Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 14

    ఆమె అడుగులో అడుగువేస్తూ దగ్గరకొచ్చింది. పిస్టల్ ని నందితాదేవి కళ్ళదగ్గర వుంచి "నిన్ను నే చెక్ చేయాలి. కదలక అలానే వుండు" అంది వెంటనే ఒళ్లంతా తడిమిచూసింది.

    ఆమె తృప్తిగా నిట్టూర్పు విడవటం గమనించింది నందితాదేవి.

    "ముందు గదిలోకి వెళదాం పద" ఆమె అంది.

    "ఊహూ, నేను రాను. వాళ్ళు నన్ను చూస్తారు. వాళ్ళింకా యీ సందులోనే తారట్లాడుతున్నారు. కావాలంటే చూడండి. సాటి ఆడదాన్ని, నా బాధ గ్రహించండి. ఈ ఒక్కరోజుకీ నాకు ఆశ్రయం యివ్వండి. నాకు రక్షణ యివ్వదల్చుకోకపోతే ఆ పిస్టల్ తో నన్ను కాల్చేయండి. వాళ్లకు చిక్కి జీవితాంతం చస్తూ బతికే బదులు ఒక్కసారి తృప్తిగా వుంటుంది చంపండి" అని, "మీ చేతిలో అది... అది..." అంటూ ఆగింది నందితాదేవి.

    ఆమె ఫక్కున నవ్వింది. పిస్టల్ ని విసిరి బెడ్ మీద పారేసింది.

    "అది టాయ్ పిస్టల్. నీ అనుమానం అర్ధమైంది. ఒకాడదాని చేతిలో పిస్టల్ ఏమిటా అని కదూ? ఇలా తమాషాచేయటానికి, శత్రువులను దడిపించటానికి పనికొస్తుంది కదా! వాటర్ కావాలా?" చెపుతూ మాట మార్చింది ఆమె.

    కావాలన్నట్లు తలవూపింది నందితాదేవి. "అలా ఛయిర్ లో కూర్చో, వాటర్ తెస్తాను" ఆమె అని గదిలోంచి బైటికెళ్ళింది.

    నందితాదేవి ఛయిర్ లో కొద్దిగా రిలాక్సవుతూ కూర్చుంది.

    వాటర్ తెస్తానని గది బైటికొచ్చిన ఆమె కిటికీ కర్టెన్ తొలగించి నందితాదేవిని చూసింది. వెంటనే వేగంగా వీధిమలుపు తలుపు తీసుకుని బైటికి వచ్చింది. వీధిలో ఇద్దరు మగాళ్ళు తారట్లాడటం చూసి తిరిగి లోపలికి వెళ్ళి తలుపులు వేసింది. మంచి నీళ్ళు తీసుకుని గదిలోకి వచ్చింది.

    "నీవుచెప్పింది నమ్ముతున్నాను" ఆమె అంది.

    "థాంక్స్" చల్లని నీళ్ళు తాగి కృతజ్ఞతగా చూస్తూ అంది. గ్లాసు కింద పెడుతూ అడిగింది- "మీ పేరు?"

    "జాస్మిన్, నేనింకా మెస్సర్సు లాల్ అండ్ లాల్ ఐరన్ కంపెనీలో స్టెనో జాబ్ చేస్తూ ఒంటరిగా వుంటున్నాను. ఇప్పటికైనా నీ నిజం పేరు చెప్పు" జాస్మిన్ చిరునవ్వుతో అడిగింది.

    "పూర్తి పేరు కొండవీటి చాంతాడంత  వుంది. అందరూ దేవీ అనే పిలుస్తారు. దేవీ అనే పిలవండి" నందితాదేవి చెప్పింది.

    "అలాగే" అదే చిరునవ్వుతో అంది జాస్మిన్.

    కొద్దిసేపు మాటలు అయిం తరువాత నందితాదేవి అడిగింది. "నే యిక్కడ దాక్కున్నట్లు మీ కెట్లా తెలుసు?"

    "నేను వీధి తలుపు దగ్గరకు వేశాను. కూర మాడుతుందేమో అని కిచెన్ లోకి వెళ్ళి దాన్ని కలియబెట్టి ఈ రూములోకి వచ్చి బుక్ పట్టుకెళ్ళి ముందు గదిలో కూర్చున్నాను. అప్పుడు చూశాను, తలుపు లోపల గడియవేసి వుండటం... నాకు మతిమరుపు లేదు. పొరపడటం నాకు చేతగాని విద్య. దొంగ దూరివుంటాడని గ్రహించాను. ధైర్యసాహసాలు నా సొత్తు. ద్రయర్లో వున్న టాయ్ పిస్టల్ తీశాను.

    గదులు వెతుకుతూ ఈ గదిలోకి వచ్చాను. తర్వాత నీకు తెలిసిందే" నవ్వుతూ చెప్పింది జాస్మిన్.

    "నిజం దొంగ అయితే కష్టం."

    "నా సంగతి నీకు తెలియదు."

    నందితాదేవికి ఏం మాట్లాడాలో తెలియలేదు.

    కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించుకుంది ఆ గదిలో.

    జాస్మిన్ మాటకు ముందు చిరునవ్వు ఆమె సొత్తు" అనుకుంది నందితాదేవి.

    అప్యాయంగా మాట్లాడుతున్న సాటి స్త్రీని చూడగానే ధైర్యం వచ్చింది నందితాదేవికి, జాస్మిన్ ఏమి అడిగినా తడుముకోకుండా అవి అబద్దాలైనా నిజం సుమా అన్నట్లు చాలా సహజంగా ఆరితేరిన మహానటిలా చెపుతున్నది. 

 Previous Page Next Page