Previous Page Next Page 
13... 14.... 15 పేజి 13


    "క్లినిక్ అంటే గుర్తొచ్చింది. మనం సోమాన్ని తీసుకుని ఆ క్లినిక్ కి వెళ్ళాలి. దానిపేరు  ఏదో వుంది." మైండ్.....మైండ్....."

    "మైండ్ మాగ్నో క్లినిక్"

    "అవును. అదే"

    మధూహ ఒళ్ళు జలదరించింది. పాముకాటు తగిలిన దానివలె అతడివైపు చూస్తూ, "అక్కడికెందుకు" అంది.

    "సోమం ఇంటర్నీడియేట్ చదువుతున్నాడు కదమ్మా. వాడిని డాక్టరీ చదివించాలని మా జీవితవాంఛ. వాడికేమో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అసలు వుండటం లేదు. వారంరోజుల్లో వాడిని ఎమ్ సెట్ కి తయారు చేయగలమని ప్రకటన ఇచ్చారుగా. అదొక్కటీ తీరిపోయి వాడు  డాక్టరీలో చేరితే అంతకన్నా కావాల్సింది ఇంకేమీ లేదు మాకు...."

    "పదహారేళ్ళుగా  రానిది, వారంరోజుల్లో ఏకాగ్రత వస్తుందా మామయ్యా. జ్ఞాపకశక్తి కావాలంటే బాగా చదవమను" అందామనుకుంది. కానీ ఆయన ఆశని ముందే చంపెయ్యటమెందుకని, "అలాగే వెళ్దాంలే మామయ్యా. అక్కడ కాంపౌండరు నాకు బాగా తెలుసు" అంది.

    ఆ సాయంత్రం ముగ్గురూ క్లినిక్ కి వెళ్ళారు. అంతకుముందే చంద్రయ్య భార్యని తీసుకుని పక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన చాలా మంచివాడు. అనుభవం వున్నవాడు. ఆవిడని పరీక్షించి టెస్టులు వ్రాసిచ్చాడు. రిపోర్టులు వచ్చాక ట్రీట్ మెంట్  మొదలుపెడదామన్నాడు. తల్లినీ, అత్తయ్యనీ వాటికోసం పంపించి,అక్కడ నుంచి మైండ్ మాగ్నో క్లినిక్ కి వెళ్ళారు ముగ్గురూ.

    మధావిధిగా చాలా రష్ గా వుంది క్లినిక్.

    తండ్రీ కొడుకుల్ని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది మధూహ. ఆ చనువు ఆమెకెప్పుడూ వుంది.

    లోపల కన్సల్టింగ్ గదిలో రాజు లేడు. దానిపక్కనే ఒక చిన్న గది, అందులో ఒక మంచమూ వున్నాయి. ఒక తెర మాత్రమే రెండింటికీ అడ్డు. ఆ చిన్న యాంటీ రూమ్ లో పేషెంట్ తో మాట్లాడుతున్నాడు. ఆమె పక్కమీద పడుకుని అతడి ప్రశ్నలకి సమాధానం చెపుతోంది.

    మధూహ గదిలో ప్రవేశించిన సంగతి, తెరకి అవతలగావున్న వాళ్ళిద్దరికీ తెలీదు. సాధారణంగా ఒక పేషెంటు గదిలో వుండగా మరెవరూ ప్రవేశించరు. మధూహ ఎదుటి కూర్చీలో కూర్చుని మాగ్ జైన్ చేతుల్లోకి తీసుకుంది.

    "అయితే మీకు చాలా నిరుత్సాహంగా వుంటోందంటారు......"

    రాజు కంఠం తెర అవతల్నుంచి వినిపిస్తూంది.

    "అవునండీ. నాలుగైదు సంవత్సరాల్నుంచీ ఇలా వుంటోంది. గుండెల్లోదడ. ఏమీ  తోచదు. దేనిపట్లా ఆసక్తి వుండదు. చచ్చిపోవాలనిపిస్తుంది" పేషెంటు చెపుతోంది.

    క్లియర్ కేస్ ఆఫ్ డిప్రెషన్ - అనుకుంది మధూహ. చేతినిండా పని లేక, చేస్తున్న పనిపట్ల వుత్సాహం లేక ఒక గమ్యమూ గుర్తింపూలేని గానుగెద్దు జీవితం వలన.....ముప్ఫయి అయిదేళ్ళు పైబడిన వ్యక్తుల్లో, ముఖ్యంగా స్త్రీలలో వచ్చే మానసిక వ్యధ.

    దీనిని సైక్రియాటిస్టులు కూడా ట్రీట్ చేయలేరు. కేవలం దినచర్య, ఆలోచనా విధానాల్లో మార్పులవల్ల మాత్రమే ఇది ముఖ్యంగా సాధ్యమవుతుంది. వారిచ్చే సలహా కూడా అదే.

    రాజు నమ్మకంగా చెప్పాడు. "మా మాగ్నోమైండ్ థెరపీ వలన అదిపోతుంది. మీరు మామూలు మనిషి అవుతారు. మీలో కొత్త వుత్సాహం నిండుతుంది."

    "ఎలా  డాక్టరుగారూ?"

    కాంపౌండర్ డాక్టరయినందుకు మధూహ విస్మయపడింది. అయితే రాజు మామూలుగా చెప్పుకుపోతున్నాడు.

    "మా మాగ్నెట్ తో మీ మెదడులో పదిహేను సంవత్సరాల క్రితం వున్న జ్ఞాపకాల్ని ముందుకుతెస్తాం. అంటే మీ వయసుకు పదిహేను సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్తామన్నమాట. ఆ హుషారు, చురుకుదనం ఇక మీలో అలానే వుండిపోతాయి....."

    "నిజంగానా డాక్టరుగారూ...."

    "మీరు పరీక్షించి చూసుకోవచ్చు"

    "ఫీజు.....?"

    "అయిదువేలు"

    మధూహ గాఢంగా శ్వాస వదిలింది. ఫీజు విషయమై ఇద్దరికీ చర్చ జరుగుతుంది. చివరికి వెయ్యిరూపాయలకు సెటిల్ అయింది. రెండు నిముషాల తరువాత. రాజు కన్సల్టింగ్ గదిలోకి వచ్చాడు. అక్కడ మధూహని చూసి క్షణం బిత్తరపోయాడు. తేరుకుని, "ఎంత సేపయింది వచ్చి?" అని అడిగాడు. 'ఇప్పుడే' అంది. 

    ఆ లోపులో పేషెంటు వెళ్ళిపోయింది. "సారీ. నీ అనుమతి తీసుకోకుండా చనువుగా వొచ్చి కూర్చున్నా"నంటూ మధూహ తనొచ్చిన పనిచెప్పి, సోమాన్నీ, చంద్రయ్యవైపు తిరిగి, "మీ అబ్బాయిని డాక్టర్ ని చేసే బాధ్యత మాకు వదిలిపెట్టండి" అన్నాడు కాన్ఫిడెంట్ గా.

    చంద్రయ్య మొహం విప్పారింది. నోటమాట రాక చేతులెత్తి నమస్కరించాడు. రాజు అన్నాడు. "ప్రతీ మనిషిలోనూ నిక్షిప్తమైన శక్తి వుంటుంది. అందులో కేవలం పదోవంతుని మాత్రమే వాడుకుంటాడు. మిగతా తొంబైశాతం వృధా అయిపోతూ వుంటుంది. దాన్ని బయటకి తీస్తే ప్రతీమనిషి ఒక గొప్ప సైంటిస్టు అవుతాడు. జీవితంలో పైకి వస్తాడు. జ్ఞాపకశక్తి అనేది ఒక గదిలాటిది. తవ్వే కొద్దీ బంగారం దొరుకుతుంది..."

    రాజు మాటలు వింటూ "ఏది ఏమైనాకానీ, ఇతడిలో ఒక గొప్ప శక్తి వుంది. అవతలివారిని తన మాటల్తో కట్టిపడేసే శక్తి అది....." అనుకుంది మధూహ.

    సోమం, అప్పుడే డాక్టరయిపోయినట్టు కలగంటున్నాడు.

    "సాధారణంగా దీనికి మూడువేలు తీసుకుంటున్నాం. మీరు మా మధూహ బంధువులు కాబట్టి రెండువేల అయిదొందలకే ట్రీట్  చేస్తాము సరేనా?" నవ్వుతూ అన్నాడు. మధూహ ఏదో చెప్పబోయేటంతలో చంద్రయ్య 'సరే బాబూ. అలాగే' అన్నాడు నమ్రతగా.

    అసిస్టెంటు ముగ్గురికీ టీ తీసుకొచ్చి ఇచ్చాడు.

    "ఈ రోజు నుంచే ప్రారంభిద్దామా?" అంటూ రాజు లేచాడు. మధూహకి సంతోషమేసింది......తను తీసుకు వచ్చినందుకు ఆ మాత్రం ఇంటరెస్టు చూపించి ట్రీట్ మెంట్ చేస్తున్నందుకు. కేవలం  తన ముందు 'ప్రతిభ' నిరూపించాలనే అతడు  ఈ విధమైన ప్రత్యేకత చూపిస్తున్నాడని ఆమెకి తెలీదు. సోమాన్ని కుర్చీలో కూర్చోబెట్టి తలకి హెల్మెట్ పెట్టి స్విచాన్ చేసాడు రాజు. సన్నటి శబ్దం మొదలైంది.

    అందరూ చూస్తూండగానే సోమం మత్తులోకి జారుకున్నాడు.

    మధుహ అవాక్కయింది. అది కలో నిజమో అర్థం కాలేదు. రాజు ఆమెవైపు క్రీగంట చూసి చిన్న మాగ్నెట్ తీసుకుని సోమం వెన్నెముక మీద నుంచి మెడవైపు రాయసాగాడు.

    చంద్రయ్య ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టు కొడుకువైపు చూస్తున్నాడు. రెండు నిముషాల్లో ట్రీ ట్ మెంట్ పూర్తయింది. తలకు అమర్చిన హెల్మెట్ తీసేసి, పక్కన  పెట్టి, "మీ అబ్బాయి లేవటానికి మరో అరగంట పడుతుంది. బయటకూర్చోండి" అంటూ, వేరే పేషెంట్ ని తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు. చంద్రయ్య బయటకు నడిచాడు. మధూహ పేషెంట్ తో పాటు వుండిపోయింది. ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు.

    హెల్మెట్ పెట్టగానే నిద్రలోచి జారుకోవటమే ఒక చిత్రం. కానీ అంతకన్నా చిత్రమైనది. వెన్నెముక మీద  మాగ్నెట్ తో రాస్తే తెలివితేటలు పెరుగుతాయన్నది ఎలా సాధ్యమన్నది! ఒక మనిషి జ్ఞాపక శక్తి పెంచుకోవాలంటే దానికి ఎంతో కృషి చేయాలి. ఏళ్ళ తరబడి సాధన కావాలి. స్వతహాగా పట్టుకతో రాని పక్షంలో ఆ శక్తి..... ఎంతో కష్టం మీదగానీ అలవడదు. అటువంటిది వారం రోజుల ట్రీట్ మెంట్ తో ఎలా వస్తుంది? ఈ ఆలోచన్లలో నిమగ్నమైవున్న మధూహ దృష్టి అప్రయత్నంగా హెల్మెట్ మీద పడింది. క్రికెటర్లు బ్యాటింగ్ చేసేటప్పుడు పెట్టుకునే టోపీలా వుందది. అదికాదు ఆమెని ఆకర్షించింది!

    హెల్మెట్ క్రిందభాగంలో తెల్లగా ఏదో కనిపించింది. ఆమె చప్పున వంగి దాన్ని తీసిచూసింది.

    క్లోరోఫాం వాసన మందంగా వస్తోంది!!!

    మధూహ ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే బయట నుంచి తెలిసిన స్వరం రుద్ద కంఠంతో వినిపించింది. ఆమె హెల్మెట్  విషయం ఆలోచనల్లోంచి తొలగించి వేగంగా బయటకొచ్చింది.

    బయటగదిలో తనతల్లి- చంద్రయ్యతో మాట్లాడుతూంది. చంద్రయ్య భార్య పక్కనే కూర్చుని కన్నీళ్ళు తుడుచుకుంటోంది. వాళ్ళిద్దరూ అప్పుడే ఆస్ప్రతి నుంచి వచ్చారు.

    మధూహకి అర్థం కాలేదు. ".....ఏమైంది?" అని అడిగింది. తల్లి మాట్లాడలేదు. చంద్రయ్య సమాధానం చెప్పలేదు. అతడి భార్య దుఃఖం మరింత ఎక్కువైంది.

    "ఏమైందీ?" రెట్టించింది. చంద్రయ్య భార్య వెక్కిళ్ళు చప్పుడు తప్ప....అంతా నిశ్శబ్దంగా వుంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ చంద్రయ్య కంఠం వినిపించింది....."మీ అత్తయ్యకి రక్తపు కేన్సరటమ్మా"


                                     7


    డాక్టర్ పార్థసారథి సానుభూతిగా వెనక్కి వాలేడు. "ఏం లాభంలేదా డాక్టర్!" మధూహ అడిగింది.

    "లేదమ్మా. చాలా ముదిరిపోయింది. అదీగాక బ్లడ్ కాన్సర్ కి దురదృష్టవశాత్తు మందింకా కనుక్కోబడలేదు. కెమోథెరపీతో కొంతకాలం జీవితాన్ని పొడిగించవచ్చుకానీ ప్రయివేటు ఆస్ప్రత్తుల్లో  దానికి చాలా ఖర్చవుతుంది. మీ  మామయ్య చాలా బీదవాడు అంటున్నారు....."

    "అవును డాక్టరుగారూ......"

    "అందుకే ప్రయివేటు ఆస్పత్రులు వద్దు. గవర్నమెంటు హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి. మరణం ఎలాగూ తప్పనప్పుడు, దానికి డబ్బు ఖర్చెందుకు అని నేను సలహా ఇవ్వటం తప్పేగాని - చిన్న చిన్న  రోగాలకే పెద్ద పెద్ద పేర్లు పెట్టి డబ్బులు వసూలు చేసే ప్రముఖ ఆస్పత్రులకి వెళ్ళొద్దు. రోగం అటువంటింది.....అని చెపుతున్నాను.."

    "అర్థమైంది డాక్టరుగారూ. అత్తమ్మని పెద్ద ఆస్పత్రిలో కనీసం ఒకరోజు వుంచగలిగే స్థోమత కూడా మాకు లేదు. ఇక ట్రీట్ మెంట్ ప్రసక్తి ఏముంది? తనకి అంతా  విపులీకరించి చెప్పారుగా."

    "చెప్పానమ్మా. అనవసరంగా ఆశలు కల్పించటంకన్నా ఇలాటి విషయాలు ముందే చెప్పెయ్యటం మంచిది."

    ఆమె లేచి నమస్కరిస్తూ - "మీలాటి డాక్టర్లుండబట్టే మెడికల్ ప్రొఫెషన్ కి గౌరవం పెరుగుతోంది సార్! వెళ్ళొస్తాను" అని అక్కణ్నుంచి కదిలింది.

    ఆమె ఇంటికొచ్చేసరికి చంద్రయ్య, అతని భార్యా మళ్ళీ వూర్నించి వచ్చివున్నారు. ముందు గదిలో బియ్యం బస్తావుంది. వారు చాలాకాలం అక్కడ వుండటానికి సిద్ధపడి వచ్చినట్టువుంది. ఆమెకి సంతోషం వేసింది. ఈ విధంగానైనా వాళ్ళ రుణం తీర్చుకోగల్గుతున్నందుకు.

    "రేపే గవర్నమెంటు ఆస్పత్రికి వెళ్ళి మాట్లాడదాం మామయ్యా" అంది.

    "అక్కడ నయం కాదని డాక్టర్ పార్థసారధి చెప్పారమ్మా" అన్నాడు చంద్రయ్య. అతడు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ఆమె తృప్తి పడింది.

    "అలా అని పూర్తిగా వదిలెయ్యలేంగా  మామయ్యా. కెమోథెరపీ వలన కొంతవరకూ బాగుపడే అవకాశం వుందని చదివాను" ధైర్యం చెపుతున్నట్టు అంది. 

 Previous Page Next Page