Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 14

    ఛ..... ఛ..... మతి వుండే మాట్లాడుతున్నావా. ఓ ఆడది, ఓ తల్లి అనవల్సిన మాటలేనా ఇవి. నీవు బొత్తిగా బరితెగించి మాట్లాడకు?" కసిరింది శారదాంబ.
    నీరూ చెప్పింది కరక్ట్. అదొక్కటే మార్గం." లోపల్నించి తల్లీకూతుళ్ళ మాటలు విని వచ్చిన శివశంకరంగారన్నారు.     
    నేనింకా ఈ మాట దానితో ఎలా అనను అనుకుంటున్నాను. అదే అంది. ఈ బిడ్డదాని భవిష్యత్తుకి బంధమవుతుంది. ఆ భర్తని వదులుకున్నప్పుడు ఆ బిడ్డకోసం పాకులాడ్డంలో అర్థం లేదు. రేపు బిడ్డనికంటే నా బిడ్డని నాకప్పగించమనచ్చు అతడు. కన్నాక ఇది కన్నతల్లి మమకారంతో ఆ బిడ్డని వదలలేక, ఆ పిల్ల కోసం అతనితో రాజీకి దిగి అతని షరతులు అన్నీ అంగీకరించి అతను ఏ బాధలు పెట్టినా పడుండాలి అక్కడ." లాయరు బుర్రతో ముందాలోచనతో అన్నారు ఆయన.  
    శారదాంబ భర్తవంక కోపంగా చూసింది." అదంటే చిన్నది, ఆలోచనా పాడూ లేదు.
    మీరూ అలా మాట్లాడుతారేమిటి? పాపపుణ్యాలు సంగతన్నా ఆలోచించండి."
    "పాపం....పుణ్యం అవన్నీ ఇదివరకటి రోజుల మాటలు. దేశంలో రోజూ కొన్నివేలమంది ఈ పనిచేస్తున్నారు. సవ్యంగా కాపురాలు చేసుకుంటున్న భార్యాభర్తలే బిడ్డ అక్కరలేదనుకుని అబార్షన్ చేయించుకుంటున్నారు. మన అమ్మాయి విషయంలో అదసలు పాపమే గాదు. నీవనవసరంగా లేనిపోనివి పెట్టకు. ఈ విషయం ఈ ఇంటిగోడదాటి వెళ్ళడానికి వీలులేదు.
    అతనికి తెలిస్తే నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయించారని గొడవ పెట్టొచ్చు. మనం వీలయినంత తొందరలో డాక్టరు దగ్గరకి వెళ్ళాలి. ఈ వూర్లో అయితే ఎవరికన్నా తెలిసే ప్రమాదం ఉంది. మద్రాసులో నాకు తెల్సిన డాక్టర్ ఉంది. మంచి గైనకాలజిస్ట్. ఆవిడకి చెప్పాను. ఈరోజుల్లో ఇది అరనిమిషంపని."    
    "తండ్రి కూతుళ్ళు ఎంత తెగించారు! నా మాటకి ఈ ఇంట్లో విలువ లేదని నాకు తెలుసు. సరే..... ఏం చేస్తారో చెయ్యండి...." శారదాంబ కోపంగా అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది.   
    "మీ అమ్మదంతా ఛాదస్తం తల్లీ! ఆవిడకి అర్థం కావడం లేదు. రేపు ఈ బిడ్డ నీకు ఎంత బర్డెన్ అవుతుందో, మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్నా ఇబ్బందే.... పంతానికన్నా అతడు బిడ్డ కావాలని అల్లరి పెడతాడు. ఇదంతా ఆవిడకి అర్థం కాదు. నీవేం భయపడకమ్మా!" అన్నారాయన.   
    తండ్రి అంత సుళువుగా ఆ సమస్యని పరిష్కరించినందుకు నిర్మల ఆనందపడింది. ఈ కారణంగా మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళనక్కరలేదన్నది ఆమెకి ఎంతో తృప్తి నిచ్చింది.
    .........................
    "డాడీ.... ఇంట్లో కూర్చుని నాకు బోర్ కొడ్తోంది. ఏదన్నా ఉద్యోగం చేస్తాను డాడీ" అంది ఓ రోజు నిర్మల.
    నిర్మల పుట్టింటికి వచ్చి అప్పటికి ఏడాది దాటింది. ఆ సంవత్సరంలో నిర్మల పాత జీవితం మరిచిపోయి పెళ్ళికాక ముందు కన్నెపిల్లగా ఎలా కేర్ ఫ్రీగా తిరిగిందో హాయిగా అలా తిరిగింది. అబార్షన్ తంతు పూర్తయ్యాక పెద్ద ఆపద తొలగిన సంతృప్తి కల్గింది.  
    ఆ ఏడాదిలో నిర్మల భర్త రెండు ఉత్తరాలు రాశాడు. ఒకటి నిర్మల ఇంట్లోంచి వచ్చేసిన నెలకు. రెండోది ఆరు నెలలకి, ఆమె నెల లోపల తిరిగి రాకపోతే ఆమెకి తనకి ఏ సంబంధం ఉండదని రాశాడు. శివశంకరంగారు ఆ ఉత్తరం చదివి జవాబివ్వనక్కరలేదన్నట్లు పక్కన పడేశారు. ఆరునెలల తరువాత - మీ అమ్మాయి నేనిచ్చిన గడువు లోపల రానందున ఇంక మీ అమ్మాయి ఈ యింటి గడప తొక్కరాదని, తామిద్దరి మధ్యా భార్యాభర్తల సంబంధం తెగిపోయిందని రాశాడు.
    దానికి శివశంకరంగారు జవాబిచ్చారు! 'నిర్మలకి ఇంక నీ యింటికి వచ్చే ఉద్దేశం లేదు. ఆ కాపురం ఆనాడే వదులుకుంది, త్వరలో డైవర్సు కాగితాలు పంపిస్తాను. ఆ కాగితాల మీద సంతకం పెడితే నా కూతురు పూర్తి స్వేచ్చ పొందుతుంది. ఆ తరువాత నీ ఇష్టం వచ్చినట్లు నీవు చేసుకోవచ్చు' అని రాసేశారు.
    ఆ ఉత్తరం చూసి నిర్మల మొగుడు నిప్పుతొక్కిన కోతిలా అయ్యాడు. బెదిరిస్తే దారికి వస్తారని, భయపెడితే కాళ్ళ బేరానికి దిగుతారని ఆశించిన అతను నిర్లక్ష్యం సహించలేకపోయాడు. 'స్వేచ్చ..... చచ్చినా ఆ నిర్మలకి స్వేచ్చ దక్కనీయను. తననించిపోయి మళ్ళీ పెళ్ళి చేసుకుందామని ఆమె ఉద్దేశం అయితే అది చచ్చినా జరగనీయను' అని కసిగా నిర్ణయించుకున్నాడు. ఆ ఉత్తరానికి జవాబుగా 'డైవర్సుకు నేను సిద్ధంగా లేనని, డైవర్సు ఇచ్చే ఉద్దేశం నాకు లేదని, మీకు కావల్సితే మీరు కోర్టు ఎక్కినా నాకేం అభ్యంతరం లేదని, 'మీ అమ్మాయికి బుద్ధి చెప్పడానికి నేనెంతకయినా తెగిస్తాను. నేను మరో పెళ్ళి చేసుకోకపోయినా ఫరవాలేదు. మగవాడికి పెళ్ళి లేకపోయినా లైఫ్ ఎంజాయ్ చేయగలను. నన్ను కాదని వెళ్ళిన మీ అమ్మాయి రెండో పెళ్ళి ఎలా చేసుకుంటుందో చూస్తాను' అని ఉక్రోషంగా రాసాడు.
    ఆ ఉత్తరం చూసి లాయరు అయిన శివశంకరంగారు కాస్త బెదిరారు. డైవర్సు తీసుకోకుండా కూతురికి రెండో పెళ్ళి చెయ్యలేరు. మూర్ఖంగా అతను నిర్మలని హింసించేందుకు డైవర్సు కోసం కోర్టు కెక్కాలి. ఎక్కినా నిర్మలని అతను బాధ పెట్టాడని చూపడానికి సాక్ష్యాలు లేవు! ఏడాదిగా ఇద్దరూ కల్సి బ్రతకటం లేదని, ఇద్దరి మధ్య అవగాహనతో సెపరేషన్ కి  పెట్టుకుంటే కోర్టు విడాకులు ఇప్పించవచ్చు. కాని అతను పంతంగా తన తప్పులేదనీ, నిర్మల ఇల్లు వదిలిపోయిందని ఉత్తరాలు రాసినా రాలేదని, విడాకులకి తాను వొప్పుకోనని అంటే కోర్టు నిర్మల వెళ్ళి కాపురం చెయ్యాలని ఆదేశించవచ్చు.   
    ఆ ఆదేశం పాటించక్కరలేదు. ఇష్టం లేకపోతే. కాని రెండో పెళ్ళికి చట్టబద్ధమయిన విడాకులు కావాలి గదా! ఆయన కాస్త మనసులో జంకాడు! అల్లుడిని తక్కువగా అంచనా వేసినందుకు విచారించాడు. నిర్మలని అధైర్యపరచడం ఇష్టం లేక ఆ విషయం ఆమెకి చెప్పలేదు. భార్యతో చెపుదామన్నా 'నే చెప్పలేదా' అని హేళన చేస్తుందేమోనన్న భయంతో చెప్పలేదు. భార్య అన్నట్టు కాస్త మంచిగా పని సానుకూలపడేట్లు చెయ్యాల్సింది. చూద్దాం..... అతను మాత్రం పెళ్ళి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటాడు? పంతం కొద్ది రెండు మూడేళ్ళుంటాడు. ఆ తరువాత చూద్దాం - ఏం జరిగేది అనుకున్నారాయన.        
    ఆ ఏడాది నిర్మల పెళ్ళికాకముందు స్నేహితులతో షికార్లు, సినిమాలు, పార్టీలు అంటూ ఎలా తిరిగేదో అలా తిరిగింది. రోజంతా పుస్తకాలు చదవటం, రికార్డులు వినడం, సాయంత్రం ఫ్రెండ్స్ ఇంటికో, సినిమాకో వెళ్ళడం. శలవు వస్తే అన్నలతో కార్డ్స్, చెస్ ఆడేది. ఇదివరకు కాలేజి వుండేది కనక కాలేజీకి వెళ్ళిరావడం, వచ్చాక రాత్రి చదువుండేదేమో రోజంతా బిజీగా. వున్నట్లుండేది. ఇప్పుడు చదువులేదు. కాలేజి లేదు, ఎంతసేపని చదవడం పుస్తకాలు. సినిమాలు మాత్రం ఎన్నని చూడటం..... ఇంట్లో వంటమనిషి, మిగతావాటికి తల్లి ఉన్నారు. వంటింటివైపు వెళ్ళాల్సిన పనిలేదు. తండ్రి రోజంతా కేసులు, కోర్టు, క్లైంట్స్  తో బిజీగా ఉంటాడు. అన్నయ్యలు చదువులు, ఉద్యోగాలతో బిజీ, ఆదివారాలే కాస్త తీరిక వాళ్లకి.

 Previous Page Next Page