Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 15

       
                
  9

    రాత్రి-

    పన్నెండు నలభై నిమిషాలు.

    వెంకుమాంబ, కోదండరామయ్య మంచాలమీద నుంచి నెమ్మదిగా లేచారు.

    చలికాలం. అద్దెకున్న వాళ్ళు పడుకున్నారు. గోడలు స్ట్రాంగ్ గా వుండడంవల్ల ఈ గదిలో శబ్దాలు ఆ గదిలోకి వినపడవు. అయినా కోదండరామయ్య, వెంకుమాంబ తగిన జాగ్రత్త తీసుకున్నారు.

    "వచ్చినప్పటినుంచీ చూస్తున్నాను ఎర్రపెట్టె మీదనే వాళ్ళిద్దరి కళ్ళూ వున్నాయి" తగ్గుస్వరంతో అంది వెంకుమాంబ.

    "ఆ కలర్ డిజైన్ అలాంటిది. పైగా లక్ష్మీదేవి అయిస్ కాంతం లాంటిది ఆకర్షిస్తూ వుంటుంది" అన్నాడు కోదండరామయ్య.

    "కొంపదీసి వాళ్ళు ఈ పెట్టెలో వున్నది గ్రహించలేదు కదా?"

    "అది వాళ్ళ బాబుతరం కాదు. యింక మనం రంగంలోకి దిగుదాము" అన్నాడు కోదండరామయ్య.

    ఇరువురు పెట్టె దగ్గరకు చేరారు. ఆప్యాయంగా పెట్టెనో సారి తడిమి చూశారు.

    "హారతి ఇచ్చి కొబ్బరికాయ దిగతుడిచి కొట్టావుగా!" కోదండరామయ్య అడిగాడు.

    "ఆ...హారతి యిస్తున్నాను. పంకజం లోపలికి వచ్చింది. "అదేమిటి పిన్నిగారూ! పెట్టెకి హారతి యిస్తున్నారు అంది. నరంలేని నాలుకంటూ ఒకటి ఏడిచిందిగా. చిన్న బొంకు బొంకాను. నాది చాదస్తం అనుకో, పిచ్చి అనుకో అందరూ పెట్టె బాగున్నది అనేవాళ్ళే. పెట్టెకి దిష్టి తగిలిందేమో అని హారతి యిస్తున్నాను. ఇనుముతో చేసిన పెట్టె ఇనప్పెట్టెతో సమానం అంటూ ఏదో తోచింది చెప్పాను."

    "ఇలాంటి పనులు ఎప్పుడూ తలుపు వేసుకుని చేయాలి" కోదండరామయ్య అన్నాడు.

    "నిజమే" అంది వెంకుమాంబ.

    కొదందరామయ్యకి, వెంకుమాంబకి ఆచారాలంటూ పెద్దగా లేవు. మడీ తడీ పట్టిమ్పుకూడా అంతగా లేదు. కొన్ని చాదస్తాలు, కాస్త సెంటిమెంటు, వేపకాయంత వెర్రి మాత్రం వున్నాయి.

    రాత్రి ఏడుగంటల వేళ ఎర్రపెట్టెకి హారతి యిచ్చింది. అప్పుడు పంకజం లోపలికి రావటం చూడటం జరిగింది. ఆ ఘట్టం అలా ముగిసిన తర్వాత తలుపులు వేసి వచ్చి కొబ్బరికాయ దిగతుడిచి కొట్టింది. ఆ కొబ్బరి చిప్పాలని పెరటి వాకిట్లోంచి బయటికి గిరాటేసింది.

    తను చేసిన పని ఎవ్వరూ చూడలేదనుకొంది వెంకుమాంబ.

    నిక్షేపం లాంటి కొబ్బరిచిప్పలని పారేయటం మనోరమ కంటపడింది. అదేమిటో పంకజంతో చర్చించవచ్చులే అని మిన్నకుండిపోయింది మనోరమ.

    అదలా వుండగా-

    ఈ రాత్రి-

    ఇది లక్ష్మీ ప్రసన్నం కాబట్టి శాంతికేదయినా చేసి ఎర్రపెట్టె మూత తెరుద్దామనుకున్నారు కోదండరామయ్య, వెంకుమాంబ. ఈ మధ్య ఓ సినిమాలో లంకెబిందెలు పైకి తీసేముందు హీరో హీరోయిన్లు కాస్త తతంగం చేస్తారు. ఎందాకయినా మంచిదని చాలా ముందుచూపుతో యిప్పుడు వీళ్ళు అదేపని చేస్తున్నారు.

    పెట్టెకి హారతి యివ్వటం, కొబ్బరికాయ దిగతుడిచి కొట్టటము అన్న క్రతువు ఏడుగంటలకి పూర్తిచేయటం జరిగింది. ఆ తర్వాత పని యిప్పుడు చేయాలి.

    పెట్టెపైన అరచేతి వెడల్పు పసుపురాసి మధ్యలో మూడు కుంకం బోట్లు పెట్టింది వెంకుమాంబ.

    నిమ్మకాయలు దిగ తుడిచి గది నలువైపులా పారేశాడు కోదండరామయ్య.

    ఎర్రపెట్టెకి ఇరువురూ సాష్టాంగ నమస్కారం పెట్టారు.

    "చాలుగా?" అడిగాడు కోదండరామయ్య.

    "చాలు" అంది వెంకుమాంబ.

    పెట్టె తెరిచేముందు యిలా చేద్దాము అనుకున్నారు. అలాగే చేశారు. అంతేగాని ఎక్కడకామా, ఎక్కడ ఫుల్ స్టాఫ్ అన్నది యిరువురికీ తెలియదు. "పసుపు శుభ ప్రదం రాస్తానూ" అంది ఆమె. "కుంకం మంగళ చిహ్నం బొట్టుకూడా పెట్టు" అన్నాడు ఆయన.

 Previous Page Next Page