అక్షరాలని ఒద్దికగా వ్రాసేవాళ్లు :-
వీరు సమస్యని కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోగలరు.
క్రమశిక్షణకి మారుపేరు. శుభ్రతపట్ల కూడా అవగాహన కలిగి వుంటారు.
సాధారణంగా తెలివితేటలున్న వారైనా సరే, వాటిని బైిటకి ప్రకటించడానికి ఎక్కువ ఇష్టపడరు.
వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా వున్నాసరే, కొంత ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ వుంటుంది. అది విడిచి పెడితే మాత్రం తప్పకుండా గొప్పవాళ్లైపోతారు.
వీళ్లు సాధారణంగా జీవితంలో తొందరగా ముందుకు చొచ్చుకుపోలేరు. కానీ, అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. రిస్క్ తీసుకోవటం వీరికి అంత ఇష్టముండదు.
అస్తవ్యస్థ చేతివ్రాత:
'అక్షరాల' కి ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వకుండా, వాటిని కేవలం తమ మనసులో కలిగే భావాలని చెప్పడానికి మాత్రమే ఉపయోగించే సాధనాలుగా భావించేవారు ఈ చేతి వ్రాతను కలిగివుంటారు.
వీలైనంత తొందరగా ఆ పనిని పూర్తిచేసుకుందాం అనే ఉద్దేశ్యంలోవుంటారు.
సమయం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
నిర్ణయాలు కూడా తొందర తొందరగా తీసుకుంటారు.
ఏదో ఒక రకంగా పైకి వెళ్తే చాలు అనే అభిప్రాయాన్ని కలిగి వుంటారు.
జీవితం పట్ల ఒక విధమైన నిర్లక్ష్యం, ధీమా, స్వంత ఆలోచనలు ఎక్కువగా వుంటాయి.
బేస్ లైన్:
తెల్లకాగితం మీద కాకుండా, గీతలున్న కాగితాల మీద వ్రాయవలసి వచ్చేటప్పుడు, కొంతమంది అక్షరాలని గీతమీద వ్రాస్తారు. మరికొందరు లైనుకి లైనుకీ మధ్య వ్రాస్తారు. ఈ క్రింది చేతి వ్రాతను గమనించండి.
పైన సూచించినట్లు లైనుకీ లైనుకీ మధ్య వ్రాసే వాళ్లు నిరంతరం ప్రేమ భావంలోవుంటారు. ప్రేమించటంగానీ, ప్రేమింపబడటంగానీ, ప్రేమతో తనకొక గుర్తింపు రావాలని గానీ వీళ్లు ఊహిస్తూ వుంటారు. ఒక గమ్యాన్ని సాధించడానికి అవసరమైన దానికన్నా ఎక్కువ కష్టపడతారు.
లైనుకి లైనుకీ మధ్య కాకుండా, ప్రతి అక్షరాన్ని లైనుకి దగ్గరగా వ్రాసేవాళ్లు ఎప్పుడూ ఒంటరితనం ఫీలవుతూ వుంటారు. వీరికి సమాజం పట్ల, జీవించేవిధానం పట్ల ఒక నిర్దిష్టమైన అవగాహనవున్నా, ఎవ్వరూ అర్దం చేసుకోవటం లేదు అని ఫీలవుతుంటారు. ఒకరిమీద ఆధారపడే మనస్తత్వం కొద్దిగా వుంటుంది.
తమ చేతివ్రాతకి లైనులున్న పేపర్లు కాకుండా తెల్లకాగితాలమీద మాత్రమే వ్రాసే అలవాటున్నవారు ఆ మేన్ స్క్రిప్ట్ కి వాక్యాల క్రింద పెన్సిల్ తో గీతగీస్తే, అది వాక్య గమనాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకి ఈ క్రింది రెండుచేతివ్రాతలను గమనించండి.
ఒక పదంలైను మీద వ్రాసి, ఒకపదం లైనునుంచి క్రిందకు దిగి, మళ్లీ ఇంకోపదం లైను మీదికి వస్తే ఆ వ్యక్తి జీవితంలో ఒక అభద్రతా భావంతో బాధపడేవాడై వుంటాడు. అలాగే పైన చెప్పిన రెండో ఉదాహరణలోలాగ అక్షరాలతో అక్షరాలు కలిపేసి వ్రాసేవాళ్లు తొందర పాటు మనస్తత్వం కలిగివుంటారు. వీటి గురించి తర్వాతి చాప్టర్ (అక్షరాల కూర్పు) లో చర్చిద్దాం.