Previous Page Next Page 
ఆఖరి వీడ్కోలు పేజి 16

   
                                                                        6

    "ప్రియమైన స్వప్నా!

    నీ దగ్గరినుండి చాలా పెద్ద ఉత్తరం వస్తుందని ఎదురుచూశాను. అసలేనీ విరహంతో కాలిపోతున్న నాకు ముక్తసరిగా వ్రాసిన రెండు వాక్యాల ఉత్తరం మండే పెనంమీద రెండు చినుకుల్లా ఎండిపోయాయి; నీ ఉత్తరం బొత్తిగా ఇలా ఉంటుందని నేనుకోలేదు.

    భార్య తన భర్తకు వ్రాసే తొలి ఉత్తరంలా ఉందా అది? చదువుకొన్న యువతివి! ఎంత చక్కగానైనా వ్రాయవచ్చునే! నీకు నచ్చిన సినిమా గురించి, నీకు నచ్చిన పుస్తకం గురించి వ్రాయాలంటే ఎన్నిలేవు?

    ఈసారి ఇంతకంటే  పెద్ద ఉత్తరం వ్రాయదలుచుకో లేదు. నాకసలు కోపం వచ్చింది. నా కోపం పోవాలంటే చక్కటి ప్రణయగీతంలాంటి ఉత్తరం వ్రాయాలి నువ్వు.

    ఇల్లుకోసం చూస్తూనే వున్నాను. ఈ మూఢమి వెళ్లి పోయేలోగా ఏదో ఒక ఇల్లు ఖాయపరచుకొని వస్తాను. ఇక ఇప్పటికి వుంటాను - నీ మాధవ్"

    ఉత్తరం చదువుకొని నీరసంగా బల్లమీద తల వాల్చింది స్వప్న.

    ధర్మం పేరుతో తను మాధవ్ ను మోసగించిందా?

    మూగబోయిన హృదయవీణ తిరిగి అతడి కోసం ప్రణయగీతం ఆలపించగలదా? ఉత్తరం విషయంలోనే ఇంతగా గొడవపెట్టే మాధవ్ జీవితంలో తన ప్రవర్తనతో సరిపెట్టుకోగలడా! తను పెళ్ళి చేసుకొని పొరపాటు చేసిందేమో?

     క్లాసంతా  రణగొణ ధ్వనిగా తయారైనా స్వప్న తన లోకంలోనే వుండిపోయింది.

    పక్కగదిలో క్లాసు తీసుకొంటున్న మధుర ఈ గడొవకు లేచి వచ్చింది. "పిల్లలకి పాఠం చెప్పకపోయినా  సైలెన్స్ గా వుంచలేవూ?" విసుక్కొంది.

    స్వప్నఉలికిపాటుతో ఈ లోకంలో పడింది.  బల్లమీద గట్టిగా బాదుతూ "సైలెన్స్" అని గట్టిగా అరిచింది.
 
    క్లాసు నిశ్శబ్దమైపోయింది.

    ఇంటికి వచ్చేటప్పుడు మధురతో అంది స్వప్న. "నేను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మధూ! ఎంత ప్రయత్నించినా స్వరూప్  ఊహల్ని నా నుండి దూరం చేయలేకపోతున్నాను!"

    "బాగుంది! ఒకరికి ఇల్లాలివై అతడిని తలపోస్తూ వుంటావా?"

    "ఏం చేయను? నా వల్ల కావడంలేదు."

    "అలా నిరాశపడితే మాధవ్ గతి ఏం కావాలి? నీ సంసారంలో అపశృతి కూడా తనకి మిగలకూడదా?" వేదన సుళ్లు తిరిగింది గుండెలో.

    ఇంటికి వచ్చాక సర్వశక్తుల్నీ కూడదీసుకొని మాధవ్ కి ఉత్తరం వ్రాయడానికి కూర్చుంది స్వప్న. భావాలు కంతలు పడిన బుట్టలోంచి పాముపిల్లల్లా జారిపోతుంటే ఒక్క వాక్యమూ రాయలేకపోయింది.

    "ఉహుఁ. లాభంలేదు. మాధవ్ ని తను ప్రేమించలేదు. అతడికిన్యాయం చేయలేదు" తలపట్టుకు కూర్చుంది స్వప్న. ఇలా జరిగితే ఎలా?  భార్యా భర్తలకు కలవడం లేదని తెలిస్తే ఇటుపుట్టిల్లూ అటు అత్తిల్లూ నవ్వులపాలు కాదూ? ఇందుకోసమేనా తను స్వరూప్ ను దూరం చేసుకుంది.

    స్వరూప్! నువ్వు నన్ను వదిలిపోయినా నీ ఊహలు నన్ను వదిలిపోవడంలేదు! వెంటాడే నీ ఊహలనుండి ఎలా తప్పించుకోను?

    కలం కిందపడేసి తల పట్టుకుంది స్వప్న.

    "అక్కా! బావొచ్చాడు!"

    గతుక్కుమంది స్వప్న.

    అవతల తండ్రి మాట్లాడడం వినిపించింది. "ఇప్పుడేనా రావడం?"

 Previous Page Next Page