పెళ్ళయ్యాక ఆ యింట్లో మరో వ్యక్తి రాకతో , కోపతాపాలు చూపినా పడి వుండే మనిషి దొరికాడు లతకి. ప్రసాద్ వివరాలు పెళ్ళికి ముందే తండ్రి చెప్పాడు. డబ్బులో గాని, స్థితి గతులలో గాని తమ దారిదాపులలో నిలబడే అర్హత అతనికి, అతని కుటుంబానికి లేదని తెలిసాక లతకి ఏదో నిబ్బరం, నిర్లక్ష్యం కలిగాయి. కేవలం డబ్బు కోసం తనని చేసుకుంటున్నాడని ఆమెకి తెలుసు . డబ్బు తనది కనక అంతా యధావిధిగా యిదివరకు మాదిరిగా తనదే అధికారం వుంటుంది యింట్లో. ప్రసాద్ కేవలం భర్త. తనూ యింటికి, డబ్బుకి, ఆస్థి పాస్తులకి అధికారిణి. తన కనుసన్నలలో ప్రసాద్ మెలగాలి. ఆమె మాటలకి తల్లిదండ్రులు తలలూపి ప్రసాద్ అన్ని విధాలా యోగ్యుడని , ఉద్యోగం లేక బాధపడ్తూన్నవాడు, యింట్లో పరిస్థితి అంతంత మాత్రం కనక యింత డబ్బు , ఆస్థి , ఆఫీసులో హోదా అన్నీ ఆశ చూపితే అతనే లొంగి పడి వుంటాడని పూర్వం లాగే యింట్లో అంతా వుంటుందని, ప్రసాద్ అధికారం ఏం వుండదని , కేవలం అతను తమ తదనంతరం ఆమెకి అండగా వుంటాడని , యింట్లో పసిపిల్లలు పారడానికి యీ పెళ్ళి చేస్తున్నామని, ఆమెకి వంటరితనం లేకుండా వుంటుందని నచ్చచెప్పారు. దాంతో ఆమెకి ముందు నించి ప్రసాద్ డబ్బు లేనివాడు కనుక డబ్బు కొసం ఆశపడి చేసుకుంటూన్నాడన్న నిరసన భావం ఏర్పడింది. తనతో అవసరం వుంది. ఏదో ఆశ లేనిదే ఎవరూ పెళ్ళి చేసుకోరన్న నిజం గుర్తించ కుండా డబ్బుందన్న అహంకారంతో ఏదన్నా సాధించవచ్చు . తను డబ్బు పెట్టి ప్రసాద్ ని కొనుక్కుంది అన్న ఆలోచన ఆమెలో నాటుకుంది. చిన్నప్పటి నుంచి ఎవరి మీదో ఒకరి మీద అధికారం చెలాయించడానికి అలవాటు పడ్డ ఆమె కోపాన్ని ప్రసాద్ అడుగడుగునా ఎదుర్కోవలసి వచ్చింది.
పెళ్ళయ్యాక తను, లత తనవాళ్ళు అంతా పెద్ద బంగాళా లో వుంటారని, నౌకర్లు, చాకర్లు దేనికి లోటు లేకుండా వుండచ్చని ప్రసాద్ అనుకున్నాడు. కాని అతని ఊహలకి విరుద్దంగా తను యిల్లరికపుటల్లుడిగా వుండాలని అతను అనుకోలేదు. అలా వుండాలని ముందుగా అతనితో నారాయణమూర్తిగారూ చెప్పలేదు. యింట్లో తల్లిదండ్రులకీ అనుమానం రాలేదు. పెళ్ళయి వారం, పది , పదిహేను రోజులు అల్లుడి వైభోగం అనుభవించడం అతనికి బాగానే అన్పించింది. కాని, ఎంతయినా తనది కానిచోట ఏదో యిబ్బందిగా, మొహమాటంగా అన్పించేది. వెండి పళ్ళెంలో పంచ భక్ష్య పరమాన్నాలు పెడ్తున్నా .....యింట్లో తల్లి పెట్టె పచ్చడి , చారు తిన్న తృప్తి కలగడం లేదు అతనికి. ఓ అతిధిలా .....ఎవరింట్లోనో ఎన్నాల్లుంటాం అన్న మొహమాటంతో గడిపాడు. అంతెత్తు డన్ లప్ ల మధ్య ఎయిర్ కండిషన్డ్ గదిలో అతను హాయిగా నిద్రపోవడానికి యిబ్బందిగా నిద్రరాక దొర్లేవాడు. తను ఎన్నాళ్ళు ఉండాలో ఇక్కడ యిల్లు అది మామగారు ఎప్పుడు ఎక్కడ ఏర్పాటు చేస్తారో అతనికి ఏమి తెలియలేదు. అడగాలంటే ఎవరిని అడగాలో, ఏమని అడగాలో తెలియక మొహమాట పడి వూరుకున్నాడు. వాళ్ళే చెప్తారు, వాళ్ళే ఏర్పాటు చేస్తారని మరో పదిహేను రోజులు వూరుకున్నాడు.
నెలరోజులు గడిచినా ఎవరూ ఎటువంటి ప్రసక్తి తేలేదు. పెళ్ళయిన వారం రోజులకి ప్రసాద్ ని వెంట పెట్టుకుని ఆఫీసుకి ఫ్యాక్టరీ కి అన్నింటికి తీసికెళ్ళి నాల్గురోజులు దగ్గిర వుండి బిజినెస్సు వ్యవహారాలన్నీ భోధపరచి ఆఫీసు పని అప్పజెప్పాడు నారాయణమూర్తి. అప్పటి నుంచి రోజూ ఆఫీసు కెళ్ళి వస్తున్నారు. ఏదో కాలక్షేపం బాగానే వుంది కాని, తన యింట్లో తను హాయిగా ఫ్రీగా మసలాలన్న కోరికతో యింక ఆగలేక ఓ రాత్రి లత దగ్గిర ఆ ప్రస్తావన తెచ్చాడు." మన యింటికి ఎప్పుడు వేడ్తాం లత?" అన్నాడు ప్రసాద్.
లత అర్ధం కానట్టు చూసింది.
"ఏమిటో నాకిక్కడ మొహమాటంగా వుంది ఇన్నాళ్ళు ఉండాలంటే , తొందరగా మనం వెళ్ళిపోదాం లతా?" అన్నాడు.
"ఎక్కడికి?" అంది ఆశ్చర్యంగా.
"అదే....అదే....మనకోసం మీ నాన్నగారేం యిల్లు అది ఏర్పాటు చేయలేదా ఇంకా?" ఎన్నాళ్ళని యిక్కడ వుంటాం."
"యిక్కడుండక ఎక్కడుంటాం. యిల్లెమిటి, ఏర్పాటేమిటి? ఇంత యిల్లుండగా మనకి వేరే యిల్లు ఎందుకు? తమరికీ భవంతి చాల్లేదా..... యింతకంటే పెద్ద బంగళా కావాలా " హేళనగా అంది.
ప్రసాద్ తెల్లపోయాడు. ఆమె వ్యంగ్యానికి మొహం నల్లబడింది.
"అదేమిటి.....మనం ఇక్కడే వుంటామా? మరి మీ నాన్నగారు యిల్లు , కారు...."
"ఊ....యిది యిల్లు కాదా, తిరుగుతున్న కార్లు యింకా చాలలేదా ఏమిటి మీకు?"
"మరి మావాళ్ళు ఎక్కడుంటారు ?"
"ఇన్నాళ్ళు ఎక్కడున్నారో అక్కడే. మరోసారి హేళనగా నవ్వింది.
ప్రసాద్ మొహం ఎర్రబడింది.
"ఏం మా నాన్నగారు మీకు ముందు చెప్పలేదా యిల్లరికం వుండాలని....' లత విలాసంగా నవ్వుతూ అంది.
ప్రసాద్ అదిరిపడి తలెత్తి "యిల్లరికం వుండాలా.....నేను యిల్లరికం వుండాలా?" అన్నాడు తెల్లబోతూ.
"ఊ....మీరే, ఏదో పెద్ద తెలియనట్టు అనటమెందుకు. ఏం ఈ ఆస్థి డబ్బు కోసం చేసుకున్నవారు. యిక్కడుండటం నామోషీ ఏమిటి? యిల్లరికానికి కాకపొతే నాన్నకి మీరే దొరికేరా. మీలాంటి వాళ్ళు లక్షమంది దొరికేవారు. లేనివాళ్ళను చేసుకుంటే యిల్లరికం వుంటారని చేసుకున్నాం. నాన్న బొట్టు పెట్టి వేరే చెప్పాలా ఏమిటి యిక్కడుండాలని.... అయినా నాకేం ఖర్మ నా యిల్లు, యీ దర్జా అది వదులుకుని రావడానికి" లత విసురుగా అంది.
ప్రసాద్ మొహం నల్లబడింది. 'అంటే ....నేనింక యిక్కడే వుండాలన్నమాట. మా వాళ్ళెవరూ నా దగ్గిరుండరన్నమాట. మీ నాన్న బంగళా, కారులు అంటే వేరే యిస్తారనుకున్నాను.... తప్పు నాదే. ముందే అడగవలసింది సరిగా....' ప్రసాద్ క్రుంగిపోతూ అన్నాడు.
పిలిచి పిల్లానిస్తే అలాగే వుంటుంది. ఈ డబ్బు, యీ యిల్లు, మేనేజింగ్ డైరక్టర్ హోదా యివన్నీ వూరికే మీపాటి వారు లేరని యిచ్చారనుకున్నారా! లత ఎత్తి పొడిచింది.
ప్రసాద్ ప్రాణం వుసూరుమంది. లతతో వాదించలేదు. ఆమెతో మాట్లాడిన కొద్ది మనిషిని నిలువునా తీసిపారేసి కింద పరిచి, చూపులతో హీనంగా, పురుగులా చూస్తుంది అని నెలరోజుల్లోనే తెల్సుకున్న ప్రసాద్ మరి లాభం లేదని వూరుకున్నారు. లతతో వైవాహిక జీవితం యింత అసంతృప్తిగా వుంటుందని అతను ఎన్నడూ తలచాలేదేమో అడుగడుగునా అతనికి లత వైఖరి నిరాశనే కల్గించింది. డానికి తోడు లత కాస్త సౌమ్యంగా వున్న సమయంలో కోరికతో దగ్గరకు తీసుకునే సరికి..... సన్నగా ఎండిపోయి , పుల్లల్లా వున్న కాళ్ళు, ఎముక మీద చర్మం సాగదీసి కప్పినట్లుండే ఆ రోగిష్టి కాళ్ళు చూసేసరికి అతని ఉద్రేకం దిగజారి పోయేది. డానికి తోడు నడవకుండా అనుక్షణం పక్క నంటి వుంటుందేమో పరిశుభ్రమైన గాలి, వెలుతురూ సోకకుండా ఒకే చోట కూర్చోడం వల్లనో మరెందువల్లనో ఆమె శరీరం నుంచి అదో మాదిరి వాసన, ఏ ఖరీదయిన సెంట్లకీ లొంగని ఆ వాసన వెగటు పుట్టించేది.
తన దగ్గరికి రాగానే ప్రసాద్ మొహంలో జుగుప్స స్పష్టంగా చూసేది లత. దాంతో ఆమెకి ప్రసాద్ పట్ల మరింత కసి పెరిగింది. తన డబ్బు తింటూ, తన డబ్బుతో సుఖాలనుభవిస్తూ తనని చూచి మొహం వెగటుగా పెడ్తాడా. ఈ అవకరం వుండ బట్టి కాదూ తను ప్రసాద్ లాంటి వాడికి భార్య అయింది. లేకపోతే తనకి ఏం ఖర్మ ఈలాంటి గతి లేనివాడిని చేసుకోడానికి! తాను అనుభవించలేనివి తనవల్ల అనుభవిస్తున్నాన్న కృతజ్ఞత వుండద్దూ ఆ మనిషికి. లత ఆలోచనలు అలా సాగేవి.
లత దురుసుతనం , తనని హేళనగా మాట్లాడటం, కించ పరచడం అవన్నీ ప్రసాద్ సహించలేక , ఆమె సౌమ్యంగా గౌరవంగా మాట్లాడితే నా సానుభూతి, ప్రేమ, లభించేవి , నన్ను పురుగులా , తన బానిసలా చూస్తె నేను తనని ఎలా ప్రేమించగలను, తన తప్పులేదని ప్రసాద్ తనని తాను సమర్ధించుకునేవాడు.