ఆమె విసురుగా కుర్చీలోంచి లేచి "ఎలా చెప్పగలనా?" అంది. ఆమె పెదవులు ఆవేశంతో వణుకుతున్నాయి. చేతిలో కాగితాల్ని అతడి మీదకు విసిరికొట్టింది. ఆ తర్వాత ఆమెకు దుఃఖం ఆపుకోవటం చేతకాలేదు. మొహాన్ని చేతుల్తో కప్పుకొని ఏడుస్తూ.... అందరూ నన్నే అంటారు. "నాదేముంది తప్పు? నాదేముంది?" అని తల టేబిల్ కేసి కొట్టుకోసాగింది.
కాగితాన్ని చేతిలోకి తీసుకుని విప్పేడు. కౌసల్య చేతివ్రాతని సులభంగా గుర్తుపట్టి చదవసాగేడు.
"రవన్నయ్యా,
పెద్దన్నయ్య వెళ్ళిపోయి వారంరోజులు కావస్తోంది. ఎక్కడ వున్నారో.... ఏం చేస్తున్నారో..... అసలు తింటున్నారో.....పస్తులు వుంటున్నారో...... ఏమీ తెలీదు. వాళ్ళక్కడ నానాకష్టాలూ పడుతూ వుంటే యిక్కడ మనం హాయిగా వుండటానికి ఎందుకో నాకు మనసొప్పడం లేదు. నువ్వేమో అసంకల్పితంగా వచ్చిన ఆస్థిని రక్షించటానికి తలమునకలయ్యే పన్లలో ఉన్నావు. అన్నయ్యా.... పెద్దన్నయ్య లేనపుడు మనకు ఆస్థీ.... ఈ డబ్బూ ఇవన్నీ ఎందుకు? నువ్వు చేసే ప్రయత్నాలలో లోపం వుందని నేనటం లేదన్నయ్యా.... కానీ నేనూ నా ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. దీపక్ ని కలుసుకుని పెద్దన్నయ్యని వెదకటం మొదలు పెడతా. నేనడుగుతే.....మనుష్యుల్ని పెట్టడానికి, డబ్బు ఖర్చు పెట్టటానికి దీపక్ వెనుకాడడని నా నమ్మకం. అందుకే వెళుతున్నాను. ఓ వందరూపాయలు మాత్రం నీ పర్స్ లోంచి తీసుకున్నాను. అక్కడికి వెళ్ళగానే పంపిస్తాను..... నీ చెల్లి కౌసల్య." ఉత్తరం చదివి స్థాణువులా కూర్చుండిపోయాడు రవి. కౌసల్య ఎంతో కోపాన్నీ, అసహ్యాన్నీ నొక్కి పెట్టి ఉత్తరం వ్రాసినట్టు చూడగానే అర్థమవుతోంది.
ఎవరిమీదో తెలియని కసి అతడి గుండెల్లోంచి ఒక్కసారిగా కట్టలు తెంచుకుని ప్రవహించింది.
"ఔను! నేను స్వార్థపరుణ్ణే. కాబోయే పెళ్ళాం ఆస్థి సంరక్షించటానికి స్వంత అన్నయ్యని మర్చిపోయిన వాణ్ణి. నేను చేతగాని చవటనే! కానీ మీరంతా మేధావులు కదా! లక్ష ఖర్చుపెట్టే వాళ్ళొకరు.... స్వంతంగా వెతికి తీసుకురావటానికి పోయే వాళ్ళొకరు -మీరెవరూ నాకు ముందరెందుకు సలహా ఇవ్వలేదు మరి? నేనెంత వెధవనో నాకు తెలియచెబుదామని చూస్తూ వూరుకుండిపోయారా?" అని అరుస్తూ పిచ్చివాడిలా అతడు టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి దీపక్ కి ట్రంకాల్ చేయసాగేడు.
10
ట్రైన్ నెమ్మదిగా వెళుతోంది.
కిటికిలోంచి బయటకు చూస్తూ కూర్చుంది కౌసల్య. ఆమె మనసు అంతా అస్పష్టమైన ఆవేదనతో నిండి వుంది. మాటిమాటికీ కళ్ళు సజలమవుతున్నాయి.
కంపార్టుమెంట్ దాదాపు ఖాళీగానే వుంది. ఓమూల వృద్ధదంపతులు కూర్చుని వున్నారు. ఒక సీటంతా ఎవరో ముసుగుపెట్టుకొని నిద్రపోతున్నారు.
కౌసల్య ఇవన్నీ గమనించే స్థితిలో లేదు. ఎప్పుడెప్పుడు తన గమ్యాన్ని చేరుకుందామా అన్న ఆత్రుతలో వుంది. ఆమెకి రైలు ప్రయాణం కూడా కొత్తే. ఎప్పుడన్నా ప్రయాణం చెయ్యవలసి వస్తే అన్నయ్య కారునే ఉపయోగించుకునేది. ఒక్కసారి మాత్రం ఫస్టుక్లాసులో ప్రయాణం చేసింది - అంతే.
"ఎక్కడికి వెళ్ళాలి మీరు" అన్న ప్రశ్నకి ఆమె ఉలిక్కిపడి తల తిప్పింది.
ఎదురుగా వున్న యువకుడు అడుగుతున్నాడు. చిన్న స్వరంతో ఆమె జవాబు చెప్పింది. పరాయి మగవాళ్ళతో మాట్లాడటం ఆమెకి అలవాటు లేదు. విధి ఇలా ఆదుకోకపోయివుంటే మెత్తటి ఫోంబెడ్ మీద గులాబీ మొగ్గలా పడుకొని నిద్రించవలసిన సమయం అది. నెట్టిమీద కొంగుతో, చెక్కమీద ఓ మూల కూర్చుండి వగచే సమయం కాదు.
"బంధువులింటికా.....?" అతడు అడిగేడు. ఆమెకీ ప్రశ్నకి జవాబు ఏం చెప్పాలో తెలియలేదు. అతడీ మౌనాన్ని ఇంకోలా అర్థం చేసుకొని, "ఇంట్లోంచి దెబ్బలాడి వచ్చేరా" అన్నాడు. ఆమె బిత్తరపోయి చూసింది.
అతడు చిన్నగా నవ్వి, "నేను మీ స్నేహితుణ్ణి అనుకొని చెప్పండి...." అన్నాడు.
ఆమెకి తెలిసిన ప్రపంచంలో అందరూ మంచివాళ్ళే. ఈ ఆప్యాయతకి ఆమె కరిగిపోయింది. అన్ని సంగతులూ చెప్పింది. రైలు ఏదో స్టేషనులో ఆగి మళ్ళీ బయలుదేరింది.
"చైతన్య అంటే గెడ్డం వుంటుంది కదూ" అడిగేడు.
"దానికేముంది, తరువాత పెరిగి వుంటుంది..... ఒకామె, చిన్నపిల్లవాడు మొత్తం ముగ్గురు కదూ...."
ఔన్నన్నట్లు తలూపింది.
"ఆమె పేరు?"
"కాంతిమతి."
"ఓ" అరిచేడు అతడు. "మీ అన్నయ్య 'కాంతి' అని పిలుస్తూ వుండగా విన్నాను" ఆమె మొహంలోకి ఒక్కసారిగా కాంతి వచ్చింది.
"మీరు చూసేరా?" అంది ఆశగా ముందుకువంగి, "ఎక్కడ?"
అతడు నవ్వేడు. "చూసేను" అన్నాడు. "మా వూళ్ళోనే! గుడి పక్కనే మా యిల్లు. నిన్నరాత్రి గుడి అరుగుమీదే చూసేను. మొత్తం ఇద్దరు నాకు బాగా గుర్తు. ఒకబాబుకూడా వున్నాడు."
ఆమె ఆతృతగా "ఏదీ మీ వూరు" అని అడిగింది.
రైలు నెమ్మదిగా ఆగింది.
అతడు లేచి "ఇదే మా వూరు" అన్నాడు. "రండి. మీ అన్నయ్యని కలుసుకొందురుగాని" అన్నాడు.
ఆమె అమాయకత్వం నిండిన కంఠంతో "వాళ్ళు ఇంకా అక్కడే వుంటారుగా " అని అడిగింది.
"లేకపోయినా ఆ చుట్టుప్రక్కలే వుంటారు. మీరేం కంగారు పడకండి. నా క్రింద చాలామంది మనుష్యులున్నారు. పది నిముషాల్లో మీ అన్నయ్య మీ ముందుంటారు. దిగండి" అన్నాడు.
ఆమె అతడి వెనకే రైలు దిగింది. అతనితో పాటు నడుస్తూ.... స్టేషన్ బయటున్న దట్టమైన చీకటి కబంధ హస్తాల్లోకి పయనించింది.
అంతే!
ప్రియమైన పాఠకుడా! తరువాత ఆమె ఏమైందో నాకు తెలీదు.
సుకురమా, లాలిత్యమూ, ఆభరణాలుగా, సౌఖ్యపు పరదాల మేలి ముసుగులో అపురూపంగా పెరిగిన ఆ అమాయకపు యువతి, ఒక్కసారి బయట ప్రపంచంలోకి వచ్చేసరికి పొంచివున్న మిన్నాగు కాటు! ఆ డబ్బున్న ప్రపంచంలోనే ఆమె కొనసాగి వుంటే..... ఆ లాలిత్యం ఆమెని విడిచిపోయేది కాదు. ఎత్తైన భవంతుల అంతర్భాగంలో ఎక్కడో ఎండ కన్నెరగకుండా - భర్తముందు కూర్చొని నాజూగ్గా తమలపాకులు అందించవలసిన ఆ చేతులు ఇక యిప్పుడు రాటుదేలవచ్చు. గులాబీల్ని పరిహసించే ఆ నాజూకు శరీరం మీద కొరడాల వాతలు పడవచ్చు.
తెల్లవారుజామునే లేచి స్నానంచేసి దేవుడిని ప్రార్థించే అలవాటుని, తెల్లవారుజామువరకూ మేలుకొనే అలవాటుగా ఆమె మార్చుకోవలసి రావచ్చు.
ఆమె చదువుకొన్న చదువు, ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చిన సాంప్రదాయం, ఆమె నేర్చుకొన్న సంస్కారం, ఆమె వినయం ఇవన్నీ కేవలం ఒక్క "డబ్బులేని కారణంగా" ఆమెకి ఎందుకూ పనికిరాకుండాపోవలసి రావచ్చు.
వజ్రం కూడా బంగారం మధ్యే శోభిస్తుంది. విధి దాన్ని పెకలి బయటకు తీసింది. ఇప్పుడు భవిష్యత్తు ప్రవల్హిక. ఆమె గమ్యం ప్రహేళిక.
* * *
"ఎదవ నాయాళ్ళు.....ఈళ్ళ సదువులు కాల్చనా? సంతోడికి వైద్దెం సెయ్యటానికి కూడా డబ్బులు కావాలా?.... ధూ" వూసేడు ఒకడు. వాడి గెడ్డం పెరిగి వుంది. బట్టలు చిరిగి వున్నాయి. వళ్ళో జోలెవుంది. గుండెల్లో దగ్గుంది. హృదయంలో మానవత్వం వుంది. అందుకే అన్నాడు - "తెల్లారితే బావుణ్ణు తొందరగా."
"తెల్లారితే ఏమవుద్దిరా?" అన్నాడు ఇంకో బిచ్చగాడు.....చైతన్యకి బియ్యం ఇచ్చినవాడు.
"అందరి దగ్గర డబ్బులూ కలిపితే, అందరి దగ్గర బియ్యమూ అమ్మితే మందేరాదా సంటోడికి?"
చైతన్యకి కళ్ళు చెమర్చినయ్. ఊరికి దూరంగా ఓ పాడుబడిన సత్రంలో తన చుట్టూ కూర్చున్న ముగ్గురు బిచ్చగాళ్ళలో ఓ గొప్ప మానవతావాదాన్ని చూస్తున్నాడు అతడు.
దూరంగా మెరుస్తోంది. తెల్లవారటానికి ఇంకో రెండు గంటలుంది. 'రెండు గంటలు' అనుకున్నాడు చైతన్య. 'రెండు గంటలు దాటితే....'
కానీ అతడికి ఇంక వేచి చూడాల్సిన అవసరం లేకపోయింది.
మినుక్కుమినుక్కుమని వెలుగుతున్న దీపం ఆరిపోయింది. ఆ చిన్న శరీరం నిలిచి వుండటానికి ఆఖరి నిముషం వరకూ ప్రయత్నించిన ప్రాణం కొట్టుకొని, కొట్టుకొని- ఓడిపోయి ఆ సకల చరాచర సృష్టి స్థితి లయ కారుడిలో ఐక్యం కావటానికి వెళ్ళిపోయింది.
అది ముందు గమనించినవాడు అక్కడున్న వారిలో వృద్ధుడు. అతడి జుట్టు తెల్లగా పండిపోయింది. వళ్ళు వృద్ధాప్యంతో ముడతలు పడింది. చావుకోసం ఎదురు చూస్తున్నవాడు - ఎన్నో చావుల్ని చూసినవాడు.
జ్వరంతో ఎగిరెగిరిపడే వళ్ళు నెమ్మదించగానే చైతన్య వూపిరి పీల్చుకొన్నాడు. వంటిమీద చెయ్యివేసి ఉధృతం తగ్గిందనుకొన్నాడు. కానీ అతని సంతృప్తి ఎంతోసేపు నిలవలేదు.
ఏడుపూ రాలేదు.
అంతకన్నా ఘోరమైన స్థితి..... నిర్లిప్తత..... అతడి మనసంతా శూన్యంగా వుంది.
విషయం అప్పుడే తెలిసినట్లుంది - కాంతిమతి గోడుగోడున ఏడుస్తోంది. 'బాబూ- బాబూ' అని. ఆ నిర్జీవమైన శవాన్ని కదుపుతోంది. ఆ తలని ఒళ్ళోకి తీసుకుని కన్నీటితో తడిపేస్తోంది. "నాయనా! బాబూ - ఒక్కసారి కళ్ళు తెరవరా?" అంటోంది. అతడు కళ్ళు మూసుకున్నాడు.
మేఘాల మధ్య నుంచి పూవుల రథం ఎక్కి బాబు వెళ్ళిపోతున్నాడు. తండ్రికేసి చిర్నవ్వుతో చెయ్యి వూపుతున్నాడు బాబు!! తప్పటడుగులు వేసుకొంటూ నట్టింట్లో మొన్న మొన్నటివరకూ తిరిగిన బాబు!! ఇంటికి రాగానే మీద వాలిపోయే బాబు.....
* * *
పిచ్చి మొక్కల్తో, చిన్న చిన్న దిబ్బల్తో స్మశానం మనిషిని ఆహ్వానిస్తున్నట్టు వుంది!
ఎండి మోడు అయిన రావిచెట్టు క్రింద కూర్చున్నాడతాడు.
ఇద్దరు గొయ్యి తవ్వుతున్నారు.
అతడి ప్రక్కనే వృద్ధుడు కూర్చున్నాడు.
మట్టితీసి పోస్తున్న సహచరులవేపు చూస్తూ చైతన్యని అతడు ఓదార్చాడు......"బాధపడకు నాయనా! చావుకీ, బ్రతుక్కీ మధ్య తేడా చాలా చిన్నది. నా పెళ్ళాం కన్న ఎనిమిదిమంది పిల్లల్నీ నేనిట్లానే పాతిపెట్టాను. కొన్ని చచ్చే పుట్టిన మాంసపు ముద్దలు, కొన్ని పుట్టినపుడు కదిలి, తర్వాత చలనం ఆగిన ముద్దలు - మొత్తం ఎనిమిది. అది కనేది, వాళ్ళు చచ్చేవాళ్ళు......నేనేమో యింటినుంచి స్మశానానికి స్మశానం నుంచి యింటికీ- కాలం పాములా సాగిపోయేది. ఆఖరిసారి దాన్నే పాతిపెట్టాల్సోచ్చింది. అంతే! స్మశానానికీ నాకు రుణం తీరిపోయింది. నే చచ్చినపుడు నేను రానక్కర్లేదుగా! ఎవరో తీసుకొస్తారు. ఏముంది నాయనా యిందులో.....బ్రతికితే మనకి దుఃఖం. బ్రతికినా చచ్చినా దుఃఖమే"