Previous Page Next Page 
మళ్ళీ తెల్లవారింది పేజి 15

    'వచ్చినయ్!' రెండు ఇన్ లాండ్ కవర్లతో పాటు ఆహ్వానం వున్న కవరు కూడా అందించింది. నీళ్ళు తోడడానికి కన్నట్లు లోపలికి వెళ్ళిపోయింది.
    ముందు ఉత్తరాలు చదువుకున్నాడు. ఆ తర్వాత ఇన్విటేషన్ కార్డు చూశాడు. భార్య అలా వుండడానికి కారణం అర్ధమయ్యింది.
    'చూశారా?'
    'ఏమిటి?'
    'అదే! నీకొడుకు పంపిన ఆహ్వానం'
    'చూశాను. మంత్రి కూడా వస్తున్నాడట'
    'వాళ్ళ మామగారి పేరు మీద ఆహ్వాన పత్రిక వేశాడు.'
    'తప్పేముంది. ఆయనేగా నర్సింగ్ హోమ్ బిల్డింగ్ కట్టించాడు'
    'అది మనకివ్వాల్సిన కట్నం డబ్బుతోనేగా?'
    'పిచ్చిగా మాట్లాడకు. కట్నం మన డబ్బు ఎలా అవుతుంది? అది వాడి డబ్బు. కాదు ఆ అమ్మాయి డబ్బు. ఇప్పుడు కట్నం ఇవ్వడం తీసుకోవడం అపరాధం తెలుసా?'
    'ఎవరు తీసుకోవడం లేదు కట్నం? అదివరకు పీటల మీద పదిమంది మధ్యా చదివించేవాళ్ళు. ఇప్పుడు రహస్యంగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు'.
    'ఇంతకీ నీ గోల ఏమిటో నాకు అర్ధం కావడం లేదు' విసుక్కున్నాడు కామేశ్వరరావు.
    'మీకెందు కర్దమవుతుంది నా బాధ?'
    'అదే చెప్పమంటున్నాను. నీ బాధ ఏమిటో?'
    'వాణ్ణి ఇంతవాణ్ణి చేసింది ఎవరండీ? మీరెక్కల కష్టం మీద వాణ్ణి డాక్టర్ను చేశారు. మీరు తండ్రి. ఆహ్వానం తండ్రి పేరు మీద పంపించొద్దూ?'
    'ఇదా నీ బాధ?' తేలిగ్గా అనేశాడు.
    'అదికాదు.'
    'మరి ఇంకా ఏమిటి?'
    'కనీసం మనల్ని రమ్మని ఒక్క ముక్కయినా రాశాడూ? పరాయివాళ్ళకు పంపినట్టు ఆహ్వాన పత్రిక పోస్టులో పడేస్తాడా?'
    కామేశ్వరరావుకు కూడా ఆహ్వాన పత్రిక చూడగానే ఆశ్చర్యం వేసింది. కనీసం రమ్మని రాయలేదని మనసు చివుక్కుమన్నది. ఆ బాధను భార్య దగ్గర వెళ్ళగక్కలేడు. అలా చేస్తే ఆమె మరీ బాధపడ్తుందని అతనికి తెలుసు. అందుకే తన బాధను దిగమింగుతూ, పిల్లలను సమర్ధిస్తూ వుంటాడు.
    'ఇదేం పెళ్ళా? పేరంటమా? అందర్నీ రమ్మని ఆహ్వానాలు పంపించడానికి. పైగా నాకు తీరిక వుండదని వాడికి తెలుసు. నేను లేకుండా నువ్వు వెళ్ళవని కూడా వాడికి తెలుసు'
    'అందుకని మాట మాత్రంగానైనా రమ్మని రాయకూడదా? వాడు రమ్మంటే మీరు వెళ్ళేవారు కాదా? నిజం చెప్పండి' నిలదీసినట్టుగా అడిగింది.
    కామేశ్వరరావు మౌనంగా వుండిపోయాడు.
    'వాడు మారిపోయాడండీ! ఎంత త్వరగా మారిపోయాడో! ఇప్పుడు వాడు మన కొడుకు కాడు. సుగుణ మొగుడండీ!' సుందరమ్మ కంఠం దుఃఖంతో బొంగురు పోయింది.   
    'ఛ! అవేం మాటలు? మొన్ననేగా రామనాధం ముందు నా బిడ్డలు అందరిలాంటి వాళ్ళు కారని అన్నావు?'
    'అలాగే అనుకున్నాను'
    'ఇప్పుడేమైందని అంత బాధపడాలి?'
    'అది కాదండీ. కనీసం మిమ్మల్నయినా రమ్మని రాశాడా? పెళ్ళిపీటల నుంచి దిగిన మరుక్షణమే మీ డబ్బు, మా డబ్బు అన్నాడు.'
    'ఇక, ఆ విషయం వదిలేయ్'
    'ఎందుకు వదిలెయ్యాలి? గాడ్ది కొడుకు. ఎవరి డబ్బుతో ఇంతవాడయ్యాడు? చంద్రం చదువు ఖర్చులు, అమ్మాయి పెళ్ళి ఖర్చు వాడే భరించాలని రాయండి' కోపంగా అంది.
    'పిచ్చిగా మాట్లాడకు. చూడు ఎవరో వచ్చినట్టున్నారు?'
    సుందరమ్మ లేచి విసురుగా హాల్లో నుంచి బయటికి వెళ్ళింది.
                                 *   *   *
    'ఏమండీ! రఘునూ కోడల్నీ పండక్కు రమ్మని రాయండి. పెళ్ళయ్యాక పట్టుమని నాలుగు రోజులు వుండలేదు. పెళ్ళయి సంవత్సరం దాటిపోయింది.'
    కామేశ్వరరావు మౌనం వహించాడు.
    'మాట్లాడరేమండీ?'
    'అలాగే రాస్తాలే!' అన్నాడు.
    ఆ మరునాడు కొడుక్కు ఉత్తరం రాశాడు. ఐదోరోజు కల్లా జవాబు వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూనే బయటినుంచే భార్యను కేక వేశాడు.
    'ఏమిటో హడావుడిగా పిలుస్తున్నారు?'
    'పండగ దగ్గర కొస్తూందిగా? పిండి వంటలు ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాను.'
    'ఏం చేస్తావు?'
    'అరిసెలంటే పెద్దాడు నాలుక కోసుకుంటాడు. బూంది లడ్లు కూడా వాడికి ఇష్టం. అవి రెండూ చేసి పండుగ రోజు గారెలు చేస్తాను. ఆ మర్చిపోయాను. వాళ్ళిద్దరికీ కొత్త బట్టలు కొనాలిగా?'
    కామేశ్వరరావు భార్య ముఖంలోకి జాలిగా చూస్తూ నిలబడ్డాడు. సుందరమ్మ దృష్టి ఆయన చేతిలో వున్న ఉత్తరం మీద పడింది. 'ఉత్తరం వచ్చిందా? పెద్దాడినుంచేనా? ఎప్పుడు బయలుదేరుతున్నారట' ఉత్సాహంగా అడిగింది.
    కామేశ్వరరావు ఉలకలేదు, పలకలేదు.
    'మాట్లాడరేమండీ!'
    'ఏం మాట్లాడమంటావు? నీ ఉత్సాహం చూస్తుంటే...'
    'పిల్లలు వస్తున్నారంటే సంతోషంగా ఉండదా ఏమిటి?'
    'వాళ్ళు రావడం లేదు' అంటూ చేతిలోని ఉత్తరం అందించి అక్కడ్నుంచి చిన్నగా జారుకున్నాడు.
    ఉత్తరం చదివి సుందరమ్మ కొద్ది క్షణాలు నిశ్చేష్టురాలై నిలబడిపోయింది.
    కొత్తగా పెట్టిన ప్రాక్టీసు. తను కదలడానికి వీల్లేకుండా వుందని, పైగా తన భార్య ఆమె పుట్టింటికి పండక్కు వెళ్తుందనీ రాశాడు రఘు.
                               *   *   *
    'అమ్మోయ్! అన్నయ్యోచ్చాడేయ్' సునంద కేకపెట్టింది. సుందరమ్మ కొడుకుని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. 'రా! రా ఎంత కాలం అయింది నిన్ను చూసి. గుంటూరు ఎంత దూరంరా! నెలకొకసారైనా కన్పించకూడదా!'
    'లా ప్రాక్టీసంటే ఏమనుకున్నావ్ అమ్మా? అందులో  స్థిరపడడానికి ఎంత కష్టపడాలను కుంటున్నావు? నాకు మంచి సీనియర్ దగ్గర పనిచేసే అవకాశం దొరికింది కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నా ఖర్చులకు నేను సంపాదించుకుంటున్నాను.'
    'ఏంటీ! వాడ్ని ఇంట్లోకి రానిస్తావా? స్కూలుకు వెళ్ళడానికి తయారై బయటికి వచ్చిన కామేశ్వరరావు అన్నాడు. 'ఏరా రామం! ప్రాక్టీసు ఎలా వుంది. మీ సీనియర్ కు సంతృప్తిగా వుందా నీ పని?' అని కొడుకుని ప్రశ్నించాడు.
    'మా సీనియర్ కి నేనంటే చాలా ఇష్టం నాన్నా! వాళ్ళింట్లోనే గది ఇచ్చి, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు.'
    'సరే నాకు టైం అయింది. సాయంకాలం మాట్లాడుకుందాం అంటూ కామేశ్వరరావు సుందరమ్మ అందించిన గొడుగు తీసుకొని వెళ్ళిపోయాడు.'

 Previous Page Next Page