Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 15


    "మేముండేది పై ఫ్లోర్ లోనే. ఇది నా ఆఫీసు. ఇప్పుడు చెప్పండి." అంది ప్రశాంతంగా.

    "థాంక్యూ వెరీ మచ్... మీరు ఎడిట్ చేసిన భాగాలు ఒక్కసారి చూడవచ్చా...."

    "ఓ ఎస్.....తప్పకుండా.....మాస్టర్ క్యాసెట్స్ పరిశీలిస్తే సరిపోతుంది....."

    "వాటిని ఎర్రేస్ చేయరు గదా?"

    "లేదు......మాస్టర్ క్యాసెట్స్ ని అలాగే వుంచేస్తాం....."

    "నేనెలా చూడగలను?"

    "సరీగ్గా ఒంటి గంటకు మీరు వస్తే వీడియో లాబ్స్ కెళ్ళి చూడవచ్చు...."

    "థాంక్యూ....." అంటూ లేచాడు ప్రభు.

    ఆమె చిరునవ్వుతో అతన్ని సాగనంపేందుకు లేచింది.

    "టీవీలో మీ ప్రోగ్రామ్స్ ని, సీరియల్స్ ని చూశాను. రియల్లీ సూపర్బ్.... రామాయణ్ తర్వాత అంత శ్రద్దగా చూసేది మీ ప్రోగ్రామ్స్ నే..... అందుకే పన్నెండు వేలు పోసి కలర్ టీవీ సెట్ కొన్నా బాధపడటం లేదు. "చిర్నవ్వుతో అంటూ క్రిందకు వెళ్ళిపోయాడు ప్రభు.

    ఆమె తిరిగి వచ్చి తన సీట్లో కూర్చుంది. ఫైల్ ని చేతిలోకి తీసుకొని ఒక్కో పేజీ తిరగేస్తూ దూరదర్శన్ అభ్యంతరాలు తెలిపిన సీన్స్ ని, డైలాగ్స్ ని చూడసాగింది.


                      *    *    *

    కృష్ణా ఒబరాయ్ రూమ్ నెంబర్ 906.....ఆ గది లోపల నిశ్శబ్దంగా ఉంది.

    నిశ్శబ్దంగా ఉన్న గదిమధ్య మౌనంగా పచార్లు చేస్తున్నాడు జయధీర్.

    అక్కడే ఓ సోఫాలో కూర్చున్న దాదా జయధీర్ కేసి చూస్తున్నాడు ఉండుండి.

    'సార్' దాదా సోఫాలోంచి లేస్తూ అన్నాడు.

    ఏమిటన్నట్లు తలెగరేశాడు జయధీర్.

    "మిమ్మల్ని పట్టుకొనేందుకు పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రభు అనే పోలీసాఫీసర్ ని నియమించినట్లు తెలిసింది. అతను మనం గోవాలో ఉండగా వచ్చాడు. ఆమెను కలిశాడు. ఆ తరువాత ఆమె ఇక్కడకు వచ్చింది. అతనూ వచ్చాడు. ఈ రోజూ ఉదయం నేను హంపీ ఆఫీసు దగ్గర కాపేసి ఉండగా తను కారులో వచ్చి, హంపీ ఆఫీసులోకి వెళ్ళి పడి నిముషాల  తరువాత తిరిగి వచ్చాడు. రహస్యంగా మీపై వలపన్నే ప్రయత్నాలేమన్నా జరుగుతున్నాయేమోనని నాకనుమానంగా ఉంది....." దాదా నెమ్మదిగా అన్నాడు.

    "ఆ రోజు నేను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగుతున్నప్పుడు ఒక టీవీ కేమేరా యూనిట్ పనిచేస్తుండటాన్ని గమనించాను.....అయితే మాకు చాలా  దూరంలో కెమేరా యూనిట్ ఉంది. జూమ్ ఉపయోగిస్తే తప్ప ప్రయాణీకుల్ని స్పష్టంగా చూపించటం కష్టం. ఎందుకైనా మంచిదని తలను బాగా వంచుకున్నాను...."

    "జూమ్ ఉపయోగించిందీ లేనిదీ ఎలా తెలుస్తుంది?"

    "అది తెలుసుకోవాలంటే......మాస్టర్ క్యాసెట్స్ ని చూడాల్సిందే...." జయధీర్ పచార్లు చేస్తూనే ఉన్నాడు.

    తిరిగి గదిలో నిశ్శబ్దం అలుముకుంది.

    అలా రెండు నిమిషాలు అలుముకుంది.

    "బహుశా, ఆ రోజు షూటింగ్ చేసింది ఆమేనేమో....?:"

    దాదా ఉలిక్కిపడ్డాడు.

    "ముందా విషయం" కనుక్కో..... జయధీర్ ఓ చోట ఆగి అన్నాడు.

    "అలాగే సార్..... ఇకపోతే మరో వారం రోజులే ఉంది వినాయకనిమజ్జనం...."

    "నాకు గుర్తుంది.....నువ్వు మరో పనిచేయాలి. నిమజ్జనం ఊరేగింపు సాగే రూట్ ని నోట్ చేసుకో. ఆ తరువాత ఆ రూట్ లో ఉన్న విలువైన షాపుల్ని మార్క్ చేయి ముఖ్యంగా గోల్డ్, డైమండ్స్ ఉన్న షాప్స్ ని ముందుగా గుర్తించు. ఆ షాప్స్ పేర్లు, ఏరియా స్పష్టంగా రాయి. ఆ షాప్స్ కి రోడ్ కి మధ్య  ఎన్ని అడుగుల దూరం ఉందో కూడా స్పష్టంగా  గుర్తించాలి. వెంటనే నిమజ్జనం రూట్ ని ఓ మేప్ లో మార్క్ చేయి. ఖరీదైన షాప్స్ దగ్గర రెడ్ మార్కర్ తో ఇంటు మార్కు పెట్టు...." అతను చెప్పుకుపోతున్నాడు.

    ఓ ప్రమాదకరమైన పతకమొకటి నిశ్శబ్దంగా ఉన్న ఆ నాలుగు గోడల మధ్య క్రమంగా రూపుదిద్దుకుంటోంది.


                                          *    *    *

    "మిస్టర్ విల్సన్! వినాయక నిమజ్జనం ఇంకా వారం రోజులే ఉంది. మనం దాన్ని ఈసారి బాగా షూట్ చేయాలి. నిమజ్జనం రూట్ ని మార్క్  చేసి ఎత్తయిన బిల్డింగ్స్ ని గుర్తించు. ఆ రోజు మనకు కనీసం నాలుగు యూనిట్స్ కావాలి. ఒకటి నిమజ్జణానికి బయలు దేరిన జన సమూహం ముందుగా వెళ్తుండాలి. కానుక మారుతీకారు బ్యాక్ డోర్ లేపేసి అక్కడ అరేంజ్ చేయాలి. మిగతా మూడు యూనిట్స్ ఎత్తయిన బిల్డింగ్స్ పై అరేంజ్ చేయాలి. నేను ఓ యూనిట్ ని, మీరో యూనిట్ ని, భవాని ఓ యూనిట్ ని ఆపరేట్ చేయాలి. నాలుగో యూనిట్ ని ఆపరేట్ చేసేందుకు మంచి టీవీ కెమేరామెన్ ని చూడాలి..... మూడు యూనిట్స్ ని రెంట్ కి తీసుకోండి....."

    విల్సన్ ఆమె చెప్పే వివరాల్ని నోట్ చేసుకుంటున్నాడు.


                     *    *    *

    రోజూ ఉదయాన్నే పెరటి గోడ దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టే అనిల్ అనిపించకపోయేసరికి ఆమెకేదో వెలితిగా అనిపించింది. పరధ్యానంగా తన పనిలో నిమగ్న మయింది.

    కొద్ది నిమిషాలకు పని పూర్తయి పోయింది. అయినా అతను కనిపించలేదు.

    ఎప్పుడూ అనిల్  వచ్చి నించుండేవేపు కొద్ది క్షణాలు చూసింది.

    అంతలో అక్కడకు నారాయణ్ వచ్చాడు. ఆమెకు అతన్ని చూడగానే నీరసం ముంచుకొచ్చింది. ఎప్పటిలాగే వాడేసిన కాఫీపొడిని తీసుకొని గోడ దగ్గరకు వెళ్ళింది.

    "మీ ఫ్రెండ్ లేరా?"

    అలా బయటపడకూడదనుకున్నా ఆమెకు తెలీకుండానే అడిగేసింది.

    నారాయణ్ ఆమె వేపు చిర్నవ్వుతో చూస్తూ "తెగ సిగ్గుపడిపోతున్నాడు..... ఇప్పటికి వాడు సుమారు ఐదారొందల నాటకాలు ఆడాడు. కాని ఎప్పుడూ ఆడపాత్ర వేయలేదండి. నిన్ననే మొదటిసారి వేశాడు. అదీ మేం బలవంతం చేశాం. అప్పటికీ మీకా విషయం చెప్పవద్దని ప్రామిస్ తీసుకున్నాడు. కానీ చిత్రం చూశారా? మీరు  చెప్పేవరకు ఫలానా పాత్రలో ఉంది అనిల్ అని గుర్తించలేకపోయాం....."

    "మీ ఫ్రెండ్ మంచి ఆర్టిస్టు.....అవకాశం అంటూ వస్తే.....మంచి డైరెక్టర్ చేతిలో పడితే పెద్ద స్టార్ అయిపోగలడు....." అంటూ కాఫీ పొడిని అందించింది.

    అతను కృతజ్ఞతలు చెప్పి పొడి తీసుకొని బస్ కేసి వెళ్ళిపోయాడు.

    ఆమెకు సరదాగా ఉంది అనీల్ ని ఏడిపించాలని.

    నారాయణ్ ని వెళ్ళనిచ్చి ఆమె బస్సుకేసి నడిచింది నిశ్శబ్దంగా.

    "నిన్నడిగింది తెలుసా?"

    "ఎవరు?" టాగూర్ నారాయణ్ తెచ్చిన కాఫీపొడి సుద్దను గిన్నెలో వేసి నీళ్ళు పోస్తూ అన్నాడు.

    "ఎవరేంటి శిరీష..."

    అప్పటివరకు బద్దకంగా పడుకొని వున్న అనిల్ చటుక్కున  లేచి కూర్చున్నాడు.

    "ఎవర్ని అడిగింది.......?" ఆతృతగా అడిగాడు.

    "టాగూర్ ని" నారాయణ్ కావాలనే అబద్దం చెప్పాడు.

    అనిల్ చిరాగ్గా చూస్తూ "మైండ్ లేని వెధవ.....వాడ్నేందుకు అడుగుతుంది? నన్నే అడిగుంటుంది.....సరీగ్గా విన్నావా?"

    అనిల్ మొఖంలో కనిపించిన ఉక్రోషాన్ని చూసి ఇద్దరూ నవ్వు కున్నారు.

    "అసలు మీ ఇద్దరి మూలంగానే ఇదంతా.....నేను హీరోయిన్ పాత్ర  వేస్తున్నట్టు అసలు మీరే చెప్పి ఉంటారు...."

    "నువ్వు మంచి ఆర్టిస్టువట. అవకాశం అంటూ వస్తే గొప్ప నటుడవై పోతావట..... ఆమె మాటలు విన్నాక నాకూ అదే అనిపించింది......"

    "అనిల్ ఆశ్చర్యంగా నారాయణ్ కేసి చూశాడు.

    "నిజంగానే అంది..... నీ మీద ఒట్టు. నిజంగానే నువ్వు మంచి నటుడివిరా..... మేమింత కాలం నీ ప్రతిభను గుర్తించలేక పోయాం. కనీసం హీరోయిన్ పాత్రలో ఉంది నువ్వనేది కూడా శిరీష చెప్పేవరకు గుర్తించలేకపోయాం."

    "మీరు నన్నేం కాకా పట్టక్కర్లేదు. శిరీషకు ఆ రోజు అక్కడ  నాటకం ఉందని చెప్పింది మీరే....."

    "లేదండి పాపం..... వాళ్ళనేం అనకండి. అయినా ఆడపిల్ల వేషం  వేస్తే లేదుగాని అంటే వచ్చిందా..?"

    ముగ్గురూ ఉలిక్కిపడి చూశారు.

    అక్కడ శిరీష నవ్వుతూ నిలబడి ఉంది. అనిల్ కెవ్వున కేకేసి ఓ సీటు  చాటుకు వెళ్ళి నించున్నాడు.

    ఆమె సిగ్గుపడుతూ తలవంచుకుంది.

    "మీరు పదండి.....నేనొస్తాను" అన్నాడు అనిల్ సిగ్గుపడుతూ.

    "ఈ రోజు లుంగీ వంతు నారాయణ్ గారిదా? మార్చేపోయాను" అంటూ బస్ లోంచి క్రిందకు దిగింది.

    రెండు నిమిషాలకు బట్టలేసుకుని క్రిందకు వచ్చాడు అనిల్.

    "నటన అంటే మీ కిష్టమా? చాలా నాటకాలు వేశారట కదూ?" శిరీష అడిగింది.

    అనిల్ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాడు.

    "అవును..... అది...... మానాన్నగారినుంచి వచ్చింది. ఆయన ఓ గొప్ప నటుడు. ఆయన నాటకం ఫలానా ఊర్లో అని తెలిస్తే చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. నేనంటే మా నాన్నకు చాలా ఇష్టం. ఎప్పుడూ నన్ను ఆయనతోనే తిప్పేవారు. అది మా అమ్మకు  ఇష్టముండేది కాదు. ఆస్తి అంతా నాటకాలకే తగలేస్తున్నారని మా నాన్నగార్ని మందలిస్తుండేది. అయినా ఆయన వినేవారు కాదు. ఆస్తి అంతా కరిగి పోయింది..... ఆఖరికి సత్య హరిశ్చంద్ర నాటకంలో కాటికాపరి వేషం వేస్తూ స్టేజీమీదే ప్రాణాలు విడిచారు."

    ఆ మాటలు చెబుతున్నాప్పుడు అనిల్ కళ్ళ లోతుల్లో తొంగిచూసిన విషాదాన్ని శిరీష గుర్తించింది.

    "మానాన్నగారు నేనో మంచి నటుడ్ని కావాలని కలలు కనేవారు. మా అమ్మ నేను బుద్దిగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని ఆశ పడేది..."

    అతని మాటలు భారంగా ఉన్నాయి.

    "అందుకోసమైనా మీరు టీవీ లో చేరాలి. అప్పుడే కదా మీ నాన్న గారి కోరిక నెరవేరేది....." కబుర్లు  చెప్పుకుంటూ ఇద్దరూ నడుస్తున్నారు.

    "చాలాసారు ప్రయత్నించాను. ఏ టీవీ సీరియల్ నిర్మాత దగ్గరకు వెళ్ళినా మా వాళ్ళే చాలామంది ఉన్నారు వేషాలు వేసేందుకు.....వెళ్ళిరా అన్నదే సమాధానం....."

    అప్పటికే వాళ్ళిద్దరూ చిన్న హొటల్ దగ్గరకు వచ్చారు.

    "టిఫిన్ చేద్దామా?" అడిగిందామె.

    అతను సమాధానం ఇవ్వలేదు.

    "ఎనీ ప్రాబ్లమ్.....డబ్బు నా దగ్గరుంది...."

 Previous Page Next Page