Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 17


    "నువ్వా ఏసుపాదం! ఏమిటిలా పొద్దుటే వచ్చావు?" అంది సీతమ్మ.

    "అయ్య...." ఆపైన నోరు పెగలలేదు ఏసుపాదంకి,

    "అబ్బాయ్ నైట్ డ్యూటీకెళ్ళాడు. ఇంకో గంట, గంటన్నరకి గాని రాడు."

    "చెప్పాను కదా, ఏదన్నా అర్జెంటా?"

    శృతి కాఫీ తాగటం పూర్తిచేసి ముందు గదిలోకి వచ్చింది.

    "అదిగాదు అమ్మా! రాత్రి నేనూ డ్యూటీలో వున్నాను. అయ్య.....అంతే మళ్ళీ ఏసుపదం నోరు మూసుకు పోయింది.

    ఊ, ఏమయిందో త్వరగా చెప్పు." అంటూ ముందు కొచ్చింది.

    ఏ వార్తా వినాలో అన్నట్లు సీతమ్మ హృదయం ముందే దడదడ లాడింది.

    "అయ్యకి ఈ నెల క్యాష్ లో పనమ్మా! రాత్రి డ్యూటీలో సరుకు లెక్కించిన తాలూకు డబ్బు మూడు లక్షలుంది. అది జాగ్రత్త పెట్టటం అయ్యది. మరో అయ్య చంద్రంగారిదీనమ్మా! తెల్లవారుఝూమున ఇన ప్పెట్టే తెరిచి వుంది. క్యాష్ లేదు. చద్రం అయ్యగారు కుర్చీలో ఒరిగి వున్నారు. ఎవరో బాగా మత్తు ఇచ్చారు. మన అయ్య......"

    "ఊ, అన్నయ్య కేమయింది చెప్పు." శృతి అరిచింది.

    "అయ్య కనబడటంలేదు. మూడు లక్షలు క్యాష్ తీసుకుని పారిపోయారని స్టేషనంతా గగ్గోలు, పోలీసు లోచ్చారు. అంతా గోలగా వుందమ్మా! కాసేపాగితే ఇక్కడికి వస్తారు. మనసు ఆగక ముందుగా వచ్చి చెప్పానమ్మా?" ఏసుపాదం తలవంచుకుని చెప్పాడు.

    సీతమ్మ చలనం లేనట్లు అలా నుంచుండి పోయింది.

    "అన్నయ్య కనపడటం లేదా! క్యాష్ మాయం అయిందా!" శృతి తెప్పరిల్లి  అడిగింది.

    అలాగే నెమ్మదిగా పక్కకి ఒరిగిపోతున్న సీతమ్మని ఏసుపాదం చూశాడు. "అమ్మా" అంటూ గబుక్కున ముందుకొచ్చి సీతమ్మని పట్టుకున్నాడు. పక్కనే నుంచున్న శృతి కూడా చటుక్కున తల్లిని పట్టుకుంది.

    ఏసుపాదం, శృతీ కలిసి సీతమ్మని మంచం మీదకు చేర్చారు.

    "అమ్మకి తెలివి తప్పింది. కాసిని నీళ్ళు పట్టుకొచ్చి ముఖాన చల్లమ్మా!" అన్నాడు ఏసుపాదం పరీక్షగా సీతమ్మ ముఖంలోకి చూసి.

    శృతి గ్లాసుతో నీళ్ళు తెచ్చి తల్లి ముఖాన చిలకరించింది.

    సీతమ్మ తెలివొచ్చి కళ్ళు విప్పింది.

    "అమ్మా!" అంది శృతి బొంగురు గొంతుకతో. తెల్లవారుఝాము వచ్చిన పీడకల, అన్నయ్య మాయం కావటం, క్యాష్ పోవటం. అన్నీ అలావుంచి హఠాత్తుగా తల్లి పడిపోవటం అతి కష్టంమీద శృతి ఏడుపు దిగమింగుకుని "అమ్మా " అంది.

    "నే బతికే ఉన్నానా?" గొణిగినట్లే అంది సీతమ్మ.

    అప్పుడే వాకిట్లోకి పోలీసు జీపు వచ్చి ఆగింది.

    "ఇప్పుడేం కాలేదు. అయ్య మంచితనం మనకు తెలియదా! పోలీసు లోచ్చారు. ధైర్యంగా వుండండమ్మా!" గబగబ అన్నాడు ఏసుపాదం.


                                                                        13


    ఏ ఆధారమూ లేంది కూర్చోటం అసాధ్యమన్నట్లు గోడకతుక్కుపోయి కూర్చుంది సీతమ్మ.

    శృతి చేతిపై తన చేయి వేసి పక్కనే కూర్చుంది శ్రీదేవి.

    శ్రీదేవి తండ్రి పరమశివంగారు ఏం మాట్లాడాలో తెలియనట్లు కుర్చీకి అతుక్కుపోయి కుర్చీలో కూర్చున్నారు.

    స్టేషన్ లో క్యాష్ తో పాటే సిద్దార్థ మాయం అయి రెండు వారాలయింది.

    అప్పుడే-ఆరోజు ఉదయమే పోలీసులు రావటం యక్ష ప్రశ్నలు వేసి వెళ్ళటం జరిగింది. గుర్తు చేయటానికా అన్నట్లు మధ్యమధ్య వచ్చి "సిద్దార్థకుమార్ వచ్చాడా?" అని అడిగి వెడుతున్నారు. డెయిలీ పేపర్లు వాటి ధర్మం అవి నిర్వర్తించాయి మూడు లక్షలు మాయం! పార్సిల్ ఆఫీసులో క్లార్క్ మాయం! అంటూ పెద్ద అక్షరాలతో ప్రచురించారు. ఇది చాలక ఇరుగూ పొరుగూ తెలిసినవారి పరామర్శలు సరేసరి. రొటీన్ గా రోజులు జరిగి పోతున్నాయి అంతే.

    "ఆ రోజునుంచి అమ్మ సరిగా భోంచేయటంలేదు. నా బలవంతాన లేచి ఏదో తిన్నాననిపించి లేస్తున్నది. అన్నయ్య ఏమయ్యాడో తెలియదు. ఆ బాధకు తోడు అమ్మ దిగులు చూడలేక పోతున్నాను. అస్తమానం కళ్ళ నీళ్ళు పెట్టుకోవడమే." అంది శృతి. ఆ తర్వాత చెప్పటం సాధ్యం కాలేదు. దోసిట్లో ముఖం దాచుకుంది.

    "ఏయ్, ఏమిటీ పిచ్చిపని! ధైర్యంగా వుండాల్సింది నీవు. మీ అమ్మకి దైర్యం చెప్పాల్సిందిపోయి నీవే ముందుగా.....ఛీ.....ఛీ." అంటూ శ్రీదేవి బలవంతాన శృతి చేతులు లాగింది ముఖం మీంచి.

    శృతి కళ్ళ నీళ్ళతోనే శ్రీదేవిని చూసింది.

    శ్రీదేవి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరుగుతున్నాయి.

    పేలవంగా నవ్వి "అందరం ఒకేలా వున్నాం శ్రీ! ఎవరి నెవరం ఓదార్చు కోవాలి! ఏం చూసి ధైర్యం తెచ్చుకోవాలి?" అంది శృతి.

    "చూడు సీతమ్మా! నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. సిద్దార్థ సంగతి మనకు తెలిసిందే. ఏదో జరిగింది. ఆ లింకు వూడాలి. అసలు విషయం బైటకు రావాలి. అందాకా ఇంతే. పెద్దదానివి నువ్వు దైర్యం తెచ్చుకుని అమ్మాయిని చూసుకోవాలా, అమ్మాయి నిన్ను చూడాలా? దిగులు పడితే అయ్యే పనులవుతాయా?" మందలింపుగా అన్నాడు పరమశివంగారు.

    "సిద్దూ సంగతి నాకు తెలుసు. మీకు తెలుసు అన్నయ్యగారూ! లోకం సంగతో? ఓ ప్రక్క పుట్టెడు నిందతో చెట్టంత కొడుకు అయిపూ అజా లేకుండా పోతే ఇరుగూ పొరుగూ యక్ష ప్రశ్నలతో వేధిస్తున్నారు." అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది సీతమ్మ.

    "లోకులు పలుగాకులు అన్నారు. పనేముంది ఊరికే కావ్ కావ్ మని అరవటం తప్ప."

    "ఆ రోజు నైట్ డ్యూటీకి వెళ్ళేరోజు కొత్త గోంగూర పచ్చడి, పప్పుచారు చేశాను, బిడ్డ ఏం ఆకలిమీదున్నాడో ఏమో ఒకటికి రెండుసార్లు కలుపుకుతిని "పప్పుచారు కాస్తే నువ్వే కాయాలమ్మా! ఈ రుచి మరొకరి చేతినుంచి రాదు. మళ్ళీ ఎప్పుడు పప్పుచారు పెడతావో, ఎన్నాల్టికి తింటానో." అన్నాడు. వారానికోసారే రాత్రిళ్ళు చారు చేస్తాను. అప్పుడే రెండు వారాలయింది. ఆ రాత్రి తినటమే. ఎక్కడున్నాడో, ఏం తింటున్నాడో!" అంటూ పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంది సీతమ్మ.

    పరమశివంగారు ఏమీ మాట్లాడ లేకపోయారు.

    "వివరాలేమైనా కనుక్కున్నారా అన్నయ్యగారూ!" కాసేపాగి సీతమ్మే అడిగింది.

    "తీగ దొరికితే డొంకంతా లాగొచ్చు. ఆ తీగ దొరక లేదమ్మా! ఆ రోజు ఏం జరిగిందో ఎవరూ చెప్పలేక పోతున్నారు. తెల్లవారుజాము, పార్సిల్ ఆఫీసులో బైట మనుషులు లేరు. కూలీలు పోర్టర్లు అక్కడక్కడ వున్నా ఏ బస్తాల మీదనో పడి కునుకు తీస్తున్నారు. సిద్దార్థ, అతనితో పని చేస్తున్న అసిస్టెంట్ క్లార్క్ చంద్రం ఆరోజు పనేం కుర్రవాడు అలవాటు ప్రకారం టీ తీసుకుని వచ్చాడుట. అప్పుడు సిద్దార్థ చంద్రం ఇద్దరే వున్నారని, టీ ఇచ్చి వెళ్ళిపోయానని చెప్పాడు.

    "చంద్రం ఏమీ చెప్పలేదా అన్నయ్య గారూ!"

    "కొత్తగా ఏం చెపుతాడమ్మా! పాతపాటే, ఈ మధ్య సిద్దార్థకి కొత్తగా స్నేహం అయిన వ్యక్తి వచ్చాడుట. అప్పుడు టైము మూడు కావస్తూ వుందిట. ఆ స్నేహితుడు పిలిస్తే బయటి కెళ్ళాడుట సిద్దార్థ. తను కుర్చీలో కూర్చుని వుంటే వెనక నుంచి ఎవరో వచ్చి ముఖం మీద ఏదో గుడ్డ వేసి అదిమి పట్టారుట. తనకి  స్పృహ పోయిందట. మర్నాడు ఆసుపత్రిలోనే తెలివి వచ్చిందిట. తెలివి వచ్చింతరువాత అతను చెప్పినదాని ప్రకారం ఇన ప్పెట్టే తాళం చెవులు సిద్ధార్థ దగ్గరే వున్నాయి. "ఆ రోజు వచ్చిన డబ్బు మూడులక్షల చిల్లర. నాకేం తెలియదు___" ఆగి పోయిన రికార్డులా ఇదే మాట." పరమశివంగారు చెప్పారు.

    "ఇన్ స్పెక్టరు గారితో గట్టిగా మాట్లాడుతానన్నారుగా....."

    "అదీ అయింది. పోలీసు వాళ్ళకైనా చిన్న క్లూ దొరకాలి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడలా వుండిపోతారు. ఆ రోజు సిద్దార్థ ఆ వ్యక్తితో బైటి కెళ్ళటం ఎవరూ చూడలేదు. చంద్రం చెప్పే మాటలే. డ్యూటీలో వున్న చంద్రం చిక్కాడు గాబట్టి అతన్ని చంపుకు తింటున్నారుట పోలీసులు. చంద్రం ఆడపిల్లలా ఒకటే ఏడుపు."

    "మీ కేమనిపిస్తున్నది అన్నయ్యగారూ?"

    "అంతా అయోమయంగా వుందమ్మా! క్యాష్ మాయం కావటం వల్ల, సిద్దార్థ కనపడకపోవడంవల్ల చోరీ నేరం సిద్దార్థ మీదనే వుంటుంది. మనకి ఏమనిపిస్తుంది అంటే ఏం చెబుతాం? సిద్దార్థ ఎలాంటివాడో నాకు తెలుసు. నీ బిడ్డ ఎలాంటివాడో నీకు తెలుసు. సిద్దార్థ మూడు లక్షలు తీసుకొని ఏ విదేశాలకో పారిపోయాడంటే ఆ అనేవాళ్ళ తొందరపాటు అది."

    "అన్నయ్య కేదయినా ప్రమాదం...." సందేహిస్తూ అడిగింది శృతి.

    "డబ్బు ఎవరైనా కాజేస్తే సిద్దార్థకి కూడా మత్తుమందు వాసన చూపించో, కొట్టో అక్కడే పడేసి వెళ్ళేవారు కదా డబ్బుతోపాటు? సిద్దార్థ మాయమయాడంటే సిద్దార్థ హేండ్ వున్నట్లే అంటున్నారమ్మా! లా వారనటం సహజమే. సిద్దార్థ మీద మనకి నమ్మకమేగారూ మాట్లాడరు."

    "ఏం మాట్లాడనమ్మా శృతీ? ఏదో ప్రమాదంలో చిక్కుకున్నాడే అనుకోవాలి" నెమ్మదిగా అన్నారు పరమశివంగారు.

    "నాకూ అలాగే అనిపిస్తున్నది. అన్నయ్యది వుత్తమెతక మనసు. దైర్యం అసలు లేదు. ఏం ఆపదలో చిక్కుకున్నాడో ఏమో!" అంది శృతి.

    "డబ్బు ఎత్తుకువెడుతున్న వాళ్ళమీద సిద్దార్థ దాడి చేసి వుండవచ్చు. వాళ్ళు సిద్దార్థని మరింత చావకొటి అతన్ని వదిలేసి వెడతారు గాని డబ్బుతోపాటు ఎత్తుకు వెళ్ళరు. సిద్దార్థ మామూలు మనిషి. మామూలు ఉద్వోగి, అతనివల్ల ప్రయోజనంలేదు. సిద్దార్థ ఆరాత్రి కలుసుకున్న వ్యక్తి ఆనవాళ్ళు చెపితే. "అవును అలాంటి వ్యక్తిని సిద్దార్థ తో రెండు మూడుసార్లు చూశామని పార్సిలాఫీసురో కొందరన్నారు. కొత్త వ్యక్తి ఊరు పేరు ఎవరికీ తెలియదు. సిద్దార్థ డబ్బుతో పరారయ్యాడనుకుంటే తమని తామే అనుమానించుకున్నట్లే, ప్రమాదంలో చిక్కుకున్నా డనుకుందామా అంటే అది ఎటువంటి ప్రమాదమో ఎవరి వూహకి అందటంలేదు."

    ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు.

    "డబ్బు ఎవరైనా దొంగిలిస్తే నేరం తనమీద పడుతుందని అన్నయ్య పిరికిగా పారిపోయి వుంటడచ్చు. అయినా ఇన్నాళ్ళు కాదు, ఇంకేన్నేళ్ళు దాక్కున్నా, మాకు తన క్షేమం కబురుచేయకుండా వుండడు కదా" అంది శృతి.

    "ఉహూ వారు అలా పారిపోయే మనిషి కాదు." టకీమని అంది శ్రీదేవి.

    కూతురు వైపు విచిత్రంగా చూశారు పరమశివంగారు.

    "నీకున్న నమ్మకం ప్రపంచానికి వాడిమీద వుంటే అదే పదివేలు తల్లీ!" అంది సీతమ్మ. ఆవిడ బాధ లోకం తన కొడుకుని దొంగ అంటున్నదే అని..... 

 Previous Page Next Page