Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 15

    "మీకేవరూ లేరా?" నందితాదేవి అడిగింది.

    "ఉన్నారు కాని వాళ్ళంతా వుండి లేనివాళ్ళు. వాళ్ళ అవసరానికే నే కనపడతాను - నా అవసరానికి వాళ్ళెవ్వరూ చేయూత నివ్వరు."
    సర్వం అర్ధమైనదానిలా "ఓ..." అంది నందితాదేవి.

                                                        7

    హోటల్ చాలా ఆధునికంగా వుంది కాష్టిలీ హోటల్ అని నందితాదేవికి అర్ధమైపోయింది. ప్రతి రూమ్ కి ఫోను వుంది.

    నందితాదేవిని మూడో అంతస్తులో వున్న రూమ్ లో దిగవిడిచి రమేష్ సెలవు తీసుకు వెళ్ళిపోయాడు.

    రాజ్ వచ్చేలోపల ట్రిమ్ గా తయారయి టిఫెన్ కూడా చేసి రెస్ట్ గా బెడ్ మీద వాలింది నందితాదేవి. ఒక్కసారిగా గతమంతా గిర్రున కళ్ళముందు తిరిగింది. గతంలోంచి బైటపడేసరికి అరగంట దాటిపోయింది.

    వళ్ళిరుచుకుంటూ బెడ్ మీంచి లేచి రూమ్ తలుపు తీసి బైటికొచ్చింది. "గంటలో వస్తానన్నాడు. రెండుగంటలు కావస్తున్నది. రాజ్ ఏం చేస్తున్నట్లు?" ముని పంటితో సుతారంగా పెదవి కొరుక్కుంటూ నుంచుండిపోయింది.

    నెమ్మదిగా ఎదురు రూమ్ తలుపులు తెరుచుకున్నాయి.

    దాదాపు యాభై ఏళ్ళ వ్యక్తి తలుపు దగ్గరే నుంచుని నందితాదేవిని నఖశిఖ పర్యంతం చూస్తూ వుండిపోయాడు. ఒకసారి చూస్తే మరిచిపోని రూపం. పైజమా, లాల్చీలో వున్నాడు. పొట్ట బానంత వుంది. శరీరమూ లావే. తల మాత్రం చిన్నది. చాలా చిన్నది. పీచులాగా వున్న పల్చని తలకట్టు ఎండిపోయిన తాటికాయలా వుంది. పిల్లి గడ్డం, సగం చెంపలు కప్పేస్తూ సైడ్ లాక్స్, వింతగా వున్నాడు. మెడలో చైను అన్ని వేళ్ళకీ ఉంగరాలు బాగా వున్నవాడే అన్నిటా బలిసిన వాడే ననిపిస్తున్నది.

    "వీడిచూపులు తగలడ ఆ బానంత పొట్టకి కాదు- చూపులు ఆకలితో అల్లాడుతున్నాయి." అనుకుని గిరుక్కున తిరిగి రూమ్ లోకి వెళ్ళిపోయింది. తలుపులు దగ్గరగా చేరవేసి పెద్దలైటు తీసి బెడ్ లైట్ వేసి మంచంమీద అడ్డంగా పడుకుంది.

    ఎదురు రూమ్ లో వున్న వ్యక్తి కళ్ళు ఇంకా తన్ని గుచ్చి చూస్తున్నట్లే అనిపిస్తున్నది. విచిత్రమైన వ్యక్తి. ఓసారి చూస్తే మర్చిపోలేని రూపం ఆ చూపు... ఆ చూపు... తనెన్నటికీ మర్చిపోలేదు.

    టైము గడిచిపోతున్నది.

    అలసటతో నిద్రలేమితో నందితాదేవి కళ్ళుమూతలు పడ్డాయి.

    కొద్దిసేపు తర్వాత రాజ్ గదిలోకి వచ్చాడు. మృదువుగా, నెమ్మదిగా పిలిచాడు. వందనాదేవి లేవలేదు. పెద్ద లైటు వేద్దామని స్విచ్ మీదకి చేయి పోనిచ్చాడు. లైట్ వేస్తే నిద్రలేస్తుంది. ఊహూ తీయని ముద్దుతో కమ్మగా మేల్కొలపాలి. లైటువేసే ప్రయత్నం మానేసి అడుగులో అడుగు వేస్తూ మంచం దగ్గరకొచ్చి ఆగాడు.

    మొహానికి చెయ్యి అడ్డంగా పెట్టుకుని నందితాదేవి నిద్రపోతున్నది.

    రాజ్ వంగి నందితాదేవి చేతిని తొలగించి గాఢంగా ముద్దుపెట్టుకున్నాడు.

    నందితాదేవి వులిక్కి పడిలేచింది. "ఓహ్ నువ్వా! రాజ్... పృధ్వీరాజ్, తమాషాగా నన్ను ఎత్తుకొచ్చావు సుమా?" అతని కౌగిలిలోకి వదిగిపోతూ తన్మయత్వంతో అంది.

    రాజ్ గబుక్కున వందనాదేవిని వదిలేశాడు. రెండంగల్లో స్విచ్ దగ్గరకెళ్ళి పెద్దలైట్ స్విచ్ వేశాడు.

    పాల నురుగులాంటి కాంతి గదంతా పరుచుకుంది.

    అక్కడే నుంచుని నఖశిఖ పర్యంతం నందితాదేవిని పరీక్షగా చూశాడు రాజ్.

    నందితాదేవి రాజ్ దగ్గరకు రాబోతూ ఆగిపోయింది.

 Previous Page Next Page