ఆ తర్వాత పనులు శరవేగంతో జరిగిపొయ్యాయి.
పలక బలపం తెచ్చారు. వరుస క్రమంలో పేర్లు రాశారు. రెండు "అ" లు రెండు "క" లు వచ్చాయి. అన్నపూర్ణ అరుంధతి. అరుంధతిలో సున్నా ఎక్కువ వుంది కాబట్టి ముందు అన్నపూర్ణమ్మ మాట్లాడి అ తర్వాత అరుంధతి మాట్లాడాలి అంది జయంతి. అలాగే కనకమ్మ కామాక్షమ్మల్లో కనకమ్మ ముందు మాట్లాడి అ తర్వాత క దీర్ఘమిస్తే కా... కామాక్షమ్మ మాట్లాడాలి" అంది జయంతి.
ఇది అందరికీ నచ్చింది.
ఇదే సందు అదే మందని సుందరి లేచి "సరీగా కూర్చోండి! వరుసక్రమంలో కూర్చోండి. సభంతా నిశ్శబ్దంగా వుండాలి." అంటూ అందరినీ సర్దింది..
సుందరికి తోడు మరో ఇద్దరు పిల్లలు చేరారు.
ఉత్సాహంగా మొదలైంది సభ.
జయంతి కొన్ని సూచనలు చేసింది.
"ఎవరూ బిడియ పడనక్కర లేదు. ఆ అమ్మాయి గురించి మీ మీ అభిప్రాయాలు నిర్భయంగా చెప్పండి. మీకు మంచిగాతోచినప్పుడు చప్పట్లు మధ్య మధ్య కొట్టండి. సభ అన్న తర్వాత అధ్యక్షుడు అంటూ ఒకరు వుండాలి. చాలా సభల్లో మీరు చూసే వుంటారు. కనుక మీలో ఒకరు అధ్యక్ష స్థానం అలంకరించి సభ ప్రారంభించండి" అంది జయంతి.
అధ్యక్ష స్థానం అంటే ఏమిటో స్థానంలో కూర్చున్నవాళ్ళు ఏం చేయాలో తెలియని చాలామంది చల్లగా తప్పుకుంటూ ఇక్కడ చిన్నా పెద్ద ఏమిటి అదేదో నువ్వే అలంకరించమ్మాయ్" అన్నారు.
పెద్ద తలకాయలు చేరిన ఆ సభలో పిన్న వయస్కురాలైన జయంతి అవలీలగా అధ్యక్షురాలి పీఠం ఎక్కేసింది.
మరికొద్ది సేపటిలో సభ ప్రారంభం కాబోతున్నది.
- 9 -
జయంతి లేచి నిలబడింది.
"కొద్దిసేపటిలో సభ ప్రారంభం అవుతున్నది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా వుండాలి." అంది జయంతి.
అందరు సర్దుకు కూర్చున్నారు.
"నేను అధ్యక్షురాలిని కనుక అక్షర క్రమంలో నేను వొక్కక్కరిని పిలుస్తాను. వారు వచ్చి ఈ స్టేజీ ఎక్కి మాట్లాడాలి. నేను చాలు అనగానే దిగిపోవాలి. అందుకని నేను చెప్పక ముందే మీరు చెప్పేది క్లుప్తంగా చెప్పి దిగిపోవాలి. ఎందుకంటే మనకి సమయం చాలదు కాబట్టి ఈ జాగ్రత్త అన్నమాట. ఇహ సభ ప్రారంభిస్తాను." అని మైకు ముందు నుంచున్నట్లుగానే యాక్షను చేసి పొడిదగ్గు దగ్గింది జయంతి.
"ఇంతకు ముందు బలవర్ధనమ్మగారు చాలా క్లుప్తంగా చాలా చక్కగా ఉపన్యసించారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మగారి సంగతి అందరికి తెలిసిందే. అయిదుగురు పిల్లల తల్లి. అడిగిన వారికి అడిగింది వెంటనే సాయం చేయగల దయాగుణం కలవారు. పంచదార కావాలన్నా, చింతపండు కావాలన్నా, ఉప్పు పప్పు సమస్తం యిస్తుంటారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మగారు మాట్లాడుతారు" అంది జయంతి.
అన్నపూర్ణమ్మ అమాంతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి లభ్యమైనట్లు ఆనందిస్తూ స్టేజీ ఎక్కింది.
అన్నపూర్ణమ్మగారి తర్వాత జయంతి ఒక్కొక్కరిని పొగుడుతూ పిలుస్తుంటే ఒక్కొక్కరూ స్టేజీ ఎక్కి, ఎవరికి తోచింది వారు మాట్లాడారు.
పెద్ద తలకాయలన్నీ యించుమించు ఒకటే చెప్పాయి. దీక్ష అనే ఆ ఎర్రపిల్ల ఏదో పెద్ద ప్లానువేసి అవాకులు చవాకులు రాసిన కాగితాలు పంచుతున్నది. ఆ పిల్లకి పాతికలోపు వయసని, అందంగా వుందని, మృదువుగా మాట్లాడుతున్నదని. మనం మోసపోకూడదు. అందరం ఒకతాటి మీద వుండాలి. దాంతో ఆ అమ్మాయి ఆటకట్టు. దీక్ష మన వీధిలోకి రాగానే అందరం ఓ కన్ను ఆ పిల్లా మీదవేసి వుంచాలి. ఏదైనా ప్రమాదం అనిపించగానే ఒకరు పెద్దగా కేకలు పెడితే మిగతావాళ్ళు చేతికి అందుబాటులో వున్న ఆయుధం అది అప్పడాల కర్ర కానీండి, చీపురు కట్ట కానీండి, ఏది దొరికితే అది తీసుకుని అపరశక్తి లాగా బైలుదేరి రావాలి. ఝాన్సీరాణి, రుద్రమదేవి పుట్టిన గడ్డయిది.
ఇలా ఎవరి శాయశక్తులా వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడారు.
ఆ తర్వాత అమ్మాయిలు స్టేజీ ఎక్కారు.
మార్క్సిజం గురించి ఈ మధ్యనే నాలుగు పుస్తకాలు తిరగేసిన ఓ కుర్రపిల్ల ఆవేశంతో వూగిపోతూ "కామ్రేడ్ సోదరీ మణులారా; లేవండి లేవండి. ఇటు చూస్తే మారణహోమం. అటుచూస్తే జలప్రళయం. పిడికిట్లో ప్రాణాలు పెట్టుకుని అలమటిస్తుంటే, గుప్పిటిలో గుండెకాయ నలిగి పోతుంటే పుండుమీద పుల్లలాగా ఈ విపత్తు ఏమిటి? ఎవరికి చెప్పుకోవాలి? ఏం చేయాలి?" అంటూ ఆక్రోశంతో అరిచినట్లు మాట్లాడింది.