగతేమీటని!
"ఏముందీ ? నాకు వేరే అర్జంటు షూటింగులున్నాయ్! అంచేత మరో సంవత్సరం వరకూ మీకు కాల్ షీట్ లేదు" అన్నాడు పెద్ద నటుడు విలన్ లాగా నవ్వుతూ.
"మరి మాకు కావాల్సినప్పుడల్లా ఎడ్జస్ట్ చేద్దామన్నారుగా!" కోపంగా అడిగాడు మహారాజు.
"అన్నాను! ఇప్పుడు ఎడ్జస్ట్ అవడం లేదు. అయినా సినిమాకు ముఖ్యం దర్శకుడే అనీ, నటుడు ఉన్నా లేకపోయినా సినిమా విజయవంతమవుతుందనీ స్టేట్ మేంటిచ్చారుగా! నేను లేకపోతె మాత్రం ఏముందీ? సినిమా తీసి పారేయండి!" అన్నాడు నవ్వటం ఆపి.
మహారాజుకి వళ్ళు మండిపోయింది.
"నువ్వెవరితో మాట్లాడుతున్నానో తెలుసా?"
"తెలుసు. చెత్త జానపద చిత్రాలు నిర్మించే ఓ పరమ చెత్త దర్శకుడితో " అని ఫోన్ పెట్టేశాడు పెద్దనటుడు.
మహారాజుకి వళ్ళు మరీ మండిపోయింది. మిగతా సీన్లలో ఆ పెద్ద నటుడు లేకుండానే సినిమా పూర్తి చేసి రిలీజ్జేసి పారేశాడు. ఆ సినిమా రెండు వందల రోజులు ఆడి ఇంకా ఆడుతూనే వుంది. తను కేవలం రెండు సీన్లలోనే ఉన్నా ఆ సినిమా అన్ని రోజులు ఎలా అడుతోందా అని ఆశ్చర్యపోయి తనే ఆ సినిమా చూడ్డాని కెళ్ళాడు పెద్ద నటుడు. సినిమా చూస్తూనే గుండెలు బాదుకుని మూర్చబోయాడతను."
ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అంది -
"నిర్మాతా! మిగతా సీన్లలో ఆ పెద్ద నటుడు లేకుండా మహారాజు ఆ సినిమా ఎలా పూర్తి చేశాడు? హీరో కేవలం రెండు సీన్లలోనే కనిపించినా ఆ సినిమా ఎలా విజయవంతమయింది? ఆ సినిమా చూసి ఆ పెద్ద నటుడు ఎందుకు గుండెలు బాదుకుని మూర్చబోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం...."
"తెలుసులే ఆహా. అపశకునం పలక్కు." విసుక్కున్నాడు నిర్మాత. సెన్సార్ పలకలేదు.
నిర్మాత విసుగు నుంచి , కోలుకుని ఇలా అన్నాడు.
"నీ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లో అవుటయిపోయిన పరీక్ష పేపర్లా ఉన్నాయి. ఆ మహారాజు జానపద చిత్రాల స్పెషలిస్టు అని చెప్పినప్పుడే అందులో కిటుకు నాకర్ధమయిపోయింది. మహారాజు రెండో సీన్ లో హీరోకి దూప్ పెట్టి హీరో ఓ ఋషి శాపం వల్ల చిలుకగా మారిపోయినట్లు చూపించి వుంటాడు. అక్కడి నుంచీ సినిమా అంతా హీరోయిను మీదా చిలుక మీదా నడిచి ఉంటుంది. చివర్లో మళ్ళీ చిలుకకు శాపం విమోచనం అయినట్లూ, హీరో, హీరోయినూ ఏకమయినట్లూ జనానికి ఎలాగూ అర్ధమయిపోతుంది. శాపవశాత్తూ హీరోలు చిలకలుగానూ, పిచ్చుకలు గానూ, మిడతలుగానూ, తూనీగలుగానూ, గొర్రెలు గానూ, మారిపోవడం , మళ్ళీ శాపవిమోచనమవగానే మామూలు రూపం పొందటం మన ప్రేక్షకులకు ఏనాడో అలవాటు చేశారు. కాబట్టి, అ పక్షులు, జంతువులూ కొంతామంది నటీనటుల కంటే బాగా యాక్షన్ చేస్తాయి కాబట్టి ఆ సినిమా మాములుగానే విజయవంతమయింది. మహారాజు చేసిన ట్రిక్ చూసి పెద్ద నటుడు, గుండెలు బాదుకుని మూర్చబోయి ఉంటాడు."
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.
***