Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 17


    పైగా ఆమెకు సహకరించేందుకు విల్సన్, భవాని వ్యాన్ దిగి ఆమె దగ్గరకు వచ్చారు.

    ఊరేగింపు శ్మశానం గేటులోకి తిరిగింది.

    ఆమె చటుక్కున వ్యాన్ దిగి కెమేరాను అందుకొని "నేను టాప్ మీదకు ఎక్కుతాను. కెమెరాను అందించండి. క్విక్...." అంది చకచకా పైకెక్కేస్తూ.

    విల్సన్ చటుక్కున కెమెరాను అందుకొని పైకెత్తి పట్టుకున్నాడు.

    పైకెక్కిన హంపీ కెమెరాను ఆత్రుతగా అందుకొని పొజిషన్ సరి  చూసుకొని శ్మశానం మధ్యకు వెళ్తున్న ఊరేగింపుపైకి కెమెరాను ఫోకస్ చేసింది.

    శవాన్ని ఓ చోట దింపారు.

    శవం చుట్టూ రెండొందల మంది దాకా ఉన్నారు. ఇద్దరు కట్టెలు పేరుస్తుంటే అనిల్ శవం కేసే చూస్తూ నిలబడ్డాడు. అతనికి అంతసేపు నటించవలసి రావటం చిరాగ్గా ఉంది. కాని కళ్ళముందు నూటయాభై  కదలాడుతుండటంతో కిమ్మనకుండా ఉండిపోయాడు.

    హంపి జూమ్ తో అనిల్ మొఖం మీదకు వెళ్ళిపోయింది. అతనిమోములోని ప్రతిభావాన్ని అతి సునిశితంగా రికార్డ్ చేసుకుపోతోంది హంపి చేతిలోని కెమేరా.

    వ్యాన్ దగ్గర నిశ్సబ్దం అలుముకుంది.

    ఆ వ్యాన్ లో ఉన్న యూనిట్ సభ్యులకు తెలుసు-ఆ దృశ్యాన్ని ఆమె ఎక్కడో సందర్భం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటుందని.

    శవం మీద కట్టెలు పేర్చటం పూర్తయింది.

    కుండ తీసుకుని అనిల్ శవం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు పూర్తిచేసాడు.

    ఒకతను అనిల్ కి కొరివి అందించాడు.

    క్కడ జరుగుతున్న ప్రతి మూమెంట్ ని హంపీ భుజం మీదున్న కెమెరా  నిశ్శబ్దంగా రికార్డు చేసుకుపోతోంది. సాయం సంధ్య బ్యాక్ డ్రాప్ గా ఉండటంతో దృశ్యం అద్భుతంగా ఉంది.

    అనిల్ తన చేతిలోని కొరివిని శవం తలకు దగ్గరగా తీసుకువచ్చాడు. అప్పటి వరకు శవాన్ని అనిల్ చూడలేదు. అనిల్ మరింత దగ్గరగా వచ్చాడు.  అతనికెందుకో ఒక్కక్షణం అనిపించింది-ఆ శవాన్ని చూద్దామని. కాని ఆచారం ప్రకారం చూడనివ్వరు. అంతసేపు నూటయాభై కోసం ఏ శవం కోసం ఏడ్చాడో దాన్ని ఖచ్చితంగా చూడాలనే పట్టుదల పెరిగింది.

    అతని ప్రయత్నంలోని ప్రతి మూమెంట్ని శ్మశానం గోడ ప్రక్కగా  నిలిపిఉన్న వ్యాన్ పైనున్న కెమేరా రికార్డ్ చేసుకుపోతోందని అతనికి  తెలీదు అతనికే కాదు, అక్కడున్న ఎవరూ ఆ విషయాన్ని గమనించలేదు.

    శవానికి మరింత దగ్గరగావచ్చి చటుక్కున తలతిప్పి చూసాడు.

    అంతే! అప్పుడు అతను పెట్టిన కేక ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా ప్రతిధ్వనించిపోయింది. కేక వేస్తూనే మొదలు తెగినచెట్టు లా  విరుచుకుపడిపోయాడు.

    నారాయణ్, టాగూర్, అనిల్ ప్రవర్తనకు షాక్ తిన్నారు.

    కేవలం నటించమంటే ఇలా చేసాడేమిటి?

    ఈలోపు హంపీ వ్యాన్ దిగి హడావిడిగా శ్మశానంలోకి వచ్చింది.

    "పాపం ఎవరతను....?" హంపీ ఠాగూర్ ని ప్రశ్నించింది.

    "పాపంలేదు... ఏం లేదు..... నూటయాభై ఇస్తానంటే నటిస్తున్నాడంతే...." అన్నాడు ఓ ప్రక్క అనిల్ విరుచుకుపడిపోవటంవల్ల ఆశ్చర్యపోతూ.

    "నటిస్తున్నాడా?" హంపీ షాక్ తింది ఈసారి.

    "అవును నూటయాభై ఏడుపది" నారాయణ్ కల్పించుకుంటూ అన్నాడు.

    ఆమె అనిల్ నటనను తెలుసుకొని చకితురాలైంది. కేవలం నటనా..... అంత అద్భుతంగా నటించగలవారున్నారా?

    ఎంత గొప్ప ఎక్స్ ప్రెషన్స్....?

    తనప్రాణానికి ప్రాణమైన తల్లి చనిపోయినప్పుడు ఆమెతో గొప్ప అటాచ్ మెంట్ పెచుకున్న కొన్న కొడుకు ఎంతగా విలపిస్తాడో అంతగా ఇతను విలపిస్తున్నాడు. ఇదంతా కేవలం నటనా?

    ఆమెకు ఆ అద్భుతాన్ని జీర్ణించుకోవటం కష్టమైపోయింది.

    "ఏంటిరా .....మరీ....అంతా ఓవర్ గా ఏక్ట్ చేస్తాడు.నిప్పంటించేసి నూటయాభై తీసుకొని రాక...." టాగూర్ చిరాకు వ్యక్తంచేశాడు.

    పడిపోయిన అనిల్ లేవక పోవడంతో నారాయణ్ కి  అనుమానం వచ్చింది.

    వడివడిగా ఆ వేపుకేసి వెళ్లాడు.

    అనిల్ ఏడుపు నటించేందుకు పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయారు.

    నారాయణ్ అనిల్ ప్రక్కన కూర్చుని "అనిల్.....అనిల్..." అంటూ కదిపి చూశాడు.

    ఫలితం కనిపించలేదు.

    టాగూర్ ను దగ్గరకు రమ్మని సైగచేసి "నీళ్ళు పట్టుకురా" అన్నాడు.

    హంపీ ఉన్న చోటే ఉండిపోయి అనిల్ గురించే ఆలోచిస్తోంది.

    టాగూర్ నీళ్ళు తెచ్చి నారాయణ్ కి అందించాడు. నారాయణ్ అనిల్ మొహంమీద నీళ్ళు చిలకించాడు.

    కట్టెలా బిగుసుకు పోయిన అనిల్ అప్పటికి కొద్దిగా కదిలాడు.

    నారాయణ్ మరికొంచెం నీళ్ళు చల్లి, భుజాల్ని గట్టిగా పట్టుకొని కదిపి చూశాడు.

    అనిల్ అప్పటికి కళ్ళు తెరచి శవంకేసి చూసి, ఒక్క ఉదుటున ఆవేపుకు పాకి, తిరిగి ఏడవడం ప్రారంభించాడు.

    "ఏమిట్రా ఏమైంది.....?ఎందుకలా ఇంకా ఏడుస్తావ్? ఇకచేల్లే తలకొరివి పెట్టేస్తే నూటయాభై తీసుకుని వెళ్ళిపోవచ్చు" టాగూర్ చిన్నగా అన్నాడు.

    టాగూర్ ని విసిరి కొట్టి తిరిగి శవంపై పడ్డాడు అనిల్.

    ఈసారి నారాయణ్ షాక్ తిని ఏదో జరిగుంటుందని ఊహించాడు.

    "నాకు చెప్పు.....నిజం చెప్పు.... ఏం జరిగింది? ఎందుకలా ఫెయింట్ అయిపోయావ్.....? ఓ ముసలి శవానికి ఇంత ఎటాచ్ మెంట్ పెట్టుకుంటే ఎలా? ఇదంతా కడుపు నింపుకోటానికే కదా?" సౌమ్యంగా సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు నారాయణ్.

    అనిల్ అప్పుడు ఓసారి తలెత్తి నారాయణ్ వేపు చూసి "కన్న తల్లిని ఈ స్థితిలో చూడవలసివస్తే...." ఆపైన అతని గొంతుకు దుఃఖం అడ్డుపడింది.

    టాగూర్, నారాయణ్ ఇద్దరూ స్తంభించి పోయారు. అనిల్ కి ఆమె కన్న తల్లా?

    అదెలా సంభవం?

    అప్పుడు గుర్తుకొచ్చాయి- అంతకు ముందు ఆ ఇద్దరు యువకులు శవ సంస్కారానికి ప్రోగుచేసుకున్న దృశ్యాలు.

    షాక్ తిన్నారు ఆ ఇద్దరు.

    బాధగా అనిల్ కేసి చూశారు.

    జరిగింది ఊహించగలిగారు.

    ఇదంతా ఆ ఇద్దరు యువకులలో ఒకడికి చిరాగ్గా అనిపించి చటుక్కున అనిల్ కి ప్రక్కగా ఉన్న కొరివి అందుకుని శవానికి అంటించేందుకు ఒకడుగు ముందుకేశాడు.

    అనిల్ చటుక్కున లేచి ఆ కొరివి అందుకున్నాడు.

    "నిజం చెప్పండి.....ఈమెను ఎవరు చంపారు?"

    ఈసారి ఆ ఇద్దరూ షాక్ తిన్నారు.

    ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు పోగుచేసుకున్నట్లు వీళ్ళకు తెలిసిపోయిందా? పైగా ఎవరు చంపాడంటాడేం?

    "నిజం చెప్పండి.....ఈమె మీ తల్లికాదు, మీ బంధువు కాదు-ఈమె శవాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్న నికృష్టులు మీరు......" అనిల్ కళ్ళలో ఎరుపు జీర కనిపించి వారు కొద్దిగా కంగారుపడ్డారు.

    టాగూర్ లేస్తూనే ఒకడి కాలర్ పట్టుకున్నాడు.

    "నిజం చెప్పండి....."

    ఆ ఇద్దరికీ భయం పట్టుకుంది.

    "ఏదో శవాన్ని అడ్డం పెట్టుకుని నాలుగు డబ్బులు సంపాదించు కుందామని ఆశపడ్డమాట వాస్తవం.... అంతేగాని ఈమెను మేం  చంపలేదు. ఈమె ఎవరోకూడా మాకసలు తెలీదు. నిన్నసాయంత్రం రైల్వేస్టేషన్ కి ప్రక్కగా  పడుంది. ఈమె ప్రక్కగా ఓ సంచి కనిపించింది. దొంగతనం చేద్దామనిపించి దగ్గరగా వెళ్ళి సంచిని మెల్లగా లాగే  ప్రయత్నం చేసాం. కానది వీసమెత్తుకూడా  కదలక పోవడంతో అనుమానం వచ్చి చూస్తే అప్పటికే ఆమె చనిపోయి ఉంది. మేము నిరుద్యోగులం. ఎలాగోలా బ్రతకాలి. అందుకే శవాన్ని మేముండే చోటుకి తెచ్చాం. డబ్బులు వసూలు చేసుకోవాలంటే హృదయ విదారకంగా ఏడవాలి. అది మాకు రాడు. అందుకే ఒకరికి నాలుగు డబ్బులిచ్చి పెట్టుకుంటే కలెక్షన్ బావుంటుందనిపించింది.....అంతే.... అంతకు మించి మాకేం తెలీదు...."

    అనిల్ గుండె శతధా ముక్కలయింది.

    మూగబోయింది.

    తనేదో ఉద్యోగం చేసి ఉద్దరిస్తానని కలవరించింది.

    తులసి నీళ్ళు వదులుతానని కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూసుంటుంది.....

    ఆ నమ్మకం పోయాకే అమ్మ తన కోసం ఆరాట పడుంటుంది. ఆఖరి  చూపుకోసం తపించిఉంటుంది.

    భర్త బ్రతికున్నంత కాలం నాటకాల మత్తులో మునిగి నమ్ముకున్న భార్యను నట్టేట ముంచితే-కొడుకన్నా సుఖపెడతాడనుకుంటే కొడుకు సైతం ఆ దారిలోనే వెళ్తున్నాడని తెలిసి గుండె పగిలిపోయి ఉంటుంది.

    అనిల్ కిప్పుడు కళ్ళెంట నీళ్ళు రావటంలేదు.

    చూపులు పేలవంగా ఉన్నాయి.

    నిశ్శబ్దంగా తల్లి శవం దగ్గరకు నడిచి ఆమె కాళ్ళమీద శిరస్సు వంచాడు.

    టాగూర్ కి, నారాయణ్ కి గుండె చిక్కబట్టినట్లయింది.

    అనిల్ గుండెల్లోని బాధ కరిగేవరకు మౌనంగా ఉండిపోయి అప్పుడు ఇద్దరు దగ్గరకు వెళ్ళి "ఇప్పుడిక చేయగలిగిందేం లేదు. తలకొరివి అంటించు" అన్నారు నిర్లిప్తంగా.

    అనిల్ తిరిగి కొరివిని అందుకుని శవానికి అంటించి ఒక్కసారి టాగూర్ ని పట్టుకుని  బావురుమన్నాడు.

    దూరంగా ఉండి చూస్తున్న హంపీకి ఇదేం అర్థంకాలేదు.

    ఏమిటి జరుగుతోందక్కడ?

    ఆమె కెమేరా ఆఫ్ చేసి వ్యాన్  దగ్గరకు  వెళ్ళిపోయింది.

    భగ్గున మంటలు ఒక్కసారి నింగి కెగసాయి. ఆ మంటల్లోకి చూస్తుండి పోయారు ఆ ముగ్గురు నిర్లిప్తంగా.

    ముందుగా స్పృహలోకి వచ్చిన నారాయణ్ "అమ్మతోపాటు ఉన్న సంచి  ఎక్కడుంది?" అనడిగాడు.

    "ఇంటి దగ్గరుంది.....మీరు మాతో వస్తే ఇస్తాం" అన్నారా ఇద్దరు ముందుకి నడుస్తూ.

    నారాయణ్ వారితోపాటు వెళ్ళిపోయాడు.

    టాగూర్ మాత్రం అనిల్ తోటే అక్కడే ఆ చితిమంటల ప్రక్కే ఉండి పోయాడు.

 Previous Page Next Page