"హంపీ స్క్రిప్టునేం చేశావ్?......."దశరథ కూల్ గా అడిగాడు.
"బాగా లేదని, ఇంకా ఇంప్రూవ్ చేయమని చెప్పాను. కాని నిజానికి ఆమె స్ర్కిప్టు చాలా గొప్పగా ఉంది." దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ గ్లాసునందుకొంటూ అన్నాడు.
"స్క్రిప్టుని తిరగరాయమంటూ చిన్న రిటార్ట్ ఇచ్చావ్.... ఆమె అది సరి జేసుకొని వస్తుంది. అప్పుడు ఓకే చేయ్. లేకపోతే నా స్క్రిప్టు గొప్పదంటూ గొడవ చేసే ప్రమాదముంది. పైలట్ ఇవ్వమను. పైలట్ దగ్గర కూడా చిన్న అభ్యంతరం లేవదీయ్. మానసికమైన ఒడుదుడుకుల దగ్గర ఆమెలో ఉత్సాహం కొంత తగ్గి పోతుంది. ఆ తరువాత పైలెట్ ఓకే చేయ్. అప్పుడే ఓ కండీషన్ పెట్టు. సీరియల్ లోని 13భాగాల్లో నాలుగు భాగాలు ఒకేసారి ముందుగా ఇచ్చేయమను.....అప్పుడు హీరో ప్రశాంత్ ప్రక్కకు తప్పుకుంటాడు. అంతా ఒక పథకం ప్రకారం జరిగిపోవాలి."
తను చెప్పేది డైరెక్టర్ విన్నాడో లేదో అని దశరథ అనుమానంగా చూసాడు అతనికేసి.
"అల్లగలగే.....డైరెక్టర్ నోటెంట మాటలు ముద్దగా వస్తున్నాయి.
అప్పటి వరకు మౌనంగా ఉన్న బ్రహ్మానందం డైరెక్టర్ ప్రక్కకు చేరాడు.
"మీ టీవీ స్టేషన్ వాళ్ళంటే నాకు చెడ్డ అభిమానమండి....."బ్రహ్మానందం చిన్నగా నవ్వుతూ అన్నాడు.
"ఎందుకెందుకు?" డైరెక్టర్ కంగారుగా అడిగాడు.
అలా అనగా ఆయనింతవరకు వినలేదు. అందుకే ఆయనకంగారు పడ్డారు.
"నాటకకళను యాధావిధిగా పోషిస్తున్నందుకు" డైరెక్టర్ కి అర్థం కాలేదు.
"అర్థంకాలేదాండి? సినిమాల ప్రభావంతో అంతరించిపోతున్న నాటక రంగాన్ని మీరు భలే ఉద్ధరిస్తున్నారు గదండి. అబ్బ..... అచ్చం.... స్టేజీపై డేరాలు కట్టి ఎలా నాటకాలాడతారో అలాగే మీ టీవీలో కూడా ఆడుతున్నారండి"
గురువుగార్ని భలే పొగిడావురా" దశరథ నవ్వుతూ అన్నాడు.
డైరెక్టర్ కూడా బ్రహ్మానందాన్ని చూసి నవ్వాడు.
"కిక్కు దిగిపోయిందండి బాబు- నేను చెప్పింది పొగడ్తకాదు- విమర్శండి....." ఆ ఇద్దరూ అర్థంకానట్లు చూశారు.
"వీధులెంట ఆడే చౌకబారు నాటకాలెలా ఉంటాయో అలాగే ఉంటున్నాయి టీవీ వాళ్ళు ప్రసారం చేస్తున్న నాటకాలు, ప్రోగ్రామ్స్. తేడా ఉండాలనుకుంటానండి.....? ఆహా.....నాకు తెలీక అడుగుతున్నాను. నాటకాలంటే రెండొందలతో ఆడొచ్చండి. కాని టీవీలో ఆడే నాటాకానికి కొన్ని వేలు ఖర్చవుద్ది గదండి? కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించిన స్టూడియోల్లోంచి కదా ప్రసారమయ్యేది!"
డైరెక్టర్ బ్రహ్మానందం మాటకు పెద్దగా నవ్వాడు.
"గొప్పవాళ్ళండి బాబు..... పొగడ్తకు, విమర్శకు రెంటికీ ఒకే రియాక్షన్..... అందుకే టీవీ లో పనిచేయగలుగుతున్నారు......"
దశరథ నవ్వుతూ డైరెక్టర్ వేపు చూసి "ఉన్నది ఉన్నట్లు చెబుతాడండి వీడు. అందుకే వీడంటే నాకు అభిమానం.....మనం సీరియల్ 'పూలతోట' లోని ఆరవభాగం ఈరోజే ప్రసారం చూద్దామా?"
దశరథ మాటలకు డైరెక్టర్ తలూపాడు.
ఆ హాల్లో మూలగా ఉన్న టీవీని ఆన్ చేయమన్నట్లు బ్రహ్మానందం వేపు చూశాడు దశరథ.
బ్రహ్మానందం ఆముదం తాగినట్లు మొఖం పెట్టాడు.
'ఆన్ చెయ్యి.....టైమవుతోంది."
"దిగిపోద్దేమోనండి" ఏడుపు మొఖం పెట్టి అన్నాడు బ్రహ్మానందం.
"ఏంటి దిగిపోయేది?' డైరెక్టర్ అర్ధంకాక అడిగాడు.
"నిషా....."
"టీవీ ఆన్ చేస్తే నిషా ఎందుకు దిగుతుంది?"
దశరథకు కోపం వచ్చింది.
"టీవీసీరియల్స్ అంత దరిద్రంగా ఉంటున్నాయని వాడి ఉద్దేశ్యం. ముందు ఆన్ చేస్తావా లేదా?" దశరథ గట్టిగా అరిచాడు.
బ్రహ్మానందం తూలుతూ వెళ్ళి టీవీ ఆన్ చేస్తూనే కళ్ళు మూసుకున్నాడు.
"అడ్డంలే" అని దశరథ అరిచాడు.
బ్రహ్మానందం కళ్ళు మూసుకునే వెనక్కి వచ్చేశాడు.
అదివో......అల్లదివో శ్రీహరివాసమూ.....పదివేల పడగల....
పై రెండు చరణాలు విని బ్రహ్మానందం కళ్ళు తెరిచాడు.
"హమ్మయ్య.....సీరియల్ ఇంకా మొదలు కాలేదన్నమాట....." అంటూ టీవీ కేసి చూసాడు.
"డైరెక్టర్ గారూ...... రోజూ సాయంత్రం భరతనాట్యం, కూచిపూడి నేర్చుకొనేందుకు మీ టీవీ స్టేషన్ లో పర్మిషన్ ఇస్తారా?"
"అదేం లేదే?!" డైరెక్టర్ ఆశ్చర్యంగా అన్నాడు.
"మరి నేర్చుకునేవాళ్ళే కనిపిస్తారేంటి రోజూ.....మన సంస్కృతిని కాపాడదామనా? ఇలా రోజూ సాయంత్రాలు భరతనాట్యం నేర్చుకొనే వాళ్ళను చూపిస్తే కోట్లు ఖర్చుపెట్టి టీవీలు, పిక్చర్ ట్యూబులు తయారుచేసే కంపెనీలు ఏమయిపోవాలి?"
డైరెక్టర్ ఒకింత ఇబ్బందిగా చూసాడు దశరథ ఇక మాట్లాడవద్దన్నట్లు గుడ్లురిమాడు.
* * *
రోజూ ఉదయం ఏడుగంటలకు ఆఫీస్ లోకి వచ్చి ఆ రోజు ప్రోగ్రామ్స్ ని చాకౌట్ చేసుకుంటుంది హంపి.
ఎప్పటిలాగే వచ్చి ఆఫీసులో కూర్చుంది.
క్రితం రోజు దూరదర్శన్ వాళ్ళు అభ్యంతరాలు తెలిపిన స్క్రిప్టుని సొరుగులోంచి తీసి ఒక్కో పేజీ తిరగేయటం మొదలెట్టింది.
పడి నిమిషాలకు కాలింగ్ బెల్ మ్రోగింది. చూస్తున్న ఫైల్ టేబుల్ పైన పెట్టేసి "కమిన్" అంది పెద్దగా.
"గుడ్ మార్నింగ్ మిస్ హంపీ.....సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్" అంటూ ప్రభు లోపలకు వచ్చాడు.
అతన్ని చూసి హంపీ ఆశ్చర్యపోయింది. అతనా ఫ్రెష్ టైమ్ లో రావటం ఆమెకు చిరాగ్గా అనిపించింది.
"మీకు గోవాలోనే చెప్పాను గదా- మీకేమన్నా వివరాలు కావాలంటే మా అసోసియేట్ ని కలవమని. మరలా......?" ఆమె మధ్యలో ఆగిపోయింది.
"చాలా ముఖ్యమైన కేసుని డీల్ చేస్తున్నాను. ఆ సందర్భంలో ప్రయోజనం ఉంటుందనుకునే ప్రతి వ్యక్తిని కలిసి వివరాలు సేకరించటం. పరిశోధించటం మావృత్తి. అలాగే మీరు సహకరించటం మీ బాధ్యత. కాదంటారా?"
ఆమెకు అప్పుడనిపించింది- అదేదో ముఖ్యమైన కేసే అయిఉండవచ్చని
"ఓకె- అడగండి ఏ వివరాలు కావాలి మీకు?" హంపి మర్యాదగానే అడిగింది.
"థాంక్యూ వెరీమచ్..... సరాసరి విషయంలోకి వస్తాను. మీరు ఇండియన్ ఎయిర్ పోర్ట్స్ అనే టాపిక్ మీద టీవీ ఫిల్మ్ తీసి దూరదర్శన్ కి అందించారు...."అతనో క్షణం ఆగాడు.
"ఊ.....అందిస్తే?"
"ఆ రోజు..... అంటే ఢిల్లీ పాలం విమానాశ్రయాన్ని ఎన్ని నిమిషాలు షూట్ చేశారు...."
"దాదాపు 25నిమిషాల్లో ఏ ఏ షాట్స్ తీసారో గుర్తుందా.....?"
చాలా షాట్స్ తీసాను. ఎన్ని షాట్స్ అంటే ఖచ్చితంగా చెప్పలేను...."
"ఏ షాట్ లో నన్నా జూమ్ తో ప్రయాణికుల ఫేసెస్ మీదకు వెళ్ళారా?"
ఆమె గుర్తుకు తెచ్చుకుంటోది.
అతను ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఆమె చెప్పే సమాధానం కోసం.
"కొన్ని తీశాను"
అతను ఆసక్తిగా ముందుకు వంగాడు.
"జూమ్ ఉపయోగించి ఏ షాట్స్ తీశారో గుర్తుందా? దయచేసి కొద్దిగా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి...."
అతని కెందుకో కేసుకు సంబంధించి ఒక్క క్లూ అయినా దొరుకుతుందని ఆశగా ఉంది.
"పాలమ్ ఫ్లెట్ ని జూమ్ ఉపయోగించి తీశాను. అలాగే ఫ్లైట్ లోంచి దిగుతున్న ప్రయాణికుల్ని తీశాను.....ఆ తరువాత లాంజ్ లోకి కెమేరా పొజిషన్ ని మార్చుకుని ఇంటీరియర్ షాట్స్ కొన్ని తీశాను...."
అతనిలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతోంది.
"ఇంటీరియర్ లో ఏషాట్స్ తీశారు......?" అతను వ్యక్తపరుస్తున్న ఆతృతను ఆమె పసిగట్టి ఆశ్చర్యపోయింది.
"కస్టమ్స్ క్లియరెన్స్ ప్రాసెస్ ని జూమ్ లో తీశాను. ఆ తరువాత బ్యాగేజ్ కన్వేయర్ బెల్ట్ పై ప్రయాణీకుల లగేజీ రావటాన్ని, ఎవరి లగేజ్ వారు తీసుకొని అవుట్ గేట్ కేసి సాగి పోవటాన్ని తీశాను....."
"అవుట్ గేట్ దగ్గర ప్రయాణీకులు బ్యాగేజ్ స్లిప్స్ చూపించి బయటకు వెళ్ళిపోవటాన్ని తీశారా?"
"తీశాను. కాని జూమ్ లో తీయలేదు. వైడ్ ఫీల్డ్ ని తీసుకున్నాను."
"మీరు తయారు చేసిన ఫైనల్ క్యాసెట్ లో జూమ్ షాట్స్ అంతగా లేవే?"
ఆమె విస్మయంగా చూసింది ప్రభు వేపు. "మీరు తయారు చేసిన క్యాసెట్ ని నేను చూశాను. అందుకే అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను.
"ఏదో ప్రాబ్లమ్ వచ్చి తీసేసి వుండవచ్చు.....ఇంతకు ఈ వివరాలన్నీ మీకు దేనికి పనికొస్తాయ్...?"
"ఓ వైట్ కాలర్ క్రిమినల్ ని పట్టుకునేందుకు"
"నా క్యాసెట్ కి అతనికి ఉన్న సంబంధం?!"
"అతను అదే రోజు ప్లైట్ లో ఇండియా వచ్చాడు."
"మీరంత ఖచ్చితంగా వచ్చాడని చెపుతున్నప్పుడు నా షూటింగ్ వివరాలు దేనికి పనికొస్తాయి? ఎలాగూ వచ్చేశాడు. వల పన్ని అతన్ని పట్టుకోవాలి.... అంతేకాని మీ విలువైన కాలమంతా నా దగ్గర వివరాలు సేకరించటంతో పాడుచేసుకుంటే ఎలా?" ఆమె మామూలుగానే అంది.
అతను చిన్నగా నవ్వాడు.
"మీ విలువైన కాలాన్ని పాడుచేస్తే క్షమించాలి. అతనెలా ఉంటాడో తెలిస్తే మీ దగ్గరకు వచ్చి ఉండేవాణ్ని కాదు....."
"ఆమె విస్మయంగా చూసింది.
"అవును- అందుకే అతన్ని పట్టుకోవడం కష్టమవుతోంది. బాధ్యతగల సివిలియన్ గా నా పరిశోధనకు సహకరిస్తే....."
ఆమె అతని బాధను. తన వృత్తిపట్ల అతనికున్న సిన్సియారిటీని గుర్తించి ప్రశంసగా అతనివైపు చూసింది.
"చెప్పండి మీకెలా సహకరించగలను?" ఆమెలో ఇప్పుడు చిరాకు లేదు- కోపం అంతకంటే లేదు.
అతనేదో చెప్పేలోగా ఆమె లేచి "ఎక్య్సూజ్ మీ " అంటూ పై ఫ్లోర్ లోకి వెళ్ళి రెండు నిమిషాల్లో రెండు కప్పుల కాఫీ తెచ్చి ప్రభుకి ఒకటి అందించి తను ఒకటి తీసుకుంది.
"ఇంతలోనే కాఫీ ఎలా తెచ్చారు?"