Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 15


    ఆయన కంగారుపడి లోపలి వెళ్ళి షర్టు వేసుకొని, మెడికల్ చెస్ట్ పట్టుకొని వచ్చి "పద" అన్నాడు.
   
    ఇద్దరూ ఇంటికి చేరుకొనేసరికి రాధ పరిస్థితి అలాగే వుంది.
   
    ఆయన ఆమెను పరీక్షిస్తున్నంతసేపూ పాణి ముళ్ళమీద నిలబడ్డట్టే వున్నాడు.
   
    ఆయన ఇంజెక్షనిచ్చి బయటి కొస్తూంటే పాణి ఆత్రుతగా "ఎలా ఉందండీ?" అని అడిగేడు.
   
    "ఏమీలేదు తగ్గిపోతుంది."
   
    పాణి కొంచెం తటపటాయించి, "అబార్షన్ కాదుగా" అన్నాడు.
   
    ఆయన నవ్వి, అతని భుజం మీద చేయివేసి, "నువ్వేం కంగారుపడకు పొద్దునకల్లా అంతా సర్దుకొంటూంది". అని, అతని చేతిలో నాలుగు మాత్రల పాకెట్ ఇస్తూ "గంట కొకటి వెయ్యి" అన్నాడు.
   
    ఆయన్ని సాగనంపటానికి బయటికొచ్చేడు.
   
    "నేను మళ్ళీ రేపొద్దున్నే వస్తాను, ఈ లోపులో ఏదన్నా కంగారు చేస్తే వెంటనే రా హాస్పిటల్ కి తీసుకెళదాం."
   
    కన్నీళ్ళతో పాణి అప్రయత్నంగా తల ఊపేడు. ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా ఒక క్షణం అలాగే అచేతనంగా నిలబడి, నెమ్మదిగా లోపలికొచ్చాడు. రాధ నిస్త్రాణంగా పడుకొని వుంది.
   
    "ఎలా వుంది?" పక్కమీద కూర్చుంటూ అడిగాడు.
   
    నీరసంగా నవ్వి, "ఫరవాలేదు. కొద్దిగా తగ్గింది" అంది. మాత్ర ఇచ్చి, మంచినీళ్ళు అందించేడు. అది వేసుకొని పడుకొంది. ఆమె మంచం దగ్గిరగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు.
   
    మూడయింది.
   
    చిన్న పిల్లతెమ్మెర అలలా వచ్చి కాలెండర్ని కదిపింది. సృష్టి అంతా ఏదో చిత్రమైన అనుభూతి పొందుతూ నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఎక్కడో తీతువు పిట్ట వికృతంగా అరిచింది. మళ్ళీ నిశ్శబ్దం.
   
    అకస్మాత్తుగా పాణికి భయం వేసింది. ఏవో రెండు చేతులు......తను విశ్వసించగలిగే రెండు చేతుల మధ్య అంతా మరచిపోయి నిశ్చింతగా విశ్రాంతి తీసుకోవాలనే తపన!
   
    కిటికీలోంచి వెన్నెల జల్లు పడుతూంది. టేబిల్ లైట్ వెలుతురు గోడల మీద ప్రతిబింబిస్తూంది. అంతా నిశ్శబ్దం.
   
    టైమ్ చూసుకొన్నాడు.
   
    నాలుగు.
   
    లేపి మాత్ర ఇద్దామనుకొన్నాడు. రాధ గాఢంగా నిద్రపోతూంది. నిద్ర పాడు చెయ్యటం ఇష్టం లేకపోయింది. మాత్ర ఇవ్వకపోతే మళ్ళీ ఏదన్నా ప్రమాదిస్తే? శాస్త్రిని అడుగుదామనుకొని, మళ్ళీ నవ్వు కొంటాడేమోనని ఊరుకున్నాడు.
   
    అయిదు నిమిషాలు మీమాంస! వద్దనే నిర్ణయానికొచ్చేడు.
   
    అనూరాధ పక్కకి తిరిగి పడుకొంది. వత్తయిన వెంట్రుకలు చెంపమీదనుంచి పక్కకి జారితే పాపికొండల మధ్య ఒయ్యారంగా మెలికలు తిరిగే గోదావరి అతనికి జ్ఞాపకం వచ్చింది. "నీకూ నాకూ మధ్య నీడలా పడిన నిశీధి నీ జుట్టు" ఎవరు వ్రాసేరు? రాధ కోసమేనా?
   
    ఇప్పుడిప్పుడే గాంభీర్యాన్ని నింపుకొంటున్న అనూరాధ....కొండల్లోనూ కోనల్లోనూ దూకుడుగా పారే సెలయేరు జీవనదై ఒడుదుడుకుల్ని తనలో నింపుకొన్నట్టు - ఎంత చిలిపిగా అల్లరి చేసేది ఒకప్పుడు!     తను మాత్రం! ఏమైపోయింది తన అల్లరంతా? తనూ పెద్దవాడై పోతున్నాడు. బాధ్యత తెలుస్తూంది. తనకో పాప. తరువాత ఇంకో పాప- ఈ ఎమోషన్స్ ఉండవప్పుడు. వీటికన్నా అతీతమైన బంధం- చాలా గౌరవప్రదమైన అనుబంధం.
   
    అనూరాధ కళ్ళు విప్పింది. ఎదురుగా కుర్చీలో కూర్చుని నిద్రలేమి వల్ల ఎర్రబారిన కళ్ళతో తనలోంచి శూన్యంలోకి చూస్తూ కూర్చున్న భర్తని చూసి కంగారు పడింది.
   
    ఆమె కళ్ళు విప్పటం చూసి పాణి ఆత్రుతగా ముందుకు వంగి, "ఎలా వుంది?" అన్నాడు.
   
    ఆమె నవ్వి, "బాగా కంగారు చేసేనా?" అంది.
   
    పాణి మాట్లాడలేదు.
   
    రాధ అతన్నే పరీక్షగా చూస్తూ, "అప్పట్నుంచీ మెలుకువగానే ఉన్నారా?" అంది.
   
    "ఆయన గంటకోసారి ఈ మాత్రలు వెయ్యమన్నారు. నువ్వేమో గాఢ నిద్రలోవున్నావు. లేపలేదు నేను" సంజాయిషీ ఇస్తున్నట్టు చెప్పేడు.
   
    "మీరు పడుకోవచ్చుగా అనవసరంగా నిద్ర పాడుచేసుకోవటం దేనికి?" అంది.
   
    పాణి ఆమెనో చిన్నపిల్లని చూసినట్టు చూసి, "నీ మొహం నీకు తెలియదులే ఆ వర్రీ" అన్నాడు.
   
    రాధ అతనివైపు తదేకంగా ఓ క్షణం చూసి, "ఒకసారి ఇలా వస్తారా?" అంది.
   
    పాణి అర్ధంకానట్టు "ఎందుకు?" అన్నాడు.
   
    "చెబుతాను."
   
    పాణి ఆమె దగ్గరగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఆమె మందస్వరాన అంది. "నాకేం తెలియదు. తెలుసుకొనే జ్ఞానం లేదు. అందుకే మీ ప్రశ్నకి ఆ రోజు సమాధానం చెప్పలేక పోయేను. అంత భాష రాదు నాకు, కానీ -"
   
    పాణి అయోమయంగా ఆమెవైపు చూస్తూ "ఏమిటి నువ్వు చెబుతూంది" అన్నాడు.
   
    ఆమె అతని జుట్టులోకి వేళ్ళు జొనిపి, చప్పున అతన్ని దగ్గిరగా లాక్కొని నుదుటిమీద ముద్దు పెట్టుకొని, "అర్ధమయిందా ప్రేమంటే?" అంది.   
       
   
                                                                --* * * *--

 Previous Page Next Page