కాంతమ్మ దృష్టిలో తన కూతురు చదవటం, పరీక్షలు ప్యాసవటం - అంతా వట్టి హైరానా, ఎంత పెద్ద చదువు చదివి మాత్రం తన కూతురు ఉద్యోగాలు చేయబోతున్నదా? ఊళ్ళేలబోతున్నదా? తన బిడ్డ గొప్ప అదృష్టవంతురాలు. బిడ్డ వయసుతోపాటు తమ సంపదకూడా పెరుగుతున్నది. దానికి చదువుమీద యిష్టం లేకపోతే, చదవమని బలవంతం చెయ్యటం ఎందుకు? ఇంకో అయిదారేళ్ళు గడిస్తే, తమ హోదాకు సరితూగే కుటుంబంలోని కుర్రవాణ్ణెవర్నయినా తెచ్చి, దానికి ముడేసి, ఇంటిలోనే ఇల్లరికం వుంచుకుంటే సరిపోతుంది.
కాంతమ్మ కెప్పుడూ యిలాంటి ఆలోచనలే. ఆమె వట్టి ఆలోచనలతో సరిపెట్టుకుని యింట్లో కూర్చోక, తమ అంతస్థుకు తగినవారనుకున్న కుటుంబాలవాళ్ళతో పరిచయాలూ, స్నేహాలూ ప్రారంభించింది. డబ్బుతోపాటు కాంతమ్మ మానసికంగా కూడా కొంత పెరిగింది. ధనం వల్లగాని, ఉద్యోగరీత్యాగాని గొప్పవాళ్ళని ఆమె అనుకున్న వ్యక్తులతో , సమానఫాయాలో మాట్లాడటం నేర్చుకున్నది.
ఉన్నట్టుండి ఒక శుభముహూర్తాన కాంతమ్మ లేడీస్ క్లబ్బులో మెంబరుగా చేరింది. అక్కడి కొచ్చేవారంతా కొద్దో గొప్పో చదువుకున్న వాళ్ళూ పెద్ద పెద్ద ఆఫీసర్ల భార్యలూ వారి సంతానమూనూ. కాంతమ్మ తన భర్త దగ్గిర ఓపిక వున్నప్పుడల్లా నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుని, వాటిని సందర్భశుద్ధి వున్నా లేకపోయినా క్లబ్బులో ధారాళంగా వుపయోగించేది. విన్నవాళ్ళు - విరగబడి నవ్వబోయి పెద్దింటావిడ. ఏమనుకొని పోతుందో అని చిరునవ్వు నవ్వే ప్రయత్నంలో వికవిక పకపక మనేవాళ్ళు. అలాంటి సందర్భాలలో కాంతమ్మకు అరికాలిమంట నెత్తికెక్కేది. 'డిగ్రీలూ, ఉద్యోగాలూ, వున్నా, లక్ష్మి లేనివాళ్ళకు, మర్యాదా మన్ననా ఏం తెలుస్తుంది?' అనుకొనే దావిడ యీసడింపుగా. ఆ నవ్విన వాళ్ళనందర్నీ నాగరికత తెలియని పశువులకింద జమకట్టేసేది.
క్లబ్బు కొచ్చేవాళ్ళల్లో రిటైర్డు హైకోర్టు జడ్జి సుందరంగారి భార్య అంటే కాంతమ్మకు మహాచెడ్డకోపం. కాంతమ్మకూ ఆమెకూ ప్రతి చిన్న విషయంలోనూ వాదోపవాదాలు జరుగుతూండేవి. ఇక కలెక్టరు భార్య కళావతి వున్నది. ఆమె ఆ క్లబ్బుకు వచ్చే వారందరిలోకి సౌందర్యవతి, విద్యావతి. ఆమె ఎవరి మనసూ నొప్పించకుండా తాను నవ్వుతూ అందర్నీ నవ్విస్తూండేది. ఆమె అన్నా కాంతమ్మకు పడదు, కాని పైకిమాత్రం ఎంతో ఆప్యాయతా, గౌరవం కనబరుస్తూండేది.
ఒకనాడు క్లబ్బులో అందరూ పేకాడుతున్నారు. మధ్య మధ్య మిసెస్ సుందరం, కాంతమ్మ ఒకరినిమించి ఒకరు గొప్పలు చెప్పుకుంటున్నారు. మిసెస్ సుందరం ఒక్కతే కాంతమ్మతో యిలాంటి కబుర్లు పెట్టుకుంటుంది. కతిమావారు ఆమె సంగతి అంతగా పట్టించుకోరు.
"మీరు కట్టిన చీర బావుంది. కొత్తదా?" అడిగింది మిసెస్ సుందరం కాంతమ్మను.
"అబ్బే లేదు; డ్రైవాష్ నుంచి వచ్చింది. నేను పట్టుచీర ఒక్కసారికంటే ఎక్కువ కట్టను, డ్రైవాష్ కు వేసేస్తాను. అదీ ఫ్యాషన్స్ కంపెనీవాళ్ళకే. వాళ్ళు చీరకు రెండు రూపాయలు చార్జి వేస్తారు. అదెంతలెండి! మా వారికి నేను నలిగిన చీర కట్టుకోవటం బొత్తిగా యిష్టం వుండదు," అన్నది కాంతమ్మ గర్వంగా.
"మీవారే నయం! మావారు వాష్ కు వేసిన చీర కట్టుకుంటే కోప్పడతారు. అందుకని, కొత్తచీర ఒకేసారి కట్టి, దాన్ని మా పనిపిల్ల కిచ్చేస్తాను. అది ఆ చీరల్ని డ్రైవాష్ కు వేసిగాని మరి కట్టుకోదు. అదిప్పుడిప్పుడే కాస్త బడాయి నేరుస్తున్న పిల్లలెండి!" అన్నది మిసెస్ సుందరం వచ్చే నవ్వు ఆపుకుంటూ.
ఈ మాటలు విన్నవాళ్ళందరూ గొల్లుమంటూ నవ్వారు. కాంతమ్మకు ఒంటిమీద తేళ్ళూ జెర్రులూ పాకినట్టయింది. ఒకే మోతాదులో యింత అవమానాన్ని ఆమేనాడూ మింగవలసి రాలేదు. ఆనాటితో ఆమె క్లబ్బు ఛాయలకేసి కూడ పోవటం మానుకున్నది.
కాంతమ్మను గృహసమస్యలు కూడా కొన్ని బాధించసాగినై. ఆదాయం పెరగటంతో, ఆ అంతస్తుకు తగినట్టు బ్రతుకుదామని కాంతమ్మ ఇంటిలో నౌకర్లనూ, చాకర్లనూ కొందరిని చేర్చింది. తిండి, ఇరవై పాతిక రూపాయిల నెలజీతాలకు వచ్చిన వాళ్ళు అవకాశం దొరికితే ఎన్నెన్ని దొంగతనాలు చేయగలరో ఆమె ఆలోచించుకొని బెదిరిపోతుండేది. ఈ నౌకర్లలో ఒకర్నీ నమ్మటానికి లేదు. వంటవాడు కాస్త సందు దొరికితే పాలూ పెరుగులు మెక్కెయ్యటమేగాక, కూరా నారా అలగావాళ్ళందరికీ పంచేస్తాడు. ఇల్లూడ్చే పిల్లా, పక్కలు పరిచే ముసలిదీ.... వీళ్ళను అసలు ఆదమరిచి ఉండేందుకే లేదు. నెలాఖర్న వీళ్ళందరికీ జీతం డబ్బులిచ్చేప్పుడు కాంతమ్మకు ప్రాణం కడబట్టినంత పనయ్యేది. పనీపాటూలేని వాళ్ళందరికీ తాను ఊరికే డబ్బు ధారపోస్తున్నట్టు బాధపడేది కాని, ఇంటికి ఈ హంగులన్నీ తప్పవు. పెళ్ళీడుకు వస్తున్న పిల్ల వున్నది. ఏ క్షణాన ఎలాంటి సంబంధాలు వస్తయ్యో చెప్పలేం.
కృష్ణారావులోకూడా రోజురోజుకూ పెరిగిపోతున్న ఆదాయం చాలా మార్పులు తెచ్చింది. ఏనాడూ రాజకీయాల జోలికి పోని కృష్ణారావు అవంటే ఎంతో ఆసక్తి కనబరుస్తున్నాడు. ఏవైనా ఎన్నికలొస్తే, అతని ఇంటికి వచ్చేపోయే కార్లసంఖ్య చెప్పటం కష్టం. అసెంబ్లీకి నిలబడవలసిందిగా కొందరతణ్ణి గట్టిగా కోరారు. అంత తొందరేం వచ్చిందిలే అన్న ధోరణిలో కృష్ణారావు మాట్లాడాడు. ఇలాంటి సంగతులు తెలిసినప్పుడల్లా కాంతమ్మ భర్త అంత ప్రయోజకుడై పోవటానికి కారణం తనే అనుకుంటుంది. ఆమె పలుకుబడివల్లే కావచ్చు. ఒకప్పుడు నాస్తికుడిలా మాట్లాడే కృష్ణారావు యిప్పుడు గొప్ప ఆస్తికుడూ, వేంకటేశ్వరస్వామి భక్తుడూ అయిపోయాడు. సింహద్వారం దాటి ఇంటిలో ప్రవేశించగానే, నిలువెత్తు ఏడుకొండలవాడి విగ్రహం అందర్నీ ఆకర్షిస్తుంది. భార్యా భర్తలిద్దరూ తప్పకుండా శనివారాల్లో ఉపవాసాలు చేస్తుంటారు.
డబ్బూ, పలుకుబడీ, ఆరోగ్యం, చక్కని కుమార్తె - యిన్ని వున్నా, ఎటో పారిపోయిన తమ్ముడు చంద్రాన్ని మాత్రం కృష్ణారావు మరిచిపోలేకపోతున్నాడు. అతడు గుర్తు వచ్చినప్పుడల్లా, కృష్ణారావు తమ్ముడిపట్ల తాను చేసిన దౌష్ట్యానికి బాధపడుతుండేవాడు. దొంగతనం చేసినా, తమ్ముణ్ణి తానలా గొడ్ల చావిడిలో గుంజకు కట్టివేయవలసిందికాదు. ఈ పాడుపని చేయటం ద్వారా తను మరణించిన తల్లిదండ్రుల ఆత్మలకు శాంతిలేకుండా చేసి ఉండవచ్చు. చంద్రం యింకా బతికేవున్నాడా?
తమ్ముణ్ణి గురించిన యీ అనుమానం కృష్ణారావుకు సరిగ్గా ఆఫీసుకు బయలుదేరే సమయాలలో ఎదురవుతుండేది; ఆ రోజునా ఎందుకనో చంద్రం హఠాత్తుగా గుర్తుకువచ్చాడు. కృష్ణారావు ఆఫీసుకు వెళ్ళే ప్రయత్నం మాని, తన గదిలోకి వెళ్ళి పడుకొన్నాడు. భార్యవచ్చి అడిగితే ఒంట్లో బాగోలేదని చెప్పాడు.
గోడగడియారం పన్నెండు కొట్టింది. బయట ఎండ మండిపోతున్నది, గదిలో ఫాన్ తిరుగుతున్నా, గాలి మరింత వేడెక్కిపోతున్నది. ఫాన్ ఆపితే ఎక్కడలేని ఉక్క.
కృష్ణారావు మంచంమీంచి లేచి వరండాలో కెళదామనుకునేంతలో అప్పుడే భోజనం చేసిందేమో - ఆయాసపడుతూ కాంతమ్మ గదిలో ప్రవేశించి, "చూడండి, యిక్కడ ఎంత ఉక్కగా వుందో! ఒక్క గదన్నా ఎయిర్ కండిషన్ చేయించమంటే చేయించారూ? ఆ జడ్జి సుందరంగారు చూడండి, ఉన్నదాన్లోనే ఎంత గొప్పగా కనబడతారో! మూడు గదులు ఎయిర్ కండిషన్ చేయించారట," అన్నది.
ఈ మాటలు వింటూనే కృష్ణారావుకు వళ్ళు మండిపోయింది. తన భార్య ఒక్కనాడైనా తన తమ్ముణ్ణి గురించి అడిగిన పాపానపోలేదు. వాడింకా బతికుంటే ఎక్కడో బికారిలా జీవితం గడుపుతూండి వుంటాడు. ఆస్తిలో వాడికీ వాటా వున్నది. అయినా వాడికి అనుభవించే రాతలేదు. ఉన్నది చాలక తన భార్య ఎయిర్ కండిషన్లు కావాలంటుంది. చంద్రం తిరిగి రాకపోవటమే ఆమె కోరుకుంటున్నట్టు కనబడుతుంది. అప్పుడు ఆస్తంతా తన కూతురికే దక్కుతుంది. ఈ మనిషిలో మానవత్వం ఉందా?
"ఉలకరూ పలుకరూ, ఏమిటంత యిదిగా ఆలోచిస్తున్నారు? ఒంట్లో మరీ అంత బాగోపోతే; డాక్టరుకు ఫోన్ చేయండి. అయినా, నా మాట మీరేనాడు లెక్కచేశారు గనక!" అంటూ కాంతమ్మ ముఖం ముడుచుకుని, దూరంగా పోయి కూర్చున్నది.
కృష్ణారావు భార్య అన్నమాటలకు ఏ జవాబూ యివ్వలేదు. అతడికి ఆలోచనలమీద ఆలోచనలు వస్తున్నవి. కాంతమ్మ మాట తనెప్పుడు కాదన్నాడో అతడికి గుర్తుకు రావటంలేదు. నిజంగానే ఆమె మాట పాటించక, ఆమెను తగిన హద్దుల్లో ఆమెనుంచినట్టయితే, తన తమ్ముడు దేశాలుపట్టి పోవలసిన అవసరం కలిగేది కాదేమో! ఈనాడు లక్షల ఆస్తికి వారసుడైన చంద్రం పొట్టకోసం ఎన్నెన్ని బాధలు పడుతున్నాడో? భగవాన్! తనుచేసిన పాపానికి నిష్కృతిలేదు.
కృష్ణారావు చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ మంచంమీద ఓ పక్కకు వత్తిగిలి పడుకున్నాడు. చంద్రంజాడలు తెలుసుకునేందుకు తాను చేయవలసినదంతా చేశానన్న తృప్తి అతడికి లేదు. చంద్రం ఎక్కడ వున్నదీ తెలియపరిచినవారికి పెద్ద బహుమానం యిస్తానని, అతడు పత్రికల్లో ప్రకటనలు వేయించాడు. ఫలితం లేకపోయింది. గురుకుల్ వాళ్ళకు రాస్తే, చంద్రమోహన్ అనే తెలుగు కుర్రవాడొకడు కొత్తగా వచ్చి చేరినట్టు జవాబిచ్చారు. తన తమ్ముడు చంద్రశేఖర్ - చంద్రమోహన్ అని పేరు మార్చుకున్నాడేమో అన్న అనుమానం అనుమానంగానే వుండిపోయింది. వ్యాపార గొడవల్లో పడిపోయి తానా విషయం అంతటితో వదిలేశాడు. తాను ఒకసారి ఆ గురుకుల్ కు వెళ్ళివస్తే ఎంత బావుండేది! కాని, తానాపని చెయ్యలేడు. ఆఫీసు.... వ్యాపారం.... లాభాలు.... భగవాన్!