"సరే. మొదటిది చెబుతున్నాను విను. రేపు మనకీ, క్లినికల్స్ కి క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, అందులో నువ్వు సెంచరీకొట్టాలి. తెలిసిందా? ఒక్క రన్ తక్కువయినా వీల్లేదు. సెంచరీ సాధించాలి."
7
ప్రి-క్లినికల్స్ కూ, క్లినికల్స్ కూ క్రికెట్ మ్యాచ్ మొదలయింది.
ప్రి-క్లినికల్స్ కు రాజా, క్లినికల్స్ కు దివాకర్ కెప్టెన్స్.
మెడికల్ కాలేజి స్టూడెంట్స్ ముప్పాతికవంతు వచ్చారు.
టాస్ వేశారు.
దివాకర్ గెలిచాడు. మొదట బ్యాటింగ్ చెయ్యటానికి ఎలెక్ట్ చేశారు.
క్రికెట్ మొదలయింది.
మాధవి, కల్యాణి కూడా ఆట చూస్తున్నారు. అసలు కల్యాణికి క్రికెట్ గురించేమీ తెలియదు. కాని మాధవి బలవంతంమీద వచ్చింది. మాధవికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. తాను రాజాని సెంచరీ కొట్టమంది. దీన్ని దివాకర్ తో చెప్పి వంద పరుగులలోపలే అందర్నీ అవుటవ్వమని చెబితే? దివాకర్ సంగతి, తనకర్థమయింది. ఏం చెప్పినా చేస్తాడు... కాని ఆమెలోని చిత్తశుద్ధి ఈ ఆలోచనని నివారింపచేసింది. ఒకవేళ దివాకర్ టీమ్ సహజంగానే వంద పరుగుల లోపలే అవుటయిపోతే? అప్పుడు రాజా పరీక్షలో ఓడిపోయినట్లు కాదా? సెంచరీ కొట్టడానికి అవకాశమే లేకపోతే ఎలా ఓడినట్లవుతుంది? ఈ ఆలోచనలన్నీ త్రోసిపుచ్చి చూద్దాం ఏం జరుగుతుందోనని మ్యాచ్ తిలకిస్తూ ఊరుకుంది.
రాజా బౌలర్ కాదు. గబగబ ప్లేస్ మెంట్స్ మార్చి ఫీల్డింగ్ ఎరేంజ్ చేస్తున్నారు. ఆకాశంలో ఎక్కడా మబ్బులు లేవు. నీరెండగా వుండి వాతావరణం ఆహ్లాదం కలిగిస్తోంది.
మొదటి రెండు వికెట్లూ గబగబ పడిపోయాయి. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఇద్దరూ బౌలర్ల ధాటికి తట్టుకుని ఫిఫ్టీరన్స్ పార్టనర్ షిప్ చేశారు. అక్కడ్నుంచీ బ్యాట్స్ మన్ కొంచెమో గొప్పో కొడుతూ స్కోర్ పెంచుతూనే వున్నారు. చివరకు లంచ్ అయిన ఓ అరగంటకు నూటఎనభై పరుగులు చేసి అంతా అవుటయ్యారు.
పరి-క్లినికల్స్ బ్యాటింగ్ మొదలయింది. రాజా ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా వచ్చాడు.
ఫాస్ట్ బౌలర్ దివాకర్ ఎటాక్ మొదలుపెట్టాడు.
మొదటి బంతి సర్రున దూసుకువచ్చింది. తాను గొప్ప ఫాస్ట్ బౌలర్ నన్న దివాకర్ మాట బొత్తిగా కొట్టి పారెయ్యటానికి వీల్లేదు. అందులో అందగత్తె అయిన ఆడపిల్లముందు బెట్ కాశాడు. ఆ ఆడపిల్ల జనంలో కూర్చుని ఈ ఆట చూస్తోంది. ఈ సర్వశక్తులూ కేంద్రీకరించి వీరావేశంతో వీరాంజనేయుడిలా విజృంభిస్తున్నాడు.
మొదటి బంతి రాజా కంటికి కనిపించనంత వేగంగా వచ్చింది. బ్యాట్ విసిరేలోపల ప్రక్కనుంచి దూసుకుపోయింది. రెండో బంతి బౌన్సర్, రాజా తలకు అడుగు ఎత్తున ఎగురుతూ గాల్లోకి వెళ్ళిపోయింది. మూడోబంతి వికెట్స్ మీదకు మెరుపులా వచ్చింది. ఆఖరి సెకనులో అతికష్టంమీద వికెట్ ని కవర్ చేసుకోగలిగాడు. నాలుగు అయిదుసార్లు కూడా బ్యాట్, బంతి దోబూచు లాడుకున్నాయి. ఆరోసారి ఆ ఓవర్ లో ఆఖరిబంతి రెట్టించిన వేగంతో దూసుకువస్తోంది. రాజా చాలా నిశితంగా చూసి బ్యాట్ విసిరాడు. బ్యాట్ బాల్ కు కనెక్ట్ అయింది. అంతే. ఫీల్డర్స్ ఎటుపోతుందో గమనించే లోపల ఎక్కడో బంప్ పడి వాయువేగంతో దొర్లుకుంటూ వెళ్ళి బౌండరీలైన్ దాటింది.
ప్రేక్షకులలో చప్పట్లు. అనుకోకుండా కల్యాణి కూడా చప్పట్లు కొట్టేసింది. మాధవి ఆమెవంక క్రీగంట చూసేసరికి నాలిక కొరుక్కుని చేతులు క్రిందకు జార్చింది.
దివాకర్ ముఖమంతా ఎర్రబడగా బంతిని రెండో బౌలర్ వైపు ఎగరేసి తాను ఫస్ట్ స్టెప్ పొజిషన్ లోకి వెళ్ళి నిల్చున్నాడు.
ఆట క్రమంగా సాగుతోంది. రాజా మెల్లగా సెటిల్ అయాడు. మొదట గోలీకాయ కన్న చిన్నగా కనిపించిన బంతి రానురానూ అతని కళ్ళకి ఫుట్ బాల్ సైజులో కనబడుతూ చెప్పినట్లు మాట వింటూ ఎటు కొడ్తే అటు పోతోంది. కవరి డ్రైవ్, స్కేవర్ డ్రైవ్ - ఆన్ డ్రైవ్, హుక్, ఉవుల్- యధేచ్చగా పరుగులు తీయసాగాడు.
అవతలివైపు ప్రతి పదిహేను రన్సుకూ ఒక్కో వికెట్ పడిపోతోంది. దివాకర్ వీరవిహారం చేస్తున్నాడు. స్కోరు నూటయాభైకి పెరిగేసరికి ఎనిమిది వికెట్లు పడిపోయాయి. అప్పటికి రాజా ఎనభై పరుగులతో వున్నాడు. దివాకర్ కి ఆరు వికెట్లు వచ్చాయి. అలుపూ సొలుపూ లేకుండా ఇంకా బౌల్ చేస్తూనే వున్నాడు.
రాజా సెంచరీ చేయాలంటే ఇంకా ఇరవై పరుగులు చేయాలి. మ్యాచ్ గెలవాలంటే ముప్ఫయ్ ఒక్క పరుగులు చెయ్యాలి. చేతిలో వున్నవి రెండే వికెట్లు, వాళ్ళిద్దరూ బౌలర్లు, సరిగ్గా బ్యాట్ పట్టుకోవటం కూడా చేతకాదు.
దీనికితోడు సూర్యుడు పడమటి దిక్కుకు వాలిపోతూ, వెలుగు బాగా తగ్గిపోయి గ్రౌండ్ అంతా నీడలు వ్యాపిస్తున్నాయి.
ఓవర్ మారింది కాబట్టి అవతలి బ్యాట్స్ మేన్ కు దివాకర్ బౌల్ చేస్తున్నాడు. చాలా క్లోజ్ ఫీల్డింగ్ ఏర్పాటు చేశాడు. ఫీల్డర్సంతా బ్యాట్స్ మేన్ కు క్లోజ్ గా నిలబడలేదు. దివాకర్ స్పీడ్ తగ్గించి ఇంచుమించు స్పిన్ బౌలర్ వేసినట్లుగా వేశాడు. బ్యాట్స్ మేన్ ని టెంప్ట్ చేద్దామని అతని ఉద్దేశం. లూజ్ బాల్ కనుక అతను కొడితే క్యాచ్ తీసుకోవచ్చు. ఎలాగైనా సింగిల్ కొట్టి ఇటువైపు పరుగెత్తుకు వచ్చేస్తే తాను స్ట్రెక్ తీసుకోవచ్చు గనుక. అలాగే పార్టనర్ కు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి అవసరమైతే ముందుకు దూకడానికి రాజా రెడీగా వున్నాడు.
చాలా లూజ్ బాల్ వచ్చింది. సింగిల్ కొడదామనుకుని అనుకోకుండా గట్టిగా బ్యాట్ విసిరేశాడు. బంతి పైకి లేచింది. "క్యాచ్, క్యాచ్" అని అరుస్తున్నాడు దివాకర్. క్లోజ్ గా వున్న ఓ ఫీల్డర్ చేతులు జాపాడు. అతని చేతులు తప్పించుకుని వేగంగా దొర్లుకుంటూ పోయి బౌండరీలైన్ దాటింది. జనం చప్పట్లు, ఈలలు. రాజా పార్టనర్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించి మళ్ళీ పొజిషన్ లోకి వెళ్ళి నిలబడ్డాడు.
అతని పార్టనర్ ఈసారి సింగిల్ తీసి, అటువైపు పరుగెత్తుకు వెళ్ళాడు.
బ్యాటింగ్ రాజాకి వచ్చింది. ఆ ఓవర్ లోనే ఒక ఫోర్ కొట్టి, చివరి బాల్ సింగిల్ తీసి రెండోవైపుకు పరుగెత్తుకు వెళితే తర్వాత ఓవర్ ఫేస్ చెయ్యడానికి రెడీ అయ్యాడు.
స్కోరు ముందుకు జరుగుతోంది.