Previous Page Next Page 
చీకటి తొలగిన రాత్రి పేజి 17

 

    "ఏం, ఎందుకు బాగుండదు , నీకేనా బాగుంటుంది. నాకు కావాలని కొనుక్కున్నాను. నేనివ్వను . కావలిస్తే నీకు మరొకటి కొంటాను. కానీ ఇదడగకు" అనేది కోపంగా. సావిత్రి వార్డ్ రోబ్ నిండా ఈ మధ్య వాయిల్సు, జార్జేట్సు, నైలాన్సు , డ్రయిలాన్స్, ఎల్ ఫార్స్ వగైరా వగైరా లన్నీ చేరుస్తుంది. తండ్రి, కూతుళ్ళు కొన్నాళ్ళు ఆశ్చర్యంగా చూశారు.
    ఓసారి కృష్ణమూర్తి వుండబట్టలేక అడిగేశాడు.....'ఏమిటి ఈ చీరలు నీకా.....కొంటుంటే , యింకా పద్మ కేమో అనుకున్నాను' అన్నాడు సావిత్రి తీక్షణంగా చూసింది....
    "ఏం నేను కట్టుకోకూడదనా ఆ చీరలు మీ ఉద్దేశంలో."
    "అబ్బే..... అడుగుతున్నాను ....ఆ చీరలు చూస్తే అలా అనిపించింది.....పిల్లలకేమో అనుకున్నాను...." నానుస్తూ అన్నాడు.
    "ఫాషన్స్ తెలీకపోతే సరి...... ఇప్పుడంతా ఇలాంటివే కట్టుకుంటారు...." ఏమనలేక వూరుకున్నాడు కృష్ణమూర్తి.
    'అమ్మా స్లీవ్ లెస్ బాగులేదమ్మా నీకు. చేతులున్న జాకెట్టు తొడుక్కుంటెనే బాగుంటుంది" అంది ఓసారి పెద్ద కూతురు. వళ్ళు మండి పోయింది సావిత్రికి. ఇదీ తనకి చెప్పడమేనా! అంటే నలబై ఏళ్ళ దానివి నీకు స్లీవ్ లెస్ ఏమిటనా దాని ఉద్దేశం.
    "నీ అభిప్రాయం అడిగినప్పుడు చేపుదువుగానిలే.....నోరు మూసుకుని వెళ్ళవతలకి" అని కసిరేసింది.
    ఇలాగే ఎన్నో సందర్భాలలో తన వయస్సు వెల్లడయ్యేట్టు ఎవరయినా ఏ చిన్నమాట అన్నా సావిత్రి సహించేది కాదు.....తండ్రి, పిల్లలు సావిత్రిలో వస్తున్న మార్పులు చిత్రంగా చూసేవారు.

                                              *    *    *    *
    ఆరోజు కాలేజీలో వార్షికోత్సవాలు అవుతున్నాయి. పద్మ రెండు మూడు కాంపిటీషన్స్ లో ప్రైజ్ లు గెల్చుకుంది. అంతేకాక ఓ నాటకంలో పోర్షను కూడా వుంది. అంచేత ప్రత్యేకం ఇంటరెస్టు తో వెళ్ళారు సావిత్రి కృష్ణమూర్తి.
    కృష్ణమూర్తి, సావిత్రి ఆహూతులస్థానాల్లో కూర్చున్నారు. ఏవేవో వెరైటీ ఎంటర్ టెయిన్ మెంట్స్ జరుగుతున్నాయి.....అవి చూస్తుంటే వెనక రెండు వరసల తర్వాత కూర్చున్న కొందరు స్టూడెంట్లు మాటలు అప్రయత్నంగా సావిత్రి చెవుల్లో దూరాయి. తన గురించి వినగానే సావిత్రి శ్రద్దగా ఆ మాటలు వినడం ఆరంభించింది.
    "వరేయ్ ......ఎవరు రోయ్ ఆవిడ.....మహా టిప్ టాప్ గా వుందే....."
    "ఎవరు ఆ గులాబి షిఫాన్ చీరావిడా? థర్డ్ బి.ఏ పద్మజ లేదూ వాళ్ళమ్మ...."
    "నిజం!"
    "ఏం, అంత ఆశ్చర్యం ...."
    'అంత కూతురుండి యివిడీ వేషం ఏమిటి! ...పద్మజ మోడెస్ట్ గా ఉంటుంది. యీ విడేమిటి చిన్నపిల్లలా కూతుర్ని మించి తయారయింది....'
    'అంతేలే.....ఎప్పుడూ అలాగే తయారవుతుంది .....నలబై ఏళ్ళు ఉండి పాతికేళ్ళ దానిలా కనిపించడానికి తాపత్రయపడ్తుంది ....పద్దెనిమిదేళ్ళ దానిలా ప్రవర్తిస్తుంది .....ఇంకా ఇవాళ కాస్త నయం.....ఒకోసారి చూడాలి ఆ వేషం.....ఓ ఆ లిప్ స్టిక్ లు, ఆ కనుబొమ్మలు దిద్దుకోడం, ఆ రంగులు , ఆ చీరలు, అ వేషం బాగా వేస్తుందిలే...."
    "నలబై వుంటాయంటావా/ అన్ని ఏళ్ళ దానిలా లేదురా....'
    "నీ మొహం .... ఆ మేకప్ తీసేసినప్పుడు చూడు.....లైట్ల వెలుగులో దట్టంగా కొట్టిన మేకప్ లో దూరానికి అలాగే కన్పిస్తుంది.....అయినా ఇరవై ఏళ్ళ కూతురుంది....అది చాలదూ నిదర్శనం.....అంత  కూతుర్నీ ఉంచుకొని యీవిడో చిన్నపిల్లలా తయారవడానికి సిగ్గేయదేమో...."
    వాళ్ళు రహస్యంగా మాట్లాడుకున్నాం అనుకుని అన్న మాటలన్నీ అక్షరం పొల్లుపోకుండా సావిత్రి చెవుల్లో దూరాయి.....సావిత్రి మొహం నల్లబడి పోయింది. ఛ....ఛ....వెధవలు .... ఎంత నీచంగా , అసభ్యంగా మాట్లాడుతున్నారు తన గురించి.....సావిత్రి శరీరం వణికింది ఎందుకో. వెనక్కి తిరిగి చూడాలని ప్రయత్నించి వెనక్కి తిరగాలేకపోయింది. ప్రక్కన భర్త విన్నాడేమో అన్న అనుమానంతో చూసింది. కృష్ణమూర్తి పోగ్రాం లో లీనమయ్యాడు. మరోక్షణం అక్కడ వుండలేక పోయింది సావిత్రి. ఏదో చెప్పి ఇంటి కొచ్చేసి ప్రక్క మీద వ్రాలిపోయింది.
    ఆరాత్రి ఒక్క క్షణం నిద్ర పట్టలేదు సావిత్రికి. ప్రొద్దుట లేస్తూనే బాత్ రూమ్ లో అద్దంలో మొహం చూసుకుంటుంటే .....మేకపు లేని మొహం..... బిగువు సడలి జారిన చెంపలు కళ్ళ క్రింద నల్లటి మచ్చలతో..... కాస్త లోతుకు పోయిన కళ్ళు.....రంగు తగ్గిపోయిన మొహం ....ఒకవంతు నేరసిపోయి వెండితీగల్లా మెరుస్తున్న జుత్తు....ఓ నలబై ఏళ్ళ ఆకారం కనపడి -- త్రుళ్ళిపడింది సావిత్రి. మళ్ళీ ....మళ్ళీ చూసుకుంది అద్దంలో..... ఎంత చూసుకున్నా....ఒక్కొక్కసారి చూస్తున్న కొద్దీ ....ఒక్కో ఏడు పైబడి వయసు పెరుగుతున్న సావిత్రిలా ఆకారం కనిపిస్తుంది తప్ప....పాతికేళ్ళ సావిత్రి అద్దంలో కనబడడం లేదు......
    వెధవ అద్దం.....ఎంత అబద్దం ఆడింది....ఎంత మోసపుచ్చింది ఇన్నాళ్ళు!....ఆ క్రీములోషన్స్ బాటిల్సు తీసి అద్దం మీద విసిరేయాలన్నంత ఆవేశం వచ్చింది సావిత్రికి. ఈలోపల కృష్ణమూర్తి 'ఏం చేస్తున్నావు లోపల .....ఎంతకీ రావేం/ కాఫీ యీయవేమిటి?' అని కేక వేయగానే నెమ్మదిగా యివతలికి వచ్చింది." 'అలా వున్నావేం' అన్నాడు. ఆశ్చర్యంగా భార్య మొహంలోకి చూస్తూ.
    "ఏం లేదు' భారంగా అంటూ వంటింటిలోకి వెళ్ళిపోయింది సావిత్రి.
    ఆరోజు ఆదివారం , ఉదయం ఇంగ్లీషు మార్నింగ్ షోకి వెళ్ళడం అలవాటు, ఆరోజు సావిత్రికి వెళ్ళాలని లేకపోయినా మంచి సినిమా అని కృష్ణమూర్తి బలవంతం చేశాడు.

 Previous Page Next Page